close

తాజా వార్తలు

మీ ఇల్లు హరితం కానూ!

కొత్త ప్రాజెక్ట్‌ల్లో వాస్తుతో పాటు ఐజీబీసీ రేటింగ్‌కు ప్రాధాన్యం

పెద్ద ప్రాజెక్టుల్లో ఇల్లు కొంటున్నప్పుడు కొనుగోలుదారులు హరితభవనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) ఏ రేటింగ్‌ ఇచ్చిందని వాకబుచేస్తున్నారు.  కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్లలో మార్పులతో స్థిరాస్తి సంస్థలు రేటింగ్‌ పొందుతున్నాయి. వీరు దరఖాస్తులో పొందుపర్చే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తుంది. నిర్మాణానికి ఉపయోగిస్తున్న సామగ్రి, సాంకేతిక తదితర అంశాల ఆధారంగా రేటింగ్‌ ఇస్తారు. పాయింట్లను బట్టి ప్రాజెక్ట్‌కు సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినమ్‌ రేటింగ్‌ జారీ చేస్తారు. వాస్తుతో పాటు ఈ మధ్య ప్రాజెక్ట్‌ల్లో రేటింగ్‌కు పెద్దపీట వేస్తుండటం నిర్మాణ రంగంలో వచ్చిన మార్పునకు నిదర్శనం.

ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌లో రెండేళ్లుగా నిర్వహిస్తున్న గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌తో కొనుగోలుదారుల్లో అవగాహన పెరిగింది. నిర్మాణదారులు సైతం తమ కొత్త ప్రాజెక్టుల్లో హరిత భవనాలను నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. మన దగ్గర 241.64 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ఐజీబీసీ రేటింగ్‌ పొందాయి. ముఖ్యంగా 18 అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

* నీటి ఎంత మేరకు ఆదా చేస్తున్నారు.. ఎలాంటి విధానాలు ప్రాజెక్ట్‌ల్లో అవలంభిస్తున్నారనే విషయాలు కూడా రేటింగ్‌ను నిర్ధారిస్తాయి. పెద్ద ప్రాజెక్ట్‌లన్నీ కూడా భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. వర్షం పడిన సమయంలోనే శుద్ధి చేసి వీటిలోకి తరలిస్తున్నారు. బోర్‌వెల్స్‌ కూడా రీఛార్జ్‌ అయ్యేలా.. ఇంజెక్షన్‌ వెల్స్‌ నిర్మించి ఇంకుడుగుంతలను నిర్మిస్తున్నారు. ఈ రూపంలో వాన నీటిని సంరక్షిస్తున్నారు. ఇదే కాకుండా గృహ అవసరాలకు ఉపయోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగునీటి శుద్ధి కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్‌కు, ఇంట్లో టాయిలెట్‌ ఫ్లషింగ్‌కు ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా నీరు చాలావరకు తిరిగి వినియోగమవుతుంది. రేటింగ్‌లో ఇది ముఖ్య భూమికను పోషిస్తుంది.
* ఇళ్లలో విద్యుత్తు వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా వేసవిలో కరెంట్‌ వినియోగం అధికంగా ఉంటోంది. ఈ బిల్లులు కూడా జేబుకు చిల్లు పెడుతుంటాయి. ఇదంతా కూడా ఇంట్లో చల్లదనం కోసమే. నిర్మాణ సమయంలోనే గది ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గించే సామగ్రిని ఉపయోగిస్తే చాలా వరకు సమస్య తీరినట్లే కదా!  వెలుతురు వచ్చేలా ఇంటి డిజైన్‌ ఉంటే.. కొనుగోలుదుదారుకు విద్యుత్తు బిల్లు గణనీయంగా తగ్గుతుంది. స్వచ్ఛమైన గాలి అందుతుంది. వనరులను పొదుపుగా వినియోగించడం, తిరిగి పునర్వినియోగం వరకు రేటింగ్‌లో అన్నీ చూస్తారు.
* ఇంటి లోపల ఉపయోగించే రంగులు పిల్లలు, గర్భిణులకు తీవ్ర హాని చేస్తుంటాయి. అందులో విడుదలయ్యే రసాయనాలతో చాలా మందికి అలర్జీలు వస్తుంటాయి. రేటింగ్‌ పొందిన ఇళ్లలో ఐజీబీసీ సర్టిఫై చేసిన రంగులను వాడటంతో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యుత్తు లైట్లు ఇష్టారాజ్యంగా కాకుండా ప్రమాణాల మేరకు ఏర్పాటు చేస్తారు.
* ఏదైనా భవనంలో వారికి అవసరమైన విద్యుత్తును సౌర, పవన విద్యుత్తు ద్వారానే ఉత్పత్తి చేస్తుంటే వాటికి నెట్‌ జీరో రేటింగ్‌ ఇస్తున్నారు.

