close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 09/03/2019 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సబలకు సత్కారం

వారంతా పురుషాధిక్య ప్రపంచంలో మహిళా సాధికారతకు మారుపేర్లు...
సమాజంలోని సమస్యలతో పోరాడిన నారీమణులు...
జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ మేటిగా నిలిచిన మహిళామణులు...
కొందరు కష్టాల కడలిలో ఎగిసిన కెరటాలైతే...
మరికొందరు ముళ్ల బాటలో నడిచి ఇతరులకు దారి చూపిన వెలుగు దివ్వెలు...
ఇంకొందరు కొత్తదనానికి ప్రతీకలుగా నిలుస్తున్న ప్రతిభావంతులు...
వీరంతా మహిళాలోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే వీరందరినీ ‘ఈనాడు-వసుంధర’ పురస్కారాలతో సత్కరించింది.

తండా నుంచి ఎవరెస్ట్‌కు
మలావత్‌ పూర్ణ
యువ సాహసి

ఎముకలు కొరికే చలిలో, అస్సలు ఇష్టపడని ఆహారంతో, ఆక్సిజన్‌ ట్యాంక్‌ లాంటి బరువును భుజాన వేసుకొని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అధిరోహించింది మలావత్‌పూర్ణ. ఆ తరువాత మరికొన్ని శిఖరాలను సునాయాసంగా ఎక్కేసింది ఈ యువ సాహసి. మలావత్‌ పూర్ణ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం. తల్లిదండ్రులు దేవిదాసు, లక్ష్మి. ఇద్దరూ రోజువారీ వ్యవసాయ కూలీలు. నెలకు వారిద్దరి ఆదాయం మొత్తం కలిపితే మూడువేల రూపాయలు మాత్రమే. దీంతో ఆమెను ఉచితంగా విద్యనందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకోసం చేర్చారు. అక్కడ చేరాక ఆ గురుకులంలో విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణ ఇస్తున్నారని తెలిసి ఆసక్తి చూపింది. వారు అవకాశం ఇవ్వడంతో పూర్ణ ట్రెక్కింగ్‌ సాధన చేసింది. ఎనిమిది నెలలు శిక్షణ తీసుకుంది. ఆమె పట్టుదలకు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌, శిక్షకుడు శేఖర్‌ బాబు ప్రోత్సాహం కూడా తోడయ్యింది. పర్వతారోహణ శిక్షణలోని ఇబ్బందులను, కష్టాన్ని చూసి చాలా మంది విద్యార్థులు వెనక్కితగ్గినా ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. పట్టు వదలకుండా సాధన చేసి ప్రపంచ రికార్డు సాధించింది. మొదట ఆమెకు శిక్షణ భువనగిరిలో ప్రారంభమైంది. ఎవరెస్టు పర్వతం అధిరోహించేందుకు ముందు డార్జిలింగ్‌లోని మౌంట్‌ రెనాక్‌పై సాధన చేసింది. దాని ఎత్తు 17వేల అడుగులు. శీతల వాతావరణాన్ని తట్టుకోవడానికి మైనస్‌ 35 డిగ్రీల సెల్సియస్‌ ఉన్న లద్దాక్‌లోని పర్వతాలు అధిరోహించింది. ఆ తరువాతే ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరం ఎక్కడం ప్రారంభించింది. నేపాల్‌ ప్రభుత్వం 16 ఏళ్లలోపు ఉన్నవారిని ఎవరెస్టు ఎక్కేందుకు అనుమతించకపోవడంతో ఆమె టిబెట్‌ నుంచి తన సాహస యాత్రను మొదలుపెట్టింది. ఎవరెస్టు అధిరోహించే సమయంలో ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు తినాల్సి వచ్చేది. ఇవి అంత సులువుగా జీర్ణం కావు. పైగా ఆ వాసన పూర్ణకు నచ్చేది కాదు. దీంతో చాలాసార్లు పొట్ట మాడ్చుకునేది. మొత్తం 52 రోజుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్‌ కుమార్‌తో కలిసి పర్వతాన్ని అధిరోహించింది. అప్పటికీ పూర్ణ వయసు కేవలం 13 ఏళ్ల 11 నెలలు. దీంతో ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన అతి చిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది. తరువాతి సంవత్సరాల్లో ఆఫ్రికాలోని కిలిమాంజారో, రష్యాలోని ఎల్‌బ్రుస్‌ పర్వతాలను అధిరోహించింది. ఇటీవలే దక్షిణ అమెరికా అర్జెంటీనాలోని అకోంకాగ్వా పర్వత శ్రేణిని సునాయసంగా ఎక్కేసింది. కేవలం అయిదేళ్ల వ్యవధిలోనే నాలుగు పర్వత శ్రేణులను అధిరోహించేసింది. ‘పర్వతారోహణ తేలికైన విషయం కాదు. రాత్రింబవళ్లు విశ్రాంతి లేకుండా సాగే సాహసయాత్ర. మధ్యలో కొండ చరియలు విరిగిపడతాయి. వాతావరణం అనుకూలించదు. ఆక్సిజన్‌ ట్యాంకుతోనే ప్రయాణం సాగించాలి. ఎవరెస్టు ఎక్కడం కూడా అనుకున్నంత సులభం కాదు. కానీ నా మనోధైర్యం నన్ను ముందుకు సాగేలా చేసింది. నేను అకోంకాగ్వా సాహస యాత్రకు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. తల్లిదండ్రుల సహకారం ఉంటే ఎలాంటి విజయాలు సాధించవచ్చో వారికి వివరించా. యూట్యూబ్‌లో విమానాలు నడిపేవారిని చూపించా..’ అని చెబుతుంది పూర్ణ. పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఎటువంటి విజయమైనా సాధిస్తాం అని చెప్పడానికి మలావత్‌ పూర్ణే నిదర్శనం.

