close

తాజా వార్తలు

మిస్టరీ ఛేదించే నౌకరీ!

నేర పరిశోధనలో అద్భుత అస్త్రం  ఫోరెన్సిక్‌ సైన్స్‌

ఆధారాలేమీ దొరక్కుండా పకడ్బందీగా నేరాలూ, మోసాలూ చేసి చట్టం నుంచి తప్పించుకుంటున్నవారు పెరుగుతున్నారు. దీంతో ఎన్నో కేసులు మిస్టరీగా మిగులుతున్నాయి. ఇలాంటి జటిలమైన కేసుల  పరిష్కారంలో ఆధునిక అస్త్రం..  ఫోరెన్సిక్‌ సైన్స్‌!   రోజురోజుకూ దీని ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారి సేవలు నేర పరిశోధనలో కీలకమవుతున్నాయి. ఫోరెన్సిక్‌పై ఆసక్తి ఉండి, దీనిలో ప్రవేశించాలనుకునేవారికి వివిధ కోర్సులతోపాటు చక్కని కొలువులూ లభిస్తున్నాయి!

ఆధునిక సాంకేతికతను అస్త్రంగా మలుచుకుని, హైటెక్‌ రీతిలో జరిగే హత్యలు, నేరాలు, సైబర్‌ దాడుల గురించి తరచూ వింటున్నాం.  భారత్‌తో సహా, ప్రపంచవ్యాప్తంగా నేరాలు, ఆర్థిక మోసాలు ఎక్కువయ్యాయి. వీటికి బాధ్యులైనవారిని గుర్తించి, చట్టం ముందు నిలబెట్టడానికి సాధారణ నైపుణ్యం సరిపోవడం లేదు. ఆధారాలు అన్వేషించి, అసలు దోషుల గుట్టు విప్పడానికి ఆవిర్భవించిందే ఫోరెన్సిక్‌ సైన్స్‌. ఇది కేవలం హంతకులను గుర్తించే శాస్త్రమే కాదు. మోసగాళ్లను పట్టించే దివ్యాస్త్రం కూడా. ముడుపులు తీసుకున్నవారినీ, మార్ఫింగ్‌ చేసినవారినీ, వన్యమృగాల వేటగాళ్లనూ, పసిమొగ్గలపై పైశాచికాన్ని ప్రదర్శించినవారినీ .. ఇలా అన్ని రకాల నేరగాళ్లనూ గుర్తించడానికి ఫోరెన్సిక్‌ సైన్స్‌ సమర్థ సాధనంగా అవతరించింది.
సాక్ష్యాలు లేకుండా ఖూనీలు చేసే నరహంతకులకూ, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేవారికీ, వస్తువులు దాచేసి దొంగలెత్తుకుపోయారని నాటకాలాడేవారికీ, ఆస్తులను తగలెట్టి ఆదుకోమని అర్థించేవారికీ¨, నకిలీ పత్రాలతో నిలువునా దోచుకుంటున్నవారికీ… ఫోరెన్సిక్‌ నిపుణులు చెక్‌ పెడుతున్నారు. వీరు నేరాలు, ఘోరాలను అధ్యయనం చేసి,  శాస్త్రీయంగా విశ్లేషించి వాటి గుట్టుమట్లను విప్పుతారు. తిరుగులేని ఆధారాలతో దర్యాప్తునకు సహకరించి, నేరగాళ్ల పని పట్టటంలో కీలక పాత్ర వహిస్తున్నారు.
ఈ రంగంలో కెరియర్‌ అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఇందుకోసం వివిధ స్థాయుల్లో పలు రకాల స్పెషలైజేషన్లతో భిన్న సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి. సమాచారాన్ని విశ్లేషించటం, లోతుగా ఆలోచించడం, వాస్తవానికి దగ్గరగా ఊహించడం, తర్కం, సునిశిత పరిశీలన ఉన్నవారు ఈ కోర్సుల్లో రాణించగలుగుతారు. కొన్నిసార్లు ఇతర విభాగాలకు చెందిన నిపుణులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి కమ్యూనికేటర్లుగా, బృంద సభ్యులుగా మెలగడం తప్పనిసరి.

