close

తాజా వార్తలు

ఆత్మాభిమానమేఅపురూపం

కాస్త బొద్దుగా ఉంటే చాలు పదహారేళ్ల అమ్మాయిని కూడా ఆంటీ అని పిలుస్తారు. పిల్లలు పుట్టాక భార్య లావయ్యిందని వదిలేసే ప్రబుద్ధులూ ఉన్నారు. ఒకవేళ సన్నగా ఉన్నా... రివటలా ఉన్నావంటూ ఆటపట్టిస్తారు.  ఇక, నలుపు, ఎరుపు, వెర్రి తెలుపు... ఇలాంటి వెక్కిరింపులకు అంతే ఉండదు. ప్రసవమయ్యాక సహజంగా వచ్చే స్ట్రెచ్‌మార్క్స్‌ వల్లా బాడీ షేమింగ్‌ తప్పడం లేదు మహిళలకి. అసలింతకీ బాడీషేమింగ్‌ అంటే ఏంటీ? దానివల్ల వచ్చే సమస్యల్ని అధిగమించాలంటే ఏం చేయాలి?

అందంగా కనిపించాలంటే... సన్నగా ఉండాలా? బొద్దుగానా!  ఏ ఛాయలో ఉంటే బాగుంటాం? తెల్లగానా, చామనఛాయాలోనా! ఇప్పుడు టీనేజీ అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకూ అందరిలోనూ ఇవే ప్రశ్నలు. ఇలా బాధపడటాన్ని పూర్‌బాడీఇమేజ్‌ అంటారు మానసిక నిపుణులు. అలానే లావుగా ఉన్నావు, పొట్టిగా కనిపిస్తున్నావు...నల్లబడ్డావు అంటూ ఇతరులు మనల్ని విమర్శించడమే బాడీషేమింగ్‌. ఈ రెండూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మనలో చాలామంది శరీర కొలతలు, ఛాయే అందానికి కొలమానం అనుకుంటారు. అసలు కుర్చీలు, తలుపులు...ఇతర వస్తువులను కొలిచినట్లు అమ్మాయిల ఆకృతులను నిర్దేశిస్తే ఎలా? అందం అంటే... ఇలా ఉండాలి? అలాగే కనిపించాలి అనుకోవడం ఎంతవరకూ సబబు. దీనికి తోడు సమాజంపై సినిమా, ఫ్యాషన్‌, అందం, ఆహారం వంటి రంగాలు తెలియకుండానే అపోహలు కలిగిస్తున్నాయి. సన్నగా ఉంటేనే బాగుంటారు. ఫలానావి రాసుకుంటే తెల్లబడతారు వంటివెన్నో అలవాటు చేశాయి. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం... ఈ మూడు అందరికీ అవసరమే కానీ... వాటిమధ్య ఉండే సన్నటి గీతల తాలూకు భావనల్ని అర్థం చేసుకోగలగాలి.

బాధితులు ఎవరంటే...
ఈ బాడీ షేమింగ్‌ ప్రభావానికి ఎక్కువగా లోనయ్యేవారిలో టీనేజర్లు, మహిళలే కనిపిస్తారు. ఈ సమస్యకు సామాజిక మాధ్యమాలు కొంతవరకూ ఆజ్యం పోస్తున్నాయి. అందుకే బ్యూటీయాప్స్‌తో ముసుగేసుకునేది కొందరైతే, నటీనటుల స్థాయిలో కనిపించాలని శస్త్రచికిత్సల వరకూ వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకునేవారు మరికొందరు. ఇలామొదలైన పూర్‌బాడీ ఇమేజ్‌ క్రమంగా బాడీ షేమింగ్‌కి బాధితుల్ని కూడా చేస్తుంది. ఈ విషయంలో సామాన్యులే కాదు... ప్రముఖులూ బాధితులే. హాలీవుడ్‌ శృంగారదేవతగా పేరు పొందిన మార్లిన్‌ మన్రో దగ్గర నుంచి బాలీవుడ్‌లో విద్యాబాలన్‌, నేహాధూపియా, ప్రియాంక చోప్రా...ఇలా అందరూ ఈ తరహా విమర్శలను ఎదుర్కొన్నవారే. అయితే వాళ్లు కుంగిపోలేదు. తమలోని ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పారు.