రైతులకు మేలుచేసేలా
జయ నల్లబోతుల
వ్యాపార రంగం

జయ నల్లబోతుల స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి. ఆమె తండ్రి, చిన్నాన్నలు రైతులు. పంటలు సరిగా పండక, చీడలు ఆశించడం, దిగుబడి రాకపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కొనేవారు. అలానే మరి కొందరు రైతులు వ్యవసాయం లాభసాటికాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం ఆమె చూశారు. అందుకే బాగా చదువుకుని.. కార్పొరేట్‌ ఉద్యోగంలో స్థిరపడ్డా రాజీనామా చేశారు. తన చదువు, నైపుణ్యాలు రైతులకు ఉపయోగపడాలని.. 2015లో ‘స్టాంప్‌ ఐటీ సొల్యూషన్స్‌’ పేరుతో అంకుర పరిశ్రమను ప్రారంభించారు. రైతులకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ తయారు చేశారు. పంటల్ని సంరక్షించుకోవడం, చీడల్ని గుర్తించి వాడాల్సిన మందులు, నిపుణుల సూచనల వంటివన్నీ ఈ యాప్‌ ద్వారా అందిస్తున్నారు. ప్రస్తుతం 24వేల హెక్టార్లలో... 14వేల మంది రైతులు ఆయిల్‌ఫాం సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు.
ఆయిల్‌ఫాం సంస్థలు రైతుల వద్ద భూములు సేకరించి పంట సాగు చేస్తాయి. ఈ క్రమంలో వారి ఉద్యోగులు పంటల సాగు, చీడల గురించి తనిఖీలకు వెళ్లాల్సి ఉంటుంది. అది కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతోనే జయ ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ముందుగా పొలం సరిహద్దుల్ని జీపీఎస్‌ సాయంతో ట్యాగ్‌ చేస్తారు. దీన్ని జియో ట్యాగింగ్‌ అంటారు. దాంతో ఆయిల్‌ఫాం ప్రతినిధి.. ఆ పొలంలోకి వెళ్లి నిలబడితేనే ఆ రైతుకు సంబంధించిన డాక్యుమెంట్‌ తెరుచుకుంటుంది. ఇది నెట్‌ లేకపోయినా పనిచేస్తుంది. అంతేకాదు పంట ఎలా ఉందీ, మొక్కల పరిస్థితి ఇలా అన్నీ ఫొటోలు తీసి పంపొచ్చు. అలానే అప్పటికప్పుడు ఆయిల్‌ ఫాం సంస్థలోని నిపుణుల బృందం సమస్యని విశ్లేషించి పరిష్కారం చెబుతుంది. అలానే చదువుకోనివారు కూడా ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా సాఫ్ట్‌వేర్‌ను తేలిగ్గా ఉపయోగించగలుగుతారు. జయ ముందుగానే రైతులకి వారి వివరాలతో ఓ క్యూఆర్‌ కోడ్‌ ఉన్న గుర్తింపు కార్డును అందిస్తారు. పంట చేతికి వచ్చాక తూకం వేసినప్పుడు బరువు వివరాలు వివరాలు ఆ కార్డు ద్వారానే సర్వర్‌లోకి వెళతాయి. దీనివల్ల తప్పుడు తూకం, చెల్లింపుల్లో మోసం వంటివి ఉండవు.  ఇలాంటి సేవల్ని భోపాల్‌, చెన్నై, ఆంధ్రా, ఒడిశాలో అందిస్తున్నారు.
అలానే చేపల సాగుకూ జయ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతోంది. ఆయిల్‌ఫాం రైతుల మాదిరే చేపల చెరువుల్ని కూడా జియో ట్యాగింగ్‌ చేసి సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. తద్వారా చేపల చెరువులు సాగు చేసే రైతులు నష్టపోకుండా లాభాల బాట పడుతున్నారు. నేషనల్‌ ఫిషరీ బోర్డు ఆంధ్రా, తెలంగాణ, ఒడిశాలో మొత్తం ఓ పది ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. వాటికీ ఆమె సాంతిక సేవల్ని అందిస్తున్నారు. అలానే ఈ మధ్య ఆగ్రో స్టార్టప్‌లు వేగం పుంజుకుంటున్నాయి. వ్యవసాయం ఆసక్తి ఉన్నవారి వద్ద నుంచి పెట్టుబడిని షేర్ల రూపంలో తీసుకుని.. రైతులకు ఆ మొత్తం చెల్లించి వారి చేత సాగు చేయిస్తున్నారు. భోపాల్‌లోని ఓ స్టార్టప్‌.. ఇలా పెట్టుబడి పెట్టించడమే కాకుండా రైతులు పండించిన కాయగూరల్ని నేరుగా వినియోగదారులకు చేరవేస్తుంది. ఇలాంటివారికి స్టార్టప్‌లకూ సాఫ్ట్‌వేర్‌ను ఇవ్వడమే కాదు.. సర్వర్లను అద్దెకిస్తున్నారు.

