Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 75480
      [news_title_telugu_html] => 

ఒలి... తేనెటీగల నెచ్చెలి

[news_title_telugu] => ఒలి... తేనెటీగల నెచ్చెలి [news_title_english] => [news_short_description] => పిల్లలు బొమ్మలతో లేదా పెంపుడు జంతువులతో ఆడుకుంటారు. ఆమే మాత్రం తేనెటీగలతో ఆడుకుంటూ పెరిగింది. వాటిని పెంచింది.  వాటిపై ఉన్న ఇష్టం... పిచ్చి.... ఆమెకు గుర్తింపునిచ్చాయి. సమస్యల్నీ తెచ్చి పెట్టాయి.  స్వామినాథన్‌ ఫౌండేషన్‌తో కలిసి తేనెటీగలపై పరిశోధన చేసింది. పీజీ విద్యార్థులకు వాటి పెంపకంలో తరగతులు తీసుకుంది. అయితే... [news_tags_keywords] => women empowerment, Honey bee, Swami nadhan Foundation, Protection [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-31 00:25:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఒలి... తేనెటీగల నెచ్చెలి - EENADU
close

తాజా వార్తలు

ఒలి... తేనెటీగల నెచ్చెలి

పిల్లలు బొమ్మలతో లేదా పెంపుడు జంతువులతో ఆడుకుంటారు. ఆమే మాత్రం తేనెటీగలతో ఆడుకుంటూ పెరిగింది. వాటిని పెంచింది.  వాటిపై ఉన్న ఇష్టం... పిచ్చి.... ఆమెకు గుర్తింపునిచ్చాయి. సమస్యల్నీ తెచ్చి పెట్టాయి.  స్వామినాథన్‌ ఫౌండేషన్‌తో కలిసి తేనెటీగలపై పరిశోధన చేసింది. పీజీ విద్యార్థులకు వాటి పెంపకంలో తరగతులు తీసుకుంది. అయితే... ఈ కారణంతోనే ఆమెను బడికి రానివ్వలేదు. బెదిరింపులూ ఎదుర్కొంది. ఆ తరువాతా.... హైదరాబాద్‌లో చదివే అవకాశాన్ని అందుకుంది. అదెలాగో...ఒలి అమన్‌ జోధా మాటల్లోనే చదువుదాం రండి.

