close

తాజా వార్తలు

కప్పు తెచ్చిన.. పోగొట్టిన క్యాచ్‌

వన్డే ప్రపంచకప్‌ ఇంకో 19 రోజుల్లో..


రీప్లే

‘క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయి’’ అని క్రికెట్లో ఓ నానుడి. అంటే ఒక క్యాచ్‌ పడితే మ్యాచ్‌ గెలవడమే కాదు.. ఒక క్యాచ్‌ చేజారితే మ్యాచ్‌ పోతుంది కూడా! క్రికెట్‌ చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఐతే ఒక క్యాచ్‌ అందుకోవడం వల్ల ఓ జట్టు ప్రపంచకప్‌ గెలిస్తే..? ఓ క్యాచ్‌ వదిలేయడం వల్ల మరో జట్టు ప్రపంచకప్‌నే కోల్పోతే? నమ్మశక్యంగా అనిపించట్లేదా? ఇది నిజం. ప్రపంచకప్‌ చరిత్రలో నిలిచిపోయిన ఈ రెండు క్యాచ్‌ల కథేంటో చూద్దాం పదండి.


 

ది 1983 ప్రపంచకప్‌. అందరి ఫేవరెట్‌ వెస్టిండీస్‌ మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడటం ఖాయమన్న అంచనాతో ఉన్నారంతా! పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగుపెట్టిన భారత జట్టు అనూహ్య విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 183 పరుగులకే ఆలౌటవ్వగానే ఇక కరీబియన్‌ జట్టు విజయం లాంఛనమే అనిపించింది. ఐతే ఛేదనలో విండీస్‌ 5 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. అప్పుడే మైదానంలోకి అడుగుపెట్టింది సింహం! వచ్చీ రాగానే చెలరేగిపోయాడు వివ్‌ రిచర్డ్స్‌. చూస్తుండగానే ఏడు బౌండరీలు బాదేశాడు. 30ల్లోకి వచ్చేశాడు. స్కోరు 50 దాటేసింది. ఆ ఊపు చూస్తే చాలా ఓవర్లు మిగిలుండగానే విండీస్‌ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. అప్పుడే మదన్‌ లాల్‌ ఆఫ్‌ సైడ్‌ ఆవల ఒక షార్ట్‌ పిచ్‌ బంతి సంధించాడు. అలాంటి బంతి పడితే రిచర్డ్స్‌ ఆగడసలు. హుక్‌ షాట్‌తో విరుచుకుపడతాడు. అప్పుడూ అదే చేశాడు. కాకపోతే బంతి ఎడ్జ్‌ తీసుకుని మిడ్‌వికెట్‌ దిశగా గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డర్‌ లేడు. స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డరున్నా అతడికి బంతి అందేలా లేదు. బంతి వెళ్తున్న వైపు కెమెరా దృశ్యం చూస్తే బౌండరీ ఖాయమనే అనిపిస్తోంది. కానీ షార్ట్‌ మిడ్‌వికెట్‌లో ఉన్న కపిల్‌.. బంతి గాల్లోకి లేవడం ఆలస్యం.. దాని మీద ఓ కన్నేసి వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అదెంత కీలకమైన క్యాచో కెప్టెన్‌గా కపిల్‌కు తెలియంది కాదు. అసాధారణ ఏకాగ్రతో పరుగెత్తి.. బంతి పడే చోటికి చేరుకుని ఒడిసి పట్టుకున్నాడు. ప్రపంచకప్‌ ఫైనల్లో అంత ఒత్తిడిలో ఆ క్యాచ్‌ను కపిల్‌ అందుకున్న వైనం అమోఘం! రిచర్డ్స్‌ వెనుదిరగ్గానే విండీస్‌ విశ్వాసం దెబ్బ తింది. అప్పటిదాకా మ్యాచ్‌పై ఆశల్లేనట్లు ఉన్న భారత ఆటగాళ్లలో ఉత్తేజం వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చేశారు.83 పరుగుల తేడాలో 8 వికెట్లు తీసి ప్రత్యర్థిని 140కే చుట్టేశారు. భీకరమైన విండీస్‌పై అద్భుత విజయంతో ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది కపిల్‌ సేన. ఆ క్యాచే లేకుంటే ఈ కప్పు భారత్‌ చేతికి అందేదే కాదేమో!

ప్రపంచకప్‌ అనగానే దురదృష్టాన్ని జేబులో పెట్టుకుని వచ్చేస్తుందేమో దక్షిణాఫ్రికా! దశాబ్దాల నిషేధాన్ని పూర్తి చేసుకుని 1992 ప్రపంచకప్‌లో అడుగు పెడితే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ఆ జట్టును ఎలా ముంచేసిందో గుర్తుండే ఉంటుంది. ఐతే దీన్ని మించిన విషాదం 1999 ప్రపంచకప్‌లో చోటు చేసుకుంది. అప్పటికి దక్షిణాఫ్రికా జట్టు భీకరం. టోర్నీలో చక్కటి ప్రదర్శన చేసింది. కానీ సెమీఫైనల్లో మూడు బంతుల్లో ఒక్క పరుగే చేయాల్సి ఉండగా.. డొనాల్డ్‌ రనౌటైపోవడం.. మ్యాచ్‌ టై కావడం.. సూపర్‌సిక్స్‌ దశలో దక్షిణాఫ్రికాపై గెలిచి ఉండటం వల్ల ఆస్ట్రేలియాకే సెమీస్‌ బెర్తు దక్కడం.. సఫారీ జట్టు కన్నీళ్లతో టోర్నీ నుంచి నిష్క్రమించడం పెద్ద విషాదమే! ఐతే సూపర్‌సిక్స్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సఫారీ జట్టే గెలవాల్సింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లక్ష్యం 272 కాగా.. ఒక దశలో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో స్టీవ్‌ వా నిలిచాడు. కానీ విజయానికి 120 పరుగులు చేయాల్సి ఉండగా... షార్ట్‌ మిడ్‌వికెట్‌లో గిబ్స్‌కు వా సులువైన క్యాచ్‌ ఇచ్చాడు. గిబ్స్‌ క్యాచ్‌ అందుకోవడం పూర్తికాకుండానే సంతోషంతో బంతిని పైకి ఎగరేయబోయాడు. అది చేజారింది. వా బతికిపోయాడు. అప్పటికి అతడి స్కోరు 56 పరుగులే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న స్టీవ్‌.. చివరిదాకా అజేయంగా నిలిచి 120 పరుగులతో జట్టును గెలిపించాడు. గిబ్స్‌ ఆ క్యాచ్‌ విషయంలో అలసత్వం ప్రదర్శించకపోయి ఉంటే ఆస్ట్రేలియా సూపర్‌సిక్స్‌లో గెలిచేదే కాదు. అదే జరిగితే సెమీస్‌ టై అయినపుడు దక్షిణాఫ్రికానే ముందంజ వేసేది. అప్పుడు ఆ జట్టు ఉన్న ఫామ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచకప్‌ కూడా గెలిచేదేమో! ఈ రకంగా చూస్తే గిబ్స్‌ వదిలిన క్యాచ్‌ సఫారీలకు ప్రపంచకప్‌ను దూరం చేసినట్లే!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.