close

తాజా వార్తలు

దేశానికి రక్షణ...సేవకు హర్షిత!

స్నేహితురాలి సలహాతోనే...బరువు తగ్గాలని ఎన్‌సీసీలో చేరిన ‘రక్షణ’ ఇప్పుడు ఏకంగా జాతీయస్థాయి గుర్తింపు  తెచ్చుకుంది. చదువు - సేవను సమన్వయం చేసుకుంటూ పెరిగిన ‘హర్షిత’ ఐక్యరాజ్య సమితి ఆహ్వానాన్ని అందుకుంది.  ఆ గుర్తింపు, ఈ ఆహ్వానం ఆషామాషీగా రాలేదు. రక్షణ అనుక్షణం కష్టపడితే...  హర్షిత ఎన్నో ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇంతకీ  వాళ్లెవరూ... ఏమేం చేశారో చూద్దామా!

ఆరేళ్ల నుంచే హర్షితా చింతం తన పాకెట్‌ మనీని  ఐరాసకు పంపేది. పెద్దయ్యాక సమాజాన్ని నవనిర్మాణ దిశగా ఎలా నడిపించాలో సలహాలిచ్చింది. అదే ఆమెకు ఐక్యరాజ్య సమితి యూత్‌ అసెంబ్లీకి ఎంపికయ్యేలా చేసింది. 

ఐక్యరాజ సమితి నుంచి ఆహ్వానం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. నేరుగా ఐరాస కార్యాలయం నుంచే ఫోన్‌ వచ్చింది. ‘ఫిబ్రవరిలో జరిగే యూత్‌ అసెంబ్లీకి రావాలి...’ అని చెప్పారు. ఈ నెల 15 - 17 వరకూ అక్కడ జరిగే యూత్‌ అసెంబ్లీలో నేను ‘సస్టెయినబుల్‌ సిటీస్‌ అండ్‌ కమ్యూనిటీస్‌’ అనే అంశంపై మాట్లాడాలి. మన గ్రామాల్లోని జీవనవిధానం, స్వయం సమృద్ధి మార్గాలు...ఇలా పలు అంశాలకు సంబంధించి బృంద చర్చల్లోనూ పాల్గొనాలి. నేను మొదటినుంచీ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశా. నా గురించి తెలిసిన ఓ స్నేహితురాలు... యుఎన్‌ఓ యూత్‌ అసెంబ్లీ గురించి చెప్పింది. అలా నవంబర్‌లో దరఖాస్తు చేశా. కొన్నిరోజులకు నేను చేసిన పనిని గురించి రాయమన్నారు. అదయ్యాక నాలుగైదు సార్లు ఇంటర్వ్యూలు చేశారు. నేను చేసిన సేవ,   దానివల్ల దేశానికి, ప్రజలకు కలిగిన ఉపయోగం... వంటివన్నీ రాశా. 

సఫాలో భాగమై... నేను శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశా. అదయ్యాక ఐఎమ్‌టీ (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ)లో ఎంబీఏ చేసి ఐటీసీ ప్రయివేట్‌ లిమిటెడ్స్‌లో బిజినెస్‌ ఎక్సలెన్స్‌ ఆఫీసర్‌గా చేస్తున్నా. ఎంబీఏ చేసేటప్పుడు హైదరాబాద్‌లో సఫా అనే ఎన్జీవోలో భాగం అయ్యా. నాతో యూనివర్సిటీ ఆఫ్‌ కొలంబియా విద్యార్థులు కూడా కలిశారు. సఫా కార్యక్రమాల్లో భాగంగా   ఆ మహిళల్ని చదువు దిశగా, వ్యక్తిత్వం పరంగా చైతన్యపరచడం, పిల్లల్ని బడిబాట పట్టించేందుకు తల్లిదండ్రుల్ని ఒప్పించడం, వారి ఆరోగ్యం, హక్కుల గురించి ఏం చెప్పాలి... వంటివన్నీ ఓ ప్రాజెక్టులా డిజైన్‌ చేసి ఇచ్చా. నేనూ వాళ్లతో కలిసి పలు ప్రాంతాలకు వెళ్లా. ఆ క్రమంలో మహారాష్ట్రకు చెందిన జాగృతి యాత్ర అనే స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసింది. దీని ద్వారా 20 నుంచి 27 ఏళ్ల లోపు వారు రైలు ప్రయాణం ద్వారా దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లి... గ్రామీణ ప్రజలను కలుస్తారు. నేనూ అలా దిల్లీ నుంచి కన్యాకుమారి వరకూ పదిహేను రోజులు... ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణించా. ధర్మశాల, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, అసోం, రాజస్థాన్‌.. ఇలా పలు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు వెళ్లా. ఇందుకు సంబంధించిన సమాచారమంతా రాష్ట్రపతిక సమర్పించా. 

