close

తాజా వార్తలు

ప్రతికూలతలకు ప్రభావితులవుతున్నారా...

కొత్త బంగారు లోకం

రశ్మిత స్నేహితురాలు దీపిక ఖరీదైన ఫోన్‌ కొనుక్కుంది. అందరిలో తానెక్కడ తక్కువవుతానోనని భావించిన రశ్మిత... అలాంటి ఫోనే కావాలని ఇంట్లో గోల చేయడం మొదలెట్టింది. సంగీతకు కాలేజీ మానేసి స్నేహితులతో సినిమాకు వెళ్లడం ఇష్టంలేదు. వాళ్లకు నో చెబితే ఎక్కడ నొచ్చుకుంటారోనని ఆలోచించింది. అందరూ తనను వేరుచేస్తారని భయపడింది. దీన్నే పీర్‌ ప్రెజర్‌ అంటారు. స్నేహితులకు నో చెప్పలేకో... అందరిలో తక్కువ కాకూడదనో... వేరే కారణాలతోనో ఇతరుల ప్రభావానికి లోనవుతుంటారు కొందరు. దాన్నుంచి ఎలా బయటపడాలంటే...

మన నడవడిక, ప్రవర్తన రూపుదిద్దుకోవడంలో స్నేహితుల ప్రభావం ఎక్కువగానే ఉండొచ్ఛు కొన్నిసార్లు చుట్టుపక్కల ఉండే వారి ప్రభావంతోనో, ఒత్తిడితోనో రకరకాల పనులు చేస్తారు. అలాంటి ఒత్తిడి సానుకూలంగా ఉంటే ఫరవాలేదు కానీ... ప్రతికూల ప్రభావం చూపిస్తే... చెడు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

చాలా తక్కువసార్లు మాత్రమే పీర్‌ ప్రెజర్‌ సానుకూల ప్రభావం చూపొచ్ఛు స్నేహితుల ప్రభావంతో కొత్త వ్యాపకాలు పెట్టుకోవడం... కాలేజీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేస్తుంటారు. ఉత్సాహంగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. కానీ అన్నిసార్లు ఇలానే జరుగుతుందని లేదు. చాలాసార్లు ఆ ఒత్తిడి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అబ్బాయిలయితే స్నేహితుల ప్రభావంతో దుర్వ్యసనాలకు అలవాటు పడతారు. ఇక, అమ్మాయిలేమో... స్నేహితులను చూసి కొత్త దుస్తులు, ఆభరణాలు కావాలని కోరుకుంటారు. అబ్బాయిలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమదిశగా అడుగులు వేసి మోసపోయినవారూ ఉంటారు. స్నేహితులకు నచ్చేలా ఉండాలని కుటుంబ విలువలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. ఆహార్యం మార్చుకోవడం వరకూ ఫరవాలేదు కానీ... అది వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తోంటే మాత్రం సమస్యగా పరిగణించాలి.

వీరిలోనే సమస్య... ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. స్నేహితుల సంఖ్య తక్కువగా ఉంటే వారిని కోల్పోకుండా ఉండేందుకు ఈ పీర్‌ ప్రెజర్‌కు ప్రభావితం అవుతారు. స్నేహితులకు, ఇతరులకు నచ్చేలా ఉంటేనే ఆమోదిస్తారనే భావనలోకి వెళ్తారు. కొందరు తమ ఉనికిని తెలియజేయడానికీ ఇలా ప్రవర్తిస్తుంటారు.

ఎలా గుర్తించొచ్ఛు..

* ఇలాంటి పిల్లలు ఉత్సాహంగా ఉండరు. ఎప్పుడూ నిరాశానిస్పృహలతో కాలం వెల్లదీస్తారు. ●

* కోపం, చిరాకు, చెడు ప్రవర్తన ఎక్కువగా ఉంటాయి.

* ఏ కారణాలు లేకుండానే వారిలో మార్పు కనిపిస్తుంది.

* ఆలస్యంగా పడుకొంటారు లేదా త్వరగా మేల్కొంటారు.

* కొందరికి ఆకలి తక్కువగా ఉంటే... మరికొందరు అతిగా తినేస్తారు.

* స్నేహితులకోసం వారికి ఇష్టమైనవాటిని సైతం వదులుకోవడానికి సిద్ధమవుతారు.

ఎలా మార్చాలంటే...

పిల్లలకు చిన్నతనం నుంచీ వారిలానే ఉండేలా సొంత వ్యక్తిత్వాన్ని అలవాటు చేయాలి. ఎదిగేకొద్దీ స్నేహితులకు నచ్చినట్లుగా మారడం వల్ల ఎదురయ్యే సమస్యల్నీ వివరించాలి. రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందో తెలియజేయాలి.

* ఆత్మవిశ్వాసం ఉన్నవారు చెడు ప్రభావాలకు లొంగరు. కొత్త విషయాలు నేర్పించడం, ఎక్కువ వ్యాపకాలు పెట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయడం అలవాటు చేస్తే... ఎలాంటి సమస్యా ఉండదు.

* తల్లిదండ్రులు పిల్లలకు ‘నో’ చెప్పడం నేర్పించాలి. స్నేహితులు చెప్పింది తనకు తెలియకపోయినా, రాకపోయినా చేయలేనని చెప్పేలా చూడాలి. మొహమాటానికి పోతే ఎదురయ్యే సమస్యల్ని పిల్లలకు తెలియజేయాలి.

* కొందరు నో చెప్పడానికి సంకోచిస్తారు. ఇలా చేస్తే నలుగురిలో తాము ప్రాభవం కోల్పోతామన్న భయం వారిలో ఉంటుంది. అలాంటివారికి ప్రత్యామ్నాయాలు ఆలోచించడం నేర్పించాలి. ఏవో సాకులు చెప్పి తప్పించుకునే మార్గాలు సూచించాలి.

* పిల్లలను నిత్యం కొత్త కొత్త కార్యక్రమాల్లో భాగం చేయాలి. సామాజిక బంధాలు పెరిగేలా చూడాలి. ఆటలు, కుటుంబ కార్యక్రమాలు, క్లబ్స్‌... వంటివాటితో ఎక్కువ స్నేహితులు పెంచుకునే మార్గాలు చూపించాలి.

* పిల్లల స్నేహితులను అప్పుడప్పుడు ఇంటికి ఆహ్వానించాలి. వాళ్ల గురించి తెలుసుకోవచ్ఛు పిల్లలపై వారి ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయొచ్ఛు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.