close

తాజా వార్తలు

‘తిరుమంగళం ఫార్ములా’ అంటే తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : 2009 తమిళనాడులోని తిరుమంగళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు.. పొద్దునే తమ ఇంటికి వచ్చిన దినపత్రికను చూస్తున్నారు... అందులో కవర్లున్నాయి. వీటిని తెరిచి చూడగా రూ.5 వేలు ఉన్నాయి... కేవలం ఒక్కరికే కాదు దాదాపు  అందరి ఇళ్లలో చేరిన పత్రికల్లో ఇలాంటి తాయిలామే చేరింది. ధనంతో పాటు ఇంటికి అవసరమైన వస్తువులను కూడా సరఫరా చేశారు.  ఓటర్లకు వినూత్నంగా డబ్బులను చేర్చడంలో తిరుమంగళం ఉప ఎన్నిక పేరు పొందడంతో ఓటర్లకు తెలివిగా డబ్బులిచ్చే విధానాన్ని తిరుమంగళం నమూనా అని అంటారు. 

అప్పుడు ఏం జరిగింది..

2009లో తమిళనాడులోని తిరుమంగళానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎండీఎంకే సభ్యుడు కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.  కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా డీఎంకే ఉంది. అలాగే రాష్ట్రంలోనూ డీఎంకే అధికారంలో ఉంది. ఈ స్థానాన్ని ఎలాగైన గెలవాలన్న అధికారపక్షం పట్టుదలతో కొత్త వ్యూహాన్ని అనుసరించింది. ఫలితంగా కోట్లాది రూపాయలను ఈ ఎన్నికల్లో రాజకీయపక్షాలు కుమ్మరించాయి. డీఎంకే నేత అళగిరి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో  ప్రచారం పోటాపోటీగా జరిగాయి. ఒక ఎన్నికలో ఓటర్లను ఎన్నివిధాలుగా మభ్యపెట్టడానికి వీలుందో అన్ని పద్ధతులను ఈ ఎన్నికల్లో రాజకీయపక్షాలు అమలు చేశాయి. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదోక నూతన వినూత్న పరిణామం. అభ్యర్థుల గుణగణాలను ప్రచారం చేయకుండా  డబ్బుతో పాటు పలు వస్తువులను ఓటర్లకు పంచడంపై విమర్శలు వచ్చినా రాజకీయపక్షాలు పట్టించుకోలేదు. చివరకు ఎన్నికల ఫలితాల్లో డీఎంకే అభ్యర్థి లతా అధియమన్‌ విజయం సాధించారు.  ఉప ఎన్నికల్లో డీఎంకే అధినాయకత్వంతో పాటు యావత్‌ రాష్ట్రమంత్రివర్గ సభ్యులు, కేంద్రంలోని డీఎంకే మంత్రులు పకడ్బందీగా ప్రచారం నిర్వహించారు. ఒక ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్రమంత్రులతో పాటు రాష్ట్ర మంత్రివర్గం పాల్గొనడం గమనార్హం. 

ధన ప్రభావాన్ని నిరోధించాలంటే..

ఎన్నికల్లో ధనప్రభావాన్ని నిరోధించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్‌చేస్తున్నాయి. అయితే రాజకీయనాయకులు ఇందుకు సంబంధించి కొత్త ఎత్తులు వేస్తుండటంతో ధనప్రభావాన్ని నిరోధించడం కష్టతరంగా మారుతోంది. దేశంలో పలువురి వద్ద పోగుబడిన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు ఎన్నికలు ఉపయోగపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. గనులు, ఇసుక అక్రమరవాణా, రియల్‌ఎస్టేట్‌, కాంట్రాక్టులు... తదితర పద్ధతుల ద్వారా నేతలకు వందలాది కోట్ల ప్రజాధనం చేరుతోంది. దేశంలో నల్లధన నియంత్రణకు తీసుకున్న చర్యలు అంతంత ఫలితాలే ఇస్తున్నాయి. ఓటర్లను చైతన్యవంతం చేయడం, బ్యాంక్‌లనుంచి ఎవరు ఎక్కువ ధనాన్ని  డ్రా చేస్తున్నారు, ఎందుకోసం వినియోగిస్తున్నారు.. అన్న అంశాలపై  నిఘా యంత్రాంగం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు నిజాయితీ కలిగిన అధికార వ్యవస్థ ఉంటే ధన ప్రభావాన్ని వీలయినంత మేరకు నిరోధించే అవకాశం కలుగుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.