close

తాజా వార్తలు

నాలో నేనే మాట్లాడుకుంటున్నా

నాకు పంతొమ్మిదేళ్లు. తొమ్మిదేళ్ల నుంచీ నాలో నేను మాట్లాడుకునే సమస్యతో బాధపడుతున్నా. రోజులో ఎక్కువ గంటలు నాకు నేను మాట్లాడుతూనే ఉంటా. ఒత్తిడి, మతిమరుపు పెరిగిపోయాయి. గతంలోని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అతిగా ఆలోచిస్తుంటా. ఏ పని చేయాలన్నా ఆసక్తి రావడంలేదు.  కంగారు ఎక్కువ. నాలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువని నా స్నేహితులు చెబుతుంటారు. ఈ సమస్య లేనప్పుడు ఎక్కువగా చదివేదాన్ని. ఆసక్తిగా నేర్చుకునేదాన్ని. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఒంటరిగా చీకటి గదిలో ఉండటానికి ఇష్టపడుతున్నా. చదువుకోలేకపోతున్నా. నిద్రలేమితో కళ్లకింద ముడతలు వచ్చాయి. అందరూ పెద్దదానిలా కనిపిస్తున్నానని అంటున్నారు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. 

- ఓ సోదరి

 

మీరు తీవ్ర మానసిక వేదనతో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. మీ అంతట మీరు మాట్లాడుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని జీవితంలో ఆనందం పొందాలనుకోవచ్చు. ఈ సమస్య మీలో ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకోండి. పరధ్యానంలో ఉంటే ఏ పనీ సరిగ్గా చేయలేం. చేసినదాన్ని గుర్తుపెట్టుకోలేం. మతిమరుపు సమస్య తలెత్తుతుంది. నిరంతరంగా మీరు మాట్లాడుకోవడం, తీవ్రంగా ఆలోచించడం వంటి లక్షణాలు చూస్తే ఇది ఓసీడీ వ్యాధి లేదా తీవ్రమైన ఆందోళన కావొచ్చు. చీకటి గదిలో కూర్చోవడం, ఇష్టపడే పనుల మీద ఆసక్తి కోల్పోవడం, ఎవరితో మాట్లాడకపోవడం... ఇవన్నీ కుంగుబాటు లక్షణాలు. మీరిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కాగితం మీద రాసుకోండి. ఏ సందర్భాల్లో ఇలా చేస్తున్నారు... ఎవరితో చనువుగా ఉండేవారు... అందరితో కష్టసుఖాలు చెప్పుకునేవారా... మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచినవారెవరూ... ఎందుకు ఎవరితో కలవలేకపోతున్నారు... ఒంటరితనం ఎందుకు ఆవహించింది... మీ స్నేహితులు ఎవరు... మీకు తోడుగా ఎవరుంటారు... ఇలా ఒక్కొక్కటి రాసుకోండి. చీకటి గదిలో ఎందుకుంటున్నారు... బయట ఉంటే ఏమనిపిస్తుందనేదీ రాసుకోండి. ఇవన్నీ కొంత వరకు పరిష్కారాన్ని సూచించొచ్చు. అందంగా లేరని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు. మీరు సానుకూలంగా ఆలోచిస్తేనే మంచి ఆలోచనలు వస్తాయి.

ఏం చేయాలంటే... దృష్టిని మళ్లించుకోవడానికి ప్రయత్నించాలి. పుస్తకంలో రెండు మూడు పేరాలు చదివి దాని గురించి ఆలోచించండి. మీ బంధువులు, స్నేహితులు, సన్నిహితుల దగ్గరికి వెళ్లి సరదాగా మాట్లాడండి. చీకటి గదిలో కూర్చోకూడదని నిర్ణయించుకోండి. ఒక వేళ కూర్చున్నా లైట్‌ వేసుకోండి. మీ మనసుకు విరుద్ధంగా చేయండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా ప్రతికూల ఆలోచన వస్తే నడవడమో, ఏదైనా పుస్తకం చదవడమో చేయండి. కొత్త జీవననైపుణ్యాలు, కొత్త భాషలు నేర్చుకోండి. అంతర్జాలంలో అడల్ట్‌ కలరింగ్‌ అని ఉంటుంది. దాన్ని ప్రయత్నిస్తే ప్రశాంతత చేకూరుతుంది. వ్యాయామాలు చేయండి. వేళకు పోషకాహారం తీసుకోండి. గెలుస్తాననే భావనతో రోజును ప్రారంభించండి. మీరు చేయలేకపోయిన వాటిని జాబితాలో రాసుకోండి. వాటిని సాధించడానికి ప్రయత్నించండి. యోగా, శ్వాస సంబంధ వ్యాయామాలు మీలో కొంత మార్పు తెస్తాయి. గట్టిగా గాలి పీల్చుకొని మెల్లిమెల్లిగా వదలండి. ఆలోచనలు దూరం అవుతాయి. ఇవి పాటిస్తూనే మానసిక నిపుణులను సంప్రదించండి. వారు చికిత్స చేస్తారు. ఈ సమస్య తప్పకుండా నయం అవుతుంది.

మీ ప్రశ్నలు ఇకపై ‌vasupsych@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.