అమ్మాయిలకు అండగా
మమతా రఘువీర్‌
సేవారంగం

అమ్మాయిలకు అన్నింటా అవకాశాలు కల్పిస్తున్నాం. గౌరవ ఇస్తున్నాం అంటూ ఎన్ని చెప్పుకున్నా...అదంతా నాణానికి ఒకవైపే అంటారు సామాజిక ఉద్యమకారిణి డా.మమతా రఘువీర్‌. మరోవైపు సమాజాభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారిన బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింసను రూపుమాపేందుకు ఆమె తరుణి పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.
వరంగల్‌ జిల్లాలో 500 గ్రామాల్లో బాలికా సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆరోగ్యం, పోషకాహారం, బాలల రక్షణ చట్టాలు, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలానే మహిళలకు వృత్తివిద్య, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1500 బాల్యవివాహాలను అడ్డుకొని సదరు బాలికల ఉన్నతవిద్యకు సాయమందించారు. సుమారు 4వేల మంది బాలకార్మికులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. అలానే మహిళలు, బాలలకు న్యాయ సహాయం అందించేందుకు ‘నీలా’ (నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ లీగల్‌ యాక్టివిస్ట్స్‌) పేరిట 2015లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. 2011-13 మధ్యకాలంలో వరంగల్‌ జిల్లా బాలల సంక్షేమ కమిటీకి అధ్యక్షురాలిగా మమతా రఘవీర్‌ పనిచేశారు. మహిళలు, బాలలకు అండగా నిలిచేందుకు హైదరాబాద్‌ నగర పోలీసుశాఖ ప్రారంభించిన ‘భరోసా’ కేంద్రానికి సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. పనిప్రదేశాల్లో స్త్రీలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో ఏర్పాటైన అంతర్గత ఫిర్యాదుల కమిటీల్లో, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 1967లో నల్గొండ జిల్లాలో మమత రఘువీర్‌ జన్మించారు. హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, పీజీ డిప్లొమా ఇన్‌ హ్యుమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ పట్టాలు పొందారు.  2003, 2008లో ఉత్తమ సామాజిక కార్యకర్తగా వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ నుంచి పురస్కారం అందుకున్నారు. 2013లో దూరదర్శన్‌ ‘సప్తగిరి సబలా పురస్కారం’ అందజేసింది. 2016, మార్చిలో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌, హైదరాబాద్‌ వారి ‘వుమెన్‌ ఆఫ్‌ ది హిస్టరీ మంత్‌’ పురస్కారానికి ఎంపికయ్యారు.