కాస్త ఖరీదే..
సాధారణ భవనాలతో పోలిస్తే హరిత భవనాల వ్యయం కొంచెం ఎక్కువ. దీర్ఘకాలంలో పొందే ప్రయోజనాలతో పోలిస్తే ఈ వ్యయం పెద్ద ఎక్కువేం కాదు అంటున్నారు నిపుణులు.
ఇదివరకు ఉపయోగించే సామగ్రిలో 90 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సమయంలో నిర్మాణ వ్యయం పెరిగేది. ఇప్పుడు 90 శాతం మన వద్దే ఉత్పత్తి అవుతున్నాయి. నీరు తక్కువగా వినియోగించే కమోడ్‌ల దగ్గర్నుంచి, హాని చేయని రంగుల వరకు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో హరిత భవనాలను కట్టేవారు పెరుగుతున్నారు.

ప్రోత్సాహకాలిస్తే..
పర్యావరణ హిత ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లేకపోతే అదనపు ఖర్చుతో వాటిని చేపట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపరు. ఈ తరహా గ్రీన్‌ బిల్డింగ్స్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తే ప్రతి భవనం హరిత భవనంగా నిర్మించే అవకాశాలు ఉంటాయని నిర్మాణదారులు అంటున్నాయి.  భవన అనుమతులు, విద్యుత్తు నీటి కనెక్షన్లు సత్వరం మంజూరయ్యేలా, ఆస్తి పన్నులో రాయితీ, ఇంఫాక్ట్‌ ఫీజు తక్కువ ఉండేలా ప్రోత్సాహకాలను కోరుకుంటున్నారు.

మూడేళ్లలో 10 బిలియన్ల మార్క్‌..

భారత్‌లో ప్రస్తుతం 7 బిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలు ఐజీబీసీ రేటింగ్‌ కలిగి ఉన్నాయి. 2022 నాటికి 10 బిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంటామనే ధీమా ఉంది.  నిపుణుల కొరత ఉంది. అగ్రస్థానంలో ఉన్న యు.ఎస్‌.లో గ్రీన్‌ అర్కిటెక్ట్‌లు, నిపుణులు 1.25 లక్షల మంది ఉంటే.. రెండో స్థానంలో ఉన్న మన వద్ద వీటిపై అవగాహన ఉన్న నిపుణులు 3867 మంది మాత్రమే. 2022 నాటికి పదివేల మంది వృత్తి నిపుణులను తయారు చేసే దిశగా శిక్షణ ఇస్తున్నాం. 2025 నాటికి హరిత భవనాలకు అవసరమయ్యే నిర్మాణ ఉత్పత్తుల విలువ 300 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరుకుంటుందని ఐజీబీసీ అంచనా వేస్తోంది.

-వి.సురేష్‌, ఛైర్మన్‌, ఐజీబీసీ

హరిత ఉత్పత్తుల వినియోగంతో..

పర్యావరణంపై భవనాల నిర్మాణంతో కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించే హరిత ఉత్పత్తులు, సాంకేతికతలకు సీఐఐ-ఐజీబీసీ గ్రీన్‌ప్రో గుర్తింపు జారీ చేస్తుంది. గత నాలుగేళ్లలో 800 ఉత్పత్తులు దేశీయంగా అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 85 కంపెనీలు గ్రీన్‌ప్రో గుర్తింపు పొందాయి. ఈసారి సదస్సు సందర్భంగా మరో 16 కంపెనీలు గ్రీన్‌ ప్రో సర్టిఫికెట్‌ పొందాయి. విదేశాలకు ఎగుమతికి ఒప్పందాలు చేసుకుంటున్నాం. మన వద్ద గ్రీన్‌ప్రో గుర్తింపు ఉన్న హరిత ఉత్పత్తుల వినియోగాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరముంది.

-సి.శేఖర్‌రెడ్డి, ఛైర్మన్‌, ఐజీబీసీ హైదరాబాద్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.