close

తాజా వార్తలు

కాన్పు బరువు తగ్గాలంటే!

గర్భం దాల్చాక చాలామంది ఇచ్చే సూచన... తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండాలంటే బాగా తినాలి అని. తీరా ప్రసవం అయ్యాక... అధిక  బరువు సమస్య ఇబ్బందిపెడుతుంది. ఇందుకు ప్రముఖ మహిళలూ మినహాయింపు కాదు.  తాజాగా ఒకప్పటి నటి సమీరారెడ్డి... గర్భం దాల్చి తాను పెరిగిన బరువు... తగ్గిన వైనాన్ని ఇన్‌స్టాలో వివరించింది. అసలు ప్రసవానంతర బరువు నుంచి బయటపడాలంటే... ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సమీరారెడ్డి... ఒకప్పుడు తీరైన శరీరాకృతితో ఆకట్టుకునే రూపంతో వెండితెర మీద మెరిసింది. పెళ్లయి ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఒకేసారి 102 కేజీలు పెరిగిపోయింది. దానికితోడు జుట్టు సమస్య. నలుగురిలోకీ వెళ్లలేక... ఆత్మన్యూనతతో చాలా రోజులు నాలుగ్గోడలు దాటి బయటకు రాలేదట. ఎప్పుడయినా, ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి వస్తే అంతా... తను నటి సమీరానే కదా.. ఇలా అయిపోయిందేమిటీ అని గుసగుసలాడుకునేవారట. ఇలాంటి పరిస్థితుల్లో రెండేళ్లు సమయం పెట్టుకుందామె.  యోగా మొదలు, పిలాటస్‌, వెయిట్‌ స్ట్రెంగ్తనింగ్‌ వ్యాయామాలు చేసి సన్నబడింది. ఇప్పుడు మళ్లీ రెండోసారి గర్భం దాల్చింది. ఈసారి సులువుగా సన్నబడతానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. ఒక్క సమీరానే కాదు... ప్రసవం అయిన వారిలో దాదాపు తొంభైశాతం మంది మహిళల పరిస్థితి ఇదే. అసలు గర్భం దాల్చాక బరువెందుకు పెరుగుతాం అంటే...

హార్మోన్ల మార్పులు మొదలు...

గర్భం దాల్చడం వల్ల శారీరకంగా హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దానికితోడు మూడ్‌స్వింగ్స్‌ ఉంటాయి. మనసు రకరకాల రుచుల్ని కోరుకుంటుంది. దానికితోడు కొన్నిసార్లు కొన్ని పదార్థాలు నచ్చి... తెలియకుండానే ఎక్కువగా లాగించేసే అవకాశాలు ఉంటాయి. అలా పండ్లు, పోషకాహారంతోపాటు మిగిలిన పదార్థాలు కూడా చేరడం వల్ల అవసరానికి మించి బరువు పెరుగుతారు. సాధారణంగా అయితే వైద్యులు పోషకాహారం తీసుకోవాలి... ఒకరికోసమే తినాలని అంటారు కానీ... తెలిసినవారు, కుటుంబసభ్యులు ఇద్దరి కోసం తినాలని పదేపదే చెబుతారు. దాంతో మితిమీరి తినేవారు ఉంటారు. ఇక, విశ్రాంతి పేరుతో కదలిక లేకపోవడం మరో కారణం. అదే అధికబరువుకు దారి తీస్తుంది. ప్రసవం తరువాత తగ్గడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే... ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవడం, ఆహారపరంగా సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, పాపాయి సంరక్షణలో పడి వ్యాయామం మొదలు నిద్ర, ఆహారం.. అన్నింటినీ నిర్లక్ష్యం చేయడం... ఇలా చాలా కారణాలే ఉంటాయి. దాంతో ఇంకా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువవుతాయి. మరెలా అంటే... పరిష్కారం మీ చేతుల్లోనే ఉందంటారు వైద్యులు.

ఆహారం ఒక్కరికోసమే...

గర్భం దాల్చినప్పటినుంచీ.. సమతుల పోషకాహారాన్ని తీసుకోవాలి. దానివల్ల బిడ్డకు అన్నిరకాల పోషకాలు అందుతాయి. అదనంగా కొన్ని కెలొరీలు అవసరమే కానీ... ఇద్దరికోసం తినాలనేం లేదు. ఒక గర్భిణికి రోజుకు అదనంగా 300 కెలొరీలు మాత్రమే సరిపోతాయి. ఒకవేళ బరువు పెరగాల్సి వస్తే... ఎంతవరకూ అనేది ముందే వైద్యులతో చర్చించాలి. రోజులో కొద్దికొద్దిగా ఐదారుసార్లు తినాలి. నట్స్‌, పెరుగు, పండ్లు, కూరగాయముక్కలు వంటివి ఎంచుకోవాలి. తీపి, ఉప్పుశాతం ఉన్న పదార్థాలు చాలామటుకూ తగ్గించాలి. పండ్లు తీసుకోవాలే తప్ప పండ్లరసాలు కాదు. దానివల్ల పీచు అందుతుంది. కొవ్వు పదార్థాలు కూడా మితంగా ఎంచుకోవాలి. ఇవన్నీ బరువును చాలామటుకూ అదుపులో ఉంచేలా చేస్తాయి. ఇక, ఏ అనారోగ్య సమస్య లేదనుకుంటే... వీలైనంత చురుగ్గా ఉండాలి. ఇంటిపనులు చేయడం, రోజూ కాసేపు నడవడం వంటివీ తప్పనిసరి. వైద్యుల సలహాతో తొమ్మిదో నెల  వరకూ యోగా మొదలు చిన్నచిన్న వ్యాయామాలు కూడా చేయొచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తొమ్మిది నెలల సమయంలో పెరిగే బరువు కొంత  వరకూ అదుపులో ఉంటుందని చెబుతారు డాక్టర్‌ అనగాని మంజుల.

