
తాజా వార్తలు
స్పేస్బేసిక్... ఇదో స్టార్టప్... కొడుకు ఉంటున్న హాస్టల్లో సౌకర్యాలెలా ఉన్నాయో అమ్మానాన్న ఫోన్లోనే ఆరాతీయొచ్చు. వసతుల లేమి, ఇతరత్రా ఇబ్బందులేవైనా సరే ఆ విద్యార్థి సులువుగా నిర్వాహకులకు ఫిర్యాదు చేయొచ్చు. ఇదంతా ఒక్క యాప్ ద్వారా సాధ్యం అంటోంది దాన్ని ప్రారంభించిన మాధవీ శంకర్. ఆమె ఇటీవలే ఐక్యరాజ్యసమితి సమావేశంలోనూ పాల్గొంది.
ప్రస్తుతం ఈ స్టార్టప్ 70 కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉంది. మొత్తం 1.20లక్షల మంది విద్యార్థులు దీన్ని వినియోగియోగిస్తున్నారు.
తమ పిల్లల సమాచారం తెలుసుకోవాలనుకునే తల్లిదండ్రులకు స్థానిక భాషల్లోనే ఆ సౌకర్యం లభిస్తుంది.
మాధవీ శంకర్ బెంగళూరులో పుట్టిపెరిగింది. అమ్మానాన్న వైద్యులు. అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్తి చేసింది. అక్కడే ఓ చిన్న స్టార్టప్ కంపెనీలో ఉద్యోగానికి చేరింది. ఆమె చేరినప్పుడు అక్కడ కేవలం నలుగురు మాత్రమే ఉద్యోగులు ఉండేవారు. క్రమంగా ఐదేళ్లలో 60 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఆ సంస్థ చేరింది. తమ సేవల్ని విదేశాలకూ విస్తరించింది. ఈ కంపెనీ ఎదుగుదలని దగ్గర నుంచి చూసింది మాధవి. అదే ఆమెకు వ్యాపారం చేయాలనే ఆలోచనను తెచ్చిపెట్టింది. అలాంటి దిశగా అడుగులు వేస్తోన్న మరికొందరిని మాధవికి పరిచయం చేశారు ఆమె తండ్రి. వారితో తన స్టార్టప్ ఆలోచనను పంచుకుంది. అందుకోసమే ఉద్యోగం వదిలి భారతదేశానికి తిరిగి వచ్చింది.
పాఠశాలలు పరిశీలించి... మాధవి ఇక్కడికి వచ్చాక ఎన్నో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లింది. అక్కడ విద్యార్థులను కలిసి విద్యావిధానంలో ఎలాంటి మార్పులు అవసరమో తెలుసుకుంది. ఆస్ట్రేలియా విద్యాసంస్థల్లో డిజిటల్ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. అది అక్కడి విద్యార్థులకు, విద్యాసంస్థలకు ఎంతో మేలు చేస్తుంది. మన దేశంలో ఏ పెద్ద విశ్వవిద్యాలయం అయినా సరే ఇప్పటికీ చిన్న చిన్న అంశాలకు సైతం పేపర్ వర్క్ చేయడం ఆమె గమనించింది. ముఖ్యంగా వసతిగృహాల్లో ఇటువంటి విధానం కొరవడటం ఆమెను ఆలోచింపచేసింది. ‘దేశంలో చాలా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు తిరిగా. హాస్టళ్లో ఉండే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సౌకర్యంగా ఉండేలా ఏదైనా చేయాలనుకున్నా. ఉద్యోగం మానేయడంతో చేతిలో డబ్బులు లేవు. నాన్న, స్నేహితులు సాయం చేశార’ని చెబుతోంది మాధవి.
హాస్టల్ విద్యార్థుల కోసం... స్పేస్బేసిక్ హాస్టల్ మేనేజ్మెంట్కు సంబంధించిన స్టార్టప్. వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు సమకూర్చుకోవడానికి, వసతులు, హాస్టల్ యాజమాన్యం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలిసేలా ఒక యాప్ రూపొందించింది. ‘మన దేశంలో ఏ విశ్వవిద్యాలయానికి వెళ్లినా గేట్పాస్ నుంచి మొదలుకొని... వసతిగృహాల్లోని సమస్యలను తెలపడానికి సంతకాలు, పేపర్లు, మాన్యువల్స్ వంటివి వినియోగిస్తున్నారు. ఈ పద్ధతిలో మార్పు తీసుకురావడం కోసం మేం ప్రయత్నిస్తున్నాం. మా యాప్ ద్వారా విద్యార్థులు రోజూ ఏం చేస్తున్నారు, ఎన్ని సెలవులు తీసుకుంటున్నారు... ఇలా అన్నింటినీ తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం తెలుసుకోవచ్చు. హాస్టల్లో ఎంత మంది ఉన్నారో తెలుసుకొని భోజనం ఏర్పాట్లు చేయొచ్చు. ఇది ఒక రికార్డు పుస్తకంలా పని చేస్తుంద’ని అంటోంది మాధవి. ఈ విధానం ఐక్యరాజ్యసమితికి నచ్చి ఆమెను అక్కడ జరిగే సదస్సులో మాట్లాడటానికి ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ఇండస్ఇండ్ అంతర్జాతీయ పాఠశాల హాస్టల్లోనూ ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ జనవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని విద్యాసంస్థల్లోకి ఈ విధానం అందుబాటులోకి రానుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
