close

తాజా వార్తలు

అబద్ధం చెబుతున్నారా...

పిల్లలు పెంపకం

* అభి సరిగ్గా చదవడు. అయినా తనకు అన్ని విషయాలు తెలుసన్నట్లు తోటి విద్యార్థులతో గొప్పలు చెబుతుంటాడు.
* నిక్కి తమ్ముడిని కొట్టింది. అమ్మకు మాత్రం తాను కొట్టలేదని... వాడే కావాలని చేస్తున్నాడని అబద్ధం చెప్పింది.
* లక్కి హోంవర్క్‌ చేయలేదు. తండ్రికి ఈ విషయం చెప్పాలనుకున్నా.. కొడతాడేమోనన్న ఉద్దేశంతో చేసేశానని చెప్పాడు.
ఇలా ప్రత్యేకంగా నిలవాలనో...  చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలనో... పెద్దవాళ్లకు భయపడో.... పిల్లలు అప్పుడప్పుడు అబద్ధాలు చెబుతుంటారు. బాల్యంలోనే ఈ అలవాటును తుంచేయడం ఉత్తమం. పెద్దయ్యాక ఇదే కొనసాగితే ఎన్నో సమస్యలు వచ్చిపడతాయి.

పిల్లలు తమకు కావాల్సింది సాధించుకోవడానికి, తమకు నచ్చని వాటి నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పొచ్చు. పొరబాట్లు చేసినప్పుడు, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సైతం తోచింది చెప్పి తప్పించుకోవాలని చూడొచ్చు. క్రమంగా ఎదిగేకొద్దీ ఇదే సరైన మార్గమని భ్రమించే ప్రమాదం ఉంది. కొందరు సందర్భానుసారంగా, మరికొందరు ఎదిగేక్రమంలో ప్రయోగాత్మక అబద్ధాలు చెబుతారు. ఆ సమయంలో వారు విజయం సాధిస్తే మళ్లీ అలాంటి ప్రయత్నం చేస్తారు. ఇలా అసత్యాలు చెప్పడానికి కొన్ని కారణాలుంటాయి.

తల్లిదండ్రులేం చేయాలంటే...
* పిల్లలు అబద్ధాలు చెప్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తిస్తే లోతుగా పరిశీలించాలి. ఈ ప్రవర్తన వారికి ఆనందాన్ని కలిగిస్తోందా... ప్రత్యేకతను తీసుకొస్తోందా అనేది పెద్దవాళ్లు విశ్లేషించుకోవాలి. గుర్తింపు కోసం అసత్యాలు చెబితే వారు ఆ ప్రత్యేకత ఎందుకు కోరుకుంటున్నారు... ఇతరులతో చెప్పుకోలేని ఆత్మన్యూనత భావాలున్నాయా... ఆత్మవిశ్వాసం లోపించిందా అనే కోణంలో ఆలోచించాలి. వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి మీరేం చేయగలరో తెలుసుకోవాలి.
* పిల్లలతో కఠినంగా వ్యవహరించినా... సందర్భం వచ్చినప్పుడు మీకు భయపడి అబద్ధాలు చెప్పొచ్చు. అదే జరిగితే కఠినంగా వ్యవహరించకుండా మృదువుగా, సున్నితంగా ఉండాలి. వారి మనసును అర్థం చేసుకోవాలి. చిన్నారులు చెప్పే అబద్ధం గురించి ఎక్కువగా మాట్లాడే బదులు వారిపై మీకున్న ప్రేమను తెలియజేయాలి. మీరు కొండంత అండగా ఉంటారనే ధైర్యాన్నివ్వాలి.  వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అప్పుడప్పుడు సరదాగా బయటకు తీసుకెళ్లాలి. దీంతో వారికి మీతో చనువు పెరుగుతుంది.
* పిల్లలు ఒకసారి అబద్ధం చెబితే... అన్నిసార్లు వాళ్లను ఆ కోణంలోనే చూస్తారు పెద్దవాళ్లు. వాళ్లు ఏం చెప్పినా నమ్మరు. ‘నువ్వు అబద్ధం చెబుతున్నావు... నీకు శిక్ష పడాల్సిందే’ అనే ధోరణిలో వ్యవహరిస్తారు. అబద్ధాలకోరు లాంటి ముద్ర వేస్తారు. అదే చేయకూడదు. ఏం జరిగిందో సవివరంగా తెలుసుకోవడానికి చర్చలకు అవకాశం ఇవ్వాలి. ఓపిగ్గా వినాలి.
* చిన్నవయసులో అబద్ధాలు చెప్పడం సరదాగా ఉంటుంది. ఏ వస్తువైనా లేదని చెప్పడం, దాచిపెట్టేయడం... ఇలాంటివి పిల్లలతోపాటు పెరగకుండా పెద్దలు జాగ్రత్త పడాలి. వారు చెప్పే అబద్ధాల వల్ల కలిగే దుష్పరిణామాలు వివరించాలి. ఆత్మన్యూనతతో అబద్ధం చెబితే అది కొత్త సమస్య తెచ్చిపెడుతుందని, దీంతో అది మరింత పెరగొచ్చని ఉదాహరణతో వివరించాలి. నీతి కథలు చెప్పి పిల్లల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించాలి.
* చిన్నారులతో ఎంత సరదాగా ఉన్నా అబద్ధాలు చెబుతుంటే... వెంటనే కొట్టకుండా కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయినా వారిలో మార్పు రాకపోతే కండీషనింగ్‌ విధానాన్ని అమలు చేయాలి. అంటే వాళ్లు ఏం అడిగినా ‘నిజం చెబితేనే’ అనే షరతు పెట్టాలి.
* నిజాయతీగా ఉండటం ఎంత అవసరమో, దానివల్ల కలిగే లాభాలేంటో పిల్లలకు అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతుండాలి. అబద్ధాలు చెప్పినప్పుడు మనపై ఇతరులకు కలిగే అభిప్రాయాన్ని వివరించాలి. ఇంట్లో పెద్దవాళ్లూ ఈ విషయంలో పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. సరదాగానైనా సరే..  చిన్నచిన్న విషయాలకు పిల్లల ముందే అబద్ధాలు చెప్పే పద్ధతిని పెద్దవాళ్లు మానుకోవాలి.

