close

తాజా వార్తలు

Updated : 27/06/2019 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బావనే చేసుకోవాలనుకుంటున్నా!

నాకు ఇరవై ఏళ్లు. నేను, మా మేనత్త కొడుకు ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం మా కుటుంబాలకూ తెలుసు. మొదట్లో పెళ్లికి ఒప్పుకొన్నారు. ఆ తరువాత కొన్ని కలహాల వల్ల అడ్డు చెబుతున్నారు. నాకు వేరొకరితో పెళ్లి చేయాలని చూస్తున్నారు. బావను తప్ప ఇంకెవరిని చేసుకోనని చెప్పినా వినడంలేదు. మా పెద్దవాళ్లను ఇద్దరం బతిమాలే ప్రయత్నం చేశాం. ఇతరుల ద్వారా చెప్పించాం.  ఎవరు ఏమన్నా నేను, బావ పెళ్లి చేసుకోవాలని  నిర్ణయించుకున్నాం. ఎటూ తేల్చుకోలేకపోతున్నాం.

- ఓ సోదరి

మీరు రాసిన ఉత్తరం ప్రకారం మీరు, మీ బావ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని అర్థం అవుతోంది. పెద్దవాళ్లను ఒప్పించలేకపోతున్నామని మీరు బాధపడుతున్నారు. ఇరు కుటుంబాల మధ్య వచ్చిన కలహాలేంటో మీ ఉత్తరంలో స్పష్టంగా చెప్పలేదు. పెద్దలకు మీ విషయం గురించి ముందే తెలిసినా వారి మధ్య వచ్చిన పొరపొచ్చాలు ఇద్దరి అనుబంధానికి విఘాతం కలిగించడం తట్టుకోలేకపోతున్నారు. పెద్దవాళ్ల సమస్యలు ఏంటనేది పక్కన పెడితే ప్రస్తుతం మీరిద్దరూ వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. భవిష్యత్తులో మీ ఇద్దరూ ఎవరి కుటుంబాలకు వారు ప్రాధాన్యం ఇస్తూనే ఎదుటి వారి కుటుంబంలోని తప్పులను ఎత్తి చూపకుండా ఉంటారనే నమ్మకం మీకు ఉందా... ఇద్దరిలోనూ కష్టసుఖాలకు తోడుగా నిలబడగలం, ఎప్పుడూ కలిసి ఉండగలమనే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నాయా... మీ బంధం దృఢమైందేనా... కేవలం ఇంకొకరు కాదంటున్నారన్న బాధతోనో, పరస్పర సానుభూతితోనో మీ మధ్య గట్టి బంధం ఉందని భావిస్తున్నారా... కలిసి నిర్ణయించుకున్నాం అని గట్టిగా అనుకుంటున్నారు కదా... భవిష్యత్తులో ఇరువైపుల నుంచి రాబోయే పరిణామాలకు మీరు సంసిద్ధులై ఉన్నారా... ఇరుకుటుంబాల్లో వ్యతిరేకత తగ్గకపోతే ఒకరికొకరు అండగా నిలబడగలరా... ఒకరిలో మరొకరికి లోపాలు కనిపిస్తే దాన్ని భూతద్దంలో చూసుకుంటూ కష్టపెట్టుకోమనే నమ్మకం ఉందా... వీటన్నింటినీ ఇద్దరూ కూర్చొని చర్చించుకోండి. ఏ కారణంతోనైనా మీ వాళ్లు అలాంటి వారు, మీ వాళ్లు ఇలాంటి వారు అని అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నింటినీ ముందే మాట్లాడుకోండి. ఒకరిమీద ఒకరికి పరస్పర విశ్వాసం, విలువ కచ్చితంగా ఉన్నాయనే గట్టి నమ్మకం వచ్చాక మరోసారి పెద్దవాళ్లతో మాట్లాడండి. ఆఖరి ప్రయత్నంగా మాత్రమే మీ నిర్ణయాన్ని అమలు చేయండి. అంతకన్నా ముందు చదువుపై దృష్టి పెట్టండి. ముందు జీవితంలో స్థిరపడేందుకు ఓ లక్ష్యం పెట్టుకోండి. ఆ తరువాతే పెళ్లి గురించి ఆలోచించండి. ఇంతలో పెద్దవాళ్ల ఆలోచనలోనూ మార్పు రావొచ్చు.

మీ ప్రశ్నలు ఇకపై vasupsych@eenadu.net కు పంపించగలరు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని