close

తాజా వార్తలు

Published : 30/10/2018 11:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మదుపు చేద్దాం..పొరపాటు చేయకుండా..

డబ్బు.. ప్రపంచం అంతా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవకాశాలను వినియోగించుకుంటూ.. పొరపాట్లకు తావీయకుండా.. జాగ్రత్తగా ఉంటేనే అవసరమైన మేరకు సంపాదించగలం. అందులో నుంచి కొంత పొదుపు చేయగలం. భవిష్యత్తు కోసం పెట్టుబడులూ పెట్టగలం. డబ్బు విషయంలో కొన్నిసార్లు భావోద్వేగాలతో చేసే పనులు దీర్ఘకాలంలో మనకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉంది. మరి, వాటిని నియంత్రించుకుంటూ ఎలా ముందుకెళ్లాలో చూద్దామా! 

మదుపు చేద్దాం..పొరపాటు చేయకుండా..
ఒక వస్తువును కొనేప్పుడు ఎన్నో రకాలుగా ప్రశ్నించుకుంటాం. కానీ, మన కష్టార్జితాన్ని ఎక్కడైనా పొదుపు చేసేప్పుడు.. పెట్టుబడి పెట్టేప్పుడు కాస్త తార్కికంగా ఆలోచించకుండా.. ఇతరుల నిర్ణయాలను పాటించేస్తుంటాం. అంకెల గారడీలు మనల్ని ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు ప్రేరేపిస్తుంటాయి. పెట్టుబడులు పెట్టేప్పుడూ అనేక రకాల ఆశలు, భయాలు, అంచనాలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. గతంలో ఎదురైన అనుభవాలు ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలకు కొన్నిసార్లు అడ్డుగా నిలుస్తాయి. ఈ దశలోనే చాలామంది మదుపరులు డబ్బు సంపాదించేందుకు దగ్గరిదారులను వెతుకుతుంటారు. దీనివల్ల ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేదనేది వారి ఆలోచన. ఇదే వారిని పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలికం అనే భావన నుంచి దూరం చేస్తుంది. చాలా సందర్భాల్లో పెట్టుబడుల నుంచి నష్టం వచ్చిందని వింటుంటాం. నిజానికి ఇది ఆయా పెట్టుబడుల నుంచి కాదు.. ఆ మదుపరుల నిర్ణయాల ఫలితాల ఆధారంగా వచ్చినవే. అవేమిటి.. వాటిని అధిగమించేందుకు ఏం చేయాలి?

అర్థం చేసుకోకుండా..

ఇతర ఏ పెట్టుబడి పథకాలతో పోల్చి చూసినా.. ఇటీవల కాలంలో మ్యూచువల్‌ ఫండ్లు కాస్త అధిక రాబడిని అందించాయనేది వాస్తవమే. ఈ కారణంతోనే గత రెండేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు చాలామంది మదుపరులు ఆసక్తి చూపించారు. యాంఫీ, ఫండ్‌ సంస్థలు కూడా మ్యూచువల్‌ ఫండ్ల గురించి విపరీతంగా ప్రచారం చేశాయి. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్టితో చూసినప్పుడు మ్యూచువల్‌ ఫండ్లు సరైనవే. ఇందులో అనుమానమేమీ లేదు. కానీ.. వాటిని అర్థం చేసుకోవడంలో పొరపాటు చేస్తేనే ఇబ్బంది. మన ఆర్థిక లక్ష్యాలను బట్టి, ఏ విభాగం, ఏ రకం ఫండ్లు మనకు సరిపోతాయనేది చూసుకోవాలి. దీర్ఘకాలం కోసం కాకుండా.. ‘ఇప్పటి పనితీరు బాగుందని మీరు పెట్టుబడి పెడితే. ఇదే కారణంతో మళ్లీ పెట్టుబడిని వెనక్కి తీసుకుంటారు’. చాలామంది మ్యూచువల్‌ ఫండ్‌ మదుపరులు చేస్తున్న పొరపాటు ఇదే. దీనికి బదులుగా క్రమానుగత పెట్టుబడి విధానంలో దీర్ఘకాలం అనే మాటను మర్చిపోకుండా ఉండాలి.

వాస్తవాలనే చూడాలి.. 
 