జానపద సరాగాల సవ్వడి
మంగ్లీ కళారంగం (గానం)

తన పాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు దోచుకున్న మంగ్లీ అసలు పేరు సత్యవతి రాఠోడ్‌. గాయనిగా, బుల్లితెర యాంకర్‌గా, నటిగా మనందరికి సుపరిచితురాలు. బంజారాలో పుట్టిన బంగారు బొమ్మ ఆమె. పాలమూరు పిల్ల. తనకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం అంటే అమితాసక్తి. మంగ్లీ నాన్న బాలు నాయక్‌ జానపద పాటలు పాడేవారు. అలా తండ్రిని చూస్తూ పెరిగిన మంగ్లీకి కూడా పాటలంటే ఇష్టం కలిగింది. ఆమె ఆసక్తిని గమనించిన ఆయన ఆమెను పాటలు నేర్చుకుని, పాడేలా ప్రోత్సహించారు. అయితే కేవలం సంగీతమే కాకుండా భరతనాట్యం కూడా నేర్చుకుందామె.
సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క జాతర, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం... ఇలా పండగేదైనా మంగ్లీ గొంతు నుంచి పాట జాలువారాల్సిందే. ఆమె పాడిన పాటలన్నింటిలో రేలా...రే మంగ్లీకి ఎంతో గుర్తింపు తెచ్చింది. ‘మాటకారి మంగ్లీ’ ప్రోగ్రామ్‌ ద్వారా తన కెరీర్‌ని ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. ఆ కార్యక్రమానికి బాగా ఆదరణ పెరగడంతో ఆ పాత్ర పేరే ఆమెకు స్థిరపడిపోయింది. ఆ  కార్యక్రమానికి బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంకర్‌గా రెండు జాతీయ అవార్డులను కూడా అందుకుంది మంగ్లీ. ఇవన్నీ ఆమెకు సినిమాల్లో పాడే అవకాశాలు తెచ్చిపెట్టాయి. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’, ‘లచ్చి’, ‘జిందగీ’, శైలజారెడ్డి అల్లుడు... సినిమాల్లోనూ పాడి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. బంజారా ఉనికిని ప్రతిబింబించే దుస్తులంటే ఆమెకు చాలా ఇష్టం. గాయకుల్లో రాజస్థానీ గాయని భన్వారీ దేవి అంటే ప్రత్యేకమైన అభిమానం తనకి. హిందీతోపాటు అన్ని భాషల్లో పాడాలనేది ఆమె కోరిక. కొంతకాలంగా ‘మంగ్లీ ముచ్చట్లు’ పేరుతో సెలబ్రిటీలను ఇంటర్యూలు కూడా చేస్తోంది. ఆడపిల్లగా విమర్శ ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన ఆమె... ఇప్పుడు తనదైన ముద్ర వేస్తోంది.