కోర్సులు.. స్పెషలైజేషన్లు
* సైన్స్‌ గ్రూప్‌తో ఇంటర్‌ చదివిన విద్యార్థులు బీఎస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. సైన్స్‌ సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తిచేసినవారు ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులో చేరడానికి అర్హులు.
* ఎంఏ క్రిమినాలజీ కోర్సులోకి గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ అనంతరం పీహెచ్‌డీ లో చేరవచ్చు.
వివిధ సంస్థలు సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. స్పెషలైజేషన్లు సైతం ఉన్నాయి. ఎమ్మెస్సీ- డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఎమ్మెస్సీ - హోం ల్యాండ్‌ సెక్యూరిటీ అండ్‌ యాంటీ టెర్రరిజం, ఎంబీఏ ఫైనాన్స్‌(ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌), ఎంటెక్‌ - సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్సిడెంట్‌ రెస్పాన్స్‌, పీజీ డిప్లొమా - ఫోరెన్సిక్‌ టాక్సికాలజీ, ఫోరెన్సిక్‌ డాక్యుమెంట్‌ ఎగ్జామినేషన్‌, ఫింగర్‌ ప్రింట్‌ సైన్స్‌, క్రిమినాలజీ, ఫోరెన్సిక్‌ మేనేజ్‌మెంట్‌, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌, ఫోరెన్సిక్‌ అడోంటాలజీ, ఫోరెన్సిక్‌ నర్సింగ్‌... తదితర కోర్సులు పలు సంస్థల్లో బోధిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ నెలకొల్పారు. ఈ సంస్థ ఎంఏ క్రిమినాలజీ, ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులు అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏడాది వ్యవధితో పీజీ డిప్లొమా ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫ్‌ సైబర్‌ క్రైమ్‌ అండ్‌ లా, పీజీ డిప్లొమా ఇన్‌ విక్టిమాలజీ అండ్‌ విక్టిమ్‌ అసిస్టెన్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టింది. గ్రాడ్యుయేట్లు ఎవరైనా వీటిలో చేరవచ్చు. ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌కి మాత్రం సైన్స్‌ గ్రాడ్యుయేట్లే అర్హులు.
గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఈ విభాగంలో పలు రకాల కోర్సులను అందిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, పంజాబ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూ, ఉస్మానియా యూనివర్సిటీ, బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, ముంబయి, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఔరంగాబాద్‌; యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌, మైసూరు (ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్సెస్‌, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌) ...తదితర సంస్థలు ఫోరెన్సిక్‌ కోర్సులకు పేరొందాయి.

అవకాశాలిక్కడ...
ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలు, ఆసుపత్రులు, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు ఫోరెన్సిక్‌ నిపుణులను డాక్యుమెంట్‌ రైటర్లుగా నియమించుకుంటున్నాయి. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), పోలీస్‌ శాఖల్లో ఫోరెన్సిక్‌ ఉద్యోగాలు ఉంటాయి. యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌, మాస్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌, కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ తదితర విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి.

ఏ హోదాలు.. విధులు ?

