close

తాజా వార్తలు

ఆయనకు ప్రేమతో...

వారిద్దరిదీ పాతికేళ్ల వివాహ బంధం. ఈ అనుబంధంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను పెనవేసుకున్నారు.  కారణాలేవైనా ఇప్పుడు... ఆ జంట విడిపోయింది. వారే అమెజాన్‌ దిగ్గజం జెఫ్‌ బెజోస్‌, అతని సహచరి మెకంజీ. కలిసి ఉన్నప్పుడే కాదు...విడిపోయాక కూడా తన భర్తపై ఉన్న ప్రేమను చాటుకుంది మెకంజీ.  విడాకుల అనంతరం వచ్చిన ఆస్తి హక్కుల్లో సింహభాగాన్ని భర్తకే తృణప్రాయంగా వదిలేసింది. అందులోనే తనకు ఆనందం ఉందని చెప్పకనే చెప్పింది. అయినా ఆమె ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో మూడో మహిళగా... అపర కుబేరుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా మెకంజీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా!

ప్రపంచంలో అత్యంత ధనిక జంట జెఫ్‌ బెజోస్‌, మెకంజీ బెజోస్‌ విడాకుల ప్రక్రియ ఏప్రిల్‌ 4 2019న ముగిసింది. అమెజాన్‌ కంపెనీలోని ఈ దంపతుల వాటాలో జెఫ్‌కు 75శాతం, మెకంజీకి 25శాతంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పాతికశాతం వాటాతోనే ఆమె ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళల్లో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా గుర్తింపూ తెచ్చుకుంది. ప్రపంచానికి ఇది మాత్రమే తెలుసు. కానీ మెకెంజీ మాజీ భర్తకోసం డెబ్భైఅయిదు శాతం వాటాను తృణప్రాయంగా వదిలేసుకుంది. అంతేనా... అమెజాన్‌లో తన ఓటింగ్‌ నియంత్రణ హక్కులను కూడా పూర్తిగా భర్తకే అప్పగించేసింది. వాళ్ల ఇతర సంస్థలు బ్లూ ఆరిజిన్‌, ది వాషింగ్టన్‌ పోస్ట్‌ల నుంచి వచ్చే ఇంట్రెస్ట్‌లు కూడా భర్తకే అని తెల్చేసింది. ప్రేమకంటే తనకు సంపద ఏ మాత్రం ఎక్కువ కాదని నిరూపించుకుంది. ఆమె ఈ స్థాయి వరకూ రావడం వెనుక ఆసక్తికరమైన అంశాలెన్నో ఉన్నాయి.

జెఫ్‌తో పరిచయం ఇలా...
మెకంజీ ఏప్రిల్‌ 7, 1970లో అమెరికాలోని క్యాలిఫోర్నియాలో పుట్టింది. తండ్రి ఆర్థిక నిపుణుడు. తల్లి గృహిణి. ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ సంపాదించింది. చదువుతున్నప్పుడే రచనలపై ఆసక్తి పెంచుకుంది. అందుకే విద్యార్థినిగా ఉన్నప్పుడే ప్రముఖ టోని మోరిసన్‌ దగ్గర రచనా నైపుణ్యాలు నేర్చుకుంది. సృజనాత్మక రచనలో మెకంజీ లాంటి విద్యార్థిని ఎప్పుడూ చూడలేదని ఆయన తరుచూ చెప్పేవారు. ఆ రచయిత మాటల్ని నిజం చేస్తూ... ‘ది టెస్టింగ్‌ ఆఫ్‌ లూథర్‌ ఆల్‌బ్రైట్‌’, ట్రాప్స్‌ పేరుతో రెండు నవలలు రాసింది. మొదటిదానికైతే అమెరికన్‌ బుక్‌ అవార్డు అందుకుంది. మెకంజీకి జెఫ్‌తో 1992లో న్యూయార్క్‌లోని డీఈ షాలో పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, చాలా తక్కువ సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆ సంస్థకు ఇంటర్య్వూకి వెళ్లినప్పుడు మెకంజీని జెఫ్‌ ఇంటర్య్వూ చేశాడు. ఆ విషయాన్ని తరువాత జెఫ్‌ చాలా చోట్ల పేర్కొన్నాడు కూడా. ‘రెజ్యూమ్‌లో ఆమె అర్హతలు, ఇతర నైపుణ్యాలు చదివాకే మెకంజీని కలిశా. ఆమె చాలా ప్రతిభావంతురాలు. అలాంటి స్త్రీ నా భాగస్వామి అయినందుకు గర్విస్తున్నా...’ అని. ఇప్పుడు విడాకులు అయిపోయాక కూడా ‘మెకంజీ అందించిన సహకారం మరవలేనిది. ఆమె ఓ అద్భుతమైన భాగస్వామి. మంచి తల్లి. ఎప్పటిలానే ఆమె నుంచి భవిష్యత్తులో మరెన్నో విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటా...’ అంటూ ట్వీట్‌ చేశాడు. అదీ మెకంజీ ప్రత్యేకత.

