
తాజా వార్తలు
మన దగ్గర శుక్రవారాలు శనివారాలు ఉపవాసం చేసినట్టే... అమెరికాలో మాంసాహారాన్ని తినకుండా ‘సోమవారాలు’ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దేవుడి మీద నిష్టతో అనుకునేరు. కాదు. ప్రకృతి మీద ఇష్టంతో! స్వీడన్లో ‘మేం నేలమీదే ఉంటాం’ అని ఉద్యమం మొదలైంది. ఇప్పటికి లక్షమంది ఈ ఏడాది విమాన ప్రయాణాలు కాదని ప్రత్యామ్నాయ వాహనాలని వెతుక్కుంటున్నారు. ఇది కూడా ప్రకృతి కోసమే! చేతినిండా డబ్బున్నా... సెకండ్ హ్యాండ్
వస్తువులతోనే సంతృప్తి పడదామంటూ ప్రపంచవ్యాప్తంగా యువత పిలుపునిస్తోంది. ఈ మార్పులన్నీ ఎందుకంటే...పర్యావరణానికి హానిచేస్తున్న ‘కార్బన్ ఫుట్‌ప్రింట్’ని తగ్గించడానికే..
ఒక్కరోజు తినకపోతే.. ఎనిమిది మెట్రిక్ టన్నులు.. అమెరికాలో ఒక్కో ఇల్లూ తాము తినే మాంసాహార భోజనం కారణంగా విడుదల చేస్తున్న కార్బన్ ఫుట్ ప్రింట్ లెక్క ఇది. మాంసం, పాల కోసం మనం డెయిరీఫామ్స్లో పెంచే జంతువులు పర్యావరణ విపత్తునకు కారణమయ్యే మీథేన్ వాయువుని విడుదలచేస్తాయి. అంతేనా.. ఆ మాంసాన్ని శుద్ధిచేసే క్రమంలో నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. సగటున కిలో మాంసం ఉత్పత్తి కోసం అయ్యే నీటి ఖర్చు 5,000 లీటర్లు. అదే కాయగూర భోజనంలో ఇంత నీటి వినియోగం ఉండదు. కర్బన ఉద్గారాల బాధా ఉండదు. దాంతో అమెరికన్లు ఒక్కరోజైనా మాంసానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ‘మీట్ ఫ్రీ మండేస్’ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇలా ఒక్కరోజు మాంసం మానేయడం వల్ల వచ్చిన లాభాన్ని లెక్కగా చెప్పుకోవాలంటే... 5 లక్షల కార్లని రోడ్డు మీదకి తీసుకెళ్లకపోతే ఎంత కాలుష్యం ఉండదో అంత కాలుష్యం తగ్గుతుందట.
వాటర్ హీటర్ని 120 ఫారన్‌హీట్ డిగ్రీల కంటే తక్కువగా ఉంచితే ఏడాదికి 200 కేజీల కార్బన్ విడుదలని అడ్డుకున్న వారమవుతాం.
విమానాలు విడుదల చేసే కార్బన్ ఫుట్‌ప్రింట్ రోజురోజుకీ పెరుగుతుండటంతో స్వీడన్, ఇంగ్లండ్ వంటి దేశాల్లో ‘ఫ్లైట్ షేమింగ్’ ఉద్యమంలో భాగంగా విమానాలకు బదులు రైళ్లని ఎంచుకుంటున్నారు.
ఫ్యాషన్ ముఖ్యమే కానీ.. చవకగా వస్తున్నాయని, కంటికింపుగా ఉంటున్నాయని చైనా, బంగ్లాదేశ్ నుంచి వచ్చే దుస్తులని అమెరికా యువత ఎక్కువగానే కొంటోంది. కానీ అలా కొన్న వాటిల్లో 85శాతం దుస్తులు ఏడాదిలోపే నాణ్యత లేని కారణంగా ల్యాండ్ఫిల్లింగ్స్లోకి వెళ్లి కుళ్లిపోతున్నాయి. ఇక ఈ సింథటిక్ దుస్తులు కుళ్లి హానికారక మిథేన్ గ్యాస్‌ని విడుదల చేస్తున్నాయి. వీటిని దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఇంధనాల ఖర్చు తక్కువేం కాదు. అలాగే ఒక టీ షర్టుని ఉత్పత్తి చేసే క్రమంలో మూడువేల లీటర్ల నీటి వినియోగంతోపాటు, రెండు కేజీల కార్బన్‌డైఆక్సైడ్ విడుదల అవుతుంది. ఈ పరిస్థితుల్లోంచి పర్యావరణానికి కాపాడుకోవడానికి మొదలైన ఉద్యమమే ‘థ్రెడ్ ఫర్ థాట్’. ఈ విధానంలో ఆర్గానిక్ కాటన్ దుస్తులు, రీసైక్లింగ్ సామర్థ్యం ఉంటే పాలిస్టర్లకి ప్రాధాన్యం ఇస్తారు. వార్డ్‌రోబుల్లో ఉండిపోయి ఒక్కసారి కూడా వాడనివి, సెకండ్ హ్యాండ్ దుస్తులకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది.