ఆ గ్రామం చూసి... ఈ యాత్రలో భాగంగా రాజస్థ్థాన్‌ లోని థార్‌ ఎడారి సమీపంలో థిలోనియా అనే గ్రామం చూసినప్పుడు నాకు ముచ్చటేసింది. అక్కడ పంటలు పండవు. నీటి వసతి సరిగా ఉండదు. అయితే వాళ్లంతా ఆర్థికంగా పరిపుష్టమయ్యారు. సౌరవిద్యుత్తుని జీవనాధారం చేసుకోవడమే దానికి కారణం. అందుకు సంబంధించిన ఉత్పత్తులు తాము వాడటంతోపాటు... తయారు చేస్తున్నారు. దాదాపు వెయ్యి కుటుంబాలున్న ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ సోలార్‌ ఉత్పత్తులు తయారు చేసి, దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ నేను దాదాపు నాలుగైదు రోజులుండి... ఓ డాక్యుమెంటరీ తీశా. అలానే ఉత్తరప్రదేశ్‌లో లింగవివక్ష ఎక్కువ. అక్కడ ఆడవాళ్లు బయటకు రారు. అందుకే అక్కడ కొన్ని గ్రామాల్లోని మహిళలు... టైలరింగ్‌, రకరకాల హస్తకళలు చేస్తుంటారు. వారికి నేను ఇంటి వద్ద నుంచే ప్రపంచాన్ని విస్తరించుకునే మార్గాలు వివరించా. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ నేర్చుకుని రకరకాల దుస్తులు డిజైన్‌ చేయడం... ఆకట్టుకునేలా హస్తకళలు రూపొందించడం... నెట్‌ ఎలా వాడాలి... సామాజిక మాధ్యమాల్లో మార్కెటింగ్‌ చేసుకోవడం వంటివెన్నో వివరించా.

కష్టం దోచుకోకుండా: ఉత్తర భారతదేశంలో కొన్ని  ప్రాంతాల్లో పసుపు బాగా పండుతుంది. కానీ రైతులు ఆ పంటని దళారీలకు అమ్మేసి నష్టపోతారు. అది తెలిసి రైతులే స్వచ్ఛంగా పసుపు మార్కెటింగ్‌ చేసేలా వాళ్లతో ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెట్టించా. పైగా మార్కెట్‌లోకి రసాయనాలు కలపని తాజా పసుపు వస్తుంది. ఇలానే ప్రాంతాన్ని బట్టి అక్కడి వారికి సమాజంలో వేగంగా ఎదిగేలా అవగాహన కల్పించా. అలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చైతన్యం తీసుకొచ్చా. ఇవే కాదు... మేక్‌ ఏ విష్‌, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నా. ఇవన్నీ కలిపే నాకు అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. 
 

చిన్నప్పుడు మా అమ్మానాన్న వారాంతంలో ఇంట్లో ఏదో ఒక పని చేయించి... ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు. అది అమ్మానాన్నల దృష్టిలో పాకెట్‌ మనీ. నాకు మాత్రం దాన్ని కష్టాల్లో ఉన్నవారికి సాయంగా ఇవ్వాలని ఉండేది. ఆరో తరగతిలో ఉన్నప్పుడు... ఐరాస గురించి పాఠం విన్నా. ఐరాస ఫండ్‌ గురించి అప్పుడే తెలిసింది. అలా నా పాకెట్‌ మనీనీ ఆ ఫండ్‌కి పంపడం మొదలుపెట్టా. ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఐరాస కార్యాలయం నుంచి నన్ను పొగుడుతూ ఉత్తరం వచ్చింది. దాన్ని ఇప్పటికీ దాచుకున్నా. 
 

బరువు తగ్గాలనే ఎన్‌సీసీలో...