ఇందుకే చెబుతారు లోపాలు కనిపించకుండా...
కొన్ని సందర్భాల్లో పిల్లలు తమ విలువ పెరగాలని గొప్పలు చెబుతుంటారు. పెద్దవాళ్లు తమను మరింత దగ్గరికి తీసుకుంటారని, నలుగురిలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని లేనివి ఉన్నట్టుగా చెబుతుంటారు. ఆత్మవిశ్వాసం తక్కువగా, ఆత్మన్యూనత భావాలు ఉన్న చిన్నారులు లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా ప్రవర్తిస్తుంటారు. తమలోని బలహీనతలు, మరికొన్ని విషయాల నుంచి పెద్దవాళ్ల దృష్టిని మరల్చడానికి అసత్యాలు చెబుతుంటారు. మరికొందరు చిన్నారులు ఏదైనా సమాధానం చెప్పే సమయంలో తొందరపాటు ప్రదర్శిస్తారు. అలానూ పొరపాబట్లు చేస్తుంటారు.

ప్రశంసలతో...
పిల్లలు ఏదయినా అబద్ధం చెప్పినప్పుడు... ‘చూశావా... ఎంత తెలివిగా సమాధానం చెప్పారో...  అతికినట్టు చెప్పేస్తారు...’ అని వారిని ప్రత్యేకంగా ప్రశంసిస్తుంటారు కొందరు పెద్దవాళ్లు. ఈ మాటలు విన్న పిల్లలు తాము చేసేది సరైందేనని అనుకుంటారు.  అబద్ధాలు చెబితేనే తమని ప్రత్యేకంగా ప్రశంసిస్తారనే ధోరణిలో అదే కొనసాగిస్తారు. మరికొందరు అసలు నిజానికి, తాము ఊహించినదానికి తేడా తెలుసుకోకుండా వారు అనుకున్నదే నిజం అని నమ్మేస్తారు.

స్వేచ్ఛ లేకపోవడం...
చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంట్లో ఉండే పెద్దలు పిల్లలతో కఠినంగా ఉంటారు. చిన్న విషయాలకే వారిపై అరుస్తుంటారు. ఇలాంటి వారి దగ్గర చిన్నారులకు స్వేచ్ఛ ఉండదు. జరిగింది జరిగినట్టు చెబితే ఇంట్లో పెద్దలు ఏమంటారోనని భయపడుతుంటారు. ఇది వారిలో ప్రతికూలతలను పెంచుతుంది. దీంతో తమ భావాలు ప్రకటించడానికి సంకోచిస్తారు. ఏం చేయాలో పాలుపోక ఏదయినా పొరపాటు చేసినప్పుడు టక్కున అబద్ధం చెప్పేస్తారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.