close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 21/03/2019 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మెడికల నెరవేరాలంటే!

నీట్‌ - 2019 : 45 రోజుల వ్యూహం!

జాతీయస్థాయి మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్ష.. ‘నీట్‌’. రెండు తెలుగు రాష్ట్రాల బైపీసీ విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు ముగించుకుని, ఇప్పుడు దీనిపై దృష్టిపెట్టారు. వారి సన్నద్ధత చివరి అంకంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో సబ్జెక్టులవారీగా అనుసరించాల్సిన మెలకువలను తెలుసుకుందాం!

దేశవ్యాప్తంగా 15.19 లక్షలమంది విద్యార్థులు మే 5న జరగబోయే నీట్‌- 2019కు దరఖాస్తు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 2 లక్షలమంది అధికం. రాష్ట్రాలవారీగా  చూస్తే మహారాష్ట్ర నుంచి అత్యధికులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఈ పెరుగుదలకు ముఖ్య కారణాలు రెండు. 1) సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నీట్‌ విదేశాల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులు చేయడానికి తప్పనిసరి అయింది. 2) అన్ని రకాల ఆయుష్‌ కోర్సులకూ నీట్‌  ర్యాంకు అవసరం అవడం.
ఇప్పుడున్న ఈ 45 రోజుల్లో చివరి 16 రోజులూ గ్రాండ్‌ టెస్టులు (పూర్తి పరీక్షలు) రాయవలసి ఉంటుంది. అంటే విద్యార్థికి తుది సన్నద్ధతకు అందుబాటులో ఉన్నది. 29 రోజులు మాత్రమే.


 

ఫిజిక్స్‌: సాధనే ముఖ్యం

నీట్‌ పరీక్షలో ఫిజిక్స్‌లో మెరుగైన స్కోరు చేయాలంటే ప్రాథమిక భావనల పట్ల పూర్తి పట్టు సాధించాలి. బాగా సాధన చేయాలి! ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ప్రతి అధ్యాయానికీ చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని సాధన చెయ్యడం మేలు.
కాలిక్యులేషన్స్‌ పట్ల విముఖత తగ్గించుకుని ఏకాగ్రతతో చదివితే ఫిజిక్స్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడం సులువే. ముఖ్యంగా డిఫరెన్షియేషన్‌, ఇంటిగ్రేషన్‌ వంటి అప్లికేషన్స్‌ మీద తగినంత పట్టు సాధించాలి. సిద్ధాంతపరమైన (థియరీ) ప్రశ్నలపైనే ఆధారపడటం సరికాదు. ఎందుకంటే నీట్‌ ప్రశ్నపత్రంలో గణిత సంబంధ (కాలిక్యులేషన్స్‌) ప్రశ్నలే ఎక్కువ వస్తున్నాయి. 11, 12 తరగతుల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. గణిత సంబంధ అనువర్తనాల పట్ల భయాన్నీ, నిరాసక్తతనూ తగ్గించుకుని వాటిపై పట్టు సాధించాలి.

అత్యంత ముఖ్యమైన చాప్టర్లు
* మెకానిక్స్‌, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్‌, ఎలక్ట్రిసిటీ అండ్‌ మాగ్నటిజం, ఆప్టిక్స్‌, మోడరన్‌ ఫిజిక్స్‌లు అత్యంత ముఖ్యమైన చాప్టర్లు. వీటిపై ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే మంచిది. మెకానిక్స్‌ విభాగంలో కన్సర్వేషన్‌ ఆఫ్‌ మొమెంటమ్‌, యాంగ్యులర్‌ మొమెంటమ్‌, ఎనర్జీలతోబాటు టార్క్‌, మొమెంట్‌ ఆఫ్‌ ఇనర్షియా ఫార్ములాలకు  ప్రాధాన్యమిస్తూ సాధన చెయ్యాలి.
* అటామిక్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌, సెమికండక్టర్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ వంటి విభాగాల నుంచి థియరీ ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఎక్కువ.
* గ్రావిటేషన్‌, ఎలక్ట్రోస్టాటిక్స్‌, మాగ్నటిజం వంటి అధ్యాయాల్లో ఉన్న విభిన్న అంశాలు, అనువర్తనాలు, ఫార్ములాలు పోల్చదగినవిగా ఉంటాయి.
* కరంట్‌ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రో మాగ్నటిజం వంటి చాప్టర్‌లలో సర్క్యూట్‌ ఆధారిత లెక్కలు జాగ్రత్తగా సాధన చెయ్యాలి. కెపాసిటర్‌, రెసిస్టెన్స్‌లతో గల సర్క్యూట్‌లలో బాలన్స్‌డ్‌ వీట్‌ స్టోన్‌ బ్రిడ్జి ఉందేేమో గమనించాలి. దానివల్ల కొన్ని సందర్భాల్లో లెక్కలు చూసిన వెంటనే సరైన సమాధానాన్ని గుర్తించే వీలుంది.
* ప్రతి చాప్టర్‌లోనూ గ్రాఫు ఆధారిత లెక్కలను కూడా అధ్యయనం చెయ్యాలి.

