close

తాజా వార్తలు

అవయవదానంపై అవగాహన అందిస్తోంది

నిరుపేదలను ఆదుకునే కుటుంబం నుంచి వచ్చింది... సామాజిక సేవపై ఆసక్తిని పెంచుకుంది. అవయవదాన అవసరాన్నీ గుర్తించింది. యుక్తవయసులోనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి... వేలాదిమందిని ఈ దిశగా ఆలోచించేలా కృషి చేస్తోంది. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ సేవ... ఆమెను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఆమే ముంబయికి చెందిన... రాధికాజోషి.

ఉమ్మడి కుటుంబంలో పెరిగింది రాధిక. తండ్రి సంతోష్‌ జోషి ప్రభుత్వోద్యోగి. తల్లి సీమ ఉపాధ్యాయురాలు. వారి కుటుంబం ఎప్పుడూ పేదలకు చేయూతనందించడంలో ముందుంటుంది. దీంతో ఈమెకూ చిన్నప్పటి నుంచే సామాజిక సేవంటే ఆసక్తి మొదలైంది. స్కూల్‌ స్థాయిలోనే పలు ఎన్జీవోలతో కలిసి వాలంటీర్‌గా పని చేసింది. ప్రస్తుతం సోషియాలజీలో డిగ్రీ చేస్తోంది. తన కుటుంబంలో చోటు చేసుకున్న ఓ విషాదం ఆమెకు ఓ లక్ష్యాన్ని కల్పించింది.

ఆ సంఘటనతోనే...
రాధిక బంధువు ఒకరికి కిడ్నీలు పాడయ్యాయి.  వెంటనే మార్పిడి చేయాలన్నారు వైద్యులు. ‘దగ్గర బంధువులెవరివీ మ్యాచ్‌ కాలేదు. ఏడాదిన్నరపాటు  దాత కోసం వెతికినా దొరకలేదు. చివరికి ఆయన చనిపోయారు. ఈ సంఘటన నన్ను ఆలోచింపజేసింది.   అవయవాల కోసం ఎంతమంది వేచి ఉన్నారో తెలుసుకోవాలనుకున్నా. ముంబయి, పుణెలోని ఆసుపత్రులన్నీ తిరిగా, అక్కడ రోగులతో మాట్లాడా. ఏడాదిపాటు నా అధ్యయనం కొనసాగించా’ అని అంటోందీమె.

అవగాహన లేకనే...
అవయవదానంపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం అని తెలుసుకుంది రాధిక. పుట్టేటప్పుడు ఎలా ఉన్నామో, చనిపోయిన తరువాతా... అలాగే ఉండాలి అనుకునే అపనమ్మకం కొందరిలో చూసింది. వీటిపై అవగాహన కల్పించాలనుకుంది. ‘ఏటా  అయిదు లక్షలమందికి పైగా అవయవమార్పిడి చేయించుకోవాలనుకుంటున్నారు. వీరిలో అయిదు శాతం మందికి మాత్రమే దాతలు దొరుకుతున్నారు. దీంతో చాలామంది చనిపోతున్నారు. అవయవదానంతో ఓ మనిషికి ప్రాణం పోయడంకన్నా పుణ్యమైనది ఏదీ లేదని అందరికీ చెప్పాలనిపించింది. ఈ ఉద్దేశంతోనే గతేడాది జూన్‌లో ‘ద సెకండ్‌ ఛాన్స్‌ ప్రాజెక్టు’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించా’ అని అంటోంది రాధిక.

యువతలో మార్పుకోసం...
యువతలో ముందుగా మార్పు తేవాలనుకుందీమె. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలు,  రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు తదితర కూడళ్లలోనూ దీనిపై ప్రచారం చేస్తోంది. ముంబయి, పుణె, ఉత్తరాఖండ్‌, కన్యాకుమారి తదితర ప్రాంతాలన్నీ పర్యటించింది. ‘ సహ విద్యార్థినులు నలుగురితో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు వందలాదిమందిని ప్రభావితం చేసింది. ఏ అవయవాలను దానం చేయొచ్చు, చట్టం ఏం చెబుతుందనే విషయాన్ని వర్క్‌షాపులు, క్రీడలు, బొమ్మలతో వివరిస్తున్నా. అవయవదానం పట్ల ఆసక్తితో ముందుకు వచ్చే యువతను కుటుంబ సభ్యుల అనుమతితో రమ్మని చెబుతాం. ఇప్పటి వరకు 900 మంది అవయవదానం చేసేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి ప్రత్యేక కార్డు ఉంటుంది. ఏదైనా తీవ్ర అనారోగ్యం, ప్రమాదం లేదా బ్రెయిన్‌డెడ్‌ జరిగినప్పుడు అవయవ దానం ఆమోదానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది’ అని చెబుతోంది రాధిక.

ఎన్జీవోలతో కలిసి...
వివిధ ఎన్జీవోలతో కలిసి ఈమె పని చేస్తోంది. ‘ముఖ్యంగా ముంబయికి చెందిన మోహన్‌ ఫౌండేషన్‌. దీని ద్వారా ఆసుపత్రులకు, పోలీసులకు సమాచారాన్ని అందిస్తాం. అవయవదానం కోసం ఎదురుచూసే రోగుల వివరాలను ఆయా ఆసుపత్రులకు అందజేస్తాం. పలువురు దాతల నుంచి నిధులూ అందుతున్నాయి. రోగులు, వైద్యుల అభిప్రాయాలను, వీడియోల రూపంలో చిత్రీకరించి మా కార్యక్రమాల్లో ప్రదర్శిస్తున్నాం. కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, పీయూషగ్రంథి, చర్మ కణజాలం, ఎముకలు, నేత్రాలను దానం చేయొచ్చు. త్వరలో  దేశమంతా పర్యటిస్తా’ అంటోందీమె. రాధిక సేవలకు ఈ ఏడాది ‘అశోకా యంగ్‌ ఛేంజ్‌ మేకర్‌’ అవార్డు ఆమెను వరించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.