‘ఇక్కడ ఒక ఐటీ సంస్థ రాబోతోంది’ లేదా.. ‘ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తోంది’.. ఇలాంటి మాటలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. వెంటనే ఆ ప్రాంతంలో స్థలం కొంటే ఎలా ఉంటుంది అనే ఆలోచిస్తాం.. అక్కడ ఉండే స్థిరాస్తి వ్యాపారులు చెప్పే మాటల సంగతి సరేసరి. ఇప్పుడు తీసుకుంటే బంగారం లాంటి అవకాశమనీ.. జాక్‌పాట్‌ మీదేనని చెప్పేస్తారు. చాలామంది చేసే పొరపాటేమిటంటే.. ఒక వార్త వినగానే.. దానిని పూర్తిగా విశ్వసిస్తుంటారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించరు. ఇలా ఆలోచించేలోపే ధరలు మదుపు చేద్దాం..పొరపాటు చేయకుండా..పెరుగుతాయి అంటూ.. వాస్తవ విరుద్ధమైన వాదనలూ చేసేవారుంటారు. అసలు ఆ సంస్థ అక్కడ వస్తోందా? అనుమతుల మాటేమిటి? అధికారులు ఏం చెబుతున్నారులాంటి వివరాలు తెలుసుకుంటే చాలు.. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు. ఇలాంటి వదంతుల వార్తలను నమ్మి, మోసపోయినవారు ఎందరో ఉన్నారని మనకు తెలుసు కదా! 
స్టాక్‌ మార్కెట్లో కూడా ఇలాంటివి ఎదురవుతుంటాయి. ఒక షేరు ధర తగ్గుతూ వస్తుందనుకుందాం.. చాలామంది దాని గత చరిత్రను చూసి, ఇప్పుడు తక్కువకు వస్తోంది కదా.. కొనేద్దాం అనుకుంటారు. మార్కెట్‌ పెరిగితే వెంటనే అది దాని గరిష్ఠ ధరకు చేరుకుంటుందని నమ్ముతుంటారు. దీర్ఘకాలంలో ఆ షేరు ధర పెరగాలంటే.. ఆ కంపెనీ పనితీరును బట్టే ఆధారపడి ఉంటుంది. అంతేకానీ, ఇతర కారణాలు కావు.. 
ఉదాహరణకు.. 2008లో మార్కెట్‌ బాగున్నప్పుడు యునిటెక్‌, సుజ్లాన్‌ కంపెనీల షేర్లు వరుసగా రూ.543; రూ.459 గరిష్ఠ ధరకు చేరాయి. ఆ తర్వాత అవి పడుతూ వచ్చాయి. చాలామంది ఇలా తగ్గుతున్నప్పుడు మళ్లీ ధర పెరుగుతుంది అనే ఆశతో కొనేశారు. కానీ, పదేళ్ల తర్వాత కూడా అవి రూ.2.20; రూ.6.05 (అక్టోబరు 26నాటికి) వద్ద ఉన్నాయి. కాబట్టి, అంచనాలు కాకుండా.. వాస్తవాలనే పరిగణనలోనికి తీసుకోవాలి. మంచి కంపెనీల షేర్లు.. మంచి ధరవద్ద కొనాలి.. ఇది మార్కెట్‌ సూత్రం. అంతేకానీ.. తక్కువకు వస్తున్నాయి కదా అని ఏదో ఒకటి అని కొంటే.. నష్టం తప్పదు. 
భవిష్యత్తును అంచనా వేస్తూ.. 
పెట్టుబడుల విషయంలో రాబడిని కచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదు. కానీ, చాలామంది గత చరిత్రను చూసి పెట్టుబడులు పెడుతుంటారు. సాధారణంగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు గతంలో వచ్చిన రాబడిని ఆశగా చూపిస్తూ మదుపరులను ఆకర్షిస్తుంటాయి. కానీ, పరిశోధనల్లో తేలింది ఏమిటంటే.. గత చరిత్ర ఆధారంగా మదుపు చేసేవారు ఎప్పుడూ లాభపడలేదు. మదుపు చేసేప్పుడు గతాన్ని కాకుండా.. ముందు ఏం జరగబోతోంది అనేది చూసుకోవాలి. 
ఉదాహరణకు జనవరి 2, 2014 నుంచి జనవరి 2, 2018 మధ్య కాలంలో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 6,514 పాయింట్ల నుంచి 19,198 పాయింట్లకు పెరిగింది. అంటే.. ఈ నాలుగేళ్లలో ఇది మూడు రెట్ల వరకూ పెరిగింది. సగటున వార్షిక వృద్ధి 31శాతం అనుకోవచ్చు. ఇదే సమయంలో స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇక ఈ ఏడాది జనవరి 15 నుంచి అక్టోబరు 26 వరకూ గమనిస్తే.. ఈ సూచీ 20,046 పాయింట్ల నుంచి తగ్గుతూ వచ్చి, 13,597కి చేరింది. అంటే దాదాపు 47.4శాతం పతనం అయ్యింది. ఇందులో పెట్టుబడులు తగ్గడమే కాకుండా.. చాలామంది తమ డబ్బును వెనక్కి తీసుకున్నారు. భవిష్యత్తును అంచనా వేయకుండా.. చాలామంది మదుపరులు మార్కెట్లో అధిక ధరల వద్ద కొని, తక్కువ ధరలకు అమ్మేస్తుంటారు. ఇదే నష్టానికి కారణం. చేయాల్సింది.. తక్కువగా ఉన్నప్పుడు కొనాలి.. అనుకున్న లాభం వచ్చినప్పుడు బయటకు రావాలి.

ఏం చేయాలి?

