close

తాజా వార్తలు

రండి.. రండి.. రంగుల లోకంలోకి!

ఫ్యాషన్‌ అంటే ర్యాంప్‌లపై మోడళ్ల వయ్యారపు నడకలు.. సినీ తారల తళుకులు.. అదో రంగుల ప్రపంచం. గ్లామర్‌, సృజనాత్మకత, గుర్తింపుల మేలు కలయిక. అందుకే ఆ రంగానికి ఎంతో క్రేజ్‌. దుస్తులు, హెయిర్‌ క్లిప్స్‌ నుంచి కాళ్ల చెప్పుల వరకు అన్నింటినీ ఆకర్షణీయంగా ఫ్యాషన్‌ నిపుణులు రూపొందిస్తారు. కాలానుగుణంగా.. కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. ఫ్యాషన్‌ రహస్యాలను యువతరానికి పంచే ఈ కెరియర్‌లోకి ప్రవేశించాలంటే కొన్ని కోర్సులు చేయాలి. తాజాగా నిఫ్ట్‌ అడ్మిషన్లకు ప్రకటన విడుదల చేసింది.

రోజువారీ జీవితంలో ఫ్యాషన్‌ ఒక భాగంగా మారింది. కొత్తదనానికి నిరంతరం స్వాగతం పలుకుతూ ప్రగతిపథంలో దూసుకుపోతున్న రంగాల్లో ఇదొకటి. అవకాశాల పరంగానూ ముందంజలో ఉంది. అందుకే యువత దీనిపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ఫ్యాషన్‌ ప్రపంచంపై అభిరుచి ఉండి, సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకోవాలనుకునేవారు ఈ కెరియర్‌ను ఎంచుకోవచ్చు. తగిన విద్యాసంస్థలూ, కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. షార్ట్‌టర్మ్‌ నుంచి పీహెచ్‌డీ వరకు ఎన్నో చేసుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియట్‌ అర్హత. డిప్లొమా కాలవ్యవధి ఏడాది. డిగ్రీ మూడు నుంచి నాలుగేళ్లు. పీజీ రెండు సంవత్సరాలు. చాలా కోర్సులకు ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్నింటికి మాత్రం సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (హైదరాబాద్‌, చెన్నై, ముంబయి, బెంగళూరులతో సహా దేశవ్యాప్తంగా సంస్థలు 16 చోట్ల ఉన్నాయి)
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (దేశంలోని పలు ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉంది.)
* సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, పుణె
* వోగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌  టెక్నాలజీ, బెంగళూరు
* సీఈటీ కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఐరాపురం
* మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కొట్టాయం
* అమిటీ స్కూల్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, నోయిడా, ఉత్తర్‌ప్రదేశ్‌.

డిజైనింగ్‌ కోర్సులు

నరల్‌, స్పెషలైజ్‌డ్‌ రెండు రకాల కోర్సులు ఉన్నాయి. జనరల్‌ వాటిలో ఫ్యాషన్‌కు సంబంధించి అన్ని అంశాల గురించీ స్థూలంగా తెలుసుకుంటారు. స్పెషలైజ్‌డ్‌ కోర్సుల్లో సంబంధిత అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తారు. మార్కెట్‌ ట్రెండ్‌లపై అవగాహన కల్పిస్తారు.

ఫ్యాషన్‌ డిజైనింగ్‌: ఇది జనరల్‌ కోర్సు. దీనిలో కొత్త డిజైన్ల రూపకల్పనపై ఎక్కువగా దృష్టిపెడతారు. వస్త్రాలు, ఆభరణాలు, లగేజ్‌ డిజైన్‌ మొదలైనవాటిని తెలుసుకుంటారు. కోర్సులో మార్కెట్‌లో వస్తున్న మార్పులు, ఇతర ధోరణులపై అవగాహన కల్పిస్తారు.

నిట్‌వేర్‌ డిజైన్‌: అల్లికలతో రూపొందించే వస్త్రాలకు సంబంధించింది. దేశంలో ఇది పురాతన పరిశ్రమ. స్థానిక అల్లికలకు ప్రాధాన్యం ఉంటుంది. కోర్సులో భాగంగా వివిధ రకాల మెషినరీల గురించి వివరిస్తారు. తయారీలో మార్కెట్‌ ధోరణులు, ఫ్యాషన్‌ను అనుసరిస్తారు.

యాక్సెసరీ డిజైన్‌: ఫ్యాషన్‌లో యాక్సెసరీలది ప్రధాన పాత్ర. వీటి జోడింపుతో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. జ్యూలరీ, ఫుట్‌వేర్‌, స్కార్ఫ్‌, హ్యాండ్‌బాగ్స్‌, బెల్టులు మొదలైనవన్నీ దీనికిందకే వస్తాయి. దుస్తులకు నప్పేలా రూపొందించడం ప్రధానం.

టెక్స్‌టైల్‌ డిజైన్‌: వివిధ రకాల వస్త్రాలు, వాటి ప్రింటింగ్‌, డైయింగ్‌, ఎంబ్రాయిడరీ, డిజైన్‌ డెవలప్‌మెంట్‌ వంటి వాటిలో ప్రావీణ్యం పొందుతారు. రంగుల మేళవింపు తెలుసుకుంటారు. ధరించేవాటినే కాదు, కార్పెట్‌ల వంటివాటినీ చదువుతారు. మొత్తంగా ముడిసరుకు నుంచి చివరికి వస్తువు రూపొందేవరకూ ప్రతి దశపై అవగాహన ఏర్పడుతుంది.

లెదర్‌ డిజైన్‌: ఇది కేవలం జాకెట్‌లు, బ్యాగులు, బెల్టులకే పరిమితం కాదు. దుస్తులూ రూపొందిస్తున్నారు. కోర్సులో భాగంగా లెదర్‌ డిజైనింగ్‌, దానిపై ఎంబ్రాయిడరింగ్‌, వివిధ టెక్నాలజీలను బోధిస్తారు.

ఫ్యాషన్‌ కమ్యూని కేషన్‌

ఫ్యాషన్‌ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. దీనిలో ఫ్యాషన్‌కు సంబంధించి విభిన్న ధోరణులను వినియోగదారులను ఆకట్టుకునేలా పరిచయం చేస్తారు. విజువల్‌ మర్చండైజింగ్‌, స్టైలింగ్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, డిజైన్లను ప్రదర్శించడం, అడ్వర్టైజింగ్‌, పీఆర్‌ స్ట్రాటజీలు, సృజనాత్మకంగా రాయడం వంటివన్నీ ఇందులో భాగమే. కోర్సులో భాగంగా గ్రాఫిక్‌ డిజైన్‌, విజువల్‌ మర్చండైజింగ్‌/ రిటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, స్టైలింగ్‌ మొదలైన అంశాలను తెలుసుకుంటారు.

ఫ్యాషన్‌ టెక్నాలజీ

క్రియేటివిటీ, టెక్నాలజీలు కలిసిన కోర్సు ఇది. ఫ్యాషన్‌ పరిశ్రమలో ఉపయోగించే సాంకేతికతను అధ్యయనం చేస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దుస్తులు, యాక్సెసరీల రూపకల్పనలో ఉపయోగిస్తున్న వివిధ రకాల టెక్నాలజీలు, పద్ధతులను చదువుతారు. టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌ డిజైన్‌, లెదర్‌, ఫుట్‌వేర్‌, యాక్సెసరీ.. తదితర స్పెషలైజేషన్లకు ఇందులో అవకాశం ఉంది.

ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌

కొత్త బ్రాండ్‌లను నెలకొల్పాలన్నా, వాటికి ప్రచారం కల్పించాలన్నా మార్కెట్‌పై అవగాహన అవసరం. ఆ విధులను మేనేజర్లు నిర్వర్తిస్తారు. ప్రొడక్ట్‌ను సరైన సమయంలో, సరైన ప్రదేశంలో అందుబాటులో ఉండేలా చూడటం లాంటి నైపుణ్యాలను ఈ కోర్సులో నేర్పిస్తారు. ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజ్‌డ్‌ కోర్సు. కోర్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టులతోపాటు మార్కెటింగ్‌, మర్చండైజింగ్‌, రిటైలింగ్‌ వంటి వాటిలో మేనేజీరియల్‌ అంశాలను చదువుతారు.

నిఫ్ట్‌ ప్రవేశాలకు ఆహ్వానం

ఫ్యాషన్‌ రంగంలో కోర్సులను అందించే ప్రముఖ విద్యాసంస్థల్లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) ఒకటి. ఇది 2020కి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. బ్యాచిలర్‌ (యాక్సెసరీ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ), పీజీ (మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ) కోర్సులు ఇందులో ఉన్నాయి. ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత సాధించినవారు వివిధ నిఫ్ట్‌ క్యాంపసుల్లో చేరవచ్చు.

అర్హతలు: బ్యాచిలర్‌ కోర్సులకు.. గుర్తింపు పొందిన సంస్థ/ బోర్డు నుంచి ఇంటర్‌ (10+2) విధానంలో  ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 5 సబ్జెక్టులతో దూరవిద్య ద్వారా చేసినవారు, డిప్లొమా విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు అక్టోబరు 1, 2019 నాటికి 23 ఏళ్లలోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ,  పీడ బ్ల్యూడీ వారికి వయసు పరిమితిలో అయిదేళ్ల మినహాయింపు ఉంది.