క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేటర్‌: నేరం జరిగిన తీరును గమనిస్తారు. ఆ నేరం ఎలా జరిగిందో నమూనాను తయారుచేస్తారు. ఆధారాలకోసం ప్రయత్నిస్తారు. అక్కడ లభించినవి సేకరించి, ప్రయోగశాల పరిశీలనకు పంపుతారు. 
వైల్డ్‌ లైఫ్‌ ఫోరెన్సిక్‌ స్పెషలిస్టు: అనుమానాస్పదంగా చనిపోతున్న వన్యమృగాలపై వీరు అధ్యయనం చేస్తారు. అక్కడ లభించిన ఆధారాలతో కారకులను గుర్తిస్తారు.
ఫోరెన్సిక్‌ టాక్సికాలజిస్ట్‌: కొందరు విష ప్రభావంతో చనిపోతారు. అయితే వారే సేవించారా, ఎవరైనా తెలీకుండా వారి ఆహారంలో కలిపారా వీళ్లు నిర్థరిస్తారు. అలాగే డ్రగ్స్‌ మొదలైనవి తీసుకుంటే ఆ మాదకద్రవ్యం పేరు, మోతాదు గుర్తిస్తారు. 
ఫోరెన్సిక్‌ సైకియాట్రిస్ట్‌/  సైకాలజిస్ట్‌: వీరు నేరారోపణ ఎదుర్కొంటున్నవారి మానసిక స్థాయిని విశ్లేషిస్తారు. సంబంధిత వివరాలు కోర్టులో అందిస్తారు. విచారణ ఎదుర్కోగలిగేలా ఉన్నారా, లేదా గమనిస్తారు. మానసిక రోగులు, సైకోలు హత్యలో భాగమైనప్పుడు ఈ నిపుణుల సేవలే కీలకం. 
ఫోరెన్సిక్‌ లింగ్విస్ట్‌లు/ ఫోరెన్సిక్‌ స్పీచ్‌ నిపుణులు:  వీరు నేరం జరిగినచోట పత్రాలు, వాయిస్‌ వివరాలు ఏవైనా లభిస్తే వాటిని గమినిస్తారు. దస్తూరీని పరీక్షించి ఆ పత్రాలను ఎవరు రాశారో గుర్తిస్తారు. ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్స్‌ తో అక్కడ లభించిన ఆడియో టేపుల్లో గొంతును విశ్లేషించవచ్చు. లభించిన వివరాలు అసలువో, నకీలీవో నిర్ధారిస్తారు.
ఫోరెన్సిక్‌ పాథాలజిస్ట్‌: అనుమానాస్పద మరణాల వెనుక మర్మాలను వీరు విప్పుతారు. ఇందుకోసం పోస్టుమార్టం చేస్తారు. ప్రమాదవశాత్తూ మరణించారా, సహజంగానే చనిపోయారా, హత్య జరిగిందా, ఆత్మహత్య చేసుకున్నారా...ఈ వివరాలు కచ్చితత్వంతో వీరు చెప్పగలరు. 
ఫోరెన్సిక్‌ సెరాలజీ నిపుణులు: వీరు రక్తాన్ని, శరీర స్రావాలను విశ్లేషించి, అవి ఎవరివో గుర్తిస్తారు. డీఎన్‌ఏ పరీక్షలు జరిపి కారకులను గుర్తించగలరు. 
ఫోరెన్సిక్‌ అడొంటాలజీ:  బాధితుల ఒంటిపై గాట్లు ఏమైనా ఉంటే వాటికి కారకులను వీళ్లు పరిశీలిస్తారు. జంతువుల కారణంగా జరిగిందా లేదంటే మనుషులే పళ్లతో కరిచారా, గోళ్లతో రక్కారా తదితర విషయాలను వెలుగులోకి తెస్తారు. 
ఫోరెన్సిక్‌ అకౌంటెంట్లు/ ఆడిటర్లు/ ఇన్వెస్టిగేటర్లు: ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ ద్వారా ఆర్థిక నేరగాళ్లను తెలుసుకోవడం, ఆర్థిక నేరాలను గుర్తించడం సాధ్యమవుతుంది. వివాదాల్లో ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలను సులువుగా అర్థమయ్యేలా కోర్టుముందు వీరు ఉంచుతారు. ఆర్థిక ఒప్పంద పత్రాలు (బాండ్స్‌), నిబంధనలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. ఈ తరహా సేవలకు అంకెలపై పట్టు, తర్కపరిజ్ఞానం తప్పనిసరి. ఈ విభాగంలో అభ్యర్థులు తమ ప్రావీణ్య గుర్తింపు కోసం పరీక్ష రాసి సర్టిఫికేషన్‌ అందుకోవచ్చు. సర్టిఫైడ్‌ ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ ప్రొఫెషనల్‌ (సీఎఫ్‌ఏపీ)ను ఇండియా ఫోరెన్సిక్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (ఐసీఎస్‌), పుణె అందిస్తుంది. ప్రస్తుతం ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అకౌంట్స్‌, లా నేపథ్యం ఉన్నవారు ఈ విభాగంలో రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, లీగల్‌ ఫర్మ్‌ల్లో ఉద్యోగాలు ఉంటాయి. 
అభ్యర్థి చదువుకున్న కోర్సును బట్టి సంబంధిత హోదాలు లభిస్తాయి. ఫోరెన్సిక్‌ క్రైమ్‌ ల్యాబొరేటరీ అనలిస్ట్‌, ఫోరెన్సిక్‌ ఇంజినీర్‌, ఫోరెన్సిక్‌ ఆర్కిటెక్ట్స్‌, ఫోరెన్సిక్‌ వెటర్నరీ సర్జన్‌.. తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించవచ్చు.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.