close

తాజా వార్తలు

నా మతం మానవత్వం: జగన్‌

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ఆసరా ప్రారంభించిన సీఎం

గుంటూరు:  ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్రచికిత్స చేయించుకున్న బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ఆసరా కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గుంటూరు పర్యటనలో ఉన్న ఆయన..  స్థానిక జీజీహెచ్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా శస్త్రచికిత్సల తర్వాత లబ్ధిదారులకు రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. డిశ్చార్జి అయిన 48 గంటల్లోపు రోగి బ్యాంకు ఖాతాకు సాయం మొత్తాన్ని జమ చేయనున్నారు. సొమ్ము అందకపోతే టోల్‌ ఫ్రీ నంబర్‌ 104కి ఫోన్‌ చేయాలని సీఎం సూచించారు.

ఈ కార్యక్రమం అమలు సందర్భంగా లబ్దిదారులకు సీఎం జగన్‌ చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంచి పాలన చేస్తుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ‘ నా మతం, కులం గురించి కొందరు ఆరోపణలు చేస్తున్నారు. వారికి నా సమాధానమిదే. నా మతం మానవత్వం.. నా కులం మాట నిలబెట్టుకోవడం’ అని అన్నారు. ఉపాధి లేని రోగులు పస్తులు ఉండకుండా చేసేందుకే ఆరోగ్య శ్రీ ఆసరా తీసుకొచ్చినట్లు చెప్పారు. జనవరి 1 నుంచి అర్హులందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు అందించనున్నట్లు సీఎం చెప్పారు.

‘ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు పెంచాం. మొత్తం 2వేల వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా జనవరి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు చేపడుతున్నాం. తర్వాత దశలవారీగా 2వేల వ్యాధులకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం వర్తింపజేస్తాం. రూ. వెయ్యి ఖర్చు దాటితే పథకం వర్తించేలా చర్యలు చేపడుతున్నాం.’ అని సీఎం జగన్‌ అన్నారు. ఏప్రిల్‌ నాటికి 1060 అంబులెన్సులు కొత్తగా అందుబాటులోకి రానున్నట్లు ఆయన చెప్పారు. ‘ప్రమాదం జరిగిన 20 నిమిషాల్లోపే అంబులెన్స్‌లు ఘటనాస్థలికి వస్తాయి. ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలను తీసుకొచ్చాం.డిసెంబర్ 15 నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 510 రకాల మందులు అందుబాటులోకి తెస్తాం. ఏప్రిల్ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం మందుల సరఫరా చేస్తాం. వైఎస్సార్ కంటి వెలుగును రాష్ట్రవ్యాప్తంగా అందరికీ వర్తింపజేస్తాం. జనవరి 1 నుంచి తలసేమియా, సికిల్ సెల్ రోగులకు రూ.10వేల ఆర్థికసాయం అందిస్తాం.’అని జగన్‌ చెప్పారు.

మే నాటికి ఖాళీగా ఉన్న  డాక్టర్, నర్సుల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మూగ, చెవిటి పిల్లలకు ఉచితంగా కాక్లియర్ ప్లాంట్స్ అమరుస్తామన్నారు. క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తామన్నారు. జనవరి 1 నుంచి క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ వైద్యాన్ని ఉచితంగా  అందిస్తామని సీఎం వెల్లడించారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.