close

తాజా వార్తలు

వివక్షను ఎదుర్కొని... ఐఏఎస్‌గా!

చరిత్రలో ఆమె

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే... ఈ నెల మొత్తాన్ని ‘విమెన్స్‌ హిస్టరీ మంత్‌’ అంటారు. చరిత్రలో నిలిచి... మన జీవితాల్ని ప్రభావితం చేయడమే కాదు... మానవాళికీ ఎంతో మేలు చేశారు చాలామంది మహిళలు.  అలాంటివారిలో కొందరి గురించి మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదటి ఐఏఎస్‌ - అన్నారాజమ్‌
అవి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజులు. పితృస్వామ్య వ్యవస్థ బలంగా వేళ్లూనుకున్న ఆ సమయంలో మహిళా సాధికారతను అంగీకరించే పరిస్థితి లేదు. ఆడపిల్లలు కనీస ప్రాథమిక విద్య కూడా పూర్తి    చేయలేని రోజుల్లో కేరళకు చెందిన అన్నా రాజమ్‌ జార్జి అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ వ్యవస్థలోని గాజుతెరల్ని బద్దలు కొట్టారు. భారతదేశం నుంచి మొదటి మహిళా ఐఏఎస్‌ అధికారిణిగా అధికారం అందుకుని చరిత్ర సృష్టించారామె.

అన్నా రాజమ్‌ 1927 జులై 17న కేరళ అలెప్పీలోని నిరానమ్‌లో పుట్టారు. ఆమె తండ్రి ఓ.ఎ జార్జి, తల్లి అన్నా పాల్‌. అన్నా కాలికట్‌లో డిగ్రీ, మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌ సాహిత్యంలో పీజీ పూర్తిచేశారు. ఆ తరువాత సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయాలనుకున్నారు. ఆమె లక్ష్యం ఐఏఎస్‌. అది తెలిసి చాలామంది ‘నీ వల్ల ఏమవుతుంది...’ అని నవ్వినవారే. కానీ ఆమె పట్టుదలతో పరీక్షరాసి 1951లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టారు.  ఆ ఘనత సాధించిన తొలిమహిళగా గుర్తింపు పొందారు.  అయితే ఇదేమంత సులువుగా జరగలేదు. ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించే క్రమంలో ఎన్నో  సవాళ్లు తప్పలేదు. మంచి మార్కులతో ఇంటర్వ్యూకు హాజరైన ఆమెతో అక్కడి బోర్డు సభ్యులు ‘విదేశీ సేవలనో, కేంద్ర ప్రభుత్వ సర్వీసులనో ఎంచుకుంటే మేలు...’ అని ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ అన్నా మాత్రం  తన లక్ష్యం ఐఏఎస్‌ అనీ ఆ సామర్థ్యం తనకు ఉందని స్థిరంగా చెప్పారు. మద్రాస్‌ క్యాడర్‌కి ఎంపికైన అన్నాకు సబ్‌కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి రాజాజీ కూడా ఆలోచించారు. ఆడపిల్ల శాంతి భద్రతలను కాపాడగలదా! అని సందేహించారు. సచివాలయంలో పోస్ట్‌ ఇస్తానన్న ఆయన మాటనీ అన్నా తిరస్కరించారు.  ‘నేను పురుష అధికారులకు దీటుగా పనిచేయగలను. అవకాశం ఇవ్వండి’ అని గట్టిగానే చెప్పగలిగారు. చివరకు మద్రాస్‌లోని తరుపత్తూర్‌ సబ్‌కలెక్టర్‌గా ఆమెను నియమించారు. ఆమె ప్రతి అడుగులోనూ ఆ వివక్ష కనిపించేది. ఆమెకి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లోనే ‘పెళ్లి చేసుకుంటే మీ నియామకం రద్దవుతుంది’ అని ఉంది. అయితే అన్నా తన బాధ్యతల్ని సమర్థమంతంగా నిర్వర్తించడంతో దాన్నెవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొన్నాళ్లకు తన బ్యాచ్‌మేట్‌ ఆర్‌.ఎన్‌ మల్హోత్రాను పెళ్లిచేసుకున్నారు. ఐఏఎస్‌గా ఏడుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఘనత ఆమెది. కేంద్రప్రభుత్వంలో కార్యదర్శి పదవిని అలంకరించిన తొలి మలయాళీ మహిళ కూడా ఆమే. 1989లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. 91 ఏళ్ల వయసులో అన్నా రాజమ్‌ మరణించారు.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.