ఎగిసిన క్రీడా కెరటం
సింధు
క్రీడలు

భారత బ్యాడ్మింటన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన ఘనత పి.వి.సింధు సొంతం. సైనా ఘనతల తర్వాత మన స్థాయి ఇది అనుకునేలోపే సింధు ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఫిట్‌నెస్‌.. దూకుడుతో ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌ను, భారత రాకెట్‌ జోరును అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఎవరూ ఊహించని ఘనతలు అందుకుంది. సైనా సాధించిన ఘనతలకు మెరుగులు దిద్దింది. ఒలింపిక్స్‌లో రజతం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో రజతం, కాంస్యం.. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం, రజతం, కాంస్యం.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాల్ని సింధు కైవసం చేసుకుంది. ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌, కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌, చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ వంటి ప్రతిష్ఠాత్మక టైటిళ్లను సాధించింది. నిరుడు ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌.. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం, రజతం.. ఆసియా క్రీడల్లో రజతం గెలుచుకుంది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ సాధించిన మొదటి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అత్యుత్తమ ఫిట్‌నెస్‌.. దూకుడుతో మహిళల బ్యాడ్మింటన్‌లో ఊపు తెచ్చింది సింధునే. ఒకప్పుడు పురుషుల మ్యాచ్‌లకే ఆదరణ ఉండగా.. మహిళల పోరాటాల్ని ఆసక్తిగా మార్చిన ఘనత సింధుదే. జపాన్‌ క్రీడాకారిణి నొజొమి ఒకుహరతో సుదీర్ఘంగా మ్యాచ్‌లు ఆడటం సింధుకే చెల్లింది. ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), ఒలింపిక్‌ ఛాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌), మాజీ ప్రపంచ ఛాంపియన్‌ ఇంతానన్‌ రచనోక్‌ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులకు సమ ఉజ్జీ మన సింధు.

మార్షల్‌ ఆర్ట్స్‌లో మేటి
ఫరీహా తఫిమ్‌
యువ క్రీడాకారిణి

ఫరీహా తఫిమ్‌... పేదరికంలో పుట్టి, జాతీయస్థాయి మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడాకారిణిగా ఎదిగింది. కట్టుబాట్లు, ఇతర అడ్డంకులు ఎదురైనా... వెనకడగు వేయకుండా ముందుకు సాగుతోంది. క్రీడలో ప్రావీణ్యం పెంచుకుంటూ పతకాల పంట పండిస్తోంది.
ఫరీహా స్వస్థలం హైదరాబాద్‌. పాఠశాలలో ఆత్మ రక్షణ విద్య మార్షల్‌ ఆర్ట్‌లో శిక్షణ పొందింది. సాధన చేయడం ప్రారంభించిన మూడేళ్లలోనే జాతీయ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. అమ్మ, ఇంట్లో వాళ్లు వద్దని చెప్పినా... సంప్రదాయాలు, ఇతర కట్టుబాట్లు   అడ్డంకులు సృష్టించినా... ఆమె మాత్రం మనోధైర్యంతో ముందుకు సాగుతోంది. కానీ ఆమె తండ్రి, పాఠశాల నిర్వాహకులు, శిక్షకులు ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఇల్లుదాటి ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా... పోటీల్లో నెగ్గి ఇంటి బాట పడతానని పట్టుదలతో చెప్పి ఆమె అసోంలో జరిగే ఛాంపియన్‌షిప్‌కు బయలుదేరింది. ఆ పోటీల్లో ఫరీహాకు ఎదురే లేకుండా పోయింది. ప్రత్యర్థులను మట్టికరిపించి పతకాల పంట పండించింది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, సంప్రదాయాలు, కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడి ఆమె రాణించిన క్రమం ఎంతో మందికి ఆదర్శం. అందుకే ఆమె జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి లండన్‌కు చెందిన ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ జయేషా పటేల్‌ ఫరీహాపై ఇండియన్‌ వుషూ వారియర్‌ గర్ల్‌ పేరుతో డాక్యుమెంటరీ తీశారు. తల్లితో సంఘర్షణల నుంచి ఆమె విజయ తీరాలు చేరేవరకు సాగిన ఫరీహా జీవితంతో రూపుదిద్దుకున్న ఈ డాక్యుమెంటరీ... ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఫరీహాకి మేరీకోం ఆదర్శం. ఈ ఆట గురించి ప్రజలకు తెలియజేయాలనుకుంటోంది.
ఫరీహా రోజూ ఉదయం మూడు గంటలు సాధన చేస్తుంది. తన శిక్షకుడు వాజా ఆమెకు ఆరో తరగతి నుంచి శిక్షణ ఇస్తున్నాడు. అతడు ఫరీహాను ఎప్పుడూ ప్రోత్సహిస్తాడు. ఆటలో ఆమె మెరుగవడానికి నిత్యం సహాయపడతాడు. ఫరిహాకు గేర్‌ బైక్‌ను నడపడమంటే ఇష్టం. జీవితంలో ఐపీఎస్‌గా స్థిరపడాలనేది ఆమె ఆకాంక్ష.
‘ఛాంపియన్‌షిప్‌ గెలవడం నేనెప్పుడు మరిచిపోను. నన్ను ఈ ఆట వైపు పంపడానికి ఇష్టపడని మా అమ్మకు ఇది ఎంతో ఆనందాన్నిచ్చింది. నేను ఇందులో రాణిస్తున్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నా. ఇది ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి కలగజేస్తుంది. అసోం ఛాంపియన్‌షిప్‌లో నా ప్రత్యర్థి నాతో పోటీ పడటానికి భయపడి వెనుదిరిగింది. దీంతో నన్ను విజేతగా ప్రకటించారు. దీనిని ఎప్పటికీ మరిచిపోను. అదో తీపి జ్ఞాపకం’ అని చెబుతోందీ ఫరీహా.

