
తాజా వార్తలు
ఆ భార్యాభర్తల్ని శుభకార్యాలకు పిలిచేవారు కాదు. పిల్లలు లేని ఆ దంపతులు ఎదురొస్తే ఏ పనీ కాదంటూ అవమానించేవారు. వీటన్నింటితో తన కడుపు పండేలా చేయమని కనిపించిన ప్రతి దేవుడినీ మొక్కేదామె. ఇన్నాళ్లకు 73 ఏళ్ల వయసులో ఆమె ప్రయత్నం ఫలించింది. పండంటి కవల ఆడపిల్లల్ని కని... గొడ్రాలు మంగాయమ్మ అనే ముద్ర చెరిపేసుకుంది. ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్ఛి.. నిన్న ప్రసవించి... అరుదైన రికార్డు సృష్టించిన మహిళగా గుర్తింపు తెచ్చుకుంది.
మంగాయమ్మకు యాభైఏడేళ్ల క్రితం యరమాటి సీతారామరాజారావుతో పెళ్లయ్యింది. మేనరికం. వ్యవసాయ నేపథ్యం. భూమిని కౌలుకు ఇవ్వగా వచ్చిన ఆదాయంతో రోజులు గడిపేవాళ్లు. ఈ జంట స్వస్థలం ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, నెలపర్తిపాడు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానభాగ్యం కలగకపోవడంతో పిల్లల కోసం వీళ్లు తిరగని ఆసుపత్రి లేదు, మొక్కని దేవుడు లేడు. ఎన్నో ఊళ్లు తిరిగారు. రాజారావు బంధువులు అమెరికాలో ఉంటే... అక్కడినుంచీ పిల్లలు కలగడానికి మందులు తెప్పించుకున్నారు. ఏ ఆసుపత్రికి వెళ్లినా పరీక్షలు చేసి సంతానం కలగదని చెప్పేవారు. మంగాయమ్మకేమో ఒక్క బిడ్డయినా పుట్టాలని ఉండేది. ఓ వైపు వీళ్లు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఇరుగుపొరుగు, బంధువుల నుంచి అవమానాలు ఎదురయ్యేవి. క్రమంగా వీళ్లని శుభకార్యాలకు పిలవడం మానేశారు. గొడ్రాలంటూ కొందరు ఆమె ముఖంపైనే అంటే... మరికొందరేమో ఆమె వెనుక విమర్శించేవారు. ఎప్పుడైనా పొద్దున్నే బయటకు వస్తే ‘ఎదురొచ్చావు... ఏం జరుగుతుందో’ అనేవారట. ఏదైనా పెళ్లికి వెళ్లి, కొత్త జంటను ఆశీర్వదించడానికి సిద్ధమవుతోంటే వద్దనేవారు. వీటన్నింటితో బాధ కలిగినా మౌనంగానే భరించేది. ‘ఏం పాపం చేశామో పిల్లల్లేరని మేం బాధపడని రోజు లేదు. వయసు పెరుగుతోన్న కొద్దీ ఈ జన్మలో అమ్మా అని పిలిపించుకునే అదృష్టం లేదేమోనని అనిపించేది. ఓసారి ఇద్దరం ఆలోచించుకుని పిల్లల్ని పెంచుకోవాలనుకున్నాం. ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని పెంచుకుంటే... ఆరునెలల నుంచి ఏడాది లోపల వెళ్లిపోయేవారు. వీటన్నింటితో చాలా కుంగిపోయా. కొన్నిరోజుల క్రితమే ఆయనకు గుండెపొటూ వచ్చింది. గతేడాది చివర్లో... మా పక్కింటి అమ్మాయి గర్భం దాల్చింది. పలకరించడానికి వెళ్లా. మాటల మధ్యలో నా వయసు వాళ్లూ పిల్లల్ని కనేందుకు ఆసుపత్రికి వస్తారా అని అడిగా. 50 ఏళ్లు దాటినవారూ ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్యవిధానం వల్ల గర్భం దాలుస్తున్నారని సమాధానం ఇచ్చిందా అమ్మాయి. నాలో ఆశ మొదలైంది. ఇంటికెళ్లి ఆయనతో చెప్ఫా అప్పటివరకు చెన్నై, హైదరాబాద్ అంటూ చాలాచోట్ల తిరిగాం. చివరిసారిగా ప్రయత్నిద్దామనుకుని గతేడాది నవంబరులో గుంటూరులోని అహల్య ఆసుపత్రికి వెళ్లా. అక్కడ డాక్టర్ ఉమాశంకర్, రాజకుమారిని కలిశాం. నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా అని అడిగా. అక్కడ నా కల నెరవేరింది...’ అని చెబుతుంది మంగాయమ్మ.
