బుజ్జాయిల డబ్బా  రోజుకో రుచబ్బా!
close

తాజా వార్తలు

Updated : 09/06/2019 00:10 IST

బుజ్జాయిల డబ్బా  రోజుకో రుచబ్బా!

‘‘ఒక్క మెతుకైనా వదిలావో..’’ ఉదయం పిల్లాడికి లంచ్‌ బాక్స్‌ పెడుతూ అమ్మ బెదిరింపు.‘‘తినాలనిపించలేదు మమ్మీ’’  స్కూల్‌ నుంచి వచ్చాక బాక్స్‌ ఇస్తూ పిల్లాడి ఫిర్యాదు. బాక్స్‌ చూసిన నిమిషం కోపం వచ్చినా.. ఖాళీ కడుపుతో నకనకలాడుతున్న బిడ్డను చూసి తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఈ సమస్య చాలామంది తల్లిదండ్రులకు ఎదురవుతూనే ఉంటుంది. దీనికి పరిష్కారంగా.. ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్నీ సంతరించుకుంటారు. రోజుకో రకం వంటకం పెట్టివ్వండి.. ఎప్పుడెప్పుడు లంచ్‌టైమ్‌ అవుతుందా అని ఎదురు చూస్తారు పిల్లలు. మీ ప్రేమతో పాటు సరికొత్త రుచిని రంగరించండి.. లొట్ట లేసుకుంటూ తినేస్తారు. కావాల్సిన పోషకాలూ పొందుపరిస్తే.. పిల్లలకు మేలు.. కన్నవారికి హ్యాపీలు..

సోమవారం
వెజ్‌ ఫ్రైడ్‌రైస్‌

కావాల్సినవి: బాస్మతి బియ్యం- కప్పుకి కాస్త వెలితిగా, క్యారెట్‌- ఒకటి, బీన్స్‌- రెండు, క్యాబేజీ తురుము- పావుకప్పు, ఉల్లిపాయముక్కలు- మూడు చెంచాలు, ఉల్లికాడలు- ఐదు, వెల్లుల్లి ముక్కలు- అరచెంచా, క్యాప్సికమ్‌- ముక్కలు రెండు చెంచాలు, సోయాసాస్‌- రెండు చెంచాలు, చిల్లీసాస్‌- అరచెంచా, అజినమోటో- పావుచెంచా (తప్పనిసరి కాదు), మిరియాల పొడి- పావుచెంచా, నూనె- ఒకటిన్నర చెంచా, ఉప్పు- రుచికి తగినంత
తయారీ: అన్నాన్ని పలుకుగా వార్చుకోవాలి.  ఉడికేటప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే అన్నం పొడిగా వస్తుంది. కడాయిలో నూనె వేసుకొని వెల్లుల్లి ముక్కలు, ఉల్లికాడల తురుము వేసి ముదురురంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు క్యారెట్‌, బీన్స్‌, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఆపై సోయాసాస్‌, చిల్లీసాస్‌, మిరియాలపొడి, అజినమోటో, ఉప్పు వేసుకుని కాయగూరలతో అన్ని సాసులు సమానంగా కలిసేట్టుగా చూడాలి. ఇప్పుడు ఇందులో ఉడికిన అన్నం వేసి కాయగూరలతో కలుపుకోవాలి. చివరిగా ఉల్లిపొరకని సన్నగా తరిగి వేసి ఐదు నిమిషాల పాటు ఉంచి దింపుకోవడమే.

మంగళవారం
మొఘలాయి పరోటా

కావాల్సినవి: గోధుమపిండి- రెండు కప్పులు, నూనె- రెండు చెంచాలు, ఉల్లిపాయ- సగం, పచ్చిమిర్చి- రెండు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా, క్యాప్సికమ్‌ ముక్కలు- రెండు చెంచాలు, క్యారెట్‌ తురుము- రెండు చెంచాలు, పసుపు- పావుచెంచా, కారం- అరచెంచా, ధనియాలపొడి- అరచెంచా, జీలకర్రపొడి- పావుచెంచా, ఆమ్‌చూర్‌పొడి- పావుచెంచా, గరంమసాలా- పావుచెంచా, ఉప్పు- తగినంత, పనీర్‌- రెండు కప్పులు
తయారీ: గోధుమపిండిలో ఉప్పు కలుపుకొని చపాతి పిండిలా చేసుకుని ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకుని... ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి రెండు నిమిషాలపాటు వేయించుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్‌ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి వేగాక పసుపు, కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, ఆమ్‌చూర్‌, గరంమసాలా, ఉప్పు  వేసి చక్కని వాసన వచ్చేంతవరకూ వేయించుకుని చివరిగా పనీర్‌ వేసి వేయించి దింపుకోవాలి. ఇప్పుడు చపాతీలను కాస్త మందంగా ఒత్తుకుని అందులో పనీర్‌ మిశ్రమాన్ని ఉంచి అన్నివైపుల నుంచీ మూసేయాలి. పెనంపై నూనె రాసి అన్ని వైపులా కాలేట్టుగా చూసుకోవాలి. మధ్యలోకి కత్తిరించి బాక్సుల్లో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.