ఆఫీసుకెళ్లాలి... బస్సు, బైకు, కారు, సైకిల్ వీటిల్లో దేనిని ఎంచుకుంటారు? వాటిల్లో దేన్ని ఎంచుకున్నా వాతావరణంలోకి ఎంతో కొంత కార్బన్‌డైఆక్సైడ్ విడుదలవుతుంది. కాకపోతే కారుతో పోలిస్తే సైకిల్ విడుదల చేసే కార్బన్ చాలా తక్కువ. ఒక్క ఆఫీసుకెళ్లినప్పుడు మాత్రమే కాదు వంట వండినా, బట్టలు ఉతికినా, టీవీ చూస్తూ కూర్చున్నా, ఏసీ ఆన్‌చేసి పడుకున్నా, మొబైల్లో సినిమా చూస్తున్నా ఏ పనిలో అయినా కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి భూమిని వేడెక్కించే హరిత వాయువులు విడుదల అవుతుంటాయి. ఇలా విడుదల అయిన వాయువుల పరిమాణాన్ని లెక్కకట్టి కార్బన్ ఫుట్‌ప్రింట్‌ని అంచనా వేస్తారు. పరిమితికి మించి ఈ కార్బన్ ఫుట్‌ప్రింట్ పెరిగినప్పుడు భూతాపం పెరిగి పర్యావరణ విపత్తులు తలెత్తుతాయి. మన జీవనశైలి కారణంగా పెరుగుతున్న కార్బన్ ఫుట్ ప్రింట్‌ని తగ్గించాల్సిన బాధ్యత మనదే.
నిజానికి కార్బన్‌డైఆక్సైడ్ లేదా కర్బన ఉద్గారాలు మనం ఊహించినంత చెడ్డవి కాదు. ఆ మాటకొస్తే బొగ్గుపులుసు వాయువుని వాడుకునే చెట్లు ఆహారం తయారుచేసుకుంటాయి. ఈ చెట్లపైనే మనమూ, ఇతర జీవజాతి ఆధారపడి జీవిస్తోంది. ఒక్కసారి కార్బన్ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి. సాధ్యం కాదు కదా? పర్యావరణానికి మేలు చేసే ఈ కార్బన్ని గ్రీన్ కార్బన్ అంటారు. చిక్కంతా రెండోరకం గ్రే కార్బన్‌తోనే! పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాలని మండించినప్పుడు వచ్చిన కార్బన్ పర్యావరణంలోకి చేరి భూతాపానికి కారణం అవుతోంది. దీనిని తగ్గించడానికి మనం చేయదగ్గ మార్పులేంటో చూద్దాం.
పక్కాలోకల్కే ప్రాధాన్యం
విదేశాల నుంచి లేక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న వాటికంటే స్థానికంగా పండిన వాటినే తినడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలుచేసిన వాళ్లమవుతాం. ఇతర ప్రాంతాల ఆహార ఉత్పత్తులు దిగుమతులు చేసుకోవడానికి వాహనాలకయ్యే ఇంధనంతోపాటు వాటిని శీతలీకరించడానికి విద్యుత్ కూడా ఖర్చవుతుంది. శీతలీకరణ, ఇంధన వినియోగం ఈ రెండూ కార్బన్ ఫుట్‌ప్రింట్‌ని పెంచేవే.
దండెం కడితే ఏమవుతుంది
మీరు దుస్తులు ఉతకడానికి... భూతాపం పెరగడానికి ఉన్న సంబంధం గురించి ఎప్పుడైనా ఆరా తీశారా? అయితే ఇప్పుడైనా తెలుసుకోండి. అవును. మీరు రెండురోజులకోసారి దుస్తులు ఉతికినా ఏడాదికి సగటున 500 కిలోల కార్బన్‌డైఆక్సైడ్ విడుదల అవుతుంది. అదెలా అంటారా? వాషింగ్ మెషీన్లో డ్రయర్ ఉంటే మన పని సగం తేలిక అవుతుంది. వేడినీళ్లతో అదే ఉతికేస్తుంది. అదే పిండేసి ఆరబెట్టేస్తుంది. అంతవరకూ బాగానే ఉన్నా అలా నీటిని వేడి చేయడానికి, బట్టలు ఆరబెట్టే క్రమంలో విడుదల అయ్యే వేడి పర్యావరణానికి హాని చేస్తుంది. అందుకే చన్నీటితో ఉతకడం, డ్రయర్‌ని కాకుండా గాలికి బట్టలని ఆరబెట్టుకోవడం మంచి పద్ధతులు.
అప్పుడప్పుడు ఇంట్లో ఎనర్జీ ఆడిట్‌ని నిర్వహించండి. ఎక్కువ విద్యుత్ వినియోగానికి కారణం అయిన వస్తువులపై ఓ కన్నేయండి. దానివల్ల మీ విద్యుత్ బిల్లులు అదుపులో ఉండటంతో పాటు పర్యావరణానికీ మేలు జరుగుతుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
