close

తాజా వార్తలు

నా డబ్బు తిరిగి వస్తుందా?

నా వయసు 28 ఏళ్లు. నాకు, మా ఆవిడకు కలిపి ఏడాదికి రూ.10లక్షల వరకూ ఆదాయం వస్తుంది. ఏడాది వయసున్న పాప ఉంది. రూ.50లక్షల గృహ రుణం తీసుకొని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను. గృహ రుణ వ్యవధి 20 ఏళ్లకు బదులు 30 ఏళ్లు పెట్టుకుంటే.. రూ.50లక్షల రుణం వస్తుంది అని బ్యాంకు చెబుతోంది. అంత దీర్ఘకాలం రుణ వాయిదాలు చెల్లించడం ఇష్టం లేదు. పాప చదువు, పెళ్లి కోసం ఎలా పొదుపు చేస్తే మంచిది?

- వెంకట్‌

గృహరుణం ఎంత కావాలని ముందు మీరు నిర్ణయించుకోండి. 9.5శాతం వడ్డీతో రూ.50లక్షల గృహరుణం తీసుకొని, 20 ఏళ్ల వ్యవధిని ఎంచుకుంటే.. నెలకు రూ.46,607 చెల్లించాలి. అదే.. 30 ఏళ్ల వ్యవధి అయితే.. నెలసరి వాయిదా రూ.42,043 అవుతుంది. 20 ఏళ్లకు బదులు 30 ఏళ్లను ఎంచుకోవడం వల్ల మీకు అవసరమైనంత రుణం లభించడమే కాకుండా.. నెలకు చెల్లించే వాయిదా రూ.4,554 తగ్గుతుంది. ఇలా నెలకు మిగిలే రూ.4,554లను మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేయండి. ఈ పథకాల్లో మదుపు చేయడం ద్వారా సిప్‌లో సగటున 13శాతం రాబడి వచ్చినా.. 20 ఏళ్లలో రూ.47,35,000 చేతికి అందే అవకాశం ఉంటుంది. 30 ఏళ్ల వ్యవధి పెట్టుకున్న మీ ఇంటి రుణంలో 20 ఏళ్ల తర్వాత చెల్లించాల్సిన మొత్తం రూ.32,49,112 ఉంటుంది. అప్పటికి మీ ఫండ్లలో పెట్టుబడి రూ.47,35,000 నుంచి ఇంటి రుణం రూ.32,49,112 చెల్లించగా మీ వద్ద సుమారు రూ.15 లక్షల వరకూ ఉంటాయి. 20 ఏళ్ల తర్వాత కూడా ఇంటి రుణం కొనసాగించాలి అంటే.. మీ ఫండ్లలో జమైన నిధిని మీ పాప చదువుకు ఉపయోగించుకోవచ్చు. మీ దంపతులిద్దరి పేరుతో ఇంటి రుణం తీసుకొని, ఇల్లు కొనుగోలు చేస్తే.. ఇద్దరికీ ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

నాకు డెబిట్‌ కార్డు నుంచి నాకు తెలియకుండానే రూ.20వేలు డెబిట్‌ అయ్యాయి. నేను ఆ విషయాన్ని వారం తర్వాత గమనించాను. ఇప్పుడు నేను ఏం చేయాలి?

- శ్రీనివాస్‌

డెబిట్‌ కార్డు, ఆన్‌లైన్‌ మోసాలు జరిగిన సందర్భంలో 15 రోజుల్లోపు బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయాలి. మోసం మొత్తం రూ.1,00,000 దాటితే ఎఫ్‌ఐఆర్‌ కూడా అవసరం. కార్డు దురుపయోగం అయినట్లు తెలియగానే బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించి, కార్డును నిలిపివేయాలి. ఫోన్‌లో వచ్చిన సంక్షిప్త సందేశం వివరాలు భద్రపరిచి, బ్యాంకుకు సమర్పించండి. దుర్వినియోగం అయిన మొత్తం వివరాలు ఉన్న బ్యాంకు ఖాతా వివరాలనూ సమర్పించాలి. ఇటువంటి లావాదేవీల్లో వినియోగదారులకు నష్టం కలగకుండా బ్యాంకులు బీమా పాలసీని తీసుకుంటాయి. మీ స్వీయ ప్రమేయం లేకుండా ఖాతా దుర్వినియోగం అయితే మీ డబ్బులు తిరిగి వస్తాయి.

మా వారు వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. సుమారు రూ.30లక్షల వరకూ వస్తాయి. ఈ మొత్తం ఖర్చు కాకుండా.. మంచి పథకాల్లో పెట్టాలని మా ఆలోచన. ఏం చేయాలి?

- ఇందిర

చేతిలో పెద్ద మొత్తం కనిపిస్తే ఎవరికైనా ఖర్చు చేయాలని అనిపిస్తుంది. ఉదారంగా ఉండాలని అనిపించడమూ సహజమే. అందుకే మన దగ్గర ఉండే పెద్ద నిధిని చిన్న మొత్తాలుగా విడదీసి చూసుకుంటే అనవసర ఖర్చులు చేయం. పదవీ విరమణ తర్వాత కనీసం 30 ఏళ్లు జీవిస్తారని అంచనా. ఈ సమయంలో అవసరమైన అన్ని ఖర్చులూ ఈ మొత్తంతోనే వెళ్లదీయాలి. అందుకే మీ వారికి వచ్చే డబ్బును 60-70, 70-80, 80-90 ఏళ్ల వయసులలో వాడుకునేలా మూడు భాగాలుగా చేసి పొదుపు, పెట్టుబడులకు మళ్లించండి. ఈ విధంగా చేయడం వల్ల 60-70 ఏళ్ల వయసులో వాడుకోవడానికి మీ వద్ద రూ.10లక్షలే ఉన్నట్లు లెక్క. అంటే ఏడాదికి మీరు ఖర్చు పెట్టుకోగలిగిన మొత్తం రూ.1లక్ష. నెలకు రూ.8.000 వరకే అన్నమాట. చేతిలో రూ.30లక్షలకు బదులు రూ.8,000-9,000 కనిపించినప్పుడు డబ్బు వృథా కాదు. 60-70 ఏళ్ల వయసు ఖర్చుల కోసం కేటాయించిన మొత్తాన్ని నష్టభయం తక్కువగా ఉండే బ్యాంకు డిపాజిట్లు, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం వంటి సురక్షిత మార్గాల్లో దాచుకోండి. 70-80ఏళ్ల మధ్య కాలానికి కేటాయించిన రూ.10లక్షలను నష్టభయం మధ్యస్థంగా ఉండే బ్యాలెన్స్‌డ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో, 80-90 ఏళ్ల వయసు ఖర్చుల కోసం కేటాయించిన మొత్తాన్ని నష్టభయం ఉన్నా.. కాస్త అధిక రాబడిని ఇచ్చే రియల్‌ ఎస్టేట్‌, ఈక్విటీ ఫండ్లలోని పెట్టుబడులను పరిశీలించండి. 

- వంగా రాజేంద్ర ప్రసాద్‌, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.