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు గుర్తింపు పొందిన సంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు. మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్‌) కోర్సుకు డిగ్రీ స్థాయిలో బీఎఫ్‌టెక్‌/ బీఈ/ బీటెక్‌ చేసి ఉండాలి. వయసు పరిమితి లేదు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్‌, ఓబీసీ కేటగిరీ వారికి రూ.2000, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి రూ.1000.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నాలతో కలిపి దేశవ్యాప్తంగా 32 పరీక్ష కేంద్రాలున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ డిసెంబరు 31, 2019. రాతపరీక్ష జనవరి 19, 2020న నిర్వహిస్తారు. ఫలితాలను ఫిబ్రవరి/ మార్చి 2020లో వెల్లడిస్తారు. సిచ్యువేషన్‌ టెస్ట్‌/ గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఏప్రిల్‌ 30, 2020న జరుగుతుంది. ప్రధానంగా రాత పరీక్షలు రెండు రకాలు. ఒకటి క్రియేటివిటీ ఎబిలిటీ టెస్ట్‌ (క్యాట్‌), రెండోది జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (గ్యాట్‌). కొన్ని కోర్సులకు రెండు స్కోర్లూ అవసరం. కొన్నింటికి గ్యాట్‌ స్కోరు సరిపోతుంది.

www.nift.ac.in, https://admission.net/nift2020

ఎలా సన్నద్ధమవ్వాలి?

క్యాట్‌లో అభ్యర్థి పరిశీలనా శక్తి, సృజనాత్మకత, కాన్సెప్ట్‌ డిజైన్‌, అభివృద్ధి చేయగల నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇక్కడ కొత్తగా ఆలోచించగలగడం, రంగుల మేళవింపు, చక్కగా వర్ణించడం ప్రధానం. ఏదైనా కాన్సెప్టును తీసుకుని సొంతంగా సాధన చేయడం ముఖ్యం. నిఫ్ట్‌తోపాటు ఇలాంటి పరీక్షలు నిర్వహించే వివిధ సంస్థల ప్రశ్నపత్రాలను సాధన చేయవచ్చు.

గ్యాట్‌కు సంబంధించి రీజనింగ్‌, మేథమేటిక్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కాంప్రహెన్షన్‌ వంటివన్నీ పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. జీకే, కరెంట్‌ అఫైర్స్‌కు వార్తాపత్రికలను చదవాలి. పరిశ్రమ సంబంధిత సమాచారానికి ఫ్యాషన్‌ మ్యాగజీన్లు ఉపయోగపడతాయి.

ఇంగ్లిష్‌లో గ్రామర్‌, సింటాక్స్‌ నుంచే ప్రశ్నలుంటాయి. ఎక్కువగా సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, ఇడియమ్స్‌-ఫ్రేజెస్‌, స్పాట్‌ ద ఎర్రర్స్‌, క్లోజ్‌ టెస్ట్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, స్పెల్లింగ్‌ ఎర్రర్స్‌, ఆర్డరింగ్‌ ప్యాసేజ్‌/ సెంటెన్సెస్‌ తదితరాల నుంచి ప్రశ్నలుంటాయి.

రీజనింగ్‌లో వెర్బల్‌, నాన్‌వెర్బర్‌, కోడింగ్‌, డీకోడింగ్‌, ర్యాంకింగ్‌, సిట్టింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, సిలాజిజమ్‌, క్యాలెండర్‌, క్లాక్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, క్యూబ్స్‌-డైసెస్‌, లైన్‌ కౌంటింగ్‌, పజిల్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

మేథమేటిక్స్‌లో నంబర్‌ సిస్టమ్‌, రేషియో-ప్రపోర్షన్‌, యావరేజెస్‌, ఏజెస్‌, ప్రాఫిట్‌-లాస్‌, స్పీడ్‌ టైం, అప్‌-డౌన్‌ స్ట్రీమ్స్‌, మిక్చర్స్‌-అలిగేషన్స్‌, పైప్స్‌, వర్క్‌ టైం, సింపుల్‌, కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌, మెన్సురేషన్‌, సెట్‌ థియరీ, ట్రిగొనామెట్రీ¨, హైట్‌-డిస్టన్స్‌, కాంబినేషన్‌-ప్రాబబిలిటీ అంశాలను ప్రధానంగా అధ్యయనం చేయాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.