close

తాజా వార్తలు

ఆకలి బాధల నుంచి... లక్షల ఆదాయం వరకూ

పుట్టిన మూడునెలలకే ఆమెను కన్నతల్లి  కాలువలో పడేసింది. పెళ్లయ్యాక భర్త ఏడాది తరువాత వదిలేశాడు. రోజుల పసికందుతో, కడుపును మెలిపెట్టే ఆకలితో ఆమె బతుకు బండి ఈడ్చుకొచ్చింది. ఇప్పుడామె మరికొందరికి ఉపాధి కల్పిస్తోంది. ఆమే సాయికుమారి.

సాయికుమారి సొంతూరు చిత్తూరు సమీపంలోని కొంగారెడ్డిపల్లె. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తల్లిదండ్రులు గొడవపడి సాయికుమారిని కాలువలో వదిలేసింది తల్లి. నీటిలో మునిగిపోతున్న పసిబిడ్డను అటుగా వెళ్తున్న పాండురంగాచారి గమనించి, ఇంటికి తీసుకెళ్తే, అతడి భార్యకు అది నచ్చలేదు. ఆమెను సరిగా పట్టించుకునేది కాదు. చదువు లేదు. ఏడో ఏట నుంచే పాచిపనులు చేసేది. పాండురంగాచారి తదనంతరం పెంపుడుతల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ చిన్నచిన్న పనులు చేసి పోషించుకోవడం అలవాటు చేసుకుంది. పద్నాలుగేళ్ల వయసులో కొన్ని పరిస్థితుల వల్ల తిరిగి పెంపుడు తల్లి ముగిళమ్మతో కలిసి చిత్తూరుకి దగ్గరల్లోని తయ్యూరికి వచ్చేసింది. పదహారేళ్ల వయసుకే పెళ్లి. ఆ తరువాతైనా జీవితం మారుతుందని ఆశిస్తే అదీ జరగలేదు. భర్త రోజూ తాగొచ్చి శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. గర్భిణి  అని తెలిసినా చిత్రహింసలు పెట్టేవాడు. చివరకు ఏడాదికే వదిలేశాడు.  పసిబిడ్డ కడుపు నింపడానికి, బాలింతగా ఉండగానే అడవికి వెళ్లి ఆకులు ఏరుకొచ్చి విస్తళ్లు కుట్టి, అమ్మేది. పెంపుడు తల్లి సాయం కొన్నాళ్లు సాయం చేసినా... ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో తిరుమలకు మకాం మార్చింది. తిరుమలలో ఉచితంగా అన్నప్రసాదాలు పెడతారని తెలిసి ముగ్గురూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ సాయికుమారి కొబ్బరికాయలు అమ్మేది. ప్రసాదాల తయారీ దగ్గర సాయం చేసి రోజులు గడిపేది.

పాచిపనితో ప్రారంభించి: పిల్లాడు ఎదిగేకొద్దీ తన కాళ్లమీద తాను స్థిరపడాలనుకుంది. ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని పాచిపనులు చేసేది. చిన్నచిన్న పనులు చేస్తూ రోడ్డుమీద టిఫిన్‌ సెంటరు పెట్టింది. రుచి, నాణ్యత ఉండటంతో క్రమంగా దానికి ఆదరణ పెరిగింది. అలా ఆమె సాయి హోటల్స్‌ పేరుతో వ్యాపారాన్ని విస్తరించింది. నెలకు యాభై లక్షల రూపాయల వ్యాపారం చేసే స్థాయికి చేరుకుంది. రూ. 250లకు ఇల్లు అద్దెకు  తీసుకొని జీవితాన్ని ప్రారంభించిన ఇంటినే కొనుక్కుంది. ఇప్పుడిప్పుడే చదువుకోవడం మొదలుపెట్టింది. కొడుకు రమేష్‌ని లా చదివిస్తోంది. పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే అతడిని చదివిస్తున్నానని అంటోందామె.

అంతా మహిళలే: కుమారికి ఉన్న రెండు హోటళ్లలో పనిచేసేవారంతా స్త్రీలే. మొత్తం పాతికమంది వరకూ ఉంటారు. ‘నేను పడిన కష్టాలు నాకు తెలుసు. సమాజం ఎలా చూస్తుందో, ఎలాంటి బాధలు భరించానో కూడా అనుభవమే. అందుకే అలాంటివారికి అండగా ఉండాలనుకున్నా...’ అని చెబుతుంది కుమారి. మంచి జీతాలు, అద్భుతమైన సౌకర్యాలను వాళ్లకు అందిస్తోందామె. అయిదేళ్ల క్రితమే అనాథలకు, ఆర్థికంగా వెనుకబడినవారికి చేయూత అందించేందుకు ‘సాయి ఛారిటబుల్‌ ట్రస్టు’’ను ప్రారంభించింది. ఇప్పటికే తిరుపతి, చుట్టు పక్కల ప్రాంతాల్లో 70 వరకు కార్యక్రమాలను నిర్వహించింది. ‘అశ్వనీ నాచప్ప సినిమా నాకు ఆదర్శం. ఆ సినిమా చూసిన తర్వాత... నా కష్టాలు చాలా చిన్నగా అనిపించాయి. ఎప్పుడూ నాకు బాధ అనిపించినా, ఆ సినిమా చూస్తుంటా. నన్ను నేను స్ఫూర్తి పొందుతుంటా...’ అని చెబుతుంది కుమారి.

-శివ మావూరి, ఈనాడు, తిరుపతి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.