close

తాజా వార్తలు

అందరికీ విద్యుత్‌... ఆమె ఆకాంక్ష

చాలామంది యువత... విదేశాలకు వెళ్లాలనో కార్పొరేట్‌ ఉద్యోగాలు అందుకోవాలనో కలలు కంటుంటారు.  కానీ పట్నాకు చెందిన ఆకాన్ష మాత్రం దానికి భిన్నంగా తన కెరీర్‌ను మార్చుకుంది. విద్యార్థినిగా ఓ ప్రాజెక్ట్‌ను చేపట్టి... సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

ఆకాన్ష సింగ్‌ది బిహార్‌. ఆమె రాజస్థాన్‌లోని బనస్థలి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత ముంబయిలోని టాటా సోషల్‌ సైన్సెస్‌ నుంచి మాస్టర్స్‌ చదివింది. ఆమెది మధ్యతరగతి కుటుంబం. తండ్రి యూకో బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌. తల్లి గృహిణి. ఆమె పుట్టి పెరిగిందంతా పట్నాలోనే. సంగీతం, నాట్యంలోనూ ప్రవేశం  ఉంది. హాకీ క్రీడాకారిణి కూడా. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అని చిన్నప్పటి నుంచీ ఆమె ఆలోచించేది.
ఆ ఊరు వెళ్లాకే..
ఓసారి ప్రాజెక్ట్‌ పనిమీద మధ్యప్రదేశ్‌లోని జబువా అనే గిరిజన గ్రామానికి వెళ్లింది ఆకాన్ష. అక్కడే మొదటిసారి గ్రామీణ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుంది. కరెంటు లేక గ్రామంలో మౌలిక వసతులూ కరవయ్యాయని తెలుసుకుంది. ‘గ్రామాలు పశుసంపదకు నిలయాలు. కానీ మన దేశంలో బయోగ్యాస్‌, బయో ఫ్యూయెల్‌ విధానం ఎందుకు విఫలమైందో తెలుసుకోవాలి’ అని అనుకుంది. అనుకున్నట్లుగానే రాజస్థాన్‌, ఉదయపూర్‌లో దీనిపై పరిశోధన చేసింది. తరువాత సొంత రాష్ట్రంలో వెనకబడిన గ్రామాలను ఎంచుకుని బయోగ్యాస్‌, విద్యుత్‌ని అందించాలనుకుంది. అందుకోసం 2015లో ఆకాన్ష స్వయంభు పేరుతో సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా బయోశక్తిని సృష్టించి, కమ్యూనిటీ బయోగ్యాస్‌ ప్లాంట్‌ల ద్వారా గ్రామీణుల అవసరాలు తీర్చాలనుకుంది. వాటి నుంచి వచ్చే వ్యర్థాలతో సహజ ఎరువు, మందుల్ని తయారు చేసి పంట దిగుబడుల్ని పెంచాలనుకుంది. అందుకోసం బిహార్‌లోని సమష్టిపూర్‌ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్ని ఎంచుకుంది. అయితే ఇదేమీ మాటల్లో చెప్పినంత సులువుగా జరిగిపోలేదు. గ్రామస్థులను ఒప్పించడం చాలా కష్టమైంది. సుమారు ఆరునెలల సమయం పట్టింది.
ఆరునెలల సమయం...!
కేవలం అరవై రూపాయల నామమాత్రపు రుసుముతో ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేస్తానంది. బయోగ్యాస్‌ ద్వారా డీజిల్‌కి బదులుగా తమ పంపుసెట్లను వాడుకునే ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం ఇళ్లలోని కిచెన్‌ వేస్ట్‌, పశువుల పేడతో బయోగ్యాస్‌, బయో ఎనర్జీ కోసం పెద్ద పెద్ద ప్లాంట్‌లను నిర్మించింది. ఇక్రిశాట్‌ శాస్త్రవేత్త  సాయంతో వాటి నుంచి వచ్చిన వృథాను సహజ ఎరువుగా మార్చడం స్థానికులకు నేర్పించింది. అవసరానికి మించి ఉన్నవాటిని మార్కెటింగ్‌ ఎలా చేయాలో అలవాటు చేసింది. దీంతో పంట దిగుబడితోపాటు వారి ఆదాయమూ పెరిగింది. అక్కడ విజయవంతం అయ్యాక క్రమంగా మరో మూడు జిల్లాలోని మరికొన్ని గ్రామాల్లోనూ తన కార్యక్రమాలు మొదలుపెట్టింది. అలా మొత్తం నాలుగు జిల్లాల్లో వందలాది మంది రైతులు పూర్తిగా రసాయానిక ఎరువులు, మందుల వినియోగానికి స్వస్తి పలికారు. వారి జీవన స్థితిగతులు మారాయి. మొదట్లో విద్యుత్‌ను కేవలం ముప్ఫై ఇళ్లకు మాత్రమే ఇవ్వగలిగింది. క్రమంగా వాటి సామర్థ్యాన్ని పెంచి వందల ఇళ్లకు విద్యుత్తు సరఫరా అయ్యేలా చేసింది. ఈ బయో ఎనర్జీ ప్లాంటు ద్వారా  దాదాపు నాలుగు గంటల పాటు విద్యుత్తు సరఫరా చేయొచ్చు. వీరికి సింగపూర్‌ బ్యాంక్‌ అయిన డీబీఎస్‌ ప్రాథమికంగా నిధులు అందించింది. అలానే ప్రభుత్వంతో పాటు మరికొన్ని ఎన్‌జీవోలూ ఈ కార్యక్రమానికి సాయం చేశాయి. అలానే ఐఐటీ పట్నా ఆకాన్ష బృందానికి ఎంతో సాయం చేసింది. ‘‘ మేం చేసిన ఈ పని వల్ల మహిళలకు ఉపాధి పెరిగింది. ప్లాంట్‌ నుంచి వచ్చే వృథాతో కుండీలు, అగరుబత్తీలు, ధూప్‌స్టిక్స్‌ వంటివెన్నో తయారుచేస్తున్నారు.ఒకప్పుడు బిల్లు కట్టడానికి భయపడి విద్యుత్తునే వద్దనుకున్నవారంతా క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నారు.‘ఇది నా ఒక్కదాని విజయం కాదు. అందరి సాయంతోనే చేయగలిగా’ అని చెబుతుంది ఆకాన్ష.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.