close

తాజా వార్తలు

Published : 23/03/2019 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరుజన్మకైనా వరమిస్తావా?

మనసులో మాట

‘మనది సీరియస్‌ ప్రేమా? టైంపాస్‌ ప్రేమా?’ బిందు మాటతో గుండెల్లో రాయి పడ్డట్టైంది. మూడేళ్ల నుంచి ప్రాణంలా ప్రేమించుకుంటున్నాం. ఒకర్నొకరం చూసుకోకుండా ఘడియైనా ఉండలేం. అలాంటిది తనెందుకిలా అడిగిందో అర్థం కాలేదు. నో డౌట్‌. సీరియస్సే. నిరూపించుకోవడానికి ఏం చేయమంటావ్‌?’ ఒకింత కోపంగానే అన్నా. ‘అవసరం లేదులే. కానీ మనం పెళ్లితో ఒక్కటవ్వాలి. ముందు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి. అందుకోసం  ఈ ఫైనల్‌ పరీక్షలు పూర్తై జాబ్స్‌ కొట్టేవరకు మాట్లాడుకోకూడదు. కలుసుకోకూడదు. ఏమంటావ్‌?’ ఊహించని షరతుతో నా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. గాలి పీల్చకుండా, భోజనం చేయకుండా ఉండటం సాధ్యమా? బిందుకి దూరంగా ఉండటమంటే నాదీ అదే పరిస్థితి.  అదే మాటంటే ‘నథింగ్‌ కన్నా.. మనం లైఫ్‌లాంగ్‌ కలిసి ఉండటానికి ఈ ఎడబాటు తప్పదు’ నా నోరు మూసేసింది.
మా పరిచయం, ప్రేమ కాలేజీలోనే మొదలయ్యాయి. నాకు మొహమాటం. తనకు బిడియం. నాకు నోరు పెగలదు. తను నోరు విప్పదు. ఈ లక్షణాలే మమ్మల్ని దగ్గర చేశాయి. మొదట్లో చూపుల్తో ఊసులాడుకునేవాళ్లం. రోజులు గడిచినకొద్దీ మాటల్లోకి మారాం. ఏడాది గడిచేసరికి బంధం బలపడింది. రోజూ క్లాసులైపోగానే దగ్గర్లోని చెరువుగట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్లం. కాలేజీ కహానీలు.. బంధువుల మనస్తత్వాలు.. అమ్మానాన్నల ఆశలు.. అన్నీ మాకిష్టమైన టాపిక్‌లే. అదిగో అలాంటి ఓరోజే మామధ్య ఈ సంభాషణ. చివరికి మేం సెటిలయ్యేదాకా దూరంగా ఉండాలనుకున్నాం.
కౌంట్‌డౌన్‌ మొదలైంది. నా సహనానికి పరీక్ష కూడా. మాటలు, కలుసుకోవడాలు కట్‌ అయ్యాక మరింత గుర్తొచ్చేది. ఒక్కోసారి కన్నీళ్లొచ్చేవి. ‘మన జీవితాలు బాగుపడి భార్యాభర్తలుగా ఒక్కటవ్వాలంటే తప్పదుగా’ బిందు గోముగా చెప్పిన మాటలు గుర్తొచ్చి నన్ను నేనే ఓదార్చుకునేవాణ్ని.
ఫలితాలొచ్చాయి. తను క్లాస్‌ ఫస్టొచ్చిందని తెలిసింది. నేనూ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. మా లక్ష్యానికి ఒక అడుగు దగ్గరయ్యాం.  నా ఉద్యోగ వేట మొదలైంది. మొదట్లో వరుస వైఫల్యాలు వెక్కిరించేవి. అయినా నేను పట్టు వదల్లేదు. ఏడాది తర్వాత ఫలితం దక్కింది. నాకో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. జాబ్‌ వచ్చిందనే సంతోషం కన్నా బిందును కలవబోతున్నాననే ఆనందమే ఎక్కువనిపించింది. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందుకోగానే ఆశగా, ఆతృతగా తనకి ఫోన్‌ చేశా. అవతలివైపు స్విచ్ఛాఫ్‌. మనసులో కంగారు మొదలైంది. భయంభయంగానే వాళ్లూరు బస్సెక్కా. ‘వాళ్లెప్పుడో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు’ పక్కింటివాళ్ల సమాచారంతో గుండె బరువెక్కింది. బిందు స్నేహితుల సాయంతో తన కొత్త అడ్రస్‌ పట్టుకున్నా.
బిందును కలవబోతున్న క్షణం. కాళ్లు వణుకుతున్నాయి. గుండె దడ ఎక్కువైంది. బయట్నుంచే తలుపు కొట్టా. లోపల్నుంచి  ఒక చిన్న పాప ఏడుపు. కొన్ని క్షణాలయ్యాక ఒకామె చంటిపాపను చంకలో వేసుకొని తలుపు తెరిచింది. తను నా బిందునే. నా కాళ్ల కింద భూమి కంపించినట్టనిపించింది. కన్నీళ్లు జలజలా రాలాయి. నన్ను చూడగానే తన కంట్లోనూ కన్నీటి ఉప్పెన. ఇద్దరి మధ్యా కాసేపటిదాకా మౌనం. ‘చదువు పూర్తయ్యాక నాకిష్టం లేకుండానే పెళ్లి ఫిక్స్‌ చేశారు. ఎంత చెప్పినా విన్లేదు. నీకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్‌ కలవలేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. చేసేదేం లేక తలొంచుకొని తాళి కట్టించుకున్నా’ అంటూ ఏడ్చింది. అప్పుడేం చేయను? మేం చేసుకున్న బాసలు, పెట్టుకున్న లక్ష్యాలు చేరుకునేసరికే తను వేరొకరి సొంతమైంది. బరువెక్కిన హృదయంతో భారంగా నిష్క్రమించా. ఎప్పటికీ అందనంత దూరమైన నా ప్రియనేస్తం మరో జన్మలో అయినా నా సొంతం కావాలని కోరుకుంటున్నా.

- కిరణ్‌ (పేర్లు మార్చాం)

Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని