close

తాజా వార్తలు

లేడీ బాడీగార్డు ... ఈ దబాంగ్‌ సింగ్‌!

బాడీగార్డ్‌... ఈ పేరు వింటే పెద్ద పెద్ద కండలేసుకొని, కళ్లజోడు పెట్టుకొని పరిసరాలు నిశితంగా పరిశీలించే పురుషులే గుర్తుకు వస్తారు. ఈ రంగంలో అమ్మాయిలను ఊహించడం దాదాపుగా కష్టమే. అలాంటి రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది వీణాగుప్తా.
చురుకైన చూపులతో కార్పొరేట్‌ అతిథులు, విదేశీ ప్రతినిధులకు రక్షణనందిస్తోంది. అంతేకాదు విద్యార్థులకు, మహిళలకు ఆత్మరక్షణ విద్యలో తర్ఫీదునిస్తూ దబాంగ్‌సింగ్‌గా గుర్తింపు పొందింది. ఆ విశేషాలు వసుంధరతో పంచుకుందిలా....

మాది గుడ్‌గావ్‌. నలుగురు అక్కాచెల్లెళ్లలో నేను మూడోదాన్ని. ఇద్దరు అమ్మాయిల తరువాత అబ్బాయే పుడతాడని నానమ్మ ఎదురుచూసిందట. మళ్లీ అమ్మాయే పుట్టడంతో నన్ను చిన్నప్పటి నుంచే మగపిల్లాడిలా పెంచారు. మేం అందరం పాఠశాలకు వెళ్లేటప్పుడు అక్కలను కొందరు ఆకతాయిలు ఇబ్బంది పెట్టేవారు. కోపంతో ఒక్కొక్కరిని కొట్టాలనిపించేది. అప్పట్లోనే నాలో టామ్‌బాయ్‌ లక్షణాలుండేవి. చిన్నప్పటి నుంచే జవాన్‌ లేదా పోలీస్‌ అవ్వాలనుకునేదాన్ని. చదువుతూనే కరాటేలో శిక్షణ తీసుకున్నా. నా శరీర ఎత్తు పోలీస్‌ కావడానికి సరిపోదు. అందుకే దరఖాస్తు చేసుకోలేకపోయా.  

* సమర్థురాలిని కాదన్నారు...
డిగ్రీ పూర్తయ్యాక హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో చేరా. 19వ ఏటనే ఓ నక్షత్ర హోటల్‌లో హాస్పిటాలిటీ విభాగంలో ఉద్యోగం సంపాదించా. తరువాత పెళ్లై, పాప పుట్టింది. కొన్నాళ్లకు వేరే ఉద్యోగానికి మారాలనుకున్నా. ఇంటర్వ్యూలో అర్హత సాధించి ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో సెక్యూరిటీ ప్రొడక్షన్‌ విభాగంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధుల్లో చేరా. అక్కడ అందరూ అబ్బాయిలే. నేను సమర్థురాలిని కాదని నన్ను మగవారికి రక్షణగా పంపించేవారు కాదు. ఆ మాటలు నాలో కసిని పెంచాయి. మగవారికి నేనెందులోనూ తక్కువ కాదని నిరూపించుకోవాలనుకున్నా. శారీరక దారుఢ్యం కోసం ఎంతో శ్రమించా. మార్షల్‌ ఆర్ట్స్‌, ఇతర ఆత్మరక్షణ విద్యల్లో తర్ఫీదు పొందా. ఎన్నో కఠిన వ్యాయామాలు చేసేదాన్ని. చాలా రోజుల కష్టం తరువాత మగవారికి ఏ మాత్రం తక్కువ కాకుండా నిలిచా.
* ఆత్మరక్షణ విద్యనందిస్తూ...
ఒకరి కింద పనిచేసే బదులు నేనే పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరాలనుకున్నా. 2008లో సీమ్‌ గ్రూపు సర్వీసెస్‌ అనే సంస్థను ప్రారంభించా. దీంతో రిస్క్‌ అండ్‌ సెక్యూరిటీ కన్సల్టెన్సీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొటెక్షన్‌ సర్వీసులు, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌... ఇలా పలురకాల సేవలు అందిస్తున్నా. వెస్‌(విమెన్‌ ఎంపవర్‌మెంట్‌, సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ ఫౌండేషన్‌) పేరుతో ఎన్జీవో ప్రారంభించా. దిల్లీ, గుడ్‌గావ్‌, ముంబయి, పుణె వంటి ప్రాంతాల్లో మహిళలకు ఉచితంగా ఆత్మరక్షణ విద్యలో శిక్షణనందిస్తున్నా. కార్పొరేట్‌ ఉద్యోగులకు, కొన్ని ఎన్జీవోల సహాయంతో చిన్నారులకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు, మహిళలకు ఆత్మరక్షణ విద్య నేర్పిస్తున్నా. మా దగ్గరి పోలీసులకు శిక్షణాతరగతులు నిర్వహిస్తున్నా. ప్రస్తుతం ఆసిస్‌, ఎఫ్‌ఎస్‌ఏఐ, సెకొనా, ఐఐఎస్సెమ్‌, ఆప్సా, ఇఫ్‌సెక్‌ వంటి అంతర్జాతీయ భద్రతాసంస్థల్లో సభ్యురాలిగా ఉన్నా. మహిళల రక్షణార్థం ప్రత్యేక యాప్‌లను ప్రారంభించా. వారికి ఎప్పుడైనా చేయూతనందించడానికి మా సంస్థ ఫోన్‌నెంబర్లు అందులో అందుబాటులో ఉంటాయి.

* విదేశీ ప్రముఖులకూ...
ఇటీవల ఉదయ్‌పూర్‌, ముంబయిలో జరిగిన వివాహ వేడుకలకు హంగేరీ రాజు, ఆయన సతీమణి హాజరయ్యారు. వారి భద్రతావ్యవహారాలు నేనే పర్యవేక్షించా. గతంలో హైదరాబాద్‌కు వచ్చిన విదేశీ ప్రముఖులకు బాడీగార్డుగా సేవలందించా. సినీ అవార్డుల కార్యక్రమాలు, కార్పొరేట్‌ సంస్థల ప్రముఖులకు, ప్రత్యేక అతిథితులకు భద్రత కల్పిస్తున్నా. ఇటీవల హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఆదిత్యబిర్లా సంస్థ ఓ కార్యక్రమం నిర్వహించింది. 100మందికి పైగా బాడీగార్డులను దీనికి నియమించా. మా రక్షణాధికారులంతా లైసెన్స్‌ ఉన్నవారే. బెల్‌ హెలికాప్టర్‌, ఆమ్‌వే, వెస్ట్రన్‌ యూనియన్‌, ఫెయిర్‌ ఇసాక్‌, ఈగల్‌, అడోబ్‌, అమెరికాకు చెందిన కొడాక్‌, వాల్‌మార్ట్‌, లెనోవో, నెట్‌ జెట్స్‌, బార్‌క్లేస్‌ బ్యాంకు- హాంకాంగ్‌, నోవలిస్‌(ఆదిత్య బిర్లా గ్రూపు) తదితర సంస్థలకు రక్షణ సేవలు అందిస్తున్నా. మన దేశంలోనే కాకుండా అమెరికా, లండన్‌, సింగపూర్‌ వంటి దేశాలకూ మా సిబ్బంది వెళుతుంది. వీలైనంత మంది మహిళల్ని ఈ రంగంలోకి తీసుకురావడమే నా లక్ష్యం.


చీరకట్టుతో...
విదేశీ ప్రతినిధులు, ప్రముఖుల భద్రతా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్నిసార్లు నేనే బాడీగార్డుగా వెళ్తూ ఉంటా. అటువంటి సమయాల్లో ‘బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌’ థీంలో దుస్తులు ధరించను. చీర లేదా సూట్‌లో విధులు నిర్వహిస్తా. అప్పుడే వారి వ్యక్తిగత సహాయకులుగానో, మేనేజరుగానో కనిపిస్తాం. దాడి చేయాలనుకునే వ్యక్తికి మనపై అనుమానం రాదు. ఎలాంటి దుస్తులు ధరించినా సరే ఏమాత్రం ఏమరపాటుగా ఉండను. చుట్టు పక్కల ఏం జరుగుతుందో నిశితంగా గమనిస్తా. చీరలో ఎలా భద్రత కల్పించగలరని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు. మార్షల్‌ఆర్ట్స్‌తో పాటు బాక్సింగ్‌లోనూ శిక్షణ పొందా. ఎటువంటి దుస్తులు ధరించినా శత్రువులతో పోరాడగలను. ఓసారి ఓ ప్రముఖ మహిళకు బాడీగార్డుగా వెళ్లా.  ఆమె ఒక చేతిలో హ్యాండ్‌బ్యాగు, మరో చేతిలో ల్యాప్‌టాప్‌ పట్టుకుంది. అకస్మాత్తుగా ఓ వ్యక్తి అక్కడికి ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె చేతిలోని బ్యాగును లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. వెంటనే స్పందించా. వెనక్కి తిరిగి ఆ వ్యక్తిపై దాడి చేశా. క్షణాల్లో అతడు కిందపడ్డాడు. అప్పుడే కాదు... ప్రతి సెకను అప్రమత్తంగా ఉండటమే ఒక బాడీగార్డుగా నా కర్తవ్యం. మా సిబ్బందికీ అదే చెబుతుంటా.


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.