close

తాజా వార్తలు

ఫిరాయింపులకొద్దీ డబ్బు

ఫిరాయింపులకొద్దీ డబ్బు

పార్టీలన్నియు ‘ఓడి’పోవును... లబ్ధి ఒక్కటే ‘గెలిచి’ నిలుచును అని మహాకవి గురజాడ అప్పారావు రాయకపోతేనేం- రాజకీయ వేదాంతం చట్టసభల్లో బల్లగుద్ది గొప్పగా చెబుతోంది. ఈ తత్వం నేతలకు బాగా తలకెక్కింది. ప్రత్యర్థి పక్షాల్లో గెలిచిన నేతలను పదవులు, డబ్బు, కాంట్రాక్టులు ఇతరేతర ప్రయోజనాలు ఎగరేసుకుపోతున్నాయి. ఈ రోజుల్లో పార్టీల సమస్యలు ఒకటీ రెండూ కావు. ఇందులో బోలెడంత తిర‘కాసు’ ఉంది. ఎలాగోలా టికెట్టు చేతిలో పెట్టి, ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకున్నా గుండెల మీద చెయ్యి వేసుకుని పార్టీలు సంతోషంగా ఉండలేకపోతున్నాయి.

ఎన్నికల్లో గెలిపించుకోవడంకన్నా వారిని మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు తమ పార్టీలోనే నిలబెట్టుకోవడం (నే)తలకు మించిన పని అవుతోంది. ఎన్నికల ముందు అధినేతల కాళ్లావేళ్లాపడి టికెట్టు సంపాదించుకున్న నేతలు సైతం ఎన్నికల్లో గెలిచాక జంప్‌ జిలానీలు అవుతున్నారు. ఒకప్పుడు వీళ్లను ఆయారాం గయారాం అనేవాళ్లు. వీళ్లు పార్టీ ఫిరాయించకుండా పార్టీ అధినేతలే వాళ్లను ప్రాధేయపడాల్సి వస్తోంది. ఎంత చిత్రం? కొందరు ఒకేరోజున రెండు మూడు పార్టీలూ మారిపోతున్నారు. ‘ఒపీనియన్స్‌ ఛేంజి చేస్తేగాని పొలిటిషీయన్‌ కానేరడు’ అని గిరీశం చేతికి మైకు ఇచ్చి గురజాడ ఎప్పుడో చెప్పించారు. మరీ ఇంత వేగంగానా అంటే- కాలానికి తగ్గట్టు ఉండాలిగా!

ఒక పార్టీ తరఫున గెలిచిన నాయకుడు ఆ పార్టీలోనే అయిదేళ్లపాటు కొనసాగిన రోజే దేశానికి నిజమైన రాజకీయ స్వాతంత్య్రం వచ్చినరోజు అనాలేమో! అధికార పార్టీలు తిరుగులేని మెజారిటీతో అధికారం చలాయిస్తున్నా, ‘హంగ్‌’లతో ప్రభుత్వాలు ఊగిసలాడుతున్నా- పరిస్థితుల్లో మార్పు ఉండటం లేదు. అందువల్ల సొంత నేతలను కాపాడుకోవటానికి పార్టీలు వివిధ ప్రయత్నాల్లో తలమునకలవుతుంటాయి.

తాజాగా ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అన్నట్లున్న కర్ణాటకలో శిబిర రాజకీయాలు నడుస్తున్నాయి. ‘ఓ కుమారస్వామీ... నే చేసిన బేరము లేమీ?’ అని కొందరు కాంగి‘రేసు’ ఎమ్మెల్యేలు వినిపించీ వినిపించకుండా పాడిన దృష్టాంతాలూ ఉన్నాయి. ఇది కర్ణాటకతో మొదలు కాలేదు. కర్ణాటకతో అంతమూ కాదు. గతంలో తమిళనాడులోనూ జరిగాయి. వేరే రాష్ట్రాల్లోనూ శిబిర రాజకీయాలు చోటు చేసుకున్నాయి. అయినా ఎవరి క్యాంపు వారి కింపు!

లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ పార్టీ రహిత ప్రజాస్వామ్యం కోసం కలలు కనేవారు. అది ఫలించలేదుగాని, ఇప్పుడు ఆ భావన పక్కదారి పట్టి ఇలా నిజమవుతున్నదేమో! కాంగ్రెస్‌ పార్టీని రద్దు చేయాలని స్వతంత్రం రాగానే మహాత్మాగాంధీ ప్రతిపాదించారు. ఆ మాటలను గాంధేయవాదులు ససేమిరా ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ కొనసాగింది. అప్పటికీ ఇప్పటికీ దేశంలో అనేకచోట్ల అధికారంలో కనిపిస్తూనే ఉంది. ‘అయినా స్వతంత్ర భారతంలో పార్టీల ప్రసక్తే లేకుండా అందరూ స్వతంత్రులైతే తప్పేమిటట!’ అని కొందరు పళ్లికిలిస్తున్నారు. నేతల పరిణామ సిద్ధాంతంలో ఎన్నో ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి.

