Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 53291
            [news_title_telugu_html] => 

అతివలకు పట్టం...అభివృద్ధే ధ్యేయం!

[news_title_telugu] => అతివలకు పట్టం...అభివృద్ధే ధ్యేయం! [news_title_english] => Mahila jayaho Telangana panchayathi Women regime Voting awareness in women [news_short_description] => తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మహిళ చైతన్యం వెల్లివిరిసింది. ఓటింగ్‌లోనే కాదు... ఎన్నికల్లో అధికారాన్ని అందుకున్న మహిళల శాతం కూడా ఎక్కువే. అలా నారాయణఖేడ్‌ మండలానికి చెందిన నర్సాపూర్‌, శేరి తండా గ్రామాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మండలంలోని మాచినేపల్లి గ్రామాలు స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలిచాయి... [news_tags_keywords] => Mahila jayaho, Telangana panchayathi, Women regime, Voting awareness in women [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-02-07 00:55:03 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అతివలకు పట్టం...అభివృద్ధే ధ్యేయం! - Mahila jayaho Telangana panchayathi Women regime Voting awareness in women - EENADU
close

తాజా వార్తలు

అతివలకు పట్టం...అభివృద్ధే ధ్యేయం!

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మహిళ చైతన్యం వెల్లివిరిసింది. ఓటింగ్‌లోనే కాదు... ఎన్నికల్లో అధికారాన్ని అందుకున్న మహిళల శాతం కూడా ఎక్కువే. అలా నారాయణఖేడ్‌ మండలానికి చెందిన నర్సాపూర్‌, శేరి తండా గ్రామాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మండలంలోని మాచినేపల్లి గ్రామాలు స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలిచాయి.

వెనకబాటుతనానికి పర్యాయపదం ఆ ప్రాంతం. కరవు కాటకాలతో అల్లాడుతూ వలసలకు పెట్టింది పేరు. మొన్నటి వరకు కొన్ని తండాలకు రహదారి సౌకర్యమూ లేదు. అక్షరజ్ఞానమూ అంతంతమాత్రమే. ఇప్పుడు మహిళా సాధికారతను పెంచే విషయంలో మా తరువాతే ఎవరైనా అంటూ చాటుకున్నారు. రెండు పంచాయతీల పాలకవర్గాల్లో పూర్తిగా మహిళలే ఉండేలా చొరవ తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే నారాయణఖేడ్‌ మండలానికి చెందిన నర్సాపూర్‌, శేరితండా గ్రామ ప్రజలు. నర్సాపూర్‌లో ఎనిమిది మంది వార్డు సభ్యులతో పాటు సర్పంచ్‌గా మహిళలనే ఏకగ్రీవంగా ఎన్నుకోగా... శేరితండాలో ఎనిమిది మందిలో 5 మంది వార్డు సభ్యులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌తో పాటు మరో మూడు వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. అందరూ మహిళలే పోటీపడటం విశేషం.

మహిళలను గౌరవించాలనే: నారాయణఖేడ్‌ మండలంలోని నర్సాపూర్‌ గ్రామ జనాభా 557. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ సర్పంచ్‌ స్థానం బీసీ(జనరల్‌)కి, నాలుగు వార్డులు మహిళలకు కేటాయించారు. దీంతో గ్రామస్థులంతా కలిసి మహిళలను గౌరవించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకోవాలనుకున్నారు. ఊరంతా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌, సర్పంచ్‌ ఇలా అందరూ మహిళలే ఉంటే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావించారు. ‘ఊర్లో ఉన్న పంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది.   అంగన్‌వాడీకి సరైన భవనం లేదు. సీసీ రోడ్లు కూడా పూర్తిగా లేవు. ఏకగీవ్రంగా చేసుకుంటే వచ్చే ప్రోత్సాహక నగదుతో అభివృద్ధి చేసుకోవచ్చని అనుకున్నాం. మహిళలనే ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వచ్చే గుర్తింపుతోనూ మరిన్ని నిధులు రాబట్టి పల్లెను బాగు చేసుకోవాలనుకున్నాం. అలా మాకు పగ్గాలు అప్పగించారు’ అని చెబుతున్నారు నర్సాపూర్‌ సర్పంచ్‌ అరవైఏళ్ల గోసాయిపల్లి నాగమ్మ.

తొలి పాలకవర్గం: శేరితండాలో 344 మంది ఓటర్లు. ఇది ఒకప్పుడు చాప్టా(కె) పంచాయతీ పరిధిలో ఉండేది. నూతన పంచాయతీగా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు రిజర్వు చేసిన ఐదు వార్డులను ఏకగీవ్రం చేసుకున్నారు. మిగతా మూడు వార్డుల్లోనూ మహిళలే పోటీ చేసేలా చూశారు. ఇక్కడ సర్పంచ్‌ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. ఇలా ఈ పంచాయతీలో ఎనిమిది వార్డుల్లో మహిళలే. ‘నేనొక్కదాన్నే 7 వరకు చదువుకున్నా. అధికారులు, గ్రామస్థుల సహకారం తీసుకొని పాలనలో మాదైన ముద్ర వేస్తాం.’ అని ధీమాగా చెబుతున్నారు శేరితండా ముప్ఫైఅయిదు సంవత్సరాల సర్పంచ్‌ సాంకిబాయి.

పైడిపల్లి తరహాలో: 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ మండలంలోని పైడిపల్లిలో గ్రామస్థులంతా ఇదే తరహాలో నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డుసభ్యులుగా మహిళలనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన మహిళా ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతను నిర్వర్తించారు. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినందుకు వచ్చిన నిధులతోపాటు ఎమ్మెల్యే నిధులు తెప్పించుకొని గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. ఇప్పుడు పైడిపల్లి తోవలోనే ఇదే మండలంలోని మరో రెండు పంచాయతీలు ముందడుగు వేయడం శుభపరిణామం.

కృషి చేస్తాం కలిసికట్టుగా...

తాజాగా తెలంగాణలో జరిగిన పంచాయతీ పోరులో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మండలంలోని మాచినేపల్లి గ్రామపంచాయతీలో వార్డు మెంబరు నుంచి సర్పంచి వరకూ మహిళలే గెలిచారు. నలుగురికీ మంచి చేయాలన్న ఆలోచన... మార్పుకోసం ప్రయత్నించే శక్తే వారిని గెలిపించింది. వీళ్లలో చాలామంది పురుషులతో పోటీపడినవారే. ‘మా గ్రామ జనాభా సుమారు వెయ్యి. నేను డిగ్రీ చదివా. మా వార్డు సభ్యుల్లో చాలామందికి కనీస చదువూ లేదు. అయినా డ్వాక్రా సంఘాల్లో చురుకే. మా ఇళ్లను చక్కబెట్టుకున్నట్లే మా ఊరినీ తీర్చిదిద్దుకోవాలనేదే మా లక్ష్యం. కలిసికట్టుగా మా ప్రాంతాలను అభివృద్ధి చేసి మా మహిళాశక్తిని చాటిచెబుతాం. వందశాతం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేస్తాం. భూగర్భమురుగు నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు, మహిళలకు ఉపాధి కోసం స్థానికంగా కుట్టు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం వంటివి మా ఎజెండాలో ఉన్నాయి...’ అని అంటారు సర్పంచి సుధారాణి. 
-  సి. గోపి, -న్యూస్‌టుడే, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా
రాజేందర్‌ సురకంటి, ఈనాడు, సంగారెడ్డి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.