ఒక్కో వ్యక్తి ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. అంటే, ఒకరికి నప్పింది మరొకరికి సరిపోకపోవచ్చు. ఒక వస్తువును కొనడం గురించి మరొకరి అభిప్రాయం అడిగి తెలుసుకోవచ్చు. కానీ, పెట్టుబడి పెట్టేప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. వాటిని సొంతంగా విశ్లేషించుకునేందుకు ప్రయత్నించాలి. కనీసం అర్థం చేసుకోవాలి. వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకోవడం ఇక్కడ అవసరం. 
ఒక పెట్టుబడి పథకంలో ఉండే లాభనష్టాలను తెలుసుకునేందుకు ముందుగా కొంత సమయం పెట్టుబడి పెట్టండి. ఆ తర్వాతే మీరు సంపాదించిన డబ్బును మదుపు చేయండి. అప్పుడే మీకు ఆ పథకాల మీద విశ్వాసం వస్తుంది. 
లక్ష్యాలను బట్టి, పెట్టుబడి పథకాల ఎంపిక ఉండాలి. పథకం పనితీరు, మీకు ఉన్న వ్యవధి, భరించగలిగే నష్టభయం వీటన్నింటినీ అంచనా వేసుకోవాలి. దీర్ఘకాలంలో 15శాతం ఇచ్చే పెట్టుబడులు స్వల్పకాలంలో 30శాతం వరకూ నష్టాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని గమనించాలి. 
వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ.. క్రమానుగత పెట్టుబడులను ఎంచుకోవడమే ఎప్పుడూ మేలు.

నా నిర్ణయం తప్పు కాదు.. 
పెట్టుబడులు అంటేనే ఎంతోకొంత నష్టభయం ఉంటాయి. ఈ విషయాన్ని మదుపు చేసేప్పుడే గమనించాలి. తక్కువ నష్టభయం భరించగలిగేవారు.. షేర్లలాంటి అధిక నష్టభయం ఉన్న పథకాలను చూడకూడదు. తీరా పెట్టుబడి పెట్టాక.. కొంత నష్టం రాగానే ఆందోళన చెంది, ఉన్నంతలో అమ్మేద్దాం అనుకోవడం సరికాదు. ఇలాంటి వారు తప్పు పెట్టుబడులను ఎంచుకున్నాం అనే ఆలోచన, ఆ పెట్టుబడుల్లో ఎప్పుడూ నష్టాలు వస్తాయనే అనుకుంటారు. పెట్టుబడి నిర్ణయాలు భావోద్వేగాలతో కాకుండా వాస్తవ పరిస్థితులను బట్టి అంచనా వేయాలి. మరికొందరు తాము తీసుకున్న నిర్ణయం తప్పు కాదు.. అనే పట్టుదలతోనే ఉంటారు. ఉదాహరణకు.. ఒక వ్యక్తి తాను నమ్మిన కొన్ని షేర్లలో పెట్టుబడి పెట్టాడు. అందులో తీవ్రంగా నష్టాలు వస్తుండటంతో వాటిని అమ్మేయాలనుకున్నాడు. వచ్చిన డబ్బును మంచి షేర్లలో మదుపు చేద్దాం అనుకున్నాడు. ఇది క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానం. కానీ, నష్టాలు వస్తున్నా.. తాను తీసుకున్న నిర్ణయం పొరపాటు కాదనీ, మొండిగా వ్యవహరిస్తేనే అసలుకు ఎసరు వస్తుంది. 
* అదృష్టవశాత్తూ తను ఎంచుకున్న ఒకటి రెండు షేర్లు మంచి రాబడి ఇచ్చేసరికి చాలామందికి ఎక్కడలేని విశ్వాసం వచ్చేస్తుంది. పెట్టుబడుల విషయంలో తమకు ఉన్న అనుభవం, నైపుణ్యం, అంచనాలు ఎప్పుడూ తప్పుకావని అనుకుంటారు. ఏ మాత్రం విశ్లేషించకుండా షేర్లను కొనేస్తుంటారు. అంతేకాదు.. వాటిని ఇతరుల మీద కూడా రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటివారు.. మార్కెట్లో అధిక మొత్తంలో ట్రేడింగ్‌ చేస్తూ.. నష్టాలతో తమ మదుపు ప్రయాణాన్ని ముగిస్తుంటారు. ఇతరులనూ ముంచేస్తారు. కాబట్టి, ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. 
అధిక సమాచారంతో.. 
పెట్టుబడుల గురించి ఇప్పుడు కుప్పలుతెప్పలుగా సమాచారం అందుబాటులో ఉంటోంది. వరదలా వస్తున్న సమాచారంలో ఏది సరైనదీ.. ఏది కాదు అని నిర్ణయించుకునే అవకాశమూ ఉండటం లేదు. మార్కెట్‌ నిపుణులూ, నిపుణులు కానివారినీ అడిగి తెలుసుకుంటారు.. నిజానికి అధిక సమాచారం కూడా కొన్నిసార్లు ఇబ్బందిపెడుతుంది. ఒక పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేందుకు కావాల్సింది అధిక సమాచారం కాదు.. కచ్చితమైన సమాచారం. అది తెలుసుకొని, పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటే చాలు. (అక్టోబరు 30, అంతర్జాతీయ పొదుపు దినోత్సవం)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.