జంప్‌ జిలానీల దెబ్బకు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టమూ వెలవెలపోతోంది. ‘వెల’ను అడ్డుకోలేకపోతోంది. టోకు ఫిరాయింపులకు గ్రీకువీరుడి లాంటివాడైన భజన్‌లాల్‌కు రాజకీయ వారసులను ఈ చట్టం ఏమీ చేయలేకపోయినా, కనీసం చిల్లర ఫిరాయింపులనైనా ఆచరణలో ఏమీ చేయలేకపోతోంది. ఫిరాయింపులవల్ల విలువలు దెబ్బతింటున్నాయని రాజకీయంగా మడికట్టుకుంటున్నవాళ్లు లబోదిబోమంటున్నారు. ఎంత ‘అన్యాయమైన’ మాట ఇది. రాజకీయాల్లో ఇప్పుడున్న ‘విలువలు’ పూర్వం ఎక్కడున్నాయి? మంచి (విలువలు) గతమున కొంచెమేనోయ్‌ ‘మంద’పెంచుకు ముందుకడుగెయ్‌ అని, ఇప్పుడు రొమ్ము విరుచుకుని చాటవచ్చు. ఇందులో పార్టీ ఫిరాయింపుల ‘పాత్ర’ అంతా ఇంతా కాదు. ఆ ‘పాత్ర’ నిండా ఎన్ని పదవులు, ఎన్ని కాంట్రాక్టులు, ఎన్ని నోట్ల కట్టలు?

ఏ పదవికి ‘విలువ’ ఏమిటో, ఏ కాంట్రాక్టు ఖరీదు ఏమిటో... అంతా చాటుమాటు వ్యవహారం. నాయకుల కడుపులో చల్ల కదలకుండా లక్ష్మీదేవి(నోట్ల) కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో అర్ధరాత్రి అపరాత్రి వేళలో కదిలి వసారాలోకి వస్తుంటే, మనసారా ఆహ్వానించకుండా మోకాలడ్డటం ఎంత తప్పు, ఎంత అపచారం? ముందు నాయకులకు న్యాయం జరిగితే సరి, అందుకు ఉపయోగపడేదే నిజమైన సిరి! ముందు నాయకుల కడుపునిండితే, నింపాదిగా జనం గురించి ఆలోచించవచ్చు. ఎప్పుడైనా ఎన్నికలు రాకపోతాయా? అప్పుడు ‘ఓటరు దేవుడి’కి ‘కోటి’ దండాలు అనకుండా ఉంటారా, ‘నైవేద్యం’ పెట్టకుండా ఉంటారా? నాయకుల వైపునుంచి ఆలోచిస్తే ‘నేతల కష్టాలు నేతలవి’ అనే కొత్త సామెత పుట్టుకొస్తుంది. అందువల్ల భాష కూడా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం అన్న తరవాత ఎంతో కొంత లాభం రావాలి కదా! ఇప్పటికాలంలో రాజకీయాలకు మించిన వ్యాపారం ఏముంటుంది? ఓట్లకోసం కోట్లు పెట్టుబడి పెట్టినవాళ్లు దానికి ఇబ్బడి ముబ్బడిగా లాభం సంపాదించకుండా ఉంటారా? జనస్వామ్యం ధన‘స్వామ్యం’ అయిందని లోకమంతా కోడై కూసినా, కుక్కై మొరిగినా ఊరుకుంటారా? కాసే బ్రహ్మానందం పదవే పరమానందం అనుకోకుండా మానతారా?

తాజా ప్రజాస్వామ్యంలో నమ్మకం తగ్గిపోయి ‘అమ్మకం’ పెరిగిపోతోంది. పాతకాలపు విలువల వలువలు ఊడ్చడానికి దుశ్శాసనుడి తాతల్లాంటి వాళ్లు రాజకీయాల్లో ఎంతోమంది సాక్షాత్కరిస్తున్నారు. ఎగబాకడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. ప్రజాసేవే పరమార్థం అనే మాట బాటతప్పి పరమస్వార్థం అనేది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ప్రజాసేవకే అంకితమైన నేతల పేర్లు చెప్పండంటే- అంతకన్నా కఠినమైన ప్రశ్న ఉందా? పోనీ అవినీతిపరులైన నేతల పేర్లు చెప్పండని అడిగితే- ‘అంతకన్నా గొంగట్లో తింటూ వెంట్రుకలు లెక్క పెట్టండి అని చెబితే బాగుంటుంది కదా’ అని జవాబు ఇస్తున్నారు.

నాయకులు పార్టీలు మారడం వల్ల వాళ్ల ధనం పెరిగిపోతోందని అసూయ పడతారేగాని, వాళ్లకు ఆయా పార్టీల జ్ఞానమూ ఒంట పట్టిందని ఆలోచించరేం? ఒక్క పార్టీలోనే ఉన్నవాడికి డొక్క శుద్ధి ఎంత ఉంటుందేమిటి?

‘ఏక పక్షం’వాడు ఉన్నట్టుండి ఫిరాయింపులవల్ల ‘అఖిలపక్షం’వాడైపోతాడు. చివరికి ‘అన్ని పార్టీల సారం అంతేనయా’ అని పాడతాడు!

- శంకరనారాయణ

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.