బుధవారం
బనానా పూరీ

కావాల్సినవి: బాగా పండిన అరటిపండ్లు- రెండు, పంచదార- రెండు చెంచాలు, పెరుగు- పావుకప్పు, జీలకర్ర- చెంచా, బేకింగ్‌సోడా- చిటికెడు, ఉప్పు- పావుచెంచా, మైదా- రెండు కప్పులు, నూనె- వేయించడానికి తగినంత
తయారీ: ఒక పాత్రలో అరటిపండ్లు, తగినంత పంచదార తీసుకుని ఫోర్క్‌తో బాగా చిదిమి పెట్టుకోవాలి. దీనిలో పెరుగు, జీలకర్ర, బేకింగ్‌సోడా, ఉప్పు వేసి చెంచాతో అన్నింటిని కలుపుకోవాలి. చివరిగా మైదా వేసి ఎక్కడా ఉండల్లేకుండా మెత్తగా చపాతీపిండిలా ఒత్తుకోవాలి. దీనికి కొద్దిగా నూనెరాసి పైన ఒక తడివస్త్రం కప్పి రాత్రంతా ఉంచేయాలి. తెల్లారి వాటిని చిన్న ఉండలుగా చేసుకుని కొద్దిగా మందంగా ఉండేట్టుగా పూరీల మాదిరిగా ఒత్తుకోవాలి. నూనెలో వేయిస్తే ఇవి బన్స్‌ మాదిరిగా పొంగుతాయి. పిల్లలు ఇష్టంగా తింటారు.

గురువారం
పండ్లతో ఇడ్లీ

కావాల్సినవి: బొంబాయి రవ్వ- ముప్పావు కప్పు, మామిడిపండు గుజ్జు- ముప్పావుకప్పు, పంచదార- పావుకప్పు, పెరుగు- పావుకప్పు, నీళ్లు- పావుకప్పు, బేకింగ్‌ సోడా- పావుచెంచా, ఉప్పు- పావుచెంచా, నేతిలో వేయించిన జీడిపప్పులు- రెండు చెంచాలు, నెయ్యి- చెంచా
తయారీ: బొంబాయిరవ్వని బంగారు రంగులోకి వచ్చేంతవరకూ వేయించుకోవాలి. రవ్వలో మామిడిపండు గుజ్జు, పంచదార, పెరుగు వేసి ఇడ్లీపిండిలా కలుపుకొని పదిహేను నిమిషాలపాటు పక్కన ఉంచుకోవాలి. చివరిగా  బేకింగ్‌సోడా, ఉప్పు కలిపి ఇడ్లీ పిండిని ప్లేట్లలో వేసుకుని నేతిలో వేయించిన జీడిపప్పులని ఒక్కో దాంట్లో ఒక్కోటి పెట్టాలి. ఇడ్లీ పాత్రలో పావుకప్పు నీళ్లు పోసుకుని అవి మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్లని ఉంచాలి. పావుగంటపాటు ఆవిరిమీద ఉడికించుకోవాలి. టూత్‌పిక్‌ లేదా చాకుతో గుచ్చి చూసినప్పుడు వాటికి ఇడ్లీ పిండి అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు ఉడికిపోయినట్టే.

శుక్రవారం
పెరుగు శాండ్‌విచ్‌

కావాల్సినవి: బ్రెడ్‌ స్లైసులు- ఎనిమిది, నీళ్లు లేకుండా వడకట్టిన గట్టి పెరుగు- ముప్పావుకప్పు, ఉల్లిపాయ ముక్కలు- నాలుగు చెంచాలు, టమాటా ముక్కలు- నాలుగు చెంచాలు, క్యాప్సికమ్‌- రెండు చెంచాలు, క్యారెట్‌ తురుము- రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముక్కలు- చెంచా, కొత్తిమీర తురుము- చెంచా, స్వీట్‌కార్న్‌ గింజలు- మూడుచెంచాలు, ఉప్పు- తగినంత, కారం- కొద్దిగా, చాట్‌మసాలా- పావుచెంచా, నెయ్యి- కొద్దిగా
తయారీ: ఒక పాత్రలో తరిగిన కాయగూర ముక్కలన్నింటిని తీసుకోవాలి. దీనికి గట్టి పెరుగుని కలపాలి. ఇప్పుడు తక్కిన చాట్‌మసాలా, ఉప్పు, కారం,  కొత్తిమీర వంటివన్నీ కలుపుకోవాలి. బ్రెడ్‌ స్లైసులకి పెరుగు రాసి ఆపై ఈ కాయగూర ముక్కల మిశ్రమాన్ని ఉంచి మరో బ్రెడ్‌తో కలిపి శాండ్‌విచ్‌ తయారుచేసుకోవాలి. వీటిని పెనం లేదా గ్రిల్‌పై కాల్చి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.

శనివారం
రాగి, నువ్వుల లడ్డు

కావాల్సినవి: మొలకెత్తిన రాగులతో చేసిన పిండి- కప్పు, నువ్వులు- పావుకప్పు, పచ్చ యాలకులు- నాలుగు, వేయించిన పల్లీలు- పావుకప్పు, కొబ్బరికోరు- పావుకప్పు, బెల్లం- 150గ్రా, నెయ్యి- మూడు చెంచాలు
తయారీ: కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి అందులో రాగి పిండిని చక్కని వాసన వచ్చేంతవరకూ వేయించుకోవాలి. పల్లీలను వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. నువ్వులు, కొబ్బరి కూడా విడివిడిగా వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పచ్చ యాలకులు అన్నింటిని కలిపి మిక్సీలో పొడి కొట్టుకోవాలి. చివరిగా బెల్లం తరుగు, రాగిపిండి కూడా మిక్సీలో వేసి తిప్పితే లడ్డూ చేయడానికి వీలుగా మిశ్రమం మారుతుంది.  నెయ్యి చేతికి అద్దుకుని ఈ మిశ్రమంతో లడ్డూలు చుట్టుకోవాలి. పిల్లలకు బలవర్థకమైన ఆహారం ఇది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని