close

తాజా వార్తలు

‘ఆటో’ఎక్కుతున్న ఇండస్ట్రీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలం గడుస్తున్న కొద్దీ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. సౌకర్యార్థ్యం రోజువారీ కార్యక్రమాల్ని మరింత సులభతరం చేసుకునే దిశగా మనుషులు సాగుతున్నారు. అందుకనుగుణంగానే పరిశ్రమలు సైతం తమ విధానాల్ని మార్చుకుంటున్నాయి. వినియోగదారులు కోరుకుంటున్న నాణ్యత, వేగం, కచ్చితత్వం కోసం శ్రమిస్తున్నాయి. అందులో భాగంగా అత్యాధునిక సాంకేతికతను సమకూర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో వస్తువుల తయారీలో మానవ తప్పిదాల్ని నిరోధించి వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంచే దిశగా సాగుతున్నాయి. వీటిలో భాగంగానే పరిశ్రమలన్నీ ‘ఆటోమేషన్‌’ వైపు మళ్లుతున్నాయి. దీంతో పరిశ్రమలు, కంపెనీల్లో పని విధానం, ఉద్యోగుల నైపుణ్యాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 

వేగం, కచ్చితత్వమే లక్ష్యం...
ప్రస్తుతం మనుషులు నిర్వహిస్తోన్న పనులను కంప్యూటర్‌ నియంత్రిత పరకరాలు అత్యంత కచ్చితత్వం, వేగం, అత్యల్ప మానవ సాయంతో చేసే ప్రక్రియే ఆటోమేషన్‌. అయితే ఇది ఇప్పటికే రొబోల రూపంలో కంపెనీల్లో ప్రవేశించింది. వీటినే మరింత స్వయం ఆధారితంగా మార్చితే పూర్తి స్థాయి ఆటోమేషన్‌ వచ్చినట్లే. ప్రస్తుతం రవాణా, రక్షణ, ఉత్పత్తి రంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రవేశించింది. ఆటోమేషన్‌ వల్ల లాభాలు భారీగానే ఉన్నాయనేది పరిశ్రమ వర్గాల వాదన. దీనివల్ల కంపెనీల సామర్థ్యం పెరిగి ఉత్పాదకత రెట్టింపు అవుతుందని విశ్లేషిస్తున్నారు. ఇక ఉద్యోగుల పని సైతం సులభం అయ్యే అవకాశం ఉంది. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇక కీలక నిర్ణయాలు సైతం అత్యంత కచ్చితత్వంతో తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. వీటన్నింటికి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలు సైతం మెరుగుపడతాయి. ఇది వారికి వ్యక్తిగతంగా ఎంతో కలిసొచ్చే అంశం. 

ఉద్యోగాల కోతపై భిన్న వాదనలు...
ఆటోమేషన్‌ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే దానిపై భిన్నవాదనలు ఉన్నాయి. యాంత్రీకరణ పెరిగిన కొద్దీ ఉద్యోగాల్లో భారీ కోత ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. మరికొంత మంది మాత్రం మరిన్ని కొత్త రకం ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వాదిస్తున్నారు. రానున్న రెండు దశాబ్దాల్లో భారత్‌లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 69శాతం తగ్గే అవకాశం ఉందని 2013లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం పేర్కొంది. కృత్రిమ మేధ, ఆటోమేషన్‌ వల్ల భవిష్యత్తులో సంభవించే పరిణామాలపై బిల్‌ గేట్స్‌, ఎలన్ మస్క్, స్టీఫెన్‌ హాకింగ్‌ లాంటి ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోమేషన్‌ వల్ల పని స్వభావం మారుతోందని.. దీని వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరగొచ్చని మరికొంత మంది నిపుణుల వాదన. అలాగే కొత్త ఆవిష్కరణలు కొత్త వృత్తులకు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఆటోమేషన్‌ వల్ల ఉద్యోగాలు కోల్పోమని.. కేవలం ఉద్యోగుల సామర్థ్యం, కచ్చితత్వాన్ని మెరుగుపరచే అవకాశం లేని కొన్ని విధులుమాత్రమే తొలగిపోతాయన్నది మరో వాదన. గత కొన్ని సంవత్సరాల్లో భారత్‌లో ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ పుంజుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఒక్క ఉత్పాదక రంగంలోనే రానున్న ఐదారు సంవత్సరాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) దాదాపు 400 ప్రాజెక్టుల్లో 9600 కొత్త ఆటోమేటెడ్‌ పరికరాల్ని అమర్చింది. దీంతో భారీ స్థాయిలో సమాచారం పుట్టుకొచ్చింది. కానీ ఆ సమాచార నాణ్యత, కచ్చితత్వాన్ని విశ్లేషించడానికి మరికొన్ని కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది.    

