close

తాజా వార్తలు

క్యాలిక్యులేటర్లతో ప్రారంభమై కంప్యూటర్ల వరకూ...

ఇంటర్నెట్‌ డెస్క్‌: అది 1976.. పుణెలోని దిల్లీ క్లాత్‌ మిల్స్‌(డీసీఎం) కంపెనీ క్యాంటీన్‌ టెబుల్‌పై కూర్చుని కంపెనీలో తమకు అప్పగించిన డిజిటల్‌ క్యాలిక్యులేటర్ తయారీపై కొంతమంది యువకులు సమాలోచనలు జరుపుతున్నారు. కానీ, అందులో ఒకరు తాము చేసే పనితో సంతృప్తిగా లేరు. కంప్యూటర్లు రాబోతున్న కాలంలో ఇంకా కాలిక్యులేటర్లు ఏంటనిపించింది. వెంటనే తన ఆలోచనని తన మిత్రులతో పంచుకున్నాడు. మనమే ఓ కంపెనీ ప్రారంభించి కంప్యూటర్లు ఎందుకు తయారుచేయకూడదని వారిలో ఓ ఆలోచన రేకెత్తించాడు. భవిష్యత్తులో కంప్యూటర్లకు ఉండబోయే డిమాండ్‌ని వారికి వివరించారు. ఆయన ఎవరో కాదు.. హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ శివనాడార్‌. నిజానికి కంప్యూటర్‌ అనే పదం ఇండియాకు అప్పుడప్పుడే పరిచయం అవుతున్న రోజులవి. తనకున్న విశ్వాసంతో స్నేహితులని ఒప్పించి కంపెనీ ప్రారంభించారు. కంప్యూటర్ల తయారీలో ఐబీఎం, యాపిల్‌ సరసన నిలిచారు. తదనంతరం అనేక కంపెనీలు పుట్టుకొచ్చినా వాటిలో ఇప్పటికీ నిలిచింది మాత్రం మూడే. అందులో హెచ్‌సీఎల్‌ ఒకటి.
మారుమూల గ్రామంలో..
తమిళనాడు రాష్ట్ర తూత్తుకుడి జిల్లాలోని మూలైపోజి అనే మారుమూల గ్రామంలో 1945లో జన్మించారు శివనాడార్‌. తండ్రి శివసుబ్రహ్మణ్య న్యాయమూర్తిగా పనిచేశారు. తల్లి వామ సుందరి దేవీ గృహిణిగా ఉండేవారు. తమిళ భాషలో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘దిన తంతి’ దినపత్రిక వ్యవస్థాపకుడు ఎస్‌.పి.అధిథనార్ శివనాడార్‌కు స్వయాన మేనమామ. కుంభకోణం, తిరుచ్చిలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. కోయంబత్తూరులోని పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించారు. అనంతరం పుణెలోని దిల్లీ క్లాత్‌ మిల్స్‌(డీసీఎం)లో ఇంజినీర్‌గా వృత్తి విద్యను ప్రారంభించారు. 

క్యాంటీన్‌ టేబుల్‌పై పుట్టిన ఆలోచన..
డీసీఎంలో పనిచేస్తుండగా ఓ రోజు కంపెనీ వారికి అప్పగించిన డిజిటల్‌ క్యాలిక్యులేటర్‌పై తన సహచరులతో చర్చిస్తున్నారు. అయితే ఆ క్యాలిక్యులేటర్లలో అత్యాధునిక చిప్‌లని వాడుతున్నారు. నిజానికి వాటిని మరింత అభివృద్ధి చేసి కంప్యూటర్లని తయారుచేయొచ్చు. అదే ఆలోచనతో సొంత కంపెనీ ప్రారంభించాలనుకున్నారు శివనాడార్‌. అదే విషయాన్ని తన తోటి సహచరులతో పంచుకున్నారు. కంపెనీ నుంచి బయటికి వస్తే సాధ్యమని భావించారు. అలా అజయ్‌ చౌదరి, అర్జున్‌ మల్హోత్రా, సుభాష్‌ అరోరా, యోగేశ్ వైద్య, డీఎస్‌.పురితో కలిసి కంపెనీ వదిలి బయటికొచ్చేశారు. 

నిధుల కోసం తొలుత క్యాలిక్యులేటర్‌ కంపెనీ..
అయితే కంపెనీ ప్రారంభానికి నిధుల సమస్య తప్పలేదు. దీంతో తొలుత వారికి అనుభవం ఉన్న క్యాలిక్యులేటర్‌ తయారీ కంపెనీనే ప్రారంభించారు. అలా మైక్రోకాంప్‌ అనే సంస్థని స్థాపించి ‘టెలీవిస్టా’ అనే క్యాలిక్యులేటర్‌ని తయారుచేసుకున్నారు. వారనుకున్నట్లే కొంత పెట్టుబడి సమకూరింది. 

అనుమతుల కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతో జట్టుకట్టి...
అయితే అప్పట్లో భారత్‌లో ప్రైవేట్‌ కంపెనీని ప్రారంభించడం ఓ పెద్ద సవాల్‌తో కూడుకున్న పని. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో జట్టుకట్టాలని నిర్ణయించుకున్నారు. అలా తమ ఆలోచనని నివేదిక రూపంలో యూపీ ప్రభుత్వానికి సమర్పించారు. వారితో కలవడానికి ప్రభుత్వం ఒప్పుకోవడంతో అనుమతులకు మార్గం సుగమమైంది. అలా అంతా కలిసి రూ.20లక్షలతో 1976లో హెచ్‌సీఎల్‌కి బీజం వేశారు.

కలిసొచ్చిన ఐబీఎం నిష్క్రమణ...
జనతా ప్రభుత్వం రాకతో భారత్‌లో విదేశీ కంపెనీలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ పనిచేసే విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తులకు సంబంధించిన సోర్స్‌ కోడ్‌ని ఇతర దేశాలకు పంపకూడదన్న నిబంధన విధించింది. దీంతో ఐబీఎం భారత్‌ నుంచి నిష్క్రమించింది. కంప్యూటర్లకు ఐబీఎం సృష్టించిన మార్కెట్‌ని వీరు ఒడిసిపట్టుకోగలిగారు. అలా ఐబీఎం నిష్క్రమణ హెచ్‌సీఎల్‌కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అయితే కేవలం  భారత్‌కే పరిమితమైతే మనుగడ సాగించలేమని భావించిన నాడార్‌ 1979లో సింగపూర్‌లో ‘ఫార్‌ ఈస్ట్‌ కంప్యూటర్స్‌’ పేరిట మరో వెంచర్‌ ప్రారంభించారు. అలా అనతి కాలంలోనే యాపిల్‌తో సమానంగా విదేశాలకు ఇన్‌ హౌజ్‌ కంప్యూటర్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు.

ఇతర రంగాలలోకి...
అలా 1980ల్లోకి ప్రవేశించే నాటికి హెచ్‌సీఎల్‌ కంప్యూటర్ల తయారీలో మంచి పట్టు సాధించింది. ఇక ఇతర రంగాల్లోకి తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకున్నారు. కంప్యూటర్‌ ఇంజినీరింగ్ విద్యకు ఉన్న అవకాశాల్ని పసిగట్టి 1981లో ఎన్‌ఐఐటీ పేరిట ఐటీ విద్యా సంస్థను ప్రారంభించారు. అనంతరం ఇతర దేశాల నుంచి సాంకేతికతను దిగుమతి చేసుకునే నిబంధనల్ని ప్రభుత్వం సులభతరం చేయడంతో ఇక పర్సనల్‌ కంప్యూటర్లపై హెచ్‌సీఎల్‌ దృష్టి మళ్లింది. అలా అనేక దేశాల్లో పర్యటించి కేవలం మూడు వారాల్లో తొలి పీసీని తయారు చేసి ‘బిజీబీ’ పేరిట విడుదల చేశారు. యూనిక్స్‌ ప్లాట్‌ఫాంపై నడిచే వీటిని ముఖ్యంగా బ్యాంకులు విపరీతంగా కొనుగోలు చేశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా తమ కంప్యూటర్‌కి గిరాకీ పెంచుకొని విక్రయాలు ప్రారంభించాయి. ఆ క్రమంలో 1989లో అమెరికా హార్డ్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించడం హెచ్‌సీఎల్‌ స్థాయిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. కానీ, కొద్ది కాలంలోనే ప్రతికూల పరిస్థితులు ప్రారంభం కావడంతో హెచ్‌పీతో జట్టుకట్టాల్సి వచ్చింది. ఇది కంపెనీకి కొత్త అవకాశాల్ని తెచ్చి పెట్టింది. అనంతరం నోకియా, ఎరిక్సన్‌తోనూ చేయికలిపి సెల్‌ఫోన్‌, స్విచ్చెస్‌ డిస్ట్రిబ్యూషన్‌లో భాగస్వామ్యం అయ్యి అవకాశాల్ని మరింత విస్తృతం చేసుకుంది. 

