close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 12/06/2019 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్లర్కుగా చేరి...ఎండీగా ఎదిగి!

పెద్ద బొట్టు... ముఖంపై చెరగని చిరునవ్వు... చూడ్డానికి మన పక్కింట్లోని  వ్యక్తిలా కనిపిస్తారామె. సాధారణ క్లర్కుగా తన కెరీర్‌ని ప్రారంభించి...ఇప్పుడు ఇండియన్‌ బ్యాంకు ఎండీగా ఉన్నత స్థానంలో ఉన్నారు.  మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె ప్రయాణం, సవాళ్లను అధిగమించిన తీరు, కెరీర్‌ని తీర్చిదిద్దుకున్న విధానం ఈతరం అమ్మాయిలకు ఆదర్శం. ఆ తెలుగింటి ఆడపడుచు పద్మజ చుండూరుతో వసుంధర ముచ్చటించింది.

లక్ష్యాన్ని మనం చేరుకుంటామా లేదా అనే ఆలోచన కంటే... ప్రయత్నలోపం లేకుండా మనం వందశాతం పనిచేశాం అనేదే మనల్ని విజయానికి దగ్గర చేస్తుంది. ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో స్థాయికి నేను ఒక్కసారిగా చేరుకోలేదు. క్లర్కు స్థాయి నుంచి ఒక్కో మెట్టూ ఎక్కి ఇక్కడికి వచ్చా. ప్రతి దశలోనూ ఎన్నో అనుభవాలు... ఇంకెన్నో సవాళ్లు... నా విజయ రహస్యాలయ్యాయి. మొదట నేను డాక్టర్‌ కావాలనుకున్నా. నాతో పాటు నా ఆలోచనలూ మారుతూ వచ్చాయి. ఇంటర్మీడియెట్‌కి వచ్చేసరికి బ్యాంకింగ్‌ రంగం ఆకర్షణీయంగా కనిపించింది. ఎలాగైనా బ్యాంకు ఉద్యోగం సాధించాలనుకున్నా. అనుకున్నట్లే మొదట ఆంధ్రాబ్యాంకుతో నా కెరీర్‌ని మొదలుపెట్టా.
మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మమ్మ, నానమ్మ ఇద్దరిదీ వైజాగ్‌ అయినా నేను అక్కడ ఉన్నది తక్కువే. నాన్న నరసింగరావు బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. అమ్మ వరలక్ష్మి గృహిణి. ఆయన ఉద్యోగ రీత్యా మేం దేశమంతా తిరిగేవాళ్లం. నేను పుణెలో పుట్టా. ప్రాథమిక విద్యాభ్యాసం షిల్లాంగ్‌లో, హైస్కూల్‌ నుంచి హైదరాబాద్‌లో చదువుకున్నా. నిజాం కాలేజీలో బీకాం చదివాక   బ్యాంకు ప్రవేశ పరీక్షలు రాయడం మొదలుపెట్టా. క్లర్కుగా ఆంధ్రాబ్యాంక్‌ చిక్కడపల్లి శాఖలో చేరా. ఆ తరువాత ఏడాదిన్నరకు పెళ్లయ్యింది. మా వారూ బ్యాంకు ఉద్యోగే. నేను ఉద్యోగం చేస్తూనే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి సర్టిఫైడ్‌ అసోసియేట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ బ్యాంకర్స్‌లో పీజీ చేశా. ఆ తరువాత ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐకి ఎంపికయ్యా. ముప్ఫైనాలుగేళ్లు వివిధ  స్థాయుల్లో పనిచేశా. ఎస్‌బీఐలో డిప్యూటీ ఎండీ స్థాయిలో ఉన్నప్పుడు ఇండియన్‌ బ్యాంక్‌కి ఎండీ, సీఈవోగా ఎంపికయ్యా.

