close

తాజా వార్తలు

మొండిగా తయారవుతోంది...మార్చేదెలా?

నాకు ఇద్దరు పిల్లలు. మొదటి పాపకు  రెండున్నరేళ్లు. చిన్న పాపకు నాలుగు నెలలు. రెండో పాప పుట్టేవరకు పెద్దపాప చాలా ఉత్సాహంగా, బుద్ధిగా ఉండేది. ఇప్పుడు బాగా అల్లరి చేస్తోంది. ప్రతి విషయానికి ఏడుస్తోంది. నన్ను, చిన్నదాన్ని కొడుతోంది. పాపాయిని మేం ముద్దుచేయడం తనకు నచ్చడం లేదు. నేను చిన్నపాపకు పాలు పడుతున్నా ఊరుకోవడం లేదు. సరిగ్గా తినడంలేదు కూడా. ఫోన్‌ ఇమ్మంటూ గొడవ చేస్తోంది. తనని ఎలా మార్చాలి?

- ఓ సోదరి

 

మొదటి సంతానానికి అమ్మానాన్నలతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. మీ పెద్దపాపకు ఇంకా రెండున్నరేళ్లే. ఈ వయసు పిల్లలకు తల్లే అన్నీ చేస్తుంది. వాళ్లకి కూడా అమ్మపై అధికారం, ఆప్యాయత ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటికి కొత్తగా ఎవరు వచ్చినా తమకు పోటీ అనుకుంటారు. అమ్మ దృష్టి తన మీద నుంచి ఎక్కడ తప్పిపోతుందోనని ఆందోళన పడతారు. మీ పెద్దపాప విషయంలోనూ అదే జరిగింది. మీరు గర్భం దాల్చాక ఆమెకు తగినంత సమయం కేటాయించలేదనిపిస్తుంది. ఇప్పుడు రెండో పాప పుట్టాక ఆమె బాధ్యతలతోనే మీకు సమయం సరిపోతుంది. కానీ అదంతా పెద్దపాపకు అర్థం కాకపోవచ్చు. దాంతో చెల్లిని... తనకు పోటీగా భావిస్తోంది. తనతో గడపడం లేదని మీపై కోపం పెంచుకుంటోంది. అందుకే అరవడం, మిమ్మల్ని, చిన్నారిని కొట్టడం లాంటివి చేస్తుండొచ్చు. దీన్నే సిబ్లింగ్‌ రైవలరీ అంటారు. తనకి కూడా ఇంట్లోకి కొత్తగా వచ్చిన చిన్నపాప అంటే ఇష్టమే.  కానీ తను రావడం వల్లే అమ్మ తనని సరిగా చూడటం లేదనే బాధ ఆమెలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే మీ ధ్యాస తన వైపు తిప్పుకోవడానికి ఏడుస్తోంది. అల్లరి చేస్తోంది. ఇప్పుడు ఏం అడిగినా అమ్మ అన్నీ సమకూరుస్తుందని అనుకుంటుంది. అలా ఫోను అడుగుతోంది.
మరేం చేయాలి...
తనకు మీరు ఉన్నారనే ధైర్యాన్ని అందించండి. అవకాశం వచ్చినప్పుడల్లా తనతో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోండి. అలాగే పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయాలి. ‘నీకైతే గోరుముద్దలు పెడుతున్నా...  చెల్లి అన్నం తినలేదు కాబట్టి పాలు పడుతున్నా’ అంటూ ప్రేమగా చెప్పాలి. అలాగే ‘నువ్వంటే మాకు ఇష్టం. ఇకపై చెల్లికి అన్నీ నువ్వే నేర్పాలి. పెద్దదానివి...’ అని అంటూ బాధ్యత అప్పచెప్పాలి. అలాగే మిగతా కుటుంబ సభ్యులకు కూడా పెద్దపాప ఇంట్లో ఉన్నప్పుడు పాపాయిని అతిగా గారాబం చేయొద్దని చెప్పాలి. చిన్నపాప కూడా ఇంటి సభ్యురాలేనని ఆమెకు తరచూ వివరించడం, చుట్టాలు, స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు మీ పెద్దపాప చేసే మంచి పనులను చెప్పి మెచ్చుకోవడం వంటివి చేస్తుండాలి. అప్పుడు ఆమెకు క్రమంగా కోపం తగ్గుతుంది.   ఆత్మస్థైర్యం పెరిగి మరింత బాధ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. చిన్న పాప కోసం ఏదైనా తెచ్చినా కూడా దాన్ని పెద్దమ్మాయితో ఇప్పించాలి. అలాగే ఇతర పిల్లలతో ఆడుకునేలా కూడా ప్రోత్సహిస్తే తనలో మార్పు కనిపిస్తుంది. ఆమె దృష్టి చిన్నారిపై ఉండదు. అంతేకానీ కొట్టడం తిట్టడం సరికాదు. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఇదే. వాస్తవానికి రెండో సంతానాన్ని ప్లాన్‌ చేసుకునే తల్లిదండ్రులు ఆ వచ్చే బిడ్డ గురించి మొదటి సంతానానికి సానుకూలంగా చెబుతూ ఉండాలి. ‘కొన్నాళ్లకు మన ఇంట్లోకి ఓ తమ్ముడో/చెల్లాయో రావొచ్చు. నువ్వు తనకి అక్కవవుతావు. నువ్వు తనతో ఎంచక్కా ఆడుకోవచ్చు’ అని వివరిస్తే... ఇలాంటి సమస్యలు ఉండవు.

- మీ సందేహాలను ‌vasukid@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.