close

తాజా వార్తలు

సహానుభూతికి సంకెళ్లేద్దాం!

సమయం, సందర్భం ఏదైనా... ఎదుటివారి కోణం నుంచి ఆలోచిస్తూ, వారి భావాలు అర్థం చేసుకునే గుణం కొందరిలో ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఎంపతీ (సహానుభూతి) అంటారు. ఇది మెదడు పనితీరుకు సంబంధించిన అంశం. ఇలాంటి ప్రేరణ ఎక్కువగా ఉన్నవారు... ఎదుటి వారిపై జాలి చూపించి వదిలేయకుండా, వారి కష్టాలను, భాధలను పంచుకోవాలనుకుంటారు. వారికి సాయం చేస్తూ సమస్యల నుంచి బయట పడేయాలనుకుంటారు. ఇది మంచి గుణమే అయినా... ఒక పరిమితి దాటితే ప్రమాదమే అంటున్నారు నిపుణులు.

ప్రమాదం జరిగితే అయ్యో పాపం అనుకోవడం సింపతీ. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించడం, కోలుకునేవరకు బాగోగులు ఆరా తీయడమే ఎంపతీ. ఇది తీవ్రమైతే వ్యక్తిగత పనులు చేసుకోలేక ఇతరుల గురించి, బయటివారి సంతోషం గురించే ఆలోచిస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు చుట్టుపక్కల అంశాలకు తొందరగా ప్రభావితమవుతారు. మనసులో ఎప్పుడూ ఏదో అలజడితో బాధపడతారు. ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తారు. చుట్టుపక్కల వారి సమస్యలన్నీ తమవే అనుకుంటారు. దీనికి తోడు మితిమీరిన జాలి, దయ వంటివి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఉద్వేగాలను అణచుకోలేరు. పరిస్థితులతో సర్దుకుపోలేరు. అతిగా ఆలోచిస్తారు. మనతో మాట్లాడేవారు నిజాలు చెప్పట్లేదనుకుంటారు. ఎక్కువమంది వ్యక్తులుండే ప్రదేశాలు, సమూహాల్లో కలవలేరు. ఎప్పుడూ అభద్రతాభావంలో ఉంటారు. ఏపనీ చేయలేక కుంగుబాటుకు గురవుతారు.

లాభాలకంటే నష్టాలే ఎక్కువ...
ఎంపతీ ఉన్నవారిలో సహజంగా ఉండే దయాగుణం సమాజంలో మంచి పేరు తీసుకొస్తుంది. ఎక్కువమంది స్నేహితులూ ఉంటారు. ఎదుటివారు చెప్పేది శ్రద్ధతో వింటారు. పరస్పర గౌరవం ఇచ్చి పుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, తెలిసినవారి కోసం ఎలాంటి సాయమైనా చేసేందుకు ముందుంటారు. సహజంగానే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు... ఇలాంటి వారిలో సామాజిక ఆందోళన ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. భావోద్వేగపరమైన మనస్తత్వం కారణంగా కోపం, ఆందోళన వంటివి తెలియకుండానే వారి మనసును ప్రభావితం చేస్తాయి. దీంతో ఇంట్రావర్ట్‌గా మారతారు. మనసులోని భావాలను ఇతరులతో చెప్పుకోలేరు. ఇతరుల సాయం కోరేందుకు మొహమాటపడతారు. ‘నా భావాలు ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయేమో’ అనుకుంటారు. చేసే పనులు ఆపేసి ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆలోచనల నుంచి దృష్టి మళ్లించేందుకు ఎక్కువగా తింటారు. ఇలాంటి విషయాల్లో పరిధులు నిర్ణయించుకోలేరు. ఇలాంటి భావాలకు అడ్డుకట్ట వేయకపోతే మానసిక ప్రశాంతత కరవై ఒత్తిడి, మనోవేదనలో కూరుకుపోతారు.


ఎలా అదుపులో పెట్టుకోవాలంటే...