సవాళ్లతో మొదలైంది...
ఆంధ్రాబ్యాంక్‌లో చేరేటప్పటికి నాకు పెద్దగా లక్ష్యాలు లేవు.   ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో అడుగుపెట్టాక ప్రతి రెండేళ్లకు బదిలీలు ఉండేవి. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చేది.  వెళ్లిన చోటల్లా కొత్త సవాళ్లు స్వాగతం పలికేవి. నా కెరీర్‌ మొత్తంలో పద్దెనిమిది బదిలీలు అయ్యాయి. వాటిల్లో న్యూయార్క్‌, లాస్‌ఏంజెలెస్‌ వంటి విదేశీ శాఖలూ ఉన్నాయి. మొదట నెల్లూరు జిల్లా కోవూరు ఏడీబీకి బదిలీ అయ్యింది. అప్పుడు బాబుకి రెండు నెలలే. చంటిపిల్లాడిని తీసుకుని తెలియని ఆ ఊరు వెళ్లడానికి మనసు ఒప్పలేదు. ఇప్పట్లా అప్పుడు క్రష్‌లు లేవు. ప్రసూతి సెలవులు పొడిగించాలనుకున్నా. మా వారు అందుకు ఒప్పుకోలేదు. సమస్యల్ని సమన్వయం చేసుకోవాలే కానీ వాటి నుంచి పారిపోకూడదని చెప్పడంతో ఆలోచించా. చివరకు పిల్లాడిని చూడటానికి ఓ పెద్దావిడ సాయం తీసుకున్నా. అప్పుడే అనుకున్నా... ప్రతిదానికీ ఓ పరిష్కారం ఉంటుందని. ఎంత కష్టం ఎదురైనా భయపడి వెనకడుగు వేయకూడదని. ఆ తరువాత పిల్లలు వారంతట వారు చదువుకునే వయసు వచ్చే వరకూ తరచూ ఊళ్లు మారాల్సి వచ్చినా.... ఆ పరిస్థితుల్ని వారికి అర్థమయ్యేలా చెప్పడంతో త్వరగానే కుదురుకునేవారు.

విదేశాల్లోనూ పనిచేయాల్సి వచ్చినా...
మా పిల్లలు టీనేజీలో ఉన్నప్పుడు నాకు లాస్‌ఏంజెలెస్‌కి బదిలీ అయ్యింది. అక్కడ యూఎస్‌ కంట్రీహెడ్‌గా చేశా. మా వారు భారత్‌లోనే ఉండటంతో నాతో పాటు పిల్లల్ని అమెరికా తీసుకెళ్లిపోయా. చాలామంది పిల్లల్ని ఈ వయసులో పాశ్చాత్య దేశానికి తీసుకెళ్తే పాడైపోతారని భయపెట్టారు. నేను మేనేజ్‌ చేసుకోగలననే నమ్మకంతో వారిని నా వెంట తీసుకెళ్లడానికే మొగ్గు చూపా. అమెరికాలో పరిస్థితులు మన జీవనశైలికి పూర్తి భిన్నం. ఎవరి పనులు వారే చేసుకోవాలి. అప్పటికి నాకు డ్రైవింగ్‌ రాదు. అక్కడ అది అవసరం. డ్రైవింగ్‌ నేర్చుకుని మరీ ఆఫీసుకి వెళ్లేదాన్ని. బ్యాంకులో పనీ ఎక్కువే. మనదేశ పనివేళలకు అనుగుణంగా పనిచేయాల్సి రావడంతో చాలా రాత్రుళ్లు బ్యాంకులోనే ఉండిపోయేదాన్ని. పిల్లలు ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు సొంతంగా వాళ్ల పనులు వాళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. నేను ఇంటికి వచ్చేసరికి వంట చేయడం, ఆఫీసు నుంచి తెచ్చుకున్న ఫైల్స్‌ని టైప్‌ చేసి ఇస్తూ నాకు సాయంగా ఉండేవారు.

త్యాగాలు అవసరం లేదు...
ఒకప్పటితో పోల్చి చూసుకుంటే...ఇప్పుడు అమ్మాయిలకు కెరీర్‌ అవకాశాలతో పాటు బోలెడన్ని సౌకర్యాలున్నా... వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు. పిల్లల్ని పైకి తీసుకురావడానికి కెరీర్‌ని సైతం వదులుకుంటున్నారు. ఆ తరువాత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడం, జాబ్‌ చేయలేకపోతున్నాననే బాధ వెరసి వారు కుంగుబాటుకి గురవుతున్నారు. నిజానికి మహిళలు ఉద్యోగాలు వదిలి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. అన్నింటినీ సమన్వయం చేసుకుంటే చాలు. దీనికి భాగస్వామీ సహకరించాలి. అమ్మాయిలూ కుటుంబ సహకారం తీసుకోవాలి. పెద్దవాళ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ సర్దుబాట్లకు సిద్ధంగా ఉండాలి. ‘నా ఇంట్లో నాకు ప్రైవసీ కావాలి. ఇల్లు నాకు నచ్చినట్లే ఉండాలి. నేను చెప్పిందే జరగాలి’ అని అనుకుంటేనే సమస్యలు. నేను అవేవీ పట్టించుకోలేదు. కొన్నాళ్లకు పిల్లల్ని చూసుకోవడానికి మా అత్తగారే మా ఇంటికి వచ్చారు.

