close

తాజా వార్తలు

Published : 06/03/2019 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

17 ఏళ్లకే ప్రయోగాలు... ప్రశంసలు

మనసును మెలిపెట్టేసే బాధలు ఎన్ని ఉన్నా.. లక్ష్యాలకు దూరం కాలేదామె. టెక్నాలజీపై ప్రేమను పెంచుకుని జుట్టు నుంచి సూక్ష్మ పోషకాలు కనుక్కొనే పరికరాన్ని,  ఆకాశహర్మ్యాల్లో నీరు, విద్యుత్తును ఆదా చేసే ఆటోమాటిక్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. పదిహేడేళ్ల వయసులో అద్భుతాలు చేస్తోన్న ఆ అమ్మాయే అరుణిమ సేన్‌. ఇటీవల రాష్ట్రపతి అవార్డుతోపాటు... జాతీయ స్థాయిలో జరిగిన యునైటెడ్‌  టెక్నాలజీస్‌ ఫ్యూచర్‌ బిల్డింగ్స్‌ ఛాలెంజ్‌లో మొదటి బహుమతి అందుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే....

రాష్ట్రపతి అవార్డును నేనెప్పుడూ ఊహించలేదు. నాకు వచ్చిన ఈ గుర్తింపుల వెనుక ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుకుంటున్నా. నాకు టెక్నాలజీ అంటే ఇష్టం. దాంతో అద్భుతాలు చేయాలని ఉండేది. కానీ మా నాన్న వల్ల నా కెరీర్‌ మధ్యలోనే ఆగిపోతుందనుకున్నా. మొండిగా, ధైర్యంతో ముందడుగు వేసి పరిస్థితుల్ని చక్కబెట్టుకోబట్టి ఇలా ఉన్నా.

