close

తాజా వార్తలు

ఆత్మవిశ్వాసమే ముఖ్యం

‘ఆమె ఆకాశం ఎత్తు. అవకాశాల్లో సగం. అమ్మగా లాలి పాటలు పాడిన ఆమే ఆకాశంలోకి రాకెట్లూ దూస్తుంది. ఆటో స్టీరింగ్‌ తిప్పిన ఆ చేతులు విమానాన్ని నడిపేస్తాయి. బుజ్జాయికి బుడిబుడి అడుగులు నేర్పిన ఆమె ఎత్తైన పర్వతాలూ అధిరోహిస్తుంది. అందుకే ఆమె నేటి మహిళ’ అని అంటున్నారు తెలంగాణ నేర పరిశోధనల అదనపు సీపీ శిఖా గోయెల్‌.  రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన మహిళాదినోత్సవ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాలుపంచుకున్నారామె.

మహిళల ప్రాధాన్యం మారింది. పురుషులతో సమానంగా నేటి స్త్రీలు దూసుకుపోతున్నారు. అడుగు పెట్టిన చోటల్లా విజయదుందుభి మోగిస్తున్నారు. అలాగే తల్లిగా పిల్లల్ని, గృహిణిగా ఇంటినీ తీర్చిదిద్దుతున్నారు.   వ్యక్తిగతంగా, వృత్తిగతంగా సమన్వయం చేసుకుంటూనే సామాజిక బాధ్యతల్నీ నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కుటుంబంతో గడపలేకపోతున్నాం, పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం... అని చాలామంది అపరాధభావనతో కుంగిపోతుంటారు. అది సరికాదు. నేటి మహిళ అన్నిసార్లు సూపర్‌ఉమన్‌ కాకపోవచ్చు కానీ బహుముఖ ప్రజ్ఞాశాలి. పురుషులు అలా ఉండరు. ఉండలేరు. అలా మల్టీ టాస్కింగ్‌ చేశా కాబట్టే ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నా. అలానే అన్నీ సమన్వయం చేసుకుంటూనే... ప్రతి పాత్రనీ సమర్ధంగా పోషిస్తున్నా.

మారాలి: మహిళలు ఎప్పుడు తమకి తామ ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. ఉద్యోగ పరిస్థితిని బట్టి కొన్నిసార్లు అందుకు అనుగుణంగా మారాల్సి ఉంటుంది. చాలాసార్లు సర్దుబాట్లు తప్పవు. అలానే ఏ సమయంలో ఏది ముఖ్యమో దాన్ని బట్టే ప్రాధాన్యాలు మార్చుకోవాలి. నా జీవితంలో నేను కెరీర్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చా. అందుకే ఈ గుర్తింపు, పేరు. దానికి నేను చాలా గర్వపడతా. ఏ ప్రలోభాలకీ ఆశపడి నేను ఈ గుర్తింపును వదులుకోలేదు. బదులుగా అన్నింటినీ సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నించా. ఉద్యోగినిగా, వ్యాపారవేత్తగా క్షణం తీరిక లేకుండా గడిపినా... వృత్తిగతాన్ని, వ్యక్తిగత జీవితాన్ని చక్కగా సమన్వయం చేసుకోవాలి. అవసరాలు, ప్రాధాన్యాలు గుర్తించాలి. అలానే నేటి మహిళలు పురుషాధిక్య రంగంలోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. నాదీ అలాంటి రంగమే. ఈ రంగాల్లో మనల్ని మనం నిరూపించుకోవాలి. అందుకు ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎలాంటి సందర్భంలోనూ అది సడలకుండా చూసుకోవాలి.

కష్టపడాలి: ఉద్యోగం వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అంతా బాగున్నప్పుడు మనకి గౌరవం దక్కుతుంది. ప్రోత్సాహం లభిస్తుంది. అదే మనలో సరైన నైపుణ్యాలు లేకపోతే మన స్థానంలో ఇతర స్త్రీలు రారు.. పురుషులు వస్తారు. కాబట్టి ఏ చిన్న పొరబాటు చేయకుండా అనుక్షణం కష్టపడాలి. ఒక మహిళ పొరపాటు చేస్తే... ఆమె చేసినట్లు కాదు. మహిళలంతా చేసినట్లు అవుతుంది. అందుకే ఎవరూ మనల్ని వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదు. ఆడవాళ్లు ఫలానా పనులు చేయలేరు అనే పరిస్థితి లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలే కాదు, అర్హతలూ పెంచుకోవాలి. అప్పుడే వడివడిగా ముందడుగు వేయగలం.

సాయం తీసుకోవాలి: మనలో చాలామంది మహిళలు ఇతరుల సాయం అడగరు. అన్నీ తామే చేయాలని అనుకుంటారు. అది ఎప్పుడూ సరికాదు. ఇంట్లోనైనా ఆఫీసులోనైనా తోటివారిని సాయం అడగాలి. అవసరానికి  ఇతరులకీ సాయపడాలి. అప్పుడే పనుల్ని మేనేజ్‌ చేసుకోవడం సులువు. అలానే ఉద్యోగినులు తమ పరిధిని కూడా పెంచుకోవాలి. ఎప్పుడూ ఇద్దరు ముగ్గురితోనే మాట్లాడతాననే నిబంధనలు వద్దు. పనిచేసే చోట అందరితో సంతోషంగా ఉండాలి. స్నేహంగా మెలగాలి. కొత్తగా వచ్చిన వారితోనూ పరిచయాలు పెంచుకోవాలి. ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల పరిధి ఇట్టే విస్తరిస్తోంది.

ఎక్కడివక్కడే: మహిళలు ఎప్పుడూ ఒత్తిళ్లను ఇంటికి తీసుకురాకూడదు. అవన్నీ ఆఫీసులోనే వదిలేయాలి. అలాగే ఇంటిఒత్తిళ్లను కూడా ఆఫీసుకు మోసుకెళ్లకూడదు. లేదంటే చేసే పనికి అవి అడ్డంకిగా మారతాయి. సమస్యల్ని సమర్థంగా ఎదుర్కోవడం తెలిసుండాలి. అపరాధభావనను వదిలేసి మన గురించి మనం గర్వపడాలి. కుటుంబాన్ని గొప్పగా చూసుకోవాలి. మనమూ ఉన్నత స్థానంలో ఉంటే మొదట సంతోషించేది కుటుంబమే కాబట్టి ఆనందంగానే పనులు చేయాలి. ఇవన్నీ మనతోనే సాధ్యం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.