close

తాజా వార్తలు

‘ఈశ్వర్‌’ టు ‘సాహో’.. వయా ‘బాహుబలి’

ఆ హీరోలను దాటి ప్రభాస్‌కు వచ్చి చేరిన ‘ఈశ్వర్‌’ కథ

ఇప్పుడు ప్రభాస్‌ పేరు కాదు.. ఒక బ్రాండ్‌!

ప్రభాస్‌.. పరిచయం అక్కర్లేని పేరు. ‘రెబల్‌స్టార్‌’ నట వారసుడిగా వెండితెరకు పరిచయమైనా, కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ‘ఈశ్వర్‌’తో మాస్‌ ఎంట్రీ ఇచ్చి.. ‘వర్షం’ సాక్షిగా విజయ దుందుభిమోగించి.. ‘ఛత్రపతి’గా మెప్పించి.. ‘బుజ్జిగాడి’లా మురిపించి.. అమ్మాయిలకు అభిమాన ‘డార్లింగ్‌’లా ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లా ‘మిర్చి’లాంటి కుర్రాడు అనిపించుకున్న ఈ ‘బాహుబలి’.. దేశం యావత్తూ ‘సాహో’ అనిపించాడు. బుధవారం ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. 

 

హీరో అవుదామని అనుకోలేదు

ప్రభాస్‌ హీరో అవుదామని అస్సలు అనుకోలేదట. తనకు సినిమాల్లో నటించాలని ఉండేది కాదట. కానీ ఇంట్లో ఒక పక్క పెదనాన్న కృష్ణంరాజు హీరో. తండ్రి(సూర్య నారాయణరాజు) నిర్మాత. ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే. అయినా సరే హీరో అయిపోదాం అని కలలో కూడా ఊహించలేదట. ‘‘పెద్దయ్యాక ఏదో వ్యాపారం చేసుకుందాం లేదా ఉద్యోగం చూసుకుందాం అనుకునేవాడిని. అయితే ఫ్రెండ్స్‌ మాత్రం సరదాగా ‘హీరో’ అని పిలిచేవారు. చదువు పూర్తవగానే, ఒక రోజు ఏం జరిగిందో తెలియదు సడెన్‌ హీరో అవ్వాలనిపించింది. విషయం పెదనాన్నకు చెబితే ఆయనతో సహా ఇంట్లో వాళ్లందరూ షాక్‌కు గురయ్యారు. నటించాలని ఉంటే ముందు నటనలో శిక్షణ తీసుకోమని విశాఖలోని సత్యానంద్‌గారి దగ్గరకు పంపారు. నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే నిర్మాత అశోక్‌కుమార్‌ సినిమా చేద్దామనడంతో తొలుత వద్దన్నా. కానీ, పెదనాన్న కృష్ణంరాజు నచ్చజెప్పడంతో ఒకరకంగా శిక్షణపూర్తి కాకుండానే ‘ఈశ్వర్‌’ సినిమాలో నటించాల్సి వచ్చింది’’ అని తాను సినీ రంగంవైపు వేసిన తొలి అడుగుల గురించి చెబుతారు ప్రభాస్‌.

ఆ హీరోలను దాటుకుని ప్రభాస్‌ వద్దకు చేరిన ‘ఈశ్వర్‌’

‘ప్రేమంటే ఇదేరా’ చిత్రం తర్వాత జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో నిర్మాత అశోక్‌కుమార్‌ తరుణ్‌తో సినిమా చేద్దామని అనుకున్నారు. అప్పటికే జయంత్‌ ‘టక్కరి దొంగ’ చిత్రీకరణలో ఉండటంతో అది పూర్తయిన తర్వాత మొదలు పెడదామనుకున్నారు. ఇదే విషయాన్ని తరుణ్‌కు చెబితే తను కూడా సుముఖత వ్యక్తం చేశాడు. కానీ, సినిమా చేసే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో అశోక్‌కుమార్‌ కొడుకుని పెట్టి తీద్దామని జయంత్‌ సలహా ఇచ్చారు. ఆ సమయంలో అశోక్‌కుమార్‌ కొడుకు చదువుకుంటుండటంతో అందుకు ఒప్పుకోలేదు. కొత్త హీరోను పెట్టి తీస్తామని ప్రకటన కూడా ఇచ్చారు. అయితే, ఆ పాత్రకు ఎవరూ సరిపోకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అదే సమయంలో ప్రభాస్‌ గురించి అశోక్‌కుమార్‌కు తెలియడంతో వెళ్లి అడిగారు. అప్పటికి ప్రభాస్‌ సత్యానంద్‌ దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకుంటున్నాడు. వెళ్లి కలిస్తే, సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు. ఫొటో షూట్‌ చేసి అంతా ఓకే అనుకున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్‌ కూడా హీరోగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి, తన ఫొటోలను కూడా అశోక్‌కుమార్‌ తెప్పించారు. సినిమా పెద్దలందరినీ కూర్చోబెట్టి తాను అనుకున్న కథకు ఎవరైతే బాగుంటుందోనని సలహా అడిగితే, అందరూ ప్రభాస్‌కు ఓటేశారు. అలా ‘ఈశ్వర్‌’ సినిమా పట్టాలెక్కింది. 

