close

తాజా వార్తలు

జీవన సంధ్యారాగం

పదో తరగతితోనే చదువు ఆపేయాలనుకున్న ఆమె...
పీహెచ్‌డీ చేసే స్థాయికి చేరుకుంది. 
ఇంటి పరిస్థితులతో... చిన్న ఉద్యోగం వస్తే చాలనుకున్న ఆమె...
ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. 
ఆర్థిక పరిస్థితులు అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నా...
చదువే లక్ష్యంగా అడుగులు వేసింది. 
చదువుల పటంలో ఒక్కో మెట్టు పైకెక్కేసింది.
తాజాగా ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగానికి అర్హత సాధించింది. 
ఆమే సింహరాజు సంధ్యారాణి.

సంధ్యారాణిది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని రాజారం. తల్లి నాగమణి. తండ్రి రాజమౌళి. ఆర్థిక పరిస్థితుల అంతంత మాత్రం కావడంతో తల్లిదండ్రులు మహారాష్ట్రలోని బివండికి వలస వెళ్లారు. అక్కడ తండ్రి టైలరింగ్‌ చేస్తే, తల్లి బీడీలు చుట్టేది. సంధ్యారాణి, ఆమె ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు రాజారంలోనే ఉన్న అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగారు. తల్లిదండ్రులు అప్పుడప్పుడూ వచ్చేవారంతే. సంధ్యారాణి పదో తరగతిలో ఉన్నప్పుడు... తండ్రికి మధుమేహం వల్ల మూత్రపిండాల సమస్య వచ్చింది. దీంతో వాళ్లు మహారాష్ట్ర నుంచి రాజారం వచ్చేశారు. అప్పటి నుంచి పిల్లల బాధ్యత తల్లే తీసుకుంది. ‘అమ్మ రాత్రనకా పగలనకా కష్టపడుతూ మమ్మల్ని చదివించింది. ఓ వైపు నాన్నకు అనారోగ్యం. మరోవైపు మా చదువులు, అవసరాలు... ఇలా అన్నీ అమ్మే చూసుకునేది. మమ్మల్ని ఏమీ ఆలోచించొద్దని, కష్టపడి చదవమని మాత్రమే చెప్పేది. ఈ రోజు నేను విజయం సాధించడానికి కారణం ఒకవిధంగా మా అమ్మే...’ అని అంటుంది సంధ్యారాణి.  

చదువు మానేయాలనుకుంది....
తండ్రి ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమించడం మొదలుపెట్టింది. దాంతో మరిన్ని సమస్యలు ఎదురయ్యాయి. వచ్చిన ప్రతి రూపాయి ఆయన వైద్యానికే ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. ఇంటికి సంధ్య పెద్దది కావడంతో తనవంతుగా ఏదయినా చేయాలనుకుంది. బాగా ఆలోచించి పదో తరగతి పూర్తి కాగానే చదువు ఆపేయాలని అనుకుంది. ఏ చిన్న పని దొరికినా అమ్మకు చేదోడువాదోడుగా ఉండొచ్చనేది సంధ్య తపన. పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాల గురించి కాకుండా ఏ పని దొరుకుతుందా అనే ధ్యాసలో ఉండేది. మార్కులు ఎన్నొచ్చినా సరే... పనిచేయడమే లక్ష్యం అనుకుంది. తీరా చూస్తే స్కూల్‌ సెకెండ్‌ ర్యాంకు. ఆమె చదువు ఆపేస్తోందని తెలిసిన ఇద్దరు టీచర్లు సంధ్య ఇంటికొచ్చారు. ‘నువ్వు చదువు ఆపేస్తే ఎలా...? కొన్నాళ్లు కష్టపడితే జీవితంలో మంచి స్థాయిలో ఉంటావు. కావాల్సిన సాయం మేం చేస్తాం...’ అని ప్రోత్సహించారు. అలా ధర్మపురిలోని శ్రీలక్ష్మి నరసింహా సంస్కృతాంధ్ర కళాశాలలో చేరింది సంధ్య. ఫీజు ఖర్చులు ఆ ఇద్దరు టీచర్లే భరించారు. అయితే ఆ కాలేజీ వేళలు సాయంత్రం. దాంతో పొద్దుటిపూట రాజారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యావలంటీర్‌గా చేరింది. మధ్యాహ్నం వరకూ అక్కడ పనిచేసి సాయంత్రం కాలేజీకి వెళ్లేది. ఇంటికొచ్చాక చదువుకునేది. కొన్నిసార్లు కాలేజీకి వెళ్లలేని పరిస్థితి. అప్పుడప్పుడూ చదువుపై ఆసక్తి కూడా తగ్గేది. అయినా వెనకడుగు వేయలేదు.   ‘నాపై నమ్మకంతో వాళ్లు డబ్బు కట్టారు. ఎలాగైనా పాసవ్వాలని కష్టపడేదాన్ని. విద్యావలంటీరుగా పనిచేసినందుకు వచ్చిన జీతాన్ని అమ్మకు ఇచ్చేసేదాన్ని. అలా డిగ్రీ పూర్తయ్యే వరకు ఈ పాఠశాలలోనే పని చేశా...’ అని వివరించారు సంధ్య. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరగవు కదా.. సంధ్య జీవితంలోనూ అదే జరిగింది. ఏమయ్యిందంటే...