అమెజాన్‌ ఏర్పాటులో...
వివాహం జరిగిన కొన్నాళ్లకే జెఫ్‌ మెకంజీతో తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న అమెజాన్‌ అనే ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌ ఆలోచనను పంచుకున్నాడు. ‘నేను వ్యాపారవేత్తను కాదు. వ్యాపార మెలకువలు కూడా నాకు తెలియవు. జెఫ్‌ తన ఆలోచనను నాతో పంచుకుంటున్నప్పుడు అతనికున్న ఉత్సాహం, ప్యాషన్‌ నేను గమనించా. అందుకే నా వంతుగా ప్రోత్సహించాలనుకున్నా...’ అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది మెకంజీ. అలా ఈ జంట న్యూయార్క్‌ నగరానికి వచ్చేసింది. జెఫ్‌ అమెజాన్‌ ప్రారంభించాక అందులో అకౌంటెంట్‌గా చేస్తూనే సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. అనుక్షణం భర్తకు అండగా నిలిచింది. ఇంకా సూటిగా చెప్పాలంటే అమెజాన్‌ తొలి ఉద్యోగుల్లో ఆమె ఒకరు. అలా అతనికి సహకరిస్తూనే... మరో పక్క కుటుంబ బాధ్యతలు కూడా సమర్థంగా నిర్వర్తించింది. వాళ్లకు నలుగురు పిల్లలు. ముగ్గురు అబ్బాయిలు, ఒకమ్మాయి. చైనానుంచి ఓ పాపను దత్తత చేసుకున్నామని గర్వంగా చెబుతుందీ జంట.
విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నాక మెకంజీ, జెఫ్‌ ఇంకా ఎక్కువగా ప్రేమించుకున్నారట. అంతేకాదు... విడిపోతే ఎలా ఉంటుందోనని తెలుసుకునేందుకు ట్రయల్స్‌ కూడా వేసుకున్నారట

అందుకే విడిపోయారు... 

ఓ టీవీ నటితో జెఫ్‌కి ఉన్న సంబంధాన్ని కొన్నాళ్ల క్రితం తెలుసుకుంది మెకంజీ. ఆ తరువాత ఇద్దరిమధ్యా సరిదిద్దుకోలేని మనస్పర్థలు మొదలయ్యాయి. చివరకు ఇప్పుడు విడిపోయారు. ఆ తరువాతే భర్తకు వ్యాపారాల్లో సింహభాగాన్నే వదిలేసింది. అలా ఇస్తున్నందుకు ఏ మాత్రం బాధలేదని, ప్రేమించిన వ్యక్తికోసం ఆనందంగా వదిలేస్తున్నానని పేర్కొంది. ఇకపై ఆ జంట కేవలం స్నేహితులుగా, పిల్లలకు తల్లిదండ్రులుగా మాత్రమే వ్యవహరిస్తారు.

సామాజిక సేవలోనూ...
అమెజాన్‌ ఎదుగుదలతోనే మెకంజీ ప్రయాణం ఆగిపోలేదు. చుట్టూ ఉన్నవారికి తన మానవతా దృక్పథాన్ని చాటడంలో మెకంజీ ఒకడుగు ముందే ఉంటుంది. 2014లో బైస్టాండర్‌ రివల్యూషన్‌ అనే సంస్థను ప్రారంభించి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది. దీని ప్రధానోద్దేశం సాటివారిలో జాలి, సహాయం చేసే గుణం పెంచడం, ఇతరుల సమస్యల్ని పంచుకోవడం. ఇందులో నిపుణులు కూడా ఉంటారు. వన్‌డే ఫండ్‌ పేరిట ఛారిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. నిరాశ్రయ కుటుంబాలకు సాయం చేయడం, లాభాపేక్ష లేని ప్రీ స్కూల్స్‌ ఏర్పాటుచేసి, పేద పిల్లలకు చదువు చెప్పడం దీని ప్రధానోద్దేశం. దీని నిర్వహణకు భారీమొత్తాన్నే కేటాయించింది. అలాగే హోం స్కూలింగ్‌పైనా ఎన్నో ప్రయోగాలు చేసింది. చుట్టుపక్కల పిల్లలకోసం కొన్ని క్లబ్‌లు ఏర్పాటు చేసింది. క్రీడలూ నిర్వహించేది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.