అతివకు అభయం
స్వాతి లక్రా
పాలనారంగం

ఆడవాళ్లను ఆటపట్టించాలంటే ఆకతాయిలు జంకుతున్నారు... మహిళలను ఏడిపిస్తే పోలీసులు తాట తీసేస్తారని పోకిరీలు వణుకుతున్నారు... దీనికి కారణం తెలంగాణ రాష్ట్రంలోని షీ బృందాలు. వీటిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు స్వాతి లక్రా. నగరంలో మహిళలను ఎవరైనా వేధించినట్లు సమాచారం వస్తే ఐదు నిమిషాల్లో షీ బృందాలు అక్కడ వాలిపోయి బాధితులకు అండగా నిలబడేలా వీటిని రూపొందించారు. దీనికి నేతృత్వం వహించేది కూడా స్వాతినే. తండ్రి తప్పు చేయకున్నా.. పోలీసులు అవమానించారు. అప్పుడే ఆమె ఐపీఎస్‌ అధికారిణి కావాలని బలంగా నిశ్చయించుకున్నారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఆమె జన్మించారు. లోరెటో కాన్వెంట్‌ పాఠశాలలో చదువుకున్నారు. లేడీ శ్రీరామ్‌ మహిళా కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. పట్టుదల, పక్కా ప్రణాళికతో చదివి 1995లో ఇండియన్‌ పోలీసు సర్వీసుకు ఎంపికయ్యారు. స్వాతిలక్రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. నిత్యం తన ప్రత్యేకత చాటుకుంటూ అంచలంచెలుగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం స్వాతిలక్రాను హైదరాబాద్‌ నేరాల విభాగంలో అడిషనల్‌ సీపీగా నియమించింది. నేరాలు నియంత్రించి, మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన కమిటీలో ఆమె కీలక పాత్ర పోషించారు. అక్కడ వచ్చిందే షీ బృందాల ఆలోచన. తరువాత వీటిని పర్యవేక్షించే బాధ్యతను కూడా స్వాతిలక్రాకే అప్పగించింది సర్కారు. వాటిని సమర్థంగా నిర్వర్తిస్తూ నగరవాసుల మన్ననలు పొందారు. ప్రస్తుతం మహిళల భద్రతా విభాగం ఐజీగా రాష్ట్ర వ్యాప్తంగా షీ బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు. సుమారు రెండున్నర దశాబ్దాల వృత్తి ప్రయాణంలో స్వాతి లక్రా ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.

చిన్నితెర మెరుపు
హరిత
టీవీ రంగం

ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలిచే ప్రముఖ బుల్లితెర నటీమణుల్లో హరిత ఒకరు. తనకంటూ ఓ స్టైల్‌ను సృష్టించుకుని తనకిచ్చిన పాత్రల్లో ఒదిగిపోయే నటి ఈమె. హరిత ఒకప్పటి నటి రవళికి అక్క. దుస్తులు, అలంకరణ, కేశాలంకరణ... ఇలా అన్నింట్లో తన ప్రత్యేకతను చాటుకుంటారామె. అందుకే చాలామంది మహిళలు ఆమెను ఇష్టపడుతుంటారు. మొదట సినీరంగంలో అడుగుపెట్టిన హరిత ఆ తరువాత బుల్లితెరపై విజయాలు అందుకున్నారు.  పాత్ర ఏదైనా కూడా తనదైన శైలిలో ఇమిడిపోవడం హరిత ప్రత్యేకత. అలంకరణలో కూడా నిండుదŸనం మూర్తీభవించినట్లుండి... తల్లి, అత్త లేదా వదిన ఇలా ఎటువంటి పాత్రనైనా సునాయాసంగా భర్తీ చేయగలరీమె.  అంతగా అభిమానులను తన ఆహార్యంతోపాటు, నటనతో ఆకట్టుకునే ప్రతిభాశాలి హరిత. ఆమె ఫ్యాషన్‌  డిజైనింగ్‌ కోర్సు చదవకపోయినా కూడా సహజసిద్ధంగా ఉండే ప్రతిభతో తన దుస్తులను తానే డిజైనింగ్‌ చేసుకుంటారు. ఇంట్లోనే మగ్గాన్ని ఏర్పాటు చేసుకుని మరీ చీరలు, బ్లవుజులపై ప్రత్యేకంగా వర్క్‌ చేయించుకోవడం ఆమె ప్రత్యేకత. మొదట్లో కొన్ని పెళ్లిళ్లలో వధువులకు దుస్తుల డిజైన్‌ చేశారీమె. కలవారి కోడళ్లు, ముద్ద మందారం సీరియల్స్‌తో తెలుగువారికి దగ్గరైన హరిత ప్రస్తుతం కుంకుమ పువ్వుతో చెరగని ముద్ర వేస్తున్నారు. హరితది చెన్నై. తన 15వ ఏట నుంచే వెండి తెరపై నటించడం మొదలుపెట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి, ఒరియా, బెంగాలీ భాషల్లో ప్రముఖ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారామె. తెలుగు సహా ఆంగ్లం, తమిళ భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. తన సహ నటుడు జాకీని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. గానం, నాట్యం హరితకు ఇష్టమైన అంశాలు. జీవితంలో భార్యాభర్తల మధ్య సర్దుబాటు ఉండటం, అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించడం వంటి అంశాలను పాటిస్తే... నిత్యం సంతోషంగా ఉండొచ్చని చెబుతారామె. ఎప్పటికప్పుడు పాత్రలకు అనుగుణంగా మారుతూ... వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ... ముందుకు సాగుతున్నారు హరిత.

పాటల పూదోటలో
శ్రేష్ఠ
కళలు
పాటల రచయిత్రి

శ్రేష్ఠ తెలుగు పాటల రచయిత్రి. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి చిత్రాల ద్వారా రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అతి తక్కువ మంది సినీగేయ రచయితలలో ఈమె ఒకరు. శ్రేష్ఠ మంచిర్యాలలో జన్మించారు. చిన్నప్పుడు తాతయ్య దగ్గర భక్తి గీతాలు నేర్చుకున్నారు. ఆయనే ఆమెకు సంగీతంలో తొలి గురువు. పదో తరగతి వచ్చేటప్పటికే రాగయుక్తంగా పాటలు పాడేవారు. శ్రీశ్రీ రచనలు చదివేవారు. వాటి ప్రభావంతో సామాజిక అసమానతలపై కవితలు రాయడం మొదలుపెట్టారు. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు తను రాసిన కవితలన్నింటినీ ‘మై కాలేజ్‌ లైఫ్‌’ పేరుతో సంపుటిగా తీసుకొచ్చారు. ఆమె కలం పేరు ‘భావన’. డిగ్రీ తరువాత ఎల్‌ఎల్‌బీలో పట్టాపొందారు. మొదటి సినిమాకే పాటలన్ని రాసే అవకాశం కొట్టేశారు శ్రేష్ఠ. ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’లోని గీతాలన్ని ఆమె రాసినవే. అవి ప్రేక్షకాదరణ సైతం పొందాయి. దీనికి ‘సినిమా మహిళా అవార్డు’ కూడా వచ్చింది. కో అంటే కోటి, జబర్దస్త్‌, కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌, పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి, యుద్ధం శరణం, హలో, ఆటగాళ్లు చిత్రాల్లోని పాటలూ రాశారు. పెళ్లి చూపులు సినిమాలోని చినుకు తాకే... మెరిసె మెరిసే పాటలు ప్రజాధరణ పొందాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.