అర్జున్‌ మల్సోత్రా నిష్క్రమణతో ఎదురుదెబ్బ...
అలా హార్డ్‌వేర్‌ రంగంలో రారాజుగా దూసుకుపోతున్న హెచ్‌సీఎల్‌ తన వ్యాపార విస్తరణలో భాగంగా 1997లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ పేరిట సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌, సర్వీసెస్‌లోకి ప్రవేశించింది. కానీ, 1998లో నాడార్‌కు అనుకోని దెబ్బ ఎదురైంది. అతిపెద్ద వాటాదారు అయిన తన సహచరుడు అర్జున్‌ మల్హోత్రా కంపెనీ నుంచి నిష్క్రమించారు. దీంతో మళ్లీ నిధుల వేటలో పడాల్సి వచ్చింది. అందుకోసం ఈసారి ఐపీఓకి వెళ్లారు. ఇది కంపెనీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో తిరుగులేని సంస్థల్లో ఒకటిగా ఎదగడానికి ఇది ఎంతో దోహదం చేసింది. తదనంతర కాలంలో బోయింగ్‌, ఎన్‌ఈసీ లాంటి దిగ్గజ కంపెనీలకు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌ చేసే స్థాయికి ఎదిగింది.   

మన వేంకన్న అంటే అపర భక్తి..
శివనాడార్‌కు దైవభక్తి ఎక్కువే. మన తిరుమల వేంకటేశుడంటే అమితమైన భక్తి. తరచూ తిరుమలను దర్శించుకుంటారు. గుడికి అనేక సార్లు భారీ విరాళాలు ప్రకటించారు. గత సంవత్సరం రూ.కోటి విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఆయన ఏకైక కూతురు రోషిణి నాడార్‌ ప్రస్తుతం హెచ్‌సీఎల్‌కి వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు.  

విద్యారంగంలో విశేష కృషి..
భారత్‌లో దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్న పారిశ్రామికవేత్తలో శివనాడార్‌ తొలి స్థానంలో ఉన్నారు. కంపెనీ స్థాపించిన నాటి నుంచి తన సంపాదనలో 10శాతం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ వస్తున్నారు. శివనాడార్‌ ఫౌండేషన్‌ పేరిట విద్య, వైద్య రంగంలో ప్రజలకు సేవలందజేస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎన్‌ పేరిట చెన్నైలో ఇంజినీరింగ్ కాలేజీ స్థాపించి ప్రతిభ గల విద్యార్థులకు అత్యాధునిక, నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్యనందిస్తున్నారు. విద్యాజ్ఞాన్‌ పేరిట పాఠశాలల్ని ప్రారంభించి గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ గల విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తున్నారు. అలాగే కళలకు ప్రాధాన్యం ఇస్తూ భార్య కిరణ్‌ నాడార్‌ పేరిట దేశంలోనే తొలి ప్రైవేట్‌ దాతృత్వ మ్యూజియం ప్రారంభించారు. శివనాడార్‌ విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పారు. ఇలా వైద్య రంగంలోనూ తన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు.

ఇలా తొలుత ఐదుగురితో 20లక్షల పెట్టుబడితో ప్రారంభమైన కంపెనీ నేడు రూ.వేల కోట్ల కంపెనీగా అవతరించి లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడిప్పుడే శివనాడార్‌ కీలక బాధ్యతల్ని తన ఏకైక కూతరు రోషిణి నాడార్‌కు అప్పజెబుతున్నారు. ‘ఫిలాం త్రోఫి’లో ఉన్నత విద్యనభ్యసించిన ఈమె తల్లి కిరణ్‌ నాడార్‌తో కలిసి దాతృత్వ కార్యక్రమాల్లోనూ క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. దేశీయ వ్యాపార రంగానికి శివ నాడార్‌ అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.