కష్టమైనవాటిపై శ్రద్ధ
* తేలిక అనిపించే అధ్యాయాలను చాలాసార్లు అభ్యాసం చెయ్యడం మానేసి కష్టతరంగా భావించే అంశాలనే రెండు మూడుసార్లు చదవటం చాలా అవసరం.
* తగినన్ని మాక్‌టెస్ట్‌లు, వీలయితే రెండు మూడు రోజులకొకసారి ప్రాక్టీస్‌ చేస్తే మంచిది. దీనివలన సమయపాలన, కచ్చితత్వం పెరుగుతాయి.
* మూడు గంటల పరీక్షా వ్యవధిలో బయాలజీ, కెమిస్ట్రీ విభాగాలను రెండు గంటలలోపే పూర్తిచేసుకుని ఒక గంట సమయాన్నైనా ఫిజిక్స్‌కు కేటాయిస్తే మంచిది.
* పరీక్ష మొదటి దశలో అన్ని సబ్జెక్టుల్లోని తేలికపాటి ప్రశ్నలు, చూడగానే సమాధానాన్ని గుర్తించగలవాటిని పూర్తి చెయ్యాలి. దీనివల్ల ప్రశ్నల్లో సింహభాగం పూర్తయిన భావనతో మిగిలిన ప్రశ్నల్ని సాధించే ధీమా పెరుగుతుంది. అనుమానాస్పదంగా ఉండి వదిలివేసినవాటిని రెండో దశలో పూర్తి చెయ్యాలి.
* వందశాతం మార్కులు తెచ్చుకోవడానికి తపించి తప్పులు చేయడం కంటే చెయ్యగలిగిన ప్రశ్నలకు కచ్చితమైన జవాబులు గుర్తించాలి. లేకుంటే రుణాత్మక మార్కుల వల్ల మొత్తం మార్కులే తగ్గే ప్రమాదం ఉంది.
* కాలిక్యులేషన్లను హడావిడిగా చేయకూడదు. జవాబులను రెస్పాన్స్‌ షీట్‌మీద గుర్తించేటపుడు ఒకదాని బదులు మరొకటి గుర్తించరాదు.

- కె. రవీంద్రకుమార్‌,  శ్రీ చైతన్య విద్యాసంస్థలు


 

 

కెమిస్ట్రీ: తేలికైన సబ్జెక్టే

నీట్‌లో ర్యాంకు సాధనకు బయాలజీ తర్వాత ప్రాముఖ్యమున్న సబ్జెక్టు కెమిస్ట్రీ. కొందరు విద్యార్థులు దీన్ని కష్టంగా భావిస్తుంటారు. దీనికి కారణం సిలబస్‌ ఎక్కువగా ఉండడమే కానీ సబ్జెక్టు క్లిష్టత కాదు. దీనిలో 120- 130 మార్కులు సాధిస్తే ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభించినట్లే. అంటే.. 30- 32 ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించాలి.
సిలబస్‌ మొత్తం ముఖ్యమైనప్పటికీ కెమిస్ట్రీలో ‘నీట్‌’ మార్కులపరంగా కీలకమైన అధ్యాయాలపై అధిక దృష్టి కేంద్రీకరించాలి. కాంప్లెక్స్‌ సమ్మేళనాలు, రసాయన బంధం, ఎలక్ట్రో కెమిస్ట్రీ, సమతాస్థితి, పాలిమర్‌లు, బయోమాలిక్యూలు, పరమాణు నిర్మాణం, కర్బన రసాయన శాస్త్రం, సాలిడ్‌ స్టేట్‌, s, p,d, f మూలకాలు, నిత్యజీవితంలో రసాయనశాస్త్రం, ద్రావణాలు, సర్ఫేస్‌ కెమిస్ట్రీ- ఇవీ ముఖ్యమైన అధ్యాయాలు.