పరీక్షలు చేశారు...
డాక్టర్లు ఆమెకు రకరకాల పరీక్షలు చేశారు. ఎలాంటి అనారోగ్యాలు లేకపోవడంతో... ఐవీఎఫ్ ప్రయత్నించొచ్చని చెబుతూనే... 73 ఏళ్ల వయసులో పిల్లల్ని కనడం చాలా రిస్క్ అన్నారు. ఆమె ఆరోగ్యం సహకరించాలన్నారు. ఎన్నో సమస్యలూ ఉంటాయన్నారు. పిల్లలకోసం ఎంత కష్టమైనా పడటానికి సిద్ధమైంది మంగాయమ్మ. డాక్టర్లు భయపడుతూనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కిందటేడాది డిసెంబరు నుంచి ఆసుపత్రిలోనే ఉండిపోయింది. రక్త పరీక్షల నుంచి రక్తపోటు, మధుమేహం నిర్థారించేందుకు అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. మంగాయమ్మ తల్లి దేవళ్ల తులసమ్మకు 98 ఏళ్లు. ఇప్పటికీ ఆమె తన పనులన్నీ చేసుకుంటుంది. డాక్టర్లు దీన్నీ పరిగణించారు. మంగాయమ్మకు అప్పటికే నెలసరి ఆగిపోయి దాదాపు ముప్ఫై ఏళ్లు. దాంతో మళ్లీ నెలసరి వచ్చేలా చేసి, అండాశయం పనితీరును పరిశీలించి, ఆ దిశగా వైద్యం మొదలుపెట్టారు. మందులు, ఇంజెక్షన్లు చేశారు. ఆమె భర్తకూ పరీక్షలు నిర్వహించారు. చివరకు గర్భం దాల్చిందామె. వైద్యులు చెప్పిన ప్రతి జాగ్రత్తనీ తీసుకుంది. చివరకు మొన్న ఆగస్టుకి తొమ్మిదినెలలు నిండాయి. గురువారం పొద్దున్న ఆసుపత్రిలోనే సీమంతం చేశారు వైద్యులు. అది జరిగిన గంటకు ఆపరేషన్ చేశారు. ఇద్దరు ఆడపిల్లలు. ‘నా భార్య కడుపు పండింది. మేం అమ్మానాన్నలమయ్యాం. ఈ వయసులో పిల్లలేంటని నవ్వుకున్నవారందరికీ సమాధానం ఆమె, పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే. ఇంకేం కావాలి...’ అని అంటున్నారు మంగాయమ్మ భర్త.
ఆమె మనోధైర్యమే... ‘ప్రస్తుతం ఈ పిల్లలు ఒక్కొక్కరూ 1.8 కిలో గ్రాముల బరువున్నారు. వాళ్లు రెండు కిలోల బరువు పెరిగేవరకూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వయసులో మంగాయమ్మకు పాలిచ్చే సామర్థ్యం ఉండదు. పిల్లల పోషణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తప్పవు. మా ప్రయత్నమే కాదు, ఆమె మనోధైర్యమూ ఎంతో పనిచేసింది. మేం చెప్పిన ప్రతి జాగ్రత్తనీ పాటించింది. ప్రసవ సమయం దగ్గరపడేకొద్దీ మరింత అప్రమత్తమయ్యాం. మొత్తానికి మా కృషి ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది...’. - డాక్టర్ శనక్కాయల అరుణ |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
