close

తాజా వార్తలు

సత్తా చూపితే కొలువుల వెలుగు!

విద్యుత్‌శాఖలో 3025 పోస్టుల భర్తీకి ప్రకటన

తెలంగాణ నిరుద్యోగ యువతకు విద్యుత్‌శాఖ తీపి కబురు తెచ్చింది. జూనియర్‌ లైన్‌మెన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌  కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు విడివిడిగా ప్రకటనలు విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 3025. పోస్టును బట్టి ఐటీఐ, డిగ్రీ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే మంచి జీతంతో కూడిన ప్రభుత్వ కొలువును చేజిక్కించుకున్నట్లే!

తెలంగాణ స్టేట్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) ఒకేసారి వివిధ పోస్టులకు ప్రకటనలు విడుదల చేసింది. 2500 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం), 500 జూనియర్‌ అసిస్టెంట్‌  కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ (జేఏసీఓ), 25 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ (జేపీఓ) ఉద్యోగాలివి.

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల్‌, నారాయణ్‌పేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, సూర్యాపేట, మెదక్‌, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌ల్లో వీటిని భర్తీ చేయనున్నారు. వీటిల్లో 5% పోస్టులను మెరిట్‌ ఆధారంగా, 95% పోస్టులను స్థానిక జిల్లా అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీవారికి రిజర్వేషన్‌ అవకాశముంది.

* జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు గుర్తింపు పొందిన సంస్థ/ బోర్డ్‌ ఆఫ్‌ కంబైన్డ్‌ ఏపీ/ తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌/ వైర్‌మెన్‌లో ఐటీఐ చేసినవారు అర్హులు. లేదా ఇంటర్మీడియట్‌లో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో ఒకేషన్‌ కోర్సు అయినా పూర్తిచేసుండాలి.
* జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఏ/ బీఎస్‌సీ/ బీకాంల్లో డిగ్రీ సాధించి ఉండాలి.
* జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఏ/ బీకాం/ బీఎస్‌సీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.

01.07.2019 నాటికి జూనియర్‌ లైన్‌మెన్లకు 18-35 ఏళ్లలోపు వయసు ఉండాలి. జేపీఓ, జేఏసీఓ పోస్టులకు 18-34 ఏళ్లలోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీవారికి వయఃపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉంది. పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంది.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియకు 100 మార్కులు కేటాయించారు. పోస్టును బట్టి ఎంపిక విధానంలో మార్పులున్నాయి.

ఎలా సిద్ధం కావాలి?

జూనియర్‌ లైన్‌మెన్‌ పేపర్‌-ఎ ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ కోర్‌ సబ్జెక్టుకు సంబంధించినది. ఇందులో ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీలు, మాగ్నటిజం, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఏసీ, బేసిక్‌ ఎలక్ట్రానిక్స్‌, డీసీ మెషిన్స్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌, ఏసీ మెషిన్స్‌, ఎలక్ట్రికల్‌ మెజర్‌మెంట్స్‌, ఎలక్ట్రిక్‌ పవర్‌ జనరేషన్‌ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. మొదట ప్రాథమిక ఫార్ములాలను క్షుణ్ణంగా చదవాలి. ఐటీఐ విద్యావిధానంలో ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన విషయ పరిజ్ఞానం ఈ పరీక్షలో ఎంతో ముఖ్యం. లైన్‌మెన్‌కు మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై అవగాహన ఉండాలి. ఏ పరికరం ఎలాంటి సూచనలు ఇస్తుంది, ఎక్కడ ఉపయోగించాలి అనేవాటిపై ప్రశ్నలు ఉండవచ్చు.

జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి అనలిటికల్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, కరెంట్‌ అఫైర్స్‌, కన్స్యూమర్‌ రిలేషన్స్‌, నిత్యజీవితంలో జనరల్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇష్యూ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, భారత, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యాలపై ప్రశ్నలు వస్తాయి. కరెంట్‌ అఫైర్స్‌లో ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలుంటాయి. వార్తాపత్రికల పఠనం సన్నద్ధతలో భాగమని గురించాలి. హైదరాబాద్‌ మెట్రో, టీ హబ్‌, గ్లోబల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ విశేషాలు ప్రశ్నలుగా రావొచ్చు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలు, అవార్డులు, ప్రభుత్వ విధానాలు, తెలంగాణలో జరిగిన సదస్సులు, సమావేశాలపై దృష్టిపెట్టాలి.

తెలంగాణలో ప్రాచీన కట్టడాలు, వాస్తుశైలి, ముఖ్యమైన జాతరలు, పండుగలు, కొండజాతుల సంప్రదాయాలు, కళలపై అవగాహన పెంచుకోవాలి. కాకతీయుల కాలంలో సమాజం, కళలు, వాస్తుశైలి, వేములవాడ చాళుక్యులు, నిజాంలు, కుతుబ్‌షాహీల కళలు, సాహిత్యం, వాస్తుశైలి నుంచి ఎక్కువ ప్రశ్నలు ఆశించవచ్చు.  తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులు, నూతన  రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేయాలి. ఉద్యమ నేతలు, ఆకాలంలో ఆలపించిన గేయాలు, రచనలు, సంస్థలు ముఖ్యం. తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే ఎక్కువ ఉపయోగకరం.

జూనియర్‌ లైన్‌మెన్‌: మొత్తం మార్కులు 100. రాతపరీక్షకు 80. 20 మార్కుల వెయిటేజీని టీఎస్‌ ట్రాన్స్‌కో/ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌/ టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ తరఫున చేస్తున్నవారికి ఇస్తారు. క్వాలిఫయింగ్‌ మార్కులను- ఓసీ-40%, బీసీ-35%, ఎస్‌సీ/ఎస్‌టీ-30%గా కేటాయించారు. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి 1:2 పద్ధతిలో అంటే 5 వేలమందిని కరెంట్‌ స్తంభం ఎక్కే (పోల్‌ క్లైంబింగ్‌) పరీక్షకు పిలుస్తారు. దీనిలోనూ అర్హత సాధించినవారికి పోస్టు ఇస్తారు. ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. ప్రతి ఆరునెలల అనుభవానికి ఒక మార్కు కేటాయిస్తారు. అంతకన్నా తక్కువ పని అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ఉండదు. ప్రారంభ వేతనం రూ.24,340. మొత్తం 80 ప్రశ్నలు; 80 మార్కులు. ఐటీఐ (ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌) నుంచి 65, జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి 15 ప్రశ్నలు చొప్పున వస్తాయి. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.

జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌

రాతపరీక్ష మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. 100 మార్కులు. క్వాలిఫయింగ్‌ మార్కులను- ఓసీ-40%, బీసీ-35%, ఎస్‌సీ/ఎస్‌టీ-30%, పీహెచ్‌ వారికి 30%గా కేటాయించారు. ప్రారంభ వేతనం రూ.34,925.

పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. ఫండమెంటల్స్‌ ఆఫ్‌ హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌, ఇండిస్ట్రియల్‌ రిలేషన్స్‌, జనరల్‌ లాస్‌, లేబర్‌ లాస్‌, రైట్‌ టూ ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌, వేజెస్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్‌-బి 20 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్‌ అవేర్‌నెస్‌- ఎంఎస్‌ ఆఫీస్‌, బేసిక్‌ కాన్సెప్ట్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అండ్‌ స్కిల్స్‌, అకౌంట్స్‌ రిలేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. సెక్షన్‌-సి 30 మార్కులు. జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, లాజికల్‌ రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌

మొత్తం మార్కులు 100. రాతపరీక్షకు 80. పరీక్ష  కాలవ్యవధి 120 నిమిషాలు. 20 మార్కుల వెయిటేజీని టీఎస్‌ ట్రాన్స్‌కో/ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌/ టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ తరఫున చేస్తున్నవారికి ఇస్తారు. ప్రతి ఆరునెలల అనుభవానికి ఒక మార్కు కేటాయిస్తారు. క్వాలిఫయింగ్‌ మార్కులను- ఓసీ-40%, బీసీ-35%, ఎస్‌సీ/ఎస్‌టీ-30%, పీహెచ్‌ వారికి 30%గా కేటాయించారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీనికి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీనిలో సాధించిన మార్కులను తుది స్కోరుకు జోడించరు. ప్రారంభ వేతనం రూ.29255.

పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. సెక్షన్‌-ఎకు 40 మార్కులు. న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-బి 20 మార్కులు. కంప్యూటర్‌ అవేర్‌నెస్‌- ఎంఎస్‌ ఆఫీస్‌, బేసిక్‌ కాన్సెప్ట్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అండ్‌ స్కిల్స్‌, అకౌంట్స్‌ రిలేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌-సికి 20 మార్కులు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ, జనరల్‌ నాలెడ్జ్‌ (కరెంట్‌ అఫైర్స్‌, కన్స్యూమర్‌ రిలేషన్స్‌, నిత్యజీవితంలో జనరల్‌ సైన్స్‌, పర్యావరణ అంశాలు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, భారత, తెలంగాణ చరిత్ర, భౌగోళికాంశాలు, ఆర్థికవ్యవస్థ, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం నుంచి ప్రశ్నలు వస్తాయి.

కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీని 50 మార్కులకు నిర్వహిస్తారు.వ్యవధి 30 నిమిషాలు. క్వాలిఫయింగ్‌ మార్కులుంటాయి. ఎంఎస్‌ వర్డ్‌లో టైపింగ్‌ లెటర్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌లో టేబుల్‌ రూపొందించడం, ఎంఎస్‌ పవర్‌ పాయింట్‌లో ప్రెజెంటేషన్‌/ స్లైడ్స్‌ను రూపొందించడం, ఈ-మెయిల్‌కు సంబంధించినవి ఉంటాయి. దరఖాస్తు చేసుకున్న జిల్లాలో 5-12 ఏళ్లు/ 1-7 తరగతులు చదివుండాలి. పోస్టులన్నింటికీ రెండేళ్ల శిక్షణ- ప్రొబేషన్‌ కాలం ఉంటుంది. ఎంపికైనవారు అయిదేళ్లకుగానూ బాండ్‌ రాయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ

న్‌లైన్‌లో (http://tssouthernpower.cgg.gov.in) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. పరీక్ష ఫీజు రూ.120 ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, పీహెచ్‌ వారికి ఫీజుల్లో మినహాయింపు ఉంది.

ఫీజు చెల్లించాక వచ్చిన జర్నల్‌ నంబరు, తేదీలను నోట్‌ చేసుకుని, దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. దానిలో అడిగిన వివరాలతోపాటు సంతకంతో కూడిన ఫొటోను కూడా జత చేయాల్సి ఉంటుంది. వివరాలన్నీ పూర్తిచేసి, సబ్మిట్‌ చేశాక అభ్యర్థి వివరాలతో  పీడీఎఫ్‌ వస్తుంది. దాన్ని సేవ్‌ చేసుకోవాలి. ప్రింట్‌ కాపీని పంపాల్సిన అవసరం లేదు.

ముఖ్యతేదీలు

జేఎల్‌ఎం, జేపీఓ
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2019
* ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 10.11.19
* దరఖాస్తుకు చివరితేదీ: 10.11.19
* పరీక్ష తేదీ: 15.12.19
జేఏసీఓ
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.10.2019
* ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 20.11.19
* దరఖాస్తుకు చివరితేదీ: 20.11.19
* పరీక్ష తేదీ: 22.12.19


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.