close

తాజా వార్తలు

పిల్లలు... పెద్దలు 50:50

పిల్లలు- పెంపకం

విచక్షణ... ఇది ప్రతి మనిషికీ రక్షణ కవచం. ఇది ఎందువల్ల జరిగింది? ఎలా జరిగింది? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ సంఘటనైనా ఇలా తరచి చూసే ఆలోచనే విచక్షణ. కన్నబిడ్డలకు అన్నీ ఇస్తున్నామా అని ఆలోచించడం కాదు వారికవి ఎంత అవసరమో తెలుసుకోవాలి  వారికి స్వేచ్ఛనిస్తున్నామని అనుకోవడం కాదు దానికి కళ్లేలుండాలని గ్రహించాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు కావాల్సిందా ప్రాప్తకాలజ్ఞతే... అది లోపిస్తే జరిగే అనర్థాలు అనేక రకాలు... మరి ఇదంతా తల్లిదండ్రుల బాధ్యతేనా? ఉత్సాహం పొంగిపొర్లే యువతరం కూడా ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి.

ప్రియుడు చెప్పాడని కన్న తల్లినే అంతమొందించిందో ఓ యువతి. విచక్షణ లేకుండా జల్సాల ఉచ్చులో పడి ఆ యువతిని హత్య చేయడానికి ఉసిగొల్పాడా యువకుడు. దేశం నలుమూలల్లో... రోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నాయని వార్తల్లో వచ్చినప్పుడు అయ్యో... పాపం! అనుకుంటాం. మన పిల్లలు అలాంటి వారు కాదని సంతోషిస్తారు తల్లిదండ్రులు. కానీ ఇలాంటి విపరీత ప్రవర్తనలకు కారణాలేంటనేది అటు తల్లిదండ్రులు, ఇటు యువతీయువకులు తెలుసుకోవాలి.

* పసి మనసును తెలుసుకుంటున్నారా? మొక్కై వంగనిది మానై వంగునా అనే మాటలు... పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు చూపిస్తున్న అశ్రద్ధను చాటిచెప్పడానికి సరితూగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలతో కఠినంగా వ్యవహరించడం, పెద్దవాళ్ల అభిప్రాయాలు, లక్ష్యాలను చిన్నారులపై బలవంతంగా రుద్దడం, చదువుల్లో వెనకబడటం... వంటివి పిల్లల మనసులో తల్లిదండ్రులపై ప్రతికూల భావనలు నాటుకుపోయేలా చేస్తున్నాయి. యుక్త వయసుకు వచ్చేసరికి వారు కోరుకునే స్వేచ్ఛ... తల్లిదండ్రులకు, వారికీ మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. దీనికితోడు ఆకర్షణ వలలో పడుతున్న యువతరం బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటోంది. 

* వారిని చెప్పనివ్వండి ఎదుగుతున్న పిల్లల మనసులో పెద్దవాళ్లపై ప్రతికూల భావనలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్లపై ఉంది. చిన్నప్పటి నుంచీ వారి ప్రవర్తన, వ్యక్తిత్వం, స్వభావాలను పరిశీలించాలి. సమస్యలను మనస్ఫూర్తిగా చెప్పుకునే స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. వారి మనసులో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ మానసికంగా అండగా నిలవాలి.

* ఆ వయసులో జాగ్రత్త!  సింగిల్‌ పేరెంట్‌ ఉన్న పిల్లలకు సరైన మార్గదర్శకం చేయాలి. చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులు, పాఠశాలలో టీచర్లు, పెరిగి పెద్దయ్యే క్రమంలో స్నేహితులు, కౌమార దశలో ఆకర్షణ ప్రభావం... పిల్లల మనస్తత్వంలో మార్పులకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో వారు ఎక్కడ దారి తప్పుతున్నట్లు గ్రహించినా పెద్దవాళ్లు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. యుక్త వయసులో హార్లోన్ల విడుదల, శరీరంలో చోటుచేసునే మార్పులు, ఆకర్షణ ప్రభావం... తదితర అంశాలను వారితో చర్చించాలి. వారికి ఎదురయ్యే ఎలాంటి సమస్యలైనా దాపరికం లేకుండా చెప్పుకునేలా ఉంటే ఆత్మవిశ్వాసంతో పాటు మంచి వ్యక్తిత్వం అలవడుతుంది.

* నచ్చజెబితే పోలా! పిల్లల ఇష్టాలు అభిరుచులను అర్థంచేసుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్లపై ఉంది. ప్రేమ ప్రస్తావన తెచ్చినప్పుడు... పెళ్లి విషయంలో సాధ్యాసాధ్యాలను విశ్లేషించి చెప్పాలి. ఇలా కాకుండా... మేం చెప్పిందే వినాలనే మొండి పట్టుదల, ఆధిపత్య ధోరణితో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫలితం లేదు అనుకుంటే వారిని వదిలేయడం మంచిది. అంతేకానీ వారిపై ప్రతీకారచర్యలకు పాల్పడొద్దు.

పెద్దల్ని అర్థంచేసుకోండి...

* స్థిరపడ్డాకే అన్నీ... ప్రేమించిన వారితోనే భవిష్యత్తు ఉందంటూ తల్లిదండ్రులను వదిలేసి వెళ్లడం ఎంతవరకు సమంజసమనేది యువతరం ఆలోచించాలి. పెద్దలు కుదిర్చిన వివాహాల్లోనే సక్సెస్‌ రేటు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది అని కాకుండా రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం అనుకోవడమే ఇందుకు కారణం. జీవితంలో స్థిరపడ్డాకే యువత ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించాలి. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకున్నవారికి... జీవితాంతం కలిసుండాలనుకునే వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలిసుండాలి.

* వారిని అర్థం చేసుకుంటున్నారా? స్వార్థంగా ఆలోచించడం, అవతలివారిపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, విమర్శించడం, చులకనగా చేసి మాట్లాడటం వంటివి గమనిస్తే... ప్రేమించిన వ్యక్తి వ్యక్తిత్వం గురించి మరోసారి ఆలోచించాల్సిందే.  కలిసి జీవితాంతం ఉండగలం అనుకునేవారు పెద్దల సమ్మతితో ఒక్కయితే భవిష్యత్తులో సంతోషంగా ఉండగలుగుతారు.

* ఆమ్మాయిలూ ఆలోచించాలి... బలహీన మనస్తత్వం ఉన్నవాళ్లు తొందరగా ఆకర్షణకు బలవుతారు. ఇదొక వ్యక్తిత్వ లోపం. చిన్నప్పటి నుంచీ స్వేచ్ఛ లేకుండా పెరగడం, తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించడం, సమాజం, స్నేహితుల ప్రభావం... వంటి కారణాలతో అమ్మాయిలు తల్లిదండ్రులపై ప్రతికూల భావనలు పెంచుకుంటారు. కౌమార దశకు రాగానే... సొంత నిర్ణయాలు తీసుకోగలమనే నమ్మకం వస్తుంది. తల్లిదండ్రుల అండ నుంచి కాస్త స్వేచ్ఛను కోరుకుంటారు. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో తల్లిదండ్రుల ప్రమేయం ఉండకూదనే అభిప్రాయానికి వస్తారు. పెద్దవాళ్లు చెప్పే జాగ్రత్తలేవీ పట్టించుకోరు. ఏది మంచి, ఏది చెడు అనేది తామే నిర్ణయించుకోగలమనే అపనమ్మకంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలో ఆకర్షణ వలలో పడతారు. 

* స్పష్టమైన తేడాలున్నాయి... నిజమైన ప్రేమలో అవతలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని గుర్తించడం, వారిని వారిగా గౌరవించడం, అనురాగం, ఆప్యాయత పంచడం వంటివి ఉంటాయి. ఆకర్షణలో ఇవేవీ ఉండవు. ఒక వ్యక్తి నచ్చినప్పుడు వారిలోని మంచి గుణాలనే చూస్తారు. వారికి దగ్గరవ్వడానికి, వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఊహాలోకంలో విహరిస్తూ కొత్త పరిచయాలకు ప్రాధాన్యం ఇస్తారు. క్రమంగా సినిమాలు, షికార్లకు వెళ్లడం, జల్సాలు చేసుకోవడం నిత్యకృత్యంగా మారతాయి. మితిమీరితే శారీరక సంబంధాల వరకు వెళ్తాయి. కొన్నాళ్లు కలిసి తిరిగిన తరువాత వారిలో ఏదో లోపించింది, వారితో జీవితాన్ని పంచుకోలేమనే నిర్ణయానికి వస్తారు. తరువాత ఇంకొకరికి దగ్గరవుతారు. టీనేజీలో ప్రేమ వివాహాలు చేసుకునే వారి సంబంధం చివరివరకూ ఉండకపోవడానికి ఇలాంటి వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.