ఖర్చు భారీగానే...
ఆటోమేషన్‌కు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు పరిశ్రమలకు భారీగానే ఖర్చయ్యే అవకాశం ఉంది. అందుకే ఒకేసారి కాకుండా సంస్థలు, కంపెనీలు దశలవారీగా ఆటోమేషన్‌వైపు అడుగులు వేస్తున్నాయి. అలాగే ప్రస్తుత ప్రమాణాల ప్రకారం పూర్తిగా ఆటోమేటేడ్‌ కంపెనీలకు నెలకొల్పాలంటే ఇంకా చాలా కాలం పట్టే అవకాశం ఉంది. దీని కోసం అత్యంత నైపుణ్యం గల మానవ వనరుల అవసరం కావొచ్చు. దీంతో నిర్వహణ ఖర్చు సైతం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు ఆ వైపు మళ్లడానికి ఆసక్తి కనబరచడం లేదు. కానీ, ఆటోమేషన్‌ లేని సంస్థలు భవిష్యత్తులో వెనకబతాయన్నది మాత్రం వాస్తవమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కొత్త నైపుణ్యాలు అందిపుచ్చుకుంటేనే..
ఈ పోటీ ప్రపంచంలో సాంకేతికతను నిలువరించడం దాదాపు సాధ్యమయ్యే పని కాదు. మానవుల అభిరుచులు, అవసరాలు మారుతున్న కొద్దీ ఉత్పత్తులు, సేవలు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తద్వారా పరిశ్రమలు, వాటిలో పని స్వభావం మారుతోంది. కాబట్టి..మారాల్సింది మనమే. కొత్త మార్పుల్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా కొత్తగా వస్తున్న ఉద్యోగాలు పూర్తిగా నైపుణ్యాల ఆధారంగానే ఉంటున్నాయి. వాటికనుగుణంగా మన నైపుణ్యాల్ని సైతం మెరుగుపరచుకునేందుకు కృషి చేయాలి. అందులో భాగంగా డిస్ట్రిబ్యూటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌(డీసీఎస్‌), సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌(ఎస్‌సీఏడీఏ), ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోల్‌(పీఎల్‌సీ), మ్యానుఫ్యాక్చరింగ్‌ ఎగ్జిక్యూషన్‌ సిస్టం(ఎమ్‌ఈఎస్‌), హ్యూమన్ మెషీన్‌ ఇంటర్‌ఫేస్‌(హెచ్‌ఎమ్‌ఐ) లాంటి సాంకేతికతల్లో నైపుణ్యం సాధించాలి. కావాల్సిన శిక్షణను పొందాలి. విద్యా విధానంలో సైతం ఆటోమేషన్‌కు సంబంధించిన కోర్సులను చేర్చాలి. ఓ ప్రముఖ సర్వే ప్రకారం భారత్‌లోని దాదాపు 66శాతం పరిశ్రమ వర్గాలు కొత్త నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల్ని నియమించుకోవడానికే ఇష్టపడుతున్నాయట. ప్రస్తుతం ఆటోమేషన్‌ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న విద్యార్థులకు విపణిలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.