కారణాలెన్నో...
అతిగా తింటే బరువు పెరగడం, మానేస్తే తగ్గడం అనేది ఉండదు. బరువుకు కారణం వంశపారంపర్యం మొదలు మన అలవాట్లు, జీవనశైలి, హార్మోన్ల ప్రభావం... ఒత్తిడి, పోషకాహార లేమి, వ్యాయామం లేకపోవడం వంటివెన్నో. అనారోగ్య సమస్యలతోనూ బరువు పెరగొచ్చు. వాటిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం మేలు. ఇక రంగంటారా? భారతీయుల సహజ రంగు నలుపే. ఉష్ణమండలానికి దగ్గరగా ఉండటం వల్ల మన శరీరంలో మెలనిన్‌ శాతం ఎక్కువ. అందుకే మన శరీరఛాయ ముదురు గోధుమ రంగులో ఉంటుంది. సహజరంగుని పోగొట్టుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. నిజానికి మెలనిన్‌ తగ్గడం వల్ల వచ్చే అనారోగ్యాలను తగ్గించుకోవడానికి పాశ్చాత్యదేశాల్లో సన్‌టానింగ్‌ చికిత్సలు తీసుకుంటున్నారు. కాబట్టి మనం ఎలా ఉన్నామో దాన్ని అంగీకరించడమే మేలు.

ఆత్మవిశ్వాసం నింపేలా...:
తల్లయ్యాక ఎన్నో మార్పులు సహజం. ప్రధానంగా స్ట్రెచ్‌మార్క్స్‌ అమ్మతనానికి గుర్తు. వాటివల్లా వివక్షి గురవడం దారుణం అంటారు లారా మజ్జా. ఆమె ఓ బ్లాగర్‌... ఇద్దరు పిల్లలకు తల్లి. ఆమె తన శరీరంలో వచ్చిన మార్పులను  ఎలా ప్రేమిస్తుందో చెబుతూ ‘మామ్‌ ఆన్‌ ద రన్‌’ అనే పుస్తకం రాసింది. తనలాంటివారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేసింది.

* మొటిమలు సహజమే అయినా చాలామంది తమకేదో అయిపోయిందనుకుని కుంగిపోతుంటారు. అలాంటివారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు వచ్చిన ఉద్యమమే పింపుల్‌ పాజిటివిటీ. మొటిమలుంటే బాధపడకండి మేకప్‌ లేకుండా, ఫొటోషాప్‌ చేయకుండా మీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయండి. దానికి పింపుల్‌ పాజిటివిటీ హ్యాష్‌ట్యాగ్‌ జతచేయండి అంటున్నారు ఆ ఉద్యమ నిర్వాహకులు. ఏ లోపం ఉన్నా... దాన్ని స్వీకరించాలే తప్ప బాడీషేమింగ్‌ ప్రభావానికి గురికాకూడదని చెప్పడమే వారి ఉద్దేశం.

ఎందుకు తగ్గానంటే..!

‘బరువెందుకు తగ్గారు’ అని అడుగుతుంటారు. టాలీవుడ్‌లో సన్నగా ఉంటే ఇష్టం అంటారు. కోలీవుడ్‌కి వెళ్తే అయ్యో ఎందుకు తగ్గావు అంటారు. సో ఇతరులకోసం కాకుండా నాకోసం సన్నబడ్డా. అందరినీ మెప్పించలేం. మనం మనలానే ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి.

- రాశీఖన్నా, నటి

ప్రతిభను తక్కువ చేయొద్దు...!

నా బరువు గురించి ట్రోల్స్‌ చేసినా నేను పట్టించుకోను. ఎవరికోసం మారాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచీ నేను ఇలానే ఉన్నాను.  నా ప్రతిభను తక్కువ చేసి, బరువుతో నా అందాన్ని కొలుస్తున్నారు. ఇది హీనమైన విషయం. నాకేది మంచిదో దానిమీదే దృష్టిపెడతా.
- సోనాక్షి సిన్హా, నటి

రూపాన్ని చూసి విలువ ఇవ్వొద్దు...!