  మాది ఎగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న ఇస్రోలో శాస్త్రవేత్త. అమ్మ బాగా చదువుకుంది. అన్నయ్యకి ఇరవై ఏళ్లు. ఆటిజం వల్ల తను మాకు రెండేళ్ల పిల్లాడే. నాన్న మద్యానికి బానిసై అమ్మని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు. అన్నయ్యని వదిలించుకోమని అమ్మపై ఒత్తిడి తెచ్చేవాడు. 2017లో అప్పటికి పదో తరగతి పూర్తిచేసి ఇంటర్‌లో చేరడానికి చూస్తున్నా. ఆ సమయంలో జరిగిన గొడవలో నాన్న అమ్మపై చేయి చేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆసుపత్రిలో చేరిస్తే ఐసీయూలో ఉంచారు. చాలా శస్త్రచికిత్సలు చేశారు. మరోవైపు అన్నయ్య బాధ్యతలు. నేను డీలా పడితే... వాళ్లిద్దర్నీ చూసుకోలేను కాబట్టి బలవంతంగా ధైర్యాన్ని కూడదీసుకున్నా. నాన్నకు దూరంగా నేను, అన్నయ్య మురికివాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం మొదలుపెట్టాం. ఆ సమయంలో అమ్మ దాచిన జీతం డబ్బులు కొన్ని, అమ్మమ్మ వాళ్ల సాయం కొంత ఉపయోగపడ్డాయి. చాలాకాలం అమ్మ ఐసీయూలో ఉంది. నేను ఉదయం అన్నయ్యకి వంట చేసి పెట్టి తన కాలకృత్యాలన్నీ తీర్చి.. ఆటిజం స్కూల్లో దింపి కాలేజీకి వెళ్లేదాన్ని. రెండుపూటలా అమ్మ దగ్గరకు వెళ్లి చూసేదాన్ని. సాయంత్రం ఇంటికొచ్చాక అన్నయ్య పనులన్నీ చూసుకుని తనని నిద్రపుచ్చి చదువుకునేదాన్ని. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తైంది. అమ్మ కోలుకున్నాక తన అర్హతకు తగిన ఓ కాంట్రాక్ట్‌ జాబ్‌ చూసుకుంది. అప్పులు తీరుస్తూ... అన్నయ్యని, నన్ను చూసుకోవడం మొదలుపెట్టింది. నేను చదువు, అధ్యయనాలపై దృష్టిపెట్టా.
జుట్టుతోనే తెలుసుకోవచ్చు: మామూలుగా శరీరంలో సూక్ష్మపోషకాలు కనుక్కోవడానికి రక్తపరీక్షలు చేస్తారు. అయితే చాలామంది రక్తపరీక్షలనేసరికి భయపడతారు. తమ సమస్యని గుర్తించలేరు. అలా కాకుండా సులువుగా పరీక్ష చేసే పరికరాన్ని కనిపెట్టాలనిపించింది. దాదాపు మూడు నెలల పాటు ప్రయోగాలు చేసి ఓ పరికరాన్ని కనిపెట్టా. అది 320-1000ఎమ్‌ఎమ్‌ తెర ఉన్న చిన్న పరికరం. దాన్ని బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌, ట్యాబ్‌లకు అనుసంధానం చేసుకోవచ్చు. దానిలో కుదుళ్లతో సహా తీసిన జుట్టును ఉంచితే.. ఫోన్‌ లేదా, ట్యాబ్‌లో సమాచారం చిటికెలో వస్తుంది. ఈ పరికరం ఖర్చు తక్కువ, పరీక్ష తేలిగ్గా అవుతుంది. సమయం వృథా కాదు.
ఆకాశహర్మ్యాలు.. పర్యావరణహితం: బెంగళూరులో మేముండే చోట నీరు, విద్యుత్‌ కొరత ఎక్కువ. అప్పుడే యూఎస్‌ఏలోని ఓ అకాడమీ ద్వారా ఆన్‌లైన్‌లో బంగ్లాదేశ్‌, నేపాల్‌, నార్వే, రొమేనియాకు చెందిన కొందరు టెక్నాలజీ విద్యార్థులతో పరిచయం అయింది. వారితో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటూ... సలహాలు తీసుకుంటూ ఏదైనా ప్రయోగం చేదామని అనుకునేదాన్ని. అలా రూపొందించిందే స్కైక్రీపర్‌ టెక్నాలజీ. పెద్ద పెద్ద భవంతులు, కార్పొరేట్‌ ఆఫీసులు, ఆకాశహర్మ్యాలు కట్టేప్పుడు ఎలా డిజైన్‌ చేస్తే నీరు, విద్యుత్‌ ఆదా చేయొచ్చు? గోడల్లోనే ఎలా మొక్కలు పెంచొచ్చు? వర్షపు నీరు ఆదా చేయడం.. వాటిని మళ్లీ ఇతర అవసరాలకు వాడటం.. గురించి ఆలోచించా. చాలా భవంతులు, పెద్ద పెద్ద ఆకాశహర్య్మాలకు వెళ్లి చూశా. అక్కడ కేవలం భూగర్భ జలాలను వాడటం లేదంటే నీళ్లు కొనుగోలు చేయడం చూశా. ఎవరూ ఇంకుడు గుంతలు తవ్వలేదు.. వర్షపు నీరు దాచి.. శుద్ధి చేసి వాడుకోవడం మీద దృష్టిపెట్టలేదు. అవన్నీ చూశాక.. వాన, వృథా నీటిని ఒడిసిపట్టుకోవడం గురించి ఆలోచించా. విద్యుత్తు కోసం సోలార్‌ వ్యవస్థ వాడటంపై దృష్టి పెట్టా. అలా భవనాలపైన వాటిని అమర్చడమే కాదు.. వాన నీరంతా ఒక ట్యాంకులో చేరేలా.. స్నానాల గదులు, సింకుల్లో నీరు మొక్కలకు అందేలా.. గోడల్లో మొక్కలు పెంచుకునేలా.. ఇలా అత్యాధునిక వ్యవస్థతో నిర్మాణాలు జరిగేలా ఓ డిజైన్‌ను రూపొందించా. అలానే ఉష్ణోగ్రత, తేమ కాంతి తీవ్రత, గాలి నాణ్యత వంటివన్నీ గుర్తించే సెన్సార్లను రూపొందించా. ఈ ప్రయోగాలను పలువురు శాస్త్రవేత్తలు ఆమోదించారు. అలా రాష్ట్రీయ బాల్‌ పురస్కారం దక్కింది. అంతేకాదు డిసెంబరులో అమెరికాలో యునైటెడ్‌ టెక్నాలజీస్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ బిల్డింగ్స్‌ ఛాలెంజ్‌ పేరుతో అంతర్జాతీయ పోటీ జరిగింది. దానికి దాదాపు అన్ని దేశాల నుంచి విద్యార్థులు భవన నిర్మాణంలో ఆధునిక పోకడలు... అనే అంశంలో ప్రయోగాల్ని తీసుకొచ్చారు. అందులో నా డిజైన్‌, డివైజ్‌లకు మొదటి స్థానం లభించింది. దాదాపు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది. వీటితోపాటు బార్లీ పంట అధిక దిగుబడికి సంబంధించి డేటా ఎనాలసిస్‌నూ రూపొందించా. ఈ మధ్యనే ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ న్యూట్రిషన్‌ ఛాలెంజ్‌ పురస్కారం కూడా అందుకున్నా. యేల్‌ యూనివర్సిటీ నుంచి గ్లోబల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యా. ప్రపంచ వ్యాప్తంగా నలభై మంది విద్యార్థులకే ఆ స్కాలర్‌షిప్‌ అందింది. అందుకు మనదేశం నుంచి నేను ఎంపికయ్యా.

- పద్మ వడ్డె

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని