close

తాజా వార్తలు

ప్రేమ్‌జీ ఇంటర్వ్యూలో మూర్తి ఫెయిల్‌..!

భారత ఐటీ పితామహుడు నారాయణమూర్తి ప్రయాణం

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ఐటీ పితామహుడిగా జగమెరిగిన ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి.. సిలికాన్‌ తరహా వ్యవస్థను భారత్‌కు పరిచయం చేశారు. ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ రంగంలో సంచలనాలు సృష్టించారు. ఆయన ఆలోచనకు.. ప్రణాళికాబద్ధమైన ఆచరణకు ఇన్ఫోసిస్‌ ఓ గొప్ప తార్కాణం. బెంగళూరులోని సంస్థకు ఏకంగా దేశాధినేతలే విచ్చేశారంటే ఇన్ఫోసిస్‌ పునాదుల్ని ఎంత పటిష్ఠంగా వేశారో అర్థమవుతోంది. కలను నిజం చేసుకోవడం కోసం చివరి దాకా పోరాడడం.. అనుకున్నది సాధించగల అద్భుత సామర్థ్యం ఆయనకు అంతర్జాతీయ ఐటీ రంగంలో గొప్ప స్థానాన్ని తెచ్చిపెట్టింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో అడగుపెట్టిన తొలి భారత కంపెనీగా ఇన్ఫోసిస్‌ చరిత్ర సృష్టించడం వెనుక నాగావర రామారావు నారాయణమూర్తి కృషి ఎనలేనిది.

రూ.250 ఖర్చు భరించే స్తోమత లేక...
ఆగస్టు 20న, 1946లో కర్ణాటకలోని మైసూరులో మధ్య తరగతి కుటుంబంలో నారాయణమూర్తి జన్మించారు. ఐఐటీలో సీటొచ్చినా.. నెలకు రూ.250 ఖర్చు భరించే స్తోమత లేదు. దీంతో తెలివైన విద్యార్థులు ఎక్కడైనా రాణిస్తారన్న తండ్రి సూచనతో మైసూరులోని స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా సాధించారు. అనంతరం ఆయన ప్రతిభకు ఐఐటీ కాన్‌పూర్‌ తలుపులు తెరచుకున్నాయి. 1969లో మాస్టర్స్‌ పట్టాతో బయటికొచ్చిన మూర్తికి ఎయిర్‌ఇండియా, హెచ్‌ఎంటీ, ఈసీఐఎల్‌, టెల్‌కో లాంటి సంస్థల్లో మంచి అవకాశాలు వచ్చాయి. కానీ, అప్పుడప్పుడే విపణిలోకి వస్తున్న కంప్యూటర్లపై ఆయన మనసు పడింది. 
ఐఐఎం అహ్మదాబాద్‌లో కెరీర్‌ ప్రారంభం..
కంప్యూటర్లపై పనిచేయాలన్న ఆయన అభిరుచికనుగుణంగా ఐఐఎం అహ్మదాబాద్‌లో చీఫ్‌ సిస్టమ్స్‌ ప్రోగ్రామర్‌గా ఉద్యోగ అవకాశం లభించింది. అక్కడ నెలకొల్పిన మినీ కంప్యూటర్ల ల్యాబ్‌ ఆయనకు మరింత కలిసొచ్చింది. రోజుకు దాదాపు 20గంటల పాటు శ్రమించి కంప్యూటర్‌పై పట్టుసాధించారు. ఆ సమయంలోనే ఈసీఐఎల్‌కు దేశంలోనే తొలి బేసిక్‌ కంప్యూటర్ ఇంటర్‌ప్రెటర్‌కు రూపకల్పన చేశారు. అనంతరం నారాయణమూర్తి ప్రతిభకు అవకాశాలు దానంతట అవే వచ్చి పడ్డాయి. ఈ క్రమంలో పారిస్‌లోని చార్లెస్‌ డిగాలే విమానాశ్రయంలో ఎయిర్‌ కార్గోను నిర్వహించగలిగే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అభివృద్ధి చేయడానికి సెఫ్రా అనే సంస్థ మూర్తిని వెతుక్కుంటూ వచ్చింది. అక్కడ రెండేళ్లు పనిచేసిన ఆయన అనేక పర్యటనలు చేశారు. పేదరికాన్ని రూపుమాపాలంటే ఉద్యోగాల్ని సృష్టించాలని అర్థం చేసుకున్నారు. సామ్యవాద భావాలున్న నారాయణమూర్తి సంపదను సమానంగా పంచాలంటే ముందు దాన్ని సృష్టించాలని నమ్మారు. అందుకు వ్యాపారం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. 
తొలి కంపెనీ విఫలం...
అదే తపనతో భారత్‌కు తిరిగి వచ్చారు. తొలుత పుణెలోని శ్రీ సంస్థలో చేరారు. కానీ, ఆ ఉద్యోగ జీవితం ఆయనకు తృప్తినివ్వలేదు. సాఫ్ట్రానిక్స్‌ అనే కంపెనీని ప్రారంభించారు. కానీ, దేశీయంగా సాఫ్ట్‌వేర్‌ రంగానికి అంతగా అవకాశాలు లేవని గుర్తించి దాన్ని మూసివేశారు. ఇక కార్పొరేట్‌ ప్రపంచంలో అనుభవం కోసం వేచిచూస్తున్న తరుణంలో ముంబయిలో ప్యాట్నీ కంప్యూటర్‌ సిస్టమ్స్‌లో సాఫ్ట్‌వేర్‌ విభాగానికి అధిపతిగా ఉద్యోగం వచ్చింది. అక్కడే సంపదను ఎలా సృష్టించాలో ఆయనకు మార్గం దొరికింది. సాఫ్ట్‌వేర్‌ రంగానికి భవిష్యత్తులో ఉన్న అవకాశాల్ని పసిగట్టారు. తద్వారా ఉద్యోగాలు కల్పించి సంపదను సృష్టించాలన్న తన కల కూడా నెరవేరుతుందని భావించారు. ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసి జీ-7దేశాలను ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నారు. 
ప్రేమ్‌జీ ఇంటర్వ్యూలో ఫెయిల్‌...

మరో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ విప్రో కంపెనీ అప్పటికే బలమైన సంస్థగా నిలదొక్కుకుంది. పాట్నీ కంప్యూటర్స్‌లో నారాయణమూర్తి పనిచేస్తుండగా.. విప్రో ప్రారంభించబోయే సాఫ్ట్‌వేర్‌ గ్రూప్‌నకు అధిపతిగా వ్యవహరించాలని అప్పటికే అక్కడి హెచ్‌ఆర్‌ విభాగంలో పనిచేస్తున్న ప్రసన్న అనే మిత్రుడు సూచించారట. దీంతో ఆయన అజీమ్‌ ప్రేమ్‌జీని కలుసుకొని తన అభిప్రాయాలు, ఆలోచనల్ని పంచుకున్నారట. కానీ, అవేవీ ప్రేమ్‌జీకి సంతృప్తినివ్వకపోవడంతో ఉద్యోగం ఇవ్వలేనని చెప్పేశారట. అయితే ఆరోజు ప్రేమ్‌జీ ‘నో’ చెప్పడమే తనకు మేలు చేసిందంటారు మూర్తి. ఆర్థిక సంస్కరణల తర్వాత ఇన్ఫోసిస్‌ ప్రయాణాన్ని చూసి మూర్తికి విజయం ఖాయమనుకున్నారట ప్రేమ్‌జీ. ఈ దశాబ్దాల కాలంలో వారు అనేక సార్లు కలుసుకున్నారు. వ్యాపార ముచ్చట్లను పంచుకున్నారు. కలిసి పనిచేశారు. అజీమ్‌ అందించిన హార్డ్‌వేర్‌, మూర్తి అందించిన సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లో బ్యాంకింగ్‌ రంగ రూపురేఖలే మారిపోయాయి.  
భార్య పొదుపు డబ్బుతో ఇన్ఫోసిస్‌...