పీజీలో చేరి...
సంధ్య డిగ్రీ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. మరో ఏడాది అయితే నా చదువు పూర్తవుతుంది కానీ... ఇంటి పరిస్థితులు ఆమెను మళ్లీ చదువుపై ఆసక్తిని తగ్గించేలా చేశాయి. ఒకవేళ ఫెయిల్‌ అయితే గనుక ఇక చదవకూడదని అనుకుంది. ఉద్యోగం చేయాలనుకుంది. కానీ ఆమెతో పాటు పనిచేసే ప్రణీత, హేమ అనే ఇద్దరు టీచర్లు పరిస్థితి తెలిసి సంధ్యకు అండగా నిలబడ్డారు.  అవసరమైన డబ్బు సాయం చేశారు. అలా వాళ్ల సాయంతో డిగ్రీ పూర్తి చేసింది. అదయ్యాక జగిత్యాలలోని కౌశల్య తెలుగు పండిత కళాశాలలో తెలుగు పండిత్‌ శిక్షణ కూడా తీసుకుంది. ఆ సమయంలో డీఎస్సీ రాద్దామని ఏడాదిపాటు దానికి సిద్ధమైనా స్నేహితులంతా పీజీలవైపు వెళ్లడంతో ఏడాది తరువాత ఆమె కూడా పీజీకి సిద్ధమైంది. అమ్మను ఒప్పించి కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన పీజీ తెలుగు ప్రవేశ పరీక్ష రాసి, కాలేజీలో చేరింది.

చెల్లి సాయం చేసేది... 
ఇంటికి దూరంగా వరంగల్‌లోని కేయూలో పీజీ చేయడం సంధ్యకు సవాలే. అయినా సిద్ధమైంది. తల్లి, చెల్లి స్వాతి ఇంటికోసమే కాదు, సంధ్య ఆర్థిక అవసరాలు తీర్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. తల్లి బీడీలు చుడితే, చెల్లి మెషీన్‌ కుట్టి డబ్బు సంపాదించి సంధ్య ఖర్చులకోసం పంపించేది. ఇంటిమీద బెంగ ఉన్నా... రెండేళ్లు అలానే కష్టపడి పీజీ పూర్తి చేసింది. ఆ తరువాత కూడా చదువును వదిలేయలేదు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎంఫిల్‌ ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్‌ రచించిన ‘సుద్దముక్క’ కవితా సంపుటిపై పరిశోధన చేసింది. ఎంఫిల్‌ చేస్తున్న సమయంలోనే నెట్‌/జేఆర్‌ఎఫ్‌ కూడా సాధించా. అప్పటి నుంచి రూ.25 వేలు ఫెలోషిప్‌గా వచ్చేవి. అలా సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉండి... చదువుకుంది. అయితే కొన్ని ఖర్చులు తగ్గించుకుని తనకు వచ్చే ఫెలోషిప్‌లో ఎక్కువ భాగాన్ని ఇంటికే పంపేది. ఎంఫిల్‌ పూర్తయ్యాక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయకుండా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలోనూ అర్హత సాధించింది. ప్రస్తుతం గూడ అంజయ్య రచనలపై పరిశోధన చేస్తోందామె.

ఆరేడు గంటలు కష్టపడి... 
పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో కూడా మంచి మార్కులు సాధించి మల్యాల మండలం తాటిపెళ్లి గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా చేరింది. అయితే కిందటేడాది మే నెలలో గురుకుల బోర్డు నుంచి డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దాన్ని ఎలాగైనా సాధించాలనుకుంది సంధ్య. అప్పటినుంచీ పీహెచ్‌డీని పార్ట్‌టైంగా మార్చుకుని ఆరేడు గంటలు కష్టపడి చదివి పరీక్షలు రాసింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. 62 తెలుగు లెక్చరర్ల పోస్టులు ఉంటే... 124 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. వడపోతల అనంతరం అరవైమందిని ఎంపిక చేస్తే అందులో సంధ్య కూడా ఉంది. ‘ఇప్పుడు అంతా అమ్మతో మంచి కూతుర్ని కన్నావు అని అంటుంటే నాకే కాదు అమ్మకూ అనందంగా, గర్వంగా ఉంది. ఆ ఉద్యోగం వచ్చేవరకూ గురుకుల పాఠశాలలోనే చేస్తా...’ అని చెబుతుంది సంధ్య.

పెళ్లయ్యాకే ఉద్యోగం...
పీహెచ్‌డీ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే శ్రీధర్‌తో నా పెళ్లయ్యింది. మేమిద్దరం ఇంటర్‌ నుంచి క్లాస్‌మేట్స్‌. సాధారణంగా పెళ్లయితే ఆడవాళ్లకు చదువుమీద ఆసక్తి తగ్గుతుందని అంటారు. కానీ మా విషయంలో అలా జరగకూడదని అనుకున్నాం. అందుకే సవాలుగా తీసుకుని ఇద్దరం కష్టపడి చదువుకుని, ఉద్యోగాలు సాధించాం. మా వారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆయన కూడా తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం తెచ్చుకున్నారు. మా సోషల్‌టీచర్‌ రాజేందర్‌సార్‌, తెలుగు మాష్టారు శంకర్‌ శర్మ సాయం ఎప్పటికీ మర్చిపోలేను.

- అక్కల మనోజ్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.