భర్త పెట్టే వేధింపులు భరించలేక కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశా. నా ఒళ్లంతా కాలిపోయింది. అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డా. కానీ ఆ గుర్తులు నా శరీరాన్ని పూర్తిగా మార్చేశాయి. షాపింగ్‌కి వెళ్లినా సరే! ముఖం మీద ముసుగు కప్పుకుని రావొచ్చు కదా! అని మర్యాదపూర్వకంగానే చెబుతారు. అక్కడే అందానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్థం అవుతుంది. ఈ పరిస్థితి చూసి మొదట్లో బాధపడినా... క్రమంగా వాటిని పట్టించుకోవడం మానేశా. బతుకుపోరాటం చేయడం మొదలుపెట్టా. ఆత్మవిశ్వాసానికి మించిన అందం ఇంకేముంటుంది అనేది నా అనుభవంలోనుంచి నేర్చుకున్న పాఠం.

ఆత్మవిశ్వాసమే ముఖ్యం

ఈ మధ్య చెన్నైలోని ఓ షాపింగ్‌మాల్‌కి వెళ్లాను. అక్కడ  సౌందర్య ఉత్పత్తులు అమ్మే ఓ స్టాల్‌లోని అమ్మాయి నన్ను పిలిచింది. వెళ్తే... ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ నా చేతిలో పెట్టి ‘ఇది రాసుకుంటే మీరు తెల్లబడతారు మేడమ్‌ ప్రయత్నించండి’ అని చెప్పింది. నాకు ఇలా ఉంటేనే ఇష్టమని. ఇంకెప్పుడూ రంగు మార్చుకోమని ఎవరినీ అడగొద్దు అని ఆ అమ్మాయికి వాళ్ల యాజమాన్యానికీ గట్టిగా చెప్పా. ఈ మధ్య మా అమ్మాయి ఓణీల ఫంక్షన్‌ జరిగింది. తనకి ఆ రోజు ఎటువంటి మేకప్‌ వేయకుండా సహజంగా అలంకరించాను. తనకెప్పుడూ అందంకంటే ఆత్మవిశ్వాసమే ముఖ్యమని చెబుతా.

ఎలా బయటపడాలి

అందంపై ఉన్న అతి ఆసక్తి, తమ శరీరాలపై ఉండే అసౌకర్యం, అనాసక్తి... వంటివన్నీ బాడీషేమింగ్‌కి కారణాలు. అందుకే కొందరు అతిగా శ్రద్ధ చూపిస్తూ బాధపడిపోతుంటారు. దాంతో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అందుకే ఇటువంటి వారంతా బాడీ కాంటూరింగ్‌, శరీరానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటారు. దీన్నే వైద్య పరిభాషలో బాడీ డిస్‌మార్ఫియా అని కూడా అంటారు. చిన్న వయసులోనే ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయగలగాలి. ‘తక్కువ తిను లేదంటే నాలా లావుగా అయిపోతావు’... ‘అయ్యో  ఎత్తు తక్కువగా ఉన్నావే! రోజూ కనీసం రెండు మూడుగంటలైనా పుల్‌అప్స్‌ చేయాలి’ అనే మాటలు వద్దు. ‘ఎలా ఉన్నా నిన్ను నువ్వు ప్రేమించుకో’ అనే స్థైర్యాన్ని పెంచాలి. చిన్నప్పుడు ‘నల్లగా ఉన్నావ్‌, అందంగా లేవు’ అంటూ మైఖేల్‌ జాక్సన్‌ తండ్రి అతడిని తరచూ అనడంతో డిస్‌మార్ఫియా ప్రభావానికి లోనయ్యాడు. తనని తాను అందంగా మార్చుకోవడానికి తరచూ స్కిన్‌లైటనింగ్‌, బాడీ కాంటూరింగ్‌ చికిత్సలు చేయించుకుంటూ అనారోగ్యాల బారిన పడ్డాడు. కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచీ లావుగా ఉన్నారా... సన్నగా ఉన్నారా అని కాకుండా ఆరోగ్యంగా ఉన్నారా  లేదా అనేది గమనించుకోండి. అందమంటే ఆత్మవిశ్వాసం అని నేర్పించండి. అప్పుడే బాడీ షేమింగ్‌ ప్రభావానికి గురికాకుండా ఉంటారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.