బడికి రానివ్వలేదని ఏడుస్తూ కూర్చోలేదు నేను. పోరాడా. చివరకు మా జిల్లా కలెక్టర్‌ సహాయంతో హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో చదువుకునే అవకాశం అందుకున్నా. మాది కేరళ వాయనాడ్‌లోని అంబలవాయల్‌. మా ముత్తాతలు కూడా తేనెటీగల పెంపకం, తేనె సేకరణలో ఉండేవారు. మా అమ్మానాన్నా అదే చేశారు. అమ్మ కడుపుతో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురైందట. మా తాతగారు తేనెటీగలను అమ్మ గర్భంపై రోజంతా పరిచి ఉంచారట. అమ్మ కోలుకుందట. అదో ప్రాచీన వైద్యం. అలా నాకు వాటితో అప్పుడే అనుబంధం ఏర్పడిందనుకుంటా. నాకు రెండేళ్లున్నప్పుడే వాటితో ఆడుకునేదాన్ని. అయితే నేను పుట్టిన రెండేళ్లలోపే నాన్న మమ్మల్ని వదిలేసి మరో పెళ్లి చేసుకోవడంతో అమ్మ నన్ను పెంచేందుకు హోటల్‌లో పనిచేసింది. పాచి పనికి వెళ్లేది. వ్యవసాయ కూలీగానూ చేసింది. నాకేమో తేనెటీగలే ప్రపంచం. మూడు, నాలుగేళ్లు వచ్చేసరికే వాటిని బాక్సులో పెంచడం మొదలుపెట్టా. నా పేరుకు ఫిలిఫ్పైన్‌ భాషలో అర్థం తేనెటీగేనట.
స్వామినాథన్‌ ఫౌండేషన్‌తో...
అమ్మ కష్టాలు చూస్తూ పెరిగిన నేను... బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేసి అమ్మను సుఖపెట్టాలనుకున్నా. కాస్త పెద్దయ్యాక వాయనాడ్‌లోని ప్రభుత్వపాఠశాలలో చేర్చారు. మూడో తరగతి వచ్చేసరికి... తోటి విద్యార్థులకు తేనెటీగల పెంపకం గురించి చెప్పేదాన్ని. ఎనిమిదో తరగతికి నా దగ్గర 2,400 తేనె పెట్టెలు ఉన్నాయి. అన్నీ నేను పెంచినవే. చాలామంది తేనె ఇష్టపడతారు కానీ... వాటిని కాదు. అవి కుడితే చనిపోతామనుకుంటారు. కానీ వాటిని ఏమీ చేయనంతవరకూ అవి మనకు హాని చేయవు. అది నిరూపించేందుకు వాటిని ముఖంపై పెట్టుకునేదాన్ని. తేనెటీగలపై నాకున్న ఆసక్తిని తెలిసి స్వామినాథన్‌ ఫౌండేషన్‌ అధికారులు నాతో మాట్లాడారు. తమకు తేనెటీగల గురించి చెప్పమన్నారు. అలా పన్నెండేళ్లకే వాయనాడ్‌లోని స్వామినాథన్‌ ఫౌండేషన్‌కు తేనెటీగలు, తేనె... వాటికి సంబంధించిన వివరాలు, వనరులు అందించేదాన్ని. నాకేమో వాళ్లు ఇతర తేనెటీగల రకాలపై పరిశోధన చేసే అవకాశం ఇచ్చారు. కొన్నిసార్లు అక్కడి ప్రముఖులతో కలిసి చర్చల్లో పాల్గొనేదాన్ని. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు కూడా వెళ్లా. ఆ వేదికలపై నా పరిశోధనా వివరాలు చెప్పేదాన్ని. తేనెలో ఏ పదార్థం కలిపితే ఏ వ్యాధికి మందులా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నించేదాన్ని.
* యాసిడ్‌ పోస్తామన్నారు...
ఎనిమిదో తరగతి వరకూ సాఫీగా సాగింది. పరిశోధనలో పడి... బడికి సరిగ్గా వెళ్లకపోయినా మంచి మార్కులే వచ్చేవి. ఏమయ్యిందో ఏమో కొందరు టీచర్లు నన్ను స్కూలుకు రావొద్దనేశారు ఓ రోజు. నేను పెంచుకున్న తేనెటీగల పెట్టెల్లో కొన్ని కాల్చేశారు కూడా. అవేవీ పట్టించుకోకుండా బడికి వెళ్తే... ఓ తరగతి గదిలో బంధించేందుకు ప్రయత్నించారు. వాళ్ల చెయ్యి కొరికి ఇంటికి వెళ్లిపోయా. నేను బడికి వస్తే అమ్మ ముఖంపై యాసిడ్‌ పోస్తామని బెదిరిస్తూ ఫోన్లు వచ్చేవి. ఎందుకు బడికి రాకూడదని అడిగితే నాకు మతి భ్రమించిందనే ముద్ర వేశారు. తోటి విద్యార్థులను నాతో మాట్లాడనిచ్చేవారు కాదు. చివరకు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశా. స్వామినాథన్‌ ఫౌండేషన్‌వాళ్లకీ చెప్పా. నన్ను, నా తేనెటీగలను హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టా. విచారిస్తే... టీచర్లు చివరకు హాజరీ తక్కువగా ఉందని చూపించారు. నిజాలు తెలిశాక ఆ ఉపాధ్యాయులను అక్కడి నుంచి బదిలీ చేశారు. చివరకు మా జిల్లా కలెక్టర్‌   సాయంతో హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో చదివే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ తొమ్మిదో తరగతిలో చేరబోతున్నా. నేను గతంలో చాలాసార్లు హైదరాబాద్‌ వచ్చా. ‘ది నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌, ఎపికల్చర్‌ విభాగంలోని పీజీ విద్యార్థులకు తేనెటీగల గురించి తరగతులు తీసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఓ వైపు చదువుకుంటూ, వాటిపై మరిన్ని పరిశోధనలు చేయబోతున్నా.
* అందుకే హైదరాబాద్‌కి...
హైదరాబాద్‌కు నేను కేవలం చదువుకోవడానికే కాదు... పనిచేసేందుకు వస్తున్నా. నాతోపాటు తేనెటీగల్ని కూడా వెంట తెచ్చుకుంటున్నా. ఇక్కడ ది నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌, ఎపికల్చర్‌ విభాగంలోని పీజీ విద్యార్థులకు తేనెలు, తేనెటీగల్లో రకాలు.. వాటికి సంబంధించిన ఔషధాల తయారీపై తరగతులు తీసుకున్నా. నా ప్రయత్నానికి జాతీయస్థాయిలో అవార్డులు కూడా వచ్చాయి. అమ్మ తరువాత నాకు అత్యంత ఆప్తులంటే...  అక్కడ అధికారి బాలకృష్ణన్‌, పరిశోధకురాలు, రచయిత్రి సీఎస్‌ చంద్రిక.

* 64 రకాల ఉత్పత్తులు...
మా తాతలు తమ కాలంలో వరద భూమి అనే సంస్థను ప్రారంభించి నష్టాలు రావడంతో మూసేశారు. నాకు పదేళ్లున్నప్పుడే అమ్మ సాయంతో దాన్ని మళ్లీ ప్రారంభించా. సహజసిద్ధమైన తేనె, పట్టుతేనె రకాల్ని దానిద్వారా అమ్ముతున్నాం. అలాగే తేనె కలిపిన ఖర్జూరం, ఇతర మిశ్రమాలు విక్రయిస్తున్నాం. దాదాపు 64 రకాల ఉత్పత్తులు అందిస్తున్నాం. ఇప్పుడు మా అమ్మకు ఇదే ఆదాయమార్గం.
* ఆత్మరక్షణలో శిక్షణ...
మాకు తరతరాలుగా మార్షల్‌ఆర్ట్స్‌ నేర్చుకునే అలవాటు ఉంది. నేను అమ్మ నుంచి కత్తి యుద్ధం, కరాటే నేర్చుకున్నా. యోగా కూడా చేస్తా. మార్షల్‌ఆర్ట్స్‌ను వాయనాడ్‌ చుట్టుపక్కల ఉండే గిరిజన బాలికలకు నేర్పించా. తేనెటీగల బొమ్మల్ని చేతులపై టాటూలుగా వేయించుకున్నా.
* మారిపోయా...
జుట్టును ముడేసి కొప్పులా పెట్టుకుంటే కష్టాలు తీరతాయని ఎవరో చెప్పారు. అందుకే అప్పటినుంచీ కొప్పులా చుట్టుకుంటున్నా. రుద్రాక్షలతో మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిసి... వాటిని వేసుకుంటున్నా. లుంగీ, కుర్తీకే ప్రాధాన్యం ఇస్తా. దీనివల్ల నాకంటూ ఓ గుర్తింపు ఉంటుందని నమ్ముతా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.