పునశ్చరణ ముఖ్యం..
* ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ప్రతి సంవత్సరం వస్తున్న 12- 13 ప్రశ్నల్లో 2 మాత్రమే సాధారణ ఆర్గానిక్‌ విభాగం నుంచి వస్తున్నాయి. మిగిలిన 10- 11 ప్రశ్నలు ఐసోమెరిసమ్‌, సమ్మేళనాల తయారీ, ధర్మాలకు సంబంధించినవి. ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ మిగిలిన 10- 11 ప్రశ్నలు సులువుగా ఉండడం వల్ల స్కోరింగ్‌ కష్టమేమీ కాదు. చర్యలు, సమీకరణాలు సులువుగా మర్చిపోవడానికి అవకాశం ఉంది. అందుకని ఈ సమీకరణాలను ఇంటర్‌కన్వర్ష్షన్స్‌ రూపంలో రాసుకొని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. కర్బన రసాయన చర్యల్లో ఉపయోగించే కారకాలు, పేరు పెట్టిన ప్రతిచర్యలను ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి.
* ఫిజికల్‌ కెమిస్ట్రీ అధ్యాయాలకు సంబంధించిన అన్ని ఫార్ములాలనూ ఒకచోట రాసుకొని పరిశీలన చేసుకోవాలి. చాలావరకూ ఫార్ములా ఆధారంగా ప్రశ్నలు రావడానికే అవకాశాలు ఎక్కువ.
* ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం కోసం ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాల క్రమాలను ఒకేచోట అధ్యయనం చేయాలి. దీనిమూలంగా సులభంగా గుర్తుంచుకొని కచ్చితంగా సమాధానం గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పటికే సంపూర్ణంగా అధ్యయనం చేశామని ఊరుకోకుండా... వివిధ రకాల అంశాలను పునశ్చరణ చేయటం ఎంతో ముఖ్యం. అతిముఖ్యమైన ఫార్ములాలు, తొందరగా మరిచిపోయే ముఖ్యమైన విషయాలను వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకుంటూవుండాలి. పరీక్షలో సమయ నిర్వహణ, కచ్చితత్వాన్ని పెంచడానికి ఎక్కువగా నీట్‌ మోడల్‌ పరీక్షలు రాస్తుండాలి. .ప్రతి ప్రాక్టీస్‌ నీట్‌ పరీక్షనూ ఫైనల్‌ నీట్‌ పరీక్షలాగానే భావించి శ్రద్ధగా రాయాలి. పరీక్ష రాసిన తరువాత విశ్లేషించుకుని, జరిగిన పొరపాట్లు ఎలాంటివో గ్రహించాలి. అవి పునరావృతం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటించి పరీక్ష రాస్తే కెమిస్ట్రీలో మెరుగైన స్కోరు సాధ్యమే!

- వి. కుమార్‌,  శ్రీ చైతన్య విద్యాసంస్థలు


 

 

బయాలజీ: ఆరు యూనిట్లు కీలకం

నీట్‌లో అత్యధిక మార్కులు తెచ్చుకోవడానికైనా, సీటు సాధించడానికైనా బయాలజీకి అధిక ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం ఉన్న సమయంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీల కంటే బయాలజీకే ఎక్కువ సమయం కేటాయించాలి. గత సంవత్సరాల విద్యార్థుల స్కోర్లు చూస్తే టాపర్ల మార్కుల్లో 50-55 శాతం వరకు బయాలజీ మార్కులే. అలాగే కనీస ర్యాంకులతో సీట్లు సాధించినవారి మార్కుల్లో 60-65 శాతం బయాలజీవే..
గత నాలుగు సంవత్సరాల నీట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కింది ఆరు యూనిట్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. 1) హ్యూమన్‌ ఫిజియాలజీ 2) ఎకాలజీ 3) ప్లాంట్‌ ఫిజియాలజీ 4) సెల్‌ స్ట్రక్చర్స్‌ అండ్‌ ఫంక్షన్స్‌ 5) రిప్రొడక్షన్‌ 6) మాలిక్యులర్‌ బేసిస్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటన్స్‌.
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో అన్ని చాప్టర్లనూ ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తూ, పైన పేర్కొన్న అధ్యాయాలకు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మంచిది.

హ్యూమన్‌ ఫిజియాలజీ:  దీనినుంచి నీట్‌-2017లో 16 ప్రశ్నలు, 2018లో 15 ప్రశ్నలు వచ్చాయి. ఈ యూనిట్లోని 7 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో మొదట ఆర్గాన్స్‌ నిర్మాణం, తర్వాత వాటి ఫిజియాలజీ వివరించారు. వీటిలో స్ట్రక్చర్‌కు సంబంధించిన ప్రశ్నలు జ్ఞాపకశక్తి ఆధారితంగా, కొన్ని డయాగ్రమ్‌పై ఆధారపడి ఉంటాయి. విద్యార్థి  ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాన్ని పూర్తిస్థాయిలో చదివి ఆ పుస్తకంలోని పటాలనే టేబ్లింగ్‌తో సహా చూసుకోవాలి. ఆర్గాన్స్‌ ఫిజియాలజీకి సంబంధించి తార్కిక ప్రశ్నలు వస్తున్నాయి. అందుకని ఈ కాన్సెప్టులపై పూర్తి స్పష్టతను తెచ్చుకోవాలి.

ఎకాలజీ: దీనినుంచి నీట్‌-2017లో 5 ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. కానీ 2018లో 11 ప్రశ్నలు వచ్చాయి. ఈ యూనిట్లో మొత్తం 4 అధ్యాయాలున్నాయి. వీటిలోని మొదటి రెండు అధ్యాయాలు ఆర్గనైజేషన్స్‌ అండ్‌ పాప్యులేషన్‌, ఎకోసిస్టమ్‌కి సంబంధించి వచ్చే ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకం ఆధారంగానే ఉన్నాయి. అందుకే  దీనికి ఇంటర్‌ పాఠ్యపుస్తకాన్ని చదవకుండా ఎన్‌సీఈఆర్‌టీకి మాత్రమే పరిమితం కావాలి.  మొక్కల, జంతువులకు సంబంధించిన ఉదాహరణలనూ, బొమ్మలనూ జాగ్రత్తగా చూసుకోవాలి. చివరి రెండు అధ్యాయాలు- బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్‌ ఇష్యూస్‌ల ప్రశ్నలు కొన్నిసార్లు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకం వెలుపల నుంచి ఉంటున్నాయి.  మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఏదైనా రిఫరెన్స్‌ పుస్తకాన్ని చదివితే మంచిది (ముఖ్యంగా ‘బయాలజీ టుడే’).

ప్లాంట్‌ ఫిజియాలజీ: 8-9 ప్రశ్నలు వస్తున్నాయి. దీనిలోని ఐదు చాప్టర్లలో ఉన్న జ్ఞాపకశక్తి ఆధారిత ప్రశ్నలు ప్లాంట్‌ గ్రోత్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ నుంచి..ముఖ్యంగా మొక్కల హార్మోనులకు సంబంధించి వస్తున్నాయి. ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్‌ ప్లాంట్స్‌ చాప్టర్‌ నుంచి నీటిరవాణా, నీటి సామర్థ్యం, డీపీడీలకు సంబంధించిన న్యూమరికల్‌   ప్రశ్నలనూ, కాన్సెప్టులకు సంబంధించిన విషయాలనూ జాగ్రత్తగా చూసుకోవాలి. మినరల్‌ న్యూట్రిషన్‌ చాప్టర్‌లోని ఎలిమెంట్స్‌, వాటి పాత్ర, వ్యాధులకు సంబంధించి తయారుచేసుకున్న చార్ట్‌ జాగ్రత్తగా చూసుకోండి. చివరగా కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ పాఠ్యాంశాల్లోని సైకిల్స్‌-మెకానిజమ్స్‌ చదివి బాగా సాధన చేయాలి.

సెల్‌ స్ట్రక్చర్స్‌ అండ్‌ ఫంక్షన్స్‌: దీని నుంచి 7-8 ప్రశ్నలు వస్తున్నాయి. కణవిభజన (సమవిభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశలలో జరిగే మార్పులు, కణచక్రం జాగ్రత్తగా చదవాలి. బయోమాలిక్యూల్స్‌ నుంచి కంటెంట్‌ సంబంధిత ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. సెల్‌ ఆర్గానెల్స్‌, వాటి విధులు, నిర్మాణానికి సంబంధించిన విషయాన్ని జాగ్రత్తగా చదవండి.

రిప్రొడక్షన్‌: దాదాపుగా 10 ప్రశ్నలు వస్తున్నాయి. దీనిలో 4 అధ్యాయాలున్నాయి. మొదటి రెండు అధ్యాయాలు వృక్షశాస్త్రానికి, చివరి రెండు జంతుశాస్త్రానికీ సంబంధించినవి. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా గమటోజెనిసిస్‌, డెవలప్‌మెంట్‌ నుంచి తులనాత్మకమైన ప్రశ్నలు అడుగుతారు. అలాగే రిప్రొడక్టివ్‌ హెల్త్‌  కూడా ముఖ్యమైన అంశమే.

మాలిక్యులర్‌ బేసిస్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటన్స్‌: దాదాపుగా 7 ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక ఆధారంగా చదువుతూ కొంత అదనపు సమాచారం నేర్చుకోవటం ద్వారా రెప్లికేషన్‌, ట్రాన్‌స్క్రిప్షన్‌, ట్రాన్స్‌లేషన్‌, రెగ్యులేషన్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ మెకానిజమ్స్‌పై ఎక్కువ పట్టు సాధించాలి.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకంలోని డయాగ్రమ్స్‌ను పరీక్షకు రెండు మూడు రోజుల ముందు మరోసారి చూసుకోవాలి. వాటి విడి భాగాలతో సహా గుర్తుపెట్టుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ  2018  ఎడిషన్లో బయాలజీకి సంబంధించి కొన్ని మార్పులు చేశారు. ఇది చిన్నవే అయినప్పటికీ వాటిని ఒకసారి చూసుకోవటం తప్పనిసరి.

 - జి. వెంకటేశ్వరరావు, శ్రీ గాయత్రి విద్యాసంస్థలు

 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.