అమ్మ... అత్తమ్మలే స్ఫూర్తి: అమ్మ 1940ల్లోనే బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం చేయలేకపోయింది. మేం బాగా చదువుకుని ఉద్యోగాలు చేయాలని కలలు కనేది. ముగ్గురం ఆడపిల్లలమే అయినా చదువు, ఇతర కళలపై ప్రత్యేక శ్రద్ధతో అన్నీ మాకు అలవడేలా చేయగలిగింది. పెద్దక్క కెనరాబ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎంపికైంది. తను ఇప్పుడు లేదు. చెల్లి ఎల్‌ఐసీలో పనిచేస్తోంది. అమ్మ మనోనిబ్బరానికి ఓ ఉదాహరణ. ఎనభైరెండేళ్ల వయసులో ఆమెకు క్యాన్సర్‌కి సంబంధించిన ఓ ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. తను ఎలా స్పందిస్తుందోనని డాక్టర్లు, ఇంటిల్లిపాదీ భయపడ్డాం. అమ్మ మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంది. ‘ఆపరేషన్‌ ఎప్పుడు చేస్తారు. నేను సిద్ధమే మీరు భయపడకండి’ అని మాకు ధైర్యాన్ని చెప్పింది. మా అత్తింటివారిది ఉమ్మడి కుటుంబం. చదువుకోకపోయినా ఇంటిల్లిపాది అవసరాలను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ పై చేయి మా అత్తగారిదే. ఆఫీసు అయిపోయాక ఇంటికి వచ్చి ఆవిడతో నా అసహనానికి కారణాలు, నా సమస్యలు చెప్పుకునేదాన్ని. ఆవిడ మాత్రం ఓసారి వాళ్లవైపు నుంచి ఆలోచించొచ్చు కదా! అని అనేది. నా మాటకి విలువ ఇవ్వడం లేదనుకునేదాన్ని. క్రమంగా అది పాజిటివ్‌నెస్‌ అనీ...దాన్ని అలవర్చుకుంటే విజయం మనతోనే ఉంటుందని అర్థమైంది.


మహిళగా అవకాశం

కెరీర్‌లో అమ్మాయిలపైనే వివక్ష ఉంటుందని అనుకోవడం పొరబాటు. పైకి ఎదగడానికి తమకి తాము పరిధులు గీసుకోవడం కొన్నిసార్లు కారణమే. బ్యాంకింగ్‌ రంగంలో ఒక స్కేల్‌ నుంచి పదోన్నతిపై ఇంకో స్కేల్‌కి వెళ్లడానికి చాలామంది మహిళలు ఇష్టపడరు. ఏ ముంబయికో, దిల్లీకో లేదంటే మరో దూర ప్రాంతానికో బదిలీ చేస్తారనే భయంతో ప్రమోషన్లను సైతం కాదనుకుంటున్నారు. ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు మా బ్యాంకులో మహిళలకు పదోన్నతి అందించినా... రెండేళ్లపాటు దూరప్రాంతాలకు పంపించం. అమ్మాయిలు ఎక్కువ కష్టపడతారు. ఏకాగ్రతతో, దూరదృష్టితో పనిచేస్తారు. ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఉంటుంది. సహనమూ ఎక్కువే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కొత్తగా తల్లులైన ఉద్యోగినులకు మేం క్రష్‌ సదుపాయాల్ని ఏర్పాటు చేశాం. ఆ సదుపాయం లేని శాఖల్లోని ఉద్యోగినులు పిల్లల్ని బయట క్రష్‌లో చేర్చినా మేం డబ్బు చెల్లిస్తాం. మహిళల కోసం ప్రత్యేకంగా సురభి ఖాతా ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నాం. బ్యాంకు పటిష్ఠత కోసం ఎప్పటికప్పుడు మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా అప్‌డేట్‌ అవ్వడంలోనూ ముందుంటాం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.