సాఫ్ట్‌వేర్‌ని ఎగుమతి చేయాలన్న ఆలోచనే ఇన్ఫోసిస్‌కి రూపాన్నిచ్చింది. తన ఏడుగురు సహచరులను కలుపుకొని 1981లో ఇన్ఫోసిస్‌ని ప్రారంభించారు. ఏడుగురిలో నారాయణమూర్తి సహా నందన్‌ నిలేకని, ఎస్‌.గోపాలకృష్ణన్‌, ఎస్‌.డి.శిబులాల్‌, కె.దినేశ్‌, ఎన్‌.ఎస్‌. రాఘవన్‌, అశోక్‌ అరోరా ఉన్నారు. వయసులో అందరికంటే రాఘవన్‌ పెద్దవారు కాగా.. మూర్తి రెండోవారు. నిజానికి వీరంతా తొలుత తమ భార్యలు చేసిన పొదుపును అప్పుగా తీసుకొని ఇన్ఫోసిస్‌కి పెట్టుబడి సమూర్చుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందించిన రుణం కూడా తోడుకావడంతో పుణెలోని శివాజీనగర్‌లో ఓ భవనాన్ని కొనుగోలు చేసి కంపెనీని ప్రారంభించారు. కానీ, తొలుత బాలారిష్టాలు తప్పలేదు. కఠిన కార్పొరేట్‌ నిబంధనలున్న ఆ కాలంలో ఒక ఫోన్‌ కొనుగోలు కోసం ఏళ్ల తరబడి వేచిచూడాల్సి వచ్చేది. కంప్యూటర్‌ని దిగుమతి చేసుకోవాలంటే అనుమతులతో కలుపుకొని మూడేళ్లు పట్టేది. వీటన్నింటిని నారాయణమూర్తి తన భుజానికెత్తుకున్నారు. దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా లాభం లేకపోవడంతో అమెరికాలోనే మకాం పెట్టారు. అలా న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న డేటాబేసిక్స్ నుంచి తొలి కాంట్రాక్ట్‌ లభించింది. మౌలిక వసతుల కోసం రుణాలు ఇవ్వాలంటూ బ్యాంకుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. కానీ వెనక్కి తగ్గలేదు. ఓ దశలో సహచరులు సంస్థని అమ్మేద్దామని ప్రతిపాదించినా మూర్తి ఒప్పుకోలేదు. ఆ రోజు ఆయన నమ్మకమే ఈరోజు ఇన్ఫోసిస్‌ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఏదేమైనా స్వదేశం నుంచే కంపెనీ కార్యకలాపాలు జరపాలని నిశ్చయించుకున్నారు. అన్ని అవాంతరాల్ని ఎదురొడ్డి బెంగళూరుకు సంస్థ కార్యకలాపాల్ని మార్చి వసతులన్నీ సమకూర్చుకున్నారు.

ఊపిర్లూదిన ఆర్థిక సంస్కరణలు...
అనేక అవాంతరాలు చుట్టుముట్టి సంస్థ ఉనికిపై నీలి నీడలు కమ్ముకుంటున్న వేళ 1991లో దేశంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు ఇన్ఫోసిస్‌ ఆశలకు ఊపిర్లూదాయి. ఇక అంది వచ్చిన అవకాశాల్ని వినియోగించుకొని ఎదురులేని శక్తిగా నిలపడంలో ఏడుగురు సభ్యులు కలిసి నడిచారు. బృందంగా కలిసి పనిచేయడంలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించారు. అందుకు మూర్తి నాయకత్వ లక్షణాలు తోడవ్వడంతో ఇక ఇన్ఫోసిస్‌ అంచెలంచెలుగా ఎదిగింది. నేడు అనేక దేశాల్లో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది. ఇండియాలో మెంటార్‌షిప్‌ ప్రోగ్రాంలు ప్రారంభించి కార్పొరేట్‌ ప్రపంచంలో ఉద్యోగుల శిక్షణలో కొత్త ఒరవడిని సృష్టించింది. 