పరిమితులు విధించుకోవాలి...
ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ... ఎవరికీ కాదు, లేదని చెప్పలేకపోవడం అన్నిసార్లూ మంచిదికాదు. ఇలాంటి వాటికి పూర్తి దూరంగా ఉండకపోయినా పరిమితులు కచ్చితంగా పాటించాలి. చుట్టూ ఉన్నవారు మనగురించి ఏమనుకుంటున్నారో, మనం చేసే పనుల్ని ఎలా విమర్శిస్తారో అనే భావనను పూర్తిగా వదిలేయాలి. భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించాలి. వీటన్నింటికంటే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. అపోహలు, మొహమాటాన్ని వీడాలి. ఇతరుల బాధ్యతలను స్వీకరించి మీరు మానసిక ఒత్తిడికి గురికావద్దు. అవసరమైతే నిపుణులను కలిసి కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. ‘అన్నీ ఉండాలి.. కానీ అన్నింటికీ పరిమితులు ఉండాలి’ అని మనసులో బలంగా నాటుకోవాలి.

ప్రశాంతత అవసరం...
చుట్టుపక్కల జరిగే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎదుటివారి ఆలోచనలు, అనుభూతులపై మితిమీరిన ఆలోచనలతో మెదడును నింపేయకుండా మనసుకు నచ్చే పనులపై దృష్టిమరల్చాలి. మీ గురించే ఆలోచిస్తూ, మీ భావాలను మనసుకు చెప్పుకోవాలి. ఏది మంచి? ఏది చెడు అనేవి మీకు మీరే నిర్ణయించుకోవాలి. యోగా, ధ్యానం, శ్వాసమీద ధ్యాస పెట్టి చేసే వ్యాయామాలతో ఫలితం ఉంటుంది. మానసికంగా బలంగా ఉంటేనే మంచి వ్యక్తిత్వం అలవడుతుంది. క్రమంగా ప్రవర్తన, స్వభావంలో మార్పు కనిపిస్తుంది.

మీకోసం మీరు...
ఎదుటివారి గురించి వదిలేసి మీకోసం మీరు ఆలోచించుకోవాలి. ఇతరులపై మితిమీరిన జాలి, దయ చూపిస్తూ సొంత పనులపై దృష్టిసారించకపోవడం మంచిదికాదు. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించడం కోసం కృషి చేయాలి. మనసును కలవరపెట్టే ఆలోచనలు ఎలాంటివో గుర్తించాలి. బాధను పరిష్కరించే మార్గాలను సొంతంగా అన్వేషించుకోవాలి. సోషల్‌ యాంగ్జైటీకి దూరంగా ఉండాలి. సంతృప్తి, అసంతృప్తి అనేవి ఎదుటివారి దృష్టినుంచి కాకుండా మీ మనసుతో, పరిణతితో ఆలోచించాలి.

ప్రకృతితో గడపాలి...
మసనులో నాటుకుపోయిన ఒత్తిడి, బాధలను దూరంచేసుకోవాలంటే... నాలుగు గోడల మధ్య కాకుండా ప్రకృతితో మమేకమవ్వండి. దీనికి బాధ, ఒత్తిడిని దూరంచేసే సహజ గుణముంటుంది. మనసును కలవరపెట్టే పెద్ద శబ్దాలు, గొడవలు, అనవసర భయాలు వంటి వాటికి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి ప్రయత్నించండి.

స్వీయ విమర్శ వదిలేయాలి...
ఎంపతీ ఎక్కువగా ఉండేవారిలో స్వీయ విమర్శ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా సంతృప్తి చెందక... ఇంకా బాగా చేయాల్సింది అనుకుంటారు. ఇలాంటి ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలి. చేస్తున్న పనేదైనా వంద శాతం ఇష్టంతో చేస్తున్నాం అనుకోవాలి. ప్రతిఫలాన్ని ఇష్టంగా స్వీకరించాలని గుర్తుంచుకోవాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.