close

తాజా వార్తలు

‘రూ.2000 నోటునీ రద్దు చేయాలి’

ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి ఎస్‌.సి.గార్గ్‌ అభిప్రాయం

దిల్లీ: మోదీ ప్రభుత్వం చేసిన నోట్ల రద్దుకు నేటికి మూడేళ్లు. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అడ్డుకోవడమే లక్ష్యంగా రూ.500, రూ.1000ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆర్థిక నిపుణుడు ఆసక్తికర అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పటి పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌.సి.గార్గ్‌ అభిప్రాయపడ్డారు. ‘‘వ్యవస్థలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. రూ.2000నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. కానీ, భారత్‌లో మాత్రం అది చాలా నెమ్మదిగా సాగుతోంది’’ అని గార్గ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లే ఉన్నాయని తెలిపారు. వీటిలో చాలా వరకు చెలామణిలోకి రావడం లేదన్నారు. రోజువారీ లావాదేవీలకు ప్రజలకు ఇవి అందుబాటులో ఉండడం లేదన్నారు. ఈ నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవడం లేదా రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఎలా చేయాలి...
ప్రస్తుతం ఉన్న రూ.2000నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటే సరిపోతుందని గార్గ్‌ తెలిపారు. ఇదే మేలైన మార్గమని.. దీనివల్ల పెద్దగా ఇబ్బందులు కూడా తలెత్తవన్నారు. అయితే వాటి స్థానంలో నగదును తిరిగి ఇవ్వొద్దన్నది షరతు పెట్టడం ద్వారా చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లన్నీ వెనక్కి వస్తాయన్నారు.

నగదు చెల్లింపుల్ని భారంగా మార్చాలి...
ఆర్థిక లావాదేవీలకు అనేక డిజిటల్‌ సాధనాలు అందుబాటులోకి వచ్చాయని గార్గ్ గుర్తుచేశారు. అయినా భారత్‌లో మాత్రం ఇంకా 85శాతం నగదు ఆధారిత చెల్లింపులే జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్ని డిజిటల్‌ చెల్లింపుల దిశగా మార్చే చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అందుకోసం నగదు చెల్లింపులపై పన్నులు, ఛార్జీలు విధించాలన్నారు. అదే సమయంలో డిజిటల్‌ చెల్లింపుల్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా నగదు ఆధారిత చెల్లింపులు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారి ప్రజలు డిజిటల్‌ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా నగదు లావాదేవీలకు పూర్తిగా స్వస్తిపలకాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో ఇలాంటి చర్యలే చేపట్టారని.. ప్రస్తుతం ఆ దేశంలో 87శాతం లావాదేవీలు డిజిటల్‌ రూపంలోనే జరుగుతున్నాయని తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం బ్యాంకింగేతర డిజిటల్‌ చెల్లింపు సాధనాల్ని వ్యవస్థలోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.