close

తాజా వార్తలు

Published : 10/09/2019 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మేమున్నామని...

నేడు ప్రపంచ ఆత్మహత్య నివారణా దినోత్సవం

ఆవేశం... ఏదో సాధించాలని కాదు... ఎందుకు బతికున్నామని! తెగింపు... కష్టాల నుంచి గట్టెక్కాలని కాదు.. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలని! కుంగుబాటులో బతుకుబాటను దిద్దుకోలేక.. ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సామాజిక పరిస్థితులో, ఆర్థిక ఇబ్బందులో కారణాలేవైనా.. ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్నవారిలో అమ్మాయిలే ఎక్కువ! ఒక్క క్షణం ఆలోచిస్తే.. జీవితంలో ప్రతిక్షణం ఆనందంగా బతకొచ్చని నిరూపించిన గాథలెన్నో ఉన్నాయి. దుస్సాహసాన్ని అడ్డుకొని కొత్త జీవితాన్నిచ్చే సంస్థలూ ఉన్నాయి. ఆ నారీమణుల విజయగాథలు స్ఫూర్తినిస్తే.. ఈ సంస్థలు ఎంతోమంది జీవితానికి భరోసానిస్తున్నాయి.

ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడో ఒకప్పుడు ముగిసిపోవాల్సిందే. జీవితాన్ని సహజంగా చాలించాల్సింది పోయి....అర్ధాంతరంగా అంతం చేసుకోవడమే ఆత్మహత్య. దీనికి చదువుల్లో వెనుకబాటు, ఆత్మన్యూనత, ప్రేమ, వైవాహిక బంధంలో కలతలు, సంతానలేమి, అనారోగ్యాలు, వృద్ధాప్య సమస్యలు....ఇలా కారణాలేవైనా కావొచ్ఛు సులువుగా వీటి ప్రభావానికి లోనయ్యేది మహిళలే. ఇవి కాస్తా కుంగుబాటుకి దారితీసి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. ఈ మనోరుగ్మతను జయించడమే అసలైన సవాలు. ఆ కీలక క్షణాలను సానుకూలంగా దాటేయగలిగితే...జీవితాన్ని హాయిగా గడిపేయొచ్ఛు అందుకు కావలసింది మానసిక సాంత్వన.

కోరుకున్న జీవితం దక్కలేదని ఒకరు, అత్తింటి ఆరళ్లు భరించలేక మరొకరు...ఒకప్పుడు ఆత్మహత్యే పరిష్కారం అనుకున్నారు. ఇప్పుడు దాన్నుంచి బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారెవరంటే..

కుంగుబాటుతో నిర్ణయం - నిహారి

కుంగుబాటుతో తీసుకున్న నిర్ణయం ఆమె శరీరాన్ని కాల్చేసింది...కానీ మనసుని దృఢపరిచింది. నిహారి మండలిది కృష్ణాజిల్లా పులిగడ్ఢ అందరు ఆడపిల్లలానే జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకుంది నిహారి. ఇంటర్‌ పూర్తవ్వగానే బాధ్యతలు తీరతాయనుకుని ఆమెకు పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమెకు భర్త రూపంలో కొన్నాళ్లకే హింస మొదలయ్యింది. విడాకులు తీసుకుని దూరమైతే సమాజం ఏమంటుందో? అమ్మానాన్నలు ఎలా స్వీకరిస్తారో అనే ఒత్తిడి కాస్తా కుంగుబాటుగా మారింది. అంతే క్షణికావేశంతో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. బతికి బయటపడింది కానీ...కానీ కొన్నాళ్లపాటు తనని తాను చూసుకోవడానికే భయపడింది. ఆమె నాలుగేళ్ల తమ్ముడు ప్రేమగా దగ్గరికి రావడంతో నిహారికి జీవితంపై ఆశ పెరిగింది. తను చేసింది ఎంత తప్పో అర్థం చేసుకుంది. ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక డిగ్రీ పూర్తిచేసింది. ఉద్యోగంలో చేరి...ఆర్థికంగా నిలదొక్కుకుంది. తనలా మరే ఆడపిల్లా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టింది.

మనసు మాట వింటాయి ఈ సంస్థలు..!

రోషిణి: ఒత్తిడిలో ఉన్నప్పుడు... తమ బాధ వినేందుకు ఎవరైనా ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అలాగని ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. దాంతో నిరాశలో కూరుకుపోయి..చివరికి చనిపోవాలనే తీవ్ర నిర్ణయం తీసేసుకుంటారు. అలాంటప్పుడు ఒక్క క్షణం రోషిణికి ఫోన్‌ చేసి చూడండి. సమస్య ఏదయినా ప్రాణం తీసుకోవడం పరిష్కారం అనుకునే మీ నిర్ణయం కచ్చితంగా మారుతుంది అని చెబుతారు ఆ సంస్థ ప్రతినిధులు. యూకేలో చడ్డా అనే వ్యక్తి ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 700 కేంద్రాల్లో, 70,000 వాలంటీర్లతో పనిచేస్తోంది. అందులో ఒకటి తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తోంది. ఆత్మహత్యల్ని నిరోధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ సంస్థ. 040-66202000, 040- 66202001 టోల్‌ఫ్రీనంబర్లలో వీరు అందుబాటులో ఉంటారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 వరకూ ఎప్పుడైనా వీరితో మాట్లాడొచ్ఛు

సూసైడ్‌హెల్ప్‌ డెస్క్‌: మేక్రో టెక్నాలజీస్‌ అనే ఐటీ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా 2009లో ఆత్మహత్య నివారణ సహాయ కేంద్రాన్ని ఆరంభించింది. ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలతో బాధపడేవారు 040-46004600కు ఫోన్‌ చేయొచ్ఛు ఇప్పటి వరకూ ముప్పైవేలకు పైగా ఫోన్‌కాల్స్‌ని వారు అందుకున్నారట. ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా స్ఫూర్తి నింపుతారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే....ఆరునెలల వరకూ వారితో అలా మాట్లాడతారట. మధ్యలో ఫోన్‌ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. అవసరమైతే వైద్య నిపుణుల సాయంతో మానసిక పరిస్థితిని సమీక్షిస్తామని వీరు చెబుతారు.

ఆసరా: ఆత్మహత్యల నివారణకు పనిచేస్తున్న మరో సంస్థ ఆసరా. 022-27546669 దీని టోల్‌ఫ్రీ నంబర్‌. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో మాట్లాడగలిగే వారెవరైనా దేశవ్యాప్తంగా ఏ ప్రదేశం నుంచైనా ఈ సంస్థ ప్రతినిధులకు ఫోన్‌ చేయొచ్ఛు వీరు కాల్‌ చేసిన వ్యక్తి మానసిక స్థితిని అర్థం చేసుకుని...వారికి కౌన్సెలర్‌ల సాయంతో తగిన సాంత్వన అందిస్తారు.

వన్‌లైఫ్‌: ఒత్తిడి, చెడు అలవాట్లు, కెరీర్‌ ఇబ్బందులు, ప్రేమ వైఫల్యం...ఇలా కారణం ఏదైనా సరే! కుంగుబాటుకి గురై జీవితాన్ని చాలించాలనుకునే యువత సంఖ్య పెరుగుతోంది. వారికి మనోధైర్యాన్ని అందిస్తుంది ఈ సంస్థ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోంది. మానసిక ఉద్వేగాలతో ఇబ్బంది పడే వారెవరైనా సరే! ఇరవైనాలుగ్గంటల్లో ఎప్పుడైనా ఈ వన్‌లైఫ్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ని ఉపయోగించుకోవచ్ఛు 7893078930 దీని నంబర్‌.

రెండుసార్లు చావు అంచుల దాకా వెళ్లి...

- సమితా పాండ్య

సమస్యల్ని ఎదుర్కొనే క్రమంలోనే మన శక్తి బయటపడుతుంది. దాన్ని సద్వినియోగపరచుకున్నప్పుడే ప్రతికూలతల్ని జయించగలుగుతాం. అందుకు సమితా పాండ్యా చక్కటి ఉదాహరణ. ఆమెది హైదరాబాద్‌. చిన్నప్పటి నుంచీ ఆటల్లో, చదువుల్లో చురుగ్గా ఉండేది. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంది. ఆమె చదువు డిగ్రీ మొదటి ఏడాదితో ఫుల్‌స్టాప్‌ పడింది. కారణం సమిత తల్లిదండ్రులు తనకి పెళ్లి చేయాలనుకోవడమే. పెళ్లివద్దని ఎంతగా పోరుపెట్టినా ఆ వేడుక జరిగిపోయింది. నిరాశతోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. దాంతో అన్నీ చక్కగానే జరుగుతున్నా ఏదో అసంతృప్తి వెంటాడేది. ఇద్దరు పిల్లలు పుట్టినా తానేదో కోల్పోయినట్లు, ఒంటరి అయినట్లు బాధపడేది. ఆ ఒత్తిడి కాస్తా ఆత్మహత్య ప్రయత్నం చేసేలా ప్రోత్సహించింది.

వేలమందికి తోడుగా...

ఇలా ఒకసారి కాదు...రెండు సార్లు ఆమె చావు అంచుల దాకా వెళ్లి అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడింది. భర్త ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్నారు. తిరిగి చదువుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఒత్తిడి తగ్గేందుకు గ్రాఫాలజీ కోర్సు చదవడం మొదలుపెట్టింది. దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. ఇక అక్కడితో వెనుతిరిగి చూడాలేదామె. వాళ్ల పెద్దబ్బాయి డిస్‌లెక్సియాతో బాధపడేవాడు. అతడికోసం కొన్ని పుస్తకాలు చదవడం మొదలుపెట్టింది. అది ఆసక్తిగా మారడంతో.. క్లినికల్‌ సైకాలజీలో డిగ్రీ పూర్తిచేసింది. ఇవన్నీ చేశాక...తాను చేసిన సూసైడ్‌ అటెంప్ట్‌ ఎంత పిచ్చి నిర్ణయమో ఆమె అర్థం చేసుకోగలిగింది. ‘ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు...దాన్ని పెద్దగా ఊహించుకుని బాధపడే బదులుగా బయటపడే మార్గాలను వెతకండి’ అంటుంది సమిత. తనలా మరెవరూ బాధపడకూడదనే... స్నేహితురాలు కవితా జైన్‌తో కలిసి న్యూస్టెప్స్‌ ఫౌండేషన్‌ పేరుతో ఓ ఎన్‌జీవోని ప్రారంభించింది. ఒత్తిడికీ చేతిరాతకీ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసి...గ్రాఫో థెరపీ ద్వారా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.