close

తాజా వార్తలు

భలే ఉపాయం!

రాము సెలవుల్లో.. తరచుగా వెళ్లే తోటకు బయలుదేరాడు. తోట దగ్గర ఓ అపరిచితుడు ఎదురై ‘అబ్బాయ్‌! ఈ తోటలో దెయ్యాలున్నాయి. అటు వెళ్లకు’ అంటుంటే, ‘పో తాతా, ఈ కాలంలో కూడా దెయ్యాలు, భూతాలు అంటావేంటి’ అని ఖండించి తోటలోకి నడిచాడు రాము.
కాసేపటికి నిశ్శబ్దంగా ఉన్న తోటలో దబ్‌దబ్‌మంటూ శబ్దాలు వినిపించాయి. కాస్త అనుమానం వచ్చింది రామూకి. తను తోటలోకి వస్తుంటే ఆ అపరిచితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. చప్పుళ్లు విని రాము భయంతో వణికిపోయాడు. నెమ్మదిగా పరుగులాంటి నడకతో ఇంటికెళ్లిపోయాడు.
ఓ రెండు గంటల తర్వాత ‘రంగయ్య తోటలో దొంగలు పడ్డారట, కొబ్బరి కాయలు తీసుకుని పోయారట’ అని అంతా అనుకుంటున్నారు. అది విన్న రామూకి అసలు సంగతి అర్థమయ్యింది. ‘అమ్మో! నాకు దెయ్యాల భయం కలిగించి దొంగలు వాళ్ల పని చాకచక్యంగా ముగించుకున్నారన్నమాట.’ అనుకున్నాడు. ఎలాగైనా దొంగల్ని పట్టించాలని ఓ ఉపాయం ఆలోచించాడు.
మర్నాడు రాము అందరికీ వినపడేలా ‘మొన్న రంగయ్య తోటలో నాకో ఉంగరం దొరికింది. అది దొంగల్లో ఎవరో ఒకరిదై ఉంటుంది. రెండువేలు ఉండే కొబ్బరి కాయలకు ఆశపడి లక్షల రూపాయల వజ్రాల ఉంగరం పారేసుకున్నారు’ అన్నాడు. దాంతో ఊరంతా ఈ విషయం పాకింది. ఆ మాట కిట్టయ్య అనే దొంగ చెవినా పడింది. తన దొంగతనం గురించి నిజం ఒప్పుకుంటే తనకు లక్షల రూపాయల ఉంగరం సొంతమవుతుందన్న ఆశ కలిగింది కిట్టయ్యకు. రాము దగ్గరికి నెమ్మదిగా వచ్చాడు. ‘బాబూ, మా దరిద్రం కొద్దీ దొంగతనం చేశాం. నాకు గంగులు, సోములు కూడా సహకరించారు. నన్ను క్షమించు బాబూ, నాకు ఆ ఉంగరం ఇచ్చేయి. ఇక నుంచి దొంగతనాలు చేయను’ అంటూ బతిమాలాడాడు కిట్టయ్య.
‘ఇంత ఖరీదైన ఉంగరం నీకెక్కడిది?’ అని రాము ఆ దొంగని ప్రశ్నించాడు.
‘అది నా భార్యకు జమీందారుగారు బహుమానంగా ఇచ్చారు. వాళ్ల బాబు నీళ్లలో పడితే మా ఆవిడ రక్షించింది’ అంటూ లేని ఉంగరం కోసం కిట్టయ్య చెబుతున్న కథకి రాముకి నవ్వొచ్చింది.
వెంటనే ‘ఎవరికైనా ఉపకారం చేస్తే మనకది మంచి రూపంలో వస్తుందని తెలిసింది కదా! మరి నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? ఇలా చేస్తే సమాజంలో నీ కుటుంబసభ్యులు ఎలాంటి
ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఒక్కసారి ఆలోచించు’ అన్నాడు రాము.
అంత చిన్న పిల్లవాడితో తను సుద్దులు చెప్పించుకోవటం సిగ్గనిపించి కిట్టయ్య ఆలోచనలో పడ్డాడు.
ఇక నుంచి దొంగతనాలు చేయను అని నిర్ణయం తీసుకుని ఊరి పెద్దల ముందు తప్పు ఒప్పుకున్నాడు.
ఊరంతా రాముని మెచ్చుకున్నారు.

- కె. వి. వి. సత్యప్రసాద్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.