అధిక బరువును తగ్గించుకోవాలనుకుని ఎన్‌సీసీలో చేరిందా యువతి. ఆ కష్టం ఇప్పుడు ఆమెను ఉత్తమ క్యాడెట్‌గా నిలిపింది. దేశవ్యాప్తంగా వేలాదిమందితో  పోటీ పడి, జాతీయస్థాయిలో విజేతగా గుర్తింపు తెచ్చిపెట్టింది.  ఆమే రక్షణ సురేష్‌ ప్రభు. 
రక్షణది చెన్నై. ఎంఓపీ వైష్ణవ కాలేజీలో బీఎస్సీ, సైకాలజీ రెండో ఏడాది చదువుతోంది. రక్షణ తండ్రి వ్యాపారి. తల్లి గృహిణి. చదువులో ముందుండే ఆమె ఐఏఎస్‌ కావాలనుకుంది. డిగ్రీ తరువాత సివిల్స్‌ రాయాలనుకునేది. అయితే ఆమె అధిక బరువే, ఆమెకో లక్ష్యాన్ని అందించింది. ‘చిన్నప్పుడు బొద్దుగా ఉండేదాన్ని. కాలేజీకి వచ్చేసరికి ఇంకా బరువు పెరిగా. ఏకంగా 90 కేజీలు. అందరూ లావుగా ఉన్నావు... జిమ్‌కి వెళ్లొచ్చు కదా అని అనేవారు. వాళ్ల మాటలు విన్నాక ఎలాగైనా బరువు తగ్గాలనుకుని జిమ్‌లో చేరాలనుకున్నా. మా కాలేజీలో స్పోర్ట్స్‌, ఎన్‌సీసీ వంటి వాటికి ప్రాధాన్యమెక్కువ. అందుకే 2017లో ఎన్‌సీసీలో చేరా. మొదట వాళ్లు చెప్పిన వ్యాయామాల్ని కష్టపడి చేసేదాన్ని. బరువు తగ్గాలనేదే నా లక్ష్యంగా పెట్టుకున్నా. అయితే నాకు తెలియకుండానే ఎన్‌సీసీలో పూర్తిగా నిమగ్నమయ్యా’ అని అంటుంది రక్షణ.


జాతీయ స్థాయిలో సీనియర్‌ వింగ్‌ కేటగిరీలో సైనికవిభాగంలో ఉత్తమ క్యాడెట్‌గా నిలిచా. ప్రధాని చేతుల మీదుగా అవార్డును, ప్రశంసలను అందుకున్నా. ప్రధానితో కలిసి ర్యాలీలో పాల్గొనే గౌరవాన్ని కూడా పొందా. పుదుచ్చేరి గవర్నరు కిరణ్‌బేడీ కూడా ప్రశంసించారు. ఇప్పుడు నా లక్ష్యం సైన్యంలోకి వెళ్లడం. అందుకోసం ఇకపై కృషి చేస్తా. 

ఎన్నో గంటల సాధన... కాలేజీ తరఫున పరేడ్‌లో పాల్గొన్న రక్షణ ఆ తరువాత రాష్ట్రం నుంచి ప్రదర్శనలకు ఎంపికైంది. దీంతో వేకువజామున నాలుగు నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు ప్రాక్టీసు చేసేది. వారంలో రెండు రోజులపాటు ఎన్‌సీసీ క్యాడెట్‌గా బిజీగా ఉండేది. ‘పరేడ్‌ పేరుతో గంటల తరబడి శిక్షణ ఉండేది. దీంతో శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దృఢంగా మారా. ఏదైనా సాధించాలనిపించింది. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దిల్లీలో జరిగే ర్యాలీలో పాల్గొనాలనుకున్నా. నా దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టా. జాతీయ స్థాయిలో ఎన్‌సీసీ తరఫున ప్రతీ ఏటా ఉత్తమ క్యాడెట్‌ను ఎంపిక చేసే పోటీలుంటాయి. దేశవ్యాప్తంగా 14.2 లక్షల మంది ఎన్‌సీసీ క్యాడెట్లున్నారు. వాళ్లలో వేలాదిమంది ఈ పోటీకి దరఖాస్తు చేసుకుంటారు. నేను కూడా దిల్లీ పోటీలకు తమిళనాడు రాష్ట్రం తరఫున ఎంపికయ్యా. అలా గతేడాది డిసెంబరు 30 నుంచి ఈ ఏడాది జనవరి 30 వరకు పలు రకాల పరీక్షల్లో పాల్గొన్నా. నెల రోజులపాటు తీవ్రంగా కృషి చేశా. విజేతను అయ్యా. ఇప్పుడు 64 కేజీలకు బరువు కూడా తగ్గా..’ అని చెబుతుంది రక్షణ.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.