సుధా లేని మూర్తి జీవితం అసంపూర్ణం...

నారాయణమూర్తి భార్య సుధామూర్తి ప్రస్తావన లేకపోతే ఆయన జీవితం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. నిజానికి మూర్తి విజయం ఆమె పెట్టుబడితోనే ప్రారంభమైంది. వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మూర్తి పుణెలో పనిచేస్తుండగా.. సుధా కులకర్ణి టెల్‌కోలో ఇంజినీర్‌గా చేస్తున్నారు. ఇద్దిరికీ తెలిసిన ఓ మిత్రుడి పుస్తకాలపై నారాయణమూర్తి అని పేరు రాసి ఉండడం సుధా గమనించారు. ఆరా తీసి మూర్తి గురించి తెలుసుకున్నారు. అనుకోకుండా ఓ విందులో ఇద్దరూ కలుసుకున్నారు. అలా మొదలైన వారి పరిచయం పుణెలో పార్కులు, సినిమాలు, షికార్ల వరకు వెళ్లింది. అలా ఓ రోజు ఇద్దరూ కలిసి రిక్షాలో కలిసి సినిమాకు వెళుతుండగా.. మూర్తి తన ప్రేమ విషయాన్ని తెలియజేశారు. పెళ్లి చేసుకుందామన్న ప్రతిపాదనను ఆమె ముందుంచారు. కాసేపు ఆలోచించిన సుధా.. కొంత సమయం కావాలని అడిగారు. కొన్ని రోజుల తర్వాత పుణె వచ్చిన తన తండ్రికి మూర్తిని పరిచయం చేశారు. ఆయన ఏం చేస్తావని మూర్తిని ప్రశ్నించారు. దానికి ‘రాజకీయాల్లోకి వెళదామనుకుంటున్నా..ఒక అనాథ ఆశ్రమాన్ని ప్రారంభిద్దామనుకుంటున్నా’ అని బదులిచ్చారు. దీంతో ఆయనకు నచ్చక తొలుత పెళ్లికి అంగీకరించలేదు. కానీ, సుధా పట్టుదలతో చివరకు 1978లో వీరిద్దరి వివాహం జరిగింది. చిల్లిగవ్వ లేకపోయినా ఇన్ఫోసిస్‌ ప్రారంభించాలనుకున్న మూర్తికి సుధా తన రూ.10వేల పొదుపు అందించి విజయానికి బాటలు వేశారు. వేల మందికి ఉపాధి కల్పించాలన్న భర్త ఆశయం కోసం తనకు ఎంతో ఇష్టమైన ఇంజినీరింగ్‌ విద్యను వదిలేసుకున్నారు. కుటుంబ భారాన్ని భుజానికెత్తుకున్నారు. కంపెనీలో మూర్తితో కలిసి సమానంగా పనిచేసే అర్హతలున్నా.. కుటుంబ భాద్యతలు భర్త ఆశయానికి అడ్డురావొద్దన్న ఉద్దేశంతో ఆ దిశగా ఆలోచించలేదు. ఇన్ఫోసిస్‌ తొలినాళ్లలో ఆయనకు అన్నీ తానే అయి వ్యవహరించారు. అదంతా బాధ్యతతో కాకుండా ప్రేమతో చేశానంటారామె. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, కళలు, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి అండగా నిలుస్తున్నారు. ఆమెకు సినిమాలంటే చాలా ఆసక్తి. బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసిన బాహుబలి చిత్రాన్ని రెండుసార్లు, మగధీర సినిమాని మూడుసార్లు వీక్షించారట.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.