నేనా తెరమీద ఇలా ఉంటానా? 

‘ఈశ్వర్‌’ మొత్తం మానిటర్‌ లేకుండా షూటింగ్‌ చేసేశారు. దీంతో తానెలా నటించానో కూడా తెలియదంటారు ప్రభాస్‌. అయితే నటన విషయంలో పెదనాన్న కృష్ణంరాజు చెప్పిన మాటలు ఎప్పటికీ తనకు గుర్తేనని చెబుతారు. ‘‘మనం ఒక షాట్‌లో నటించామంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. దాన్ని చెరపలేం. అందుకే ఏది చేసినా సీరియస్‌గా చెయ్‌. ఆ క్షణానికి నీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నా పక్కనపెట్టేయ్‌’ అన్నారు. అలా మొత్తానికి ‘ఈశ్వర్‌’ విడుదలైంది. తొలిరోజే థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశా. ఎంతో థ్రిల్లింగ్‌గా ఫీలయ్యా. బాబోయ్‌.. ఇదేంటీ.. నేనానా.. తెరమీద ఇలా ఉంటానా? అనిపించింది. ఆ సినిమా చూశాక నాన్న నన్ను కౌగిలించుకుని బాగుందిరా అంతే ఆ ఒక్కమాట అన్నారు’ అని తన తొలి సినిమా విశేషాలను పంచుకుంటారు ప్రభాస్‌.

‘వర్షం’ ఇచ్చిన హిట్‌ 

‘ఈశ్వర్‌’ చిత్రం తర్వాత ‘రాఘవేంద్ర’ సినిమా చేశారు ప్రభాస్‌. అయితే ఆ సినిమా తన ఇమేజ్‌ను పెంచలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను కొందరు ‘మాస్‌ హీరో’ అని అంటే తానేమో ‘లవర్‌బాయ్‌’ను అనేవారట. ఇదే సమయంలో ఎం.ఎస్‌.రాజు నిర్మాతగా శోభన్‌ దర్శకత్వంలో తీసిన ‘వర్షం’ సినిమా ప్రభాస్‌కు మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన ‘అడవిరాముడు’, ‘చక్రం’ సినిమాలు ప్రభాస్‌ సినీ కెరీర్‌కు సరైన విజయాలను అందించలేకపోయాయి. ఈ దశలోనే రాజమౌళి దర్శకత్వంలో ‘ఛత్రపతి’ చేశారు. తల్లి సెంటిమెంట్‌తో పాటు రాజమౌళి తనదైన టేకింగ్‌తో తీయడంతో ‘ఛత్రపతి’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘బుజ్జిగాడు’ ప్రభాస్‌ను కొత్తగా చూపించింది. ‘బిల్లా’లో స్టైలిష్‌గా కనిపించారు. ‘డార్లింగ్‌’ చిత్రంతో ప్రభాస్‌ అన్ని రకాల పాత్రలూ చేయగలరని నిరూపించారు. ఈ చిత్రంలో లవర్‌బాయ్‌గా ప్రభాస్‌ పోషించిన పాత్ర యువతను విశేషంగా ఆకట్టుకుంది. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘మిర్చి’ చిత్రాలు ప్రభాస్‌ కెరీర్‌ గ్రాఫ్‌ను మరింత పెంచాయి.  

మిత్రుడి కోసం విశ్వామిత్రుడిగా.. 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ‘యమదొంగ’ చిత్రం చేశారు. ఈ సినిమాను విశ్వామిత్ర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమైనా చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు టైటిల్స్‌ పడే సమయంలో విశ్వామిత్రుడిగా ప్రభాస్‌ కనిపిస్తే బాగుంటుందనుకున్నారట రాజమౌళి. ఇదే విషయాన్ని ప్రభాస్‌కు చెప్పారట. ‘నేనేంటి ఆ వేషం ఏంటి? అనుకున్నాను. కాస్త అటూ ఇటూ అయితే నీ బ్యానర్‌ పరువేం కాను?’ అంటూ జోక్‌ చేశానని, అయితే మిత్రుడి కోసం ఆ మాత్రం చేయలేనా అని విశ్వామిత్రుడిగా కనిపించానని చెబుతారు. ఇక మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన ‘దేనికైనా రెడీ’ చిత్రానికి కథకుడిగా మారారు ప్రభాస్‌. 

అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ‘బాహుబలి’ 

‘బాహుబలి’ ప్రభాస్‌కు అంతర్జాతీయంగా ఖ్యాతిని తెచ్చి పెట్టింది. దర్శకుడు రాజమౌళి ఈ కథ చెప్పి డేట్లు అడిగితే ‘నీకు ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో డార్లింగ్‌’ అన్నారట. ఒక స్టార్‌ కథానాయకుడు మరే సినిమా ఒప్పుకోకుండా కేవలం ఒక్క సినిమా కోసం ఏకంగా ఐదేళ్ల పాటు పనిచేయడం అంటే మాటలు కాదు. అలా ‘బాహుబలి’ కోసం అంకితభావంతో పనిచేశారు కాబట్టే ప్రభాస్‌కు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చి పెట్టింది. కేవలం పేరు తీసుకురావడమే కాదు.. దక్షిణభారత సినీ పరిశ్రమలో ఏ నటుడికీ దక్కని అరుదైన గౌరవాన్ని దక్కేలా చేసింది. బ్యాంకాక్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ‘బాహుబలి’ రూపంలో ఉన్న ప్రభాస్‌ మైనపు బొమ్మను ఏర్పాటు చేయడం విశేషం.

బాలీవుడ్‌ కూడా ‘సాహో’ అంది!

‘బాహుబలి’తో కేవలం దక్షిణాది నటుడిగానే కాకుండా జాతీయ నటుడిగా ఎదిగారు ప్రభాస్‌. దీంతో సుజీత్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’ భారీ అంచనాల మధ్య విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ వింటేజ్‌ లవ్‌స్టోరీ చేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే పూర్తిస్థాయిలో షూటింగ్‌ జరుపుకోనుంది.

సోషల్‌మీడియా స్టార్‌

ప్రభాస్‌ వెండితెరపైనే కాదు.. సామాజిక మాధ్యమాల్లోనూ స్టారే. ఒకప్పుడు వాటికి దూరంగా ఉండే ప్రభాస్‌ తన కొత్త సినిమాలకు సంబంధించిన వివరాలను పంచుకుంటూ ప్రస్తుతం చురుగ్గా ఉంటున్నారు. ఫేస్‌బుక్‌లో ప్రభాస్‌ను 10మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.9మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. అయితే ఆయన ఇద్దరిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో ఒకరు శ్రద్ధాకపూర్‌ కాగా, మరొకరు సాహో దర్శకుడు సుజీత్‌. 

ఫిట్‌నెస్‌కా బాప్‌..!

ప్రభాస్‌ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, ‘బాహుబలి’ మరో ఎత్తు. ఎందుకంటే యోధుడిలా కనిపించేందుకు ప్రభాస్‌ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా అమరేంద్ర బాహుబలి పాత్రలో కండల వీరుడిగా కనిపించిన ప్రభాస్‌.. మహేంద్ర బాహుబలి పాత్ర కోసం చాలా సన్నబడ్డారు. రెండు పాత్రలకు అనుగుణంగా ప్రభాస్‌ మారడం వెనుక పూర్తి క్రెడిట్‌ ఆయనకే దక్కుతుందని దర్శకుడు రాజమౌళి కూడా చెప్పారు. తాను కేవలం పాత్రలు ఎలా ఉండాలని మాత్రమే వివరించానని ప్రభాస్‌ అందుకు తగిన విధంగా సిద్ధమయ్యారని తెలిపారు. ఇక ‘బాహుబలి’ షూటింగ్‌లో సమయంలో కొన్ని రోజుల పాటు కేవలం ఎగ్‌మీల్‌ మాత్రమే ప్రభాస్‌ తీసుకునేవారని అన్నారు. అయితే, నెలలో ఒకరోజు తన ఇష్టం వచ్చింది తినడానికి అవకాశం ఉండేదని ఆ ఒక్క రోజు మాత్రం  ప్రభాస్‌ దాదాపు 15 రకాల బిర్యానీలు లాగించేవారని నవ్వుతూ చెప్పుకొచ్చారు. 

దీపావళి వస్తే ఇక అంతే..

ప్రభాస్‌కు అత్యంత ఇష్టమైన పండగల్లో దీపావళి ఒకటి. ఆ రోజు కొత్తవాళ్లు ఎవరైనా ప్రభాస్‌ను చూస్తే భయపడిపోతారట. ఎందుకంటే ఆరోజు ఫ్రెండ్స్‌, బంధువులతో కలిసి రచ్చ రచ్చ చేసేవారట. అలా ఒకసారి దీపావళినాడు మెహర్‌ రమేష్‌ ఇంటికి వచ్చి భయపడిపోయారట. ప్రభాస్‌, అతని స్నేహితులు కాలుస్తున్న టపాసులు చూసి, ‘మీరేంటి బాబూ టెర్రరిస్టుల్లా ఉన్నారు’ అని షాకయ్యారట.

-ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.