ప్రముఖులు తీసుకున్న జాగ్రత్తలివే...

సానియా మీర్జా... గర్భం దాల్చినప్పుడు 89 కేజీలకు చేరుకుంది. ప్రసవానంతరం కేవలం ఐదు నెలల్లోనే 22 కేజీల బరువు తగ్గింది. అలాగని క్రాష్‌డైట్‌ మాత్రం అనుసరించి కాదు. తొమ్మిదినెలల సమయంలో నచ్చిన పదార్థాలన్నీ తినేసిన సానియా ప్రసవం తరువాత ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించింది. రోజూ నాలుగు   గంటలు జిమ్‌లో కఠోర వ్యాయామాలు చేసింది. వంద నిమిషాలు కార్డియో... గంటసేపు కిక్‌బాక్సింగ్‌, పిలాటస్‌, యోగా చేసింది. ఒకప్పటిలానే తీరైన ఆకృతికి వచ్చేసింది. త్వరలో ఆడేందుకు సిద్ధమవుతోంది.

కరీనా కపూర్‌ఖాన్‌... జీరోసైజ్‌కి ఉదాహరణగా నిలిచిన బాలీవుడ్‌ తార. అయితే గర్భం దాల్చినప్పుడు అందరు అమ్మాయిల్లానే కరీనా కూడా బరువు పెరిగింది. ప్రసవానంతరం... చాలా తక్కువ సమయంలోనే మళ్లీ మునుపటి ఆకృతికి వచ్చేసింది. దానికి కారణం బరువు తగ్గేందుకు నిర్దేశిత లక్ష్యాలు పెట్టుకుంది. కష్టపడేందుకు సిద్ధపడింది. నిపుణుల పర్యవేక్షణలో యోగా, పిలాటస్‌ చేసింది. అన్ని రకాల పదార్థాలు తీసుకుంది కానీ.. మితంగానే. జంక్‌ఫుడ్‌ని పూర్తిగా మానేసింది. కేవలం బరువు తగ్గడంపైనే కాదు... కండరాలు, ఎముక దృఢత్వంపైనా దృష్టిపెట్టింది. కరీనా సాధారణంగా రోజూ ఒక పండుతో తన దినచర్యను మొదలుపెడుతుంది. బరువు తగ్గేందుకు క్రమశిక్షణ అవసరంలేదు కానీ... లక్ష్యం పెట్టుకుని కష్టపడితే తగ్గడం సులువేనని చెబుతుంది. ఇవన్నీ కలిపే ఆమెను బరువు తగ్గేలా చేశాయి.

ప్రసవానంతరం ఏం చేయాలంటే...

సన్నబడటం కష్టం  అనుకుంటారు కానీ... ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు పొందడం సులువే. ఎలాగంటే...
సులువుగా సన్నబడాలనే ఉద్దేశంతో క్రాష్‌డైట్ల జోలికి పోకూడదు. వాటివల్ల సులువుగా బరువు తగ్గుతారు కానీ... ప్రసవానంతరం పాపాయికి పాలు పడతారు కాబట్టి కొత్తగా తల్లులైన వారికి కొన్ని పోషకాలు అవసరం అవుతాయి. క్రాష్‌డైట్ల వల్ల ఇవేవీ అందవు. బాలింతగా ఉన్నప్పుడు 550 కెలొరీలు అదనంగా తీసుకుంటే చాలు. నెలలు గడిచేకొద్దీ క్రమంగా తగ్గించుకోవచ్చు.
* పాపాయికి పాలు పట్టడం వల్ల కూడా బరువు అదుపులో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి కచ్చితంగా ఆరునెలలు పాలు పట్టడం మంచిది.
* పీచుశాతం ఎక్కవగా ఉన్న పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దానివల్ల కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లు ఉంటుంది. అన్నిరకాల పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. మేలుచేసే మాంసకృత్తులు తీసుకోవడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. కొంత    వరకూ బరువూ తగ్గుతారు. జీవక్రియల పనితీరు కూడా బాగుంటుంది. గుడ్లు, నట్స్‌, చిక్కుడుజాతి గింజలు వంటివి ఎంచుకోవాలి.
* చక్కెర, ఉప్పుశాతం ఉన్న పదార్థాలు, ప్రాసెస్‌ చేసిన పదార్థాలను దాదాపుగా మానేయాలి. వాటిల్లో కెలొరీలు ఎక్కువ, పోషకాలు తక్కువ. పైగా అవి భవిష్యత్తులో అనారోగ్యాలకు దారితీస్తాయి.
* సహజ కాన్పు అయితే రెండు మూడు రోజులు లేదా కనీసం వారం తరువాత వ్యాయామం మొదలుపెట్టొచ్చు. అయితే సిజేరియన్‌ అయితే ఆరువారాల తరువాత వైద్యులు పరీక్షించి, ఏ ఇబ్బందీ లేదని చెబితే మెల్లగా వ్యాయామాలు చేయాలి. నడక, పరుగు, సైకిలుతొక్కడం... ఇలా ఏదో ఒకటి రోజూ అరగంట చేయాలి. పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే... ఆ భాగం తగ్గుతుంది.
* మంచినీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సాధారణంగా పాపాయి సంరక్షణలో తల్లికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు. కానీ ఎన్ని పనులున్నా కంటినిండా నిద్రపోయేలా చూసుకోవాలి.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.