close

తాజా వార్తలు

రండి... పొదుపు చేద్దాం!

డబ్బు సంపాదించడం తెలియడం వేరు... దాన్ని ఆచీతూచీ ఖర్చుచేయడం వేరు. చాలా తక్కువమందికి తెలిసిన ఈ కళను మీరూ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా... పొదుపుపై కొంత అవగాహన పెంచుకుని చూడండి. అంతర్జాతీయ పొదుపు దినోత్సవం సందర్భంగా ఆ వివరాలేంటో చూద్దామా...

రోజుల్లో డబ్బులు దాచుకోవడానికి, లావాదేవీలు చేయడానికి కొన్ని బ్యాంకులు మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని ఖాతాలు అందుబాటులోకి తెచ్చాయి. ఆ ఖాతాల ద్వారా షాపింగ్‌, పొదుపు వంటివాటి పరంగా ఎన్నో ప్రయోజనాలు పొందొచ్ఛు ముఖ్యంగా పలు బ్యాంకులు విమెన్‌ సేవింగ్స్‌ అకౌంట్లను అందిస్తున్నాయి. ఏదైనా నచ్చిన వస్తువు, దుస్తులు కనబడగానే కొనాలనుకుంటారు మహిళలు. అలాంటి వారికి ఈ ఖాతాలు ఎంతోగానో ఉపయోగపడతాయి. వీళ్లకోసం ప్రత్యేకంగా ఐ విష్‌ అకౌంటునీ అందిస్తోందో బ్యాంకు. అంటే... మనం అనుకున్న వస్తువు తాలూకు ధరను నమోదు చేసి... ఎన్నాళ్లలో కొనుక్కోవచ్చో వివరిస్తే... నెలకు కొంత మొత్తం మన జీతం నుంచి బ్యాంకు తీసుకుంటుంది. గడువుతేదీ ముగిశాక ఆ డబ్బు కొంత రివార్డులతో కలిపి మన చేతికి వస్తుంది. ఇలాంటి సదుపాయాలే మరికొన్ని బ్యాంకులూ అందిస్తున్నాయి. పెద్దవాళ్లకే కాదు... పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకునీ... ఈ పొదుపుఖాతాలు అందుబాటులోకి తెస్తున్నాయి బ్యాంకులు. ఆ వివరాలు తెలుసుకుని నచ్చినదాంట్లో పొదుపుదిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నించండి.

మీ వంతుగా ఎంత...

నెల తిరిగేసరికి జీతం తీసుకోవడం... ఖర్చుచేయడం మనలో చాలామంది చేసేదే. మరి అత్యవసర సమయంలో డబ్బు అవసరం అయితే... ఆ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉందంటారు నిపుణులు. ఆదాయాన్ని బట్టి... ముందు పదో, పదిహేను శాతమో పొదుపు చేశాకే ఖర్చుల గురించి ఆలోచించండి. మిగిలిన డబ్బుకు తగినట్లుగానే మీ అవసరాల గురించి ఆలోచించండి. దీర్ఘకాలం పొదుపు చేయగలిగితే... ఎక్కువమొత్తం కనిపిస్తుంది. ఇది సాధ్యం కావాలంటే... వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం చాలా అవసరం. మీరేం చేయక్కర్లేదు... కొన్నాళ్లపాటు ప్రతినెలా... దేనికి ఎంత ఖర్చుచేస్తున్నారనేది ఓ చోట రాయండి. నెల తిరిగేసరికి... వృథా అనుకున్న ఖర్చుల్ని కొట్టేసి... మరోసారి అవి చేయకుండా జాగ్రత్తపడండి. ఈ చిన్న ప్రక్రియ తెలియకుండానే ఎంతో డబ్బును మిగులుస్తుంది. ప్రయత్నించి చూడండి.

పిల్లలకు చెప్పడం కాదు...

సాధారణంగా పిల్లలు ఏదయినా అడిగితే... వెంటనే కొనివ్వం. ఆలోచిస్తాం. ఎందుకు అని ప్రశ్నిస్తాం. ఉపయోగకరం అనుకుంటేనే కొనిస్తామని చెబుతాం. అదే సూత్రం మనమెందుకు పాటించకూడదు. ఏదయినా కొనాలని అనుకున్నప్పుడు వెంటనే షాపింగ్‌కి బయలుదేరకండి. ముందు అది అవసరమా కాదా అనేది ఆలోచించండి. ఆ తరువాతా దాని ఉపయోగాన్ని అంచనా వేయండి. తాత్కాలిక అవసరం అనుకుంటే... ఎవరినైనా అడిగి తీసుకోవడమే ఉత్తమం. దుస్తులు, చెప్పులు, అలంకరణ సామగ్రి, బ్యాగులు... ఇలా ఏవి కొనాలన్నా తొందరపడకండి. మీదగ్గరున్న వస్తువుల్ని గమనించుకోండి. ఆ తరువాతే నిర్ణయం తీసుకోండి. వీలైనంతవరకూ విలాసాలకు పోకుండా ఉండటమే మేలు. ముఖ్యంగా స్నేహితులతో కలిసి వెళ్లి ఏవో ఒకటి కొనేయడం, గొప్పలకు పోవడం వద్దే వద్ధు.

చిల్లర ఏం చేస్తున్నారు...

ఒకప్పుడు మన అమ్మమ్మలు పోపులడబ్బాలో డబ్బు దాచేవారు. అది ఎక్కువమొత్తం కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుందని నమ్మేవారు. అదే సూత్రాన్ని మనమూ అనుసరించొచ్ఛు మీకు అందుబాటులో చిన్న హుండీ పెట్టుకోండి. నిత్యావసరాలు, ఇతర వస్తువులు కొనగా వచ్చిన చిల్లరను ఎక్కడపడితే అక్కడ పెట్టేయకుండా అందులో వేయండి. ఆ హుండీ పూర్తిగా నిండితే... మీరెంత పొదుపు చేశారనేది మీకే తెలుస్తుంది. చిన్న ఖర్చుకైనా ఆ డబ్బు ఉపయోగపడుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.