
తాజా వార్తలు
మతిస్థిమితం లేని తల్లి... అప్పుడే పుట్టిన పాపను పొదల్లో పడేస్తే... ఆ బిడ్డను అక్కున చేర్చుకుందో సంస్థ. ఇప్పుడా చిచ్చర పిడుగు... కొలనులో చేపలా ఈదుతోంది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. చదువులోనూ చురుగ్గా రాణిస్తోంది. ఆమె కడపకు చెందిన పూజ ఈమాన్.
అది 2008. ప్రాంతం... తిరుపతికి సమీపంలోని రేణిగుంట రైల్వే బ్రిడ్జి. ఒక మూగ, చెవిటి తల్లి బిడ్డను ప్రసవించింది. మతిస్థిమితం సరిగ్గా లేదు. ఏం చేయాలో పాలుపోక ఆ పిచ్చితల్లి బొడ్డూడని పసిబిడ్డను అక్కడి ముళ్ల పొదల్లో పడేసింది. శరీరమంతా రక్తపు మరకలు. గుక్కపట్టి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసి కొందరు కడపలో రాజా ఫౌండేషన్, డాడీహోం వారికి సమాచారం అందించారు. వెంటనే వారక్కడకు చేరుకుని పాపను అక్కున చేర్చుకున్నారు. ఆమె వివరాలేవీ వారికి తెలియవు. పాపను తీసుకొచ్చే సమయంలో ఆమె తల్లి గట్టిగా అరుస్తూ, చికాకుగా కనిపించింది. ఆమెనూ డాడీహోంకు తీసుకొచ్చారు. ఆమె కొన్నిరోజుల తరువాత ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పటికీ ఆ తల్లి ఆచూకి లభించలేదు. సంస్థ నిర్వాహకుడు రాజారెడ్డి పాపకు పేరు పెట్టాలని, పిల్లల కోసం తను ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నట్లు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్కలాంకు లేఖ రాశాడు. ఆయన స్పందించి పాపకు పూజ ఈమాన్ అనే పేరు పెట్టడం విశేషం. బడిపెట్టమంటూ రాజారెడ్డిని ప్రోత్సహించారు.
పూజ ఇంటర్నేషనల్ పాఠశాలగా... కొన్ని రోజులకు... చదువుతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చనే లక్ష్యంతో రాజారెడ్డి పూజ పేరుతోనే పాఠశాలను ప్రారంభించాడు. పూజ చిన్నప్పటి నుంచీ అన్నింటిలో చురుకే. పాఠశాలలో అన్నిరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, వసతులు ఉండేవి. ఈత కొలనూ ఉంది. ఆమె ప్రారంభంలో నీరంటే కొంచెం భయపడినా తరువాత దానిపై ఆసక్తి పెంచుకుంది. ఆమె ఈదే విధానం చూసి అక్కడి శిక్షకులు ప్రోత్సహించేవారు. క్రమంగా రాటుదేలింది. అందరూ ఉదయం ఐదు గంటలకు లేచి వ్యాయామం సాధన చేస్తే... ఈ చిచ్చర పిడుగు మాత్రం నాలుగు గంటలకే లేచి కొలనులో ఈదేది. ‘ఈత రాకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నా విద్య అలాంటివారికి ఉపయోగపడాలని దీనిపై మరింత ఆసక్తి పెంచుకున్నాన’ని అంటుందామె. ఇప్పటి వరకు పూజ ఎన్నో పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. 2018లో చెన్నైలో నిర్వహించిన దక్షిణాది అంతర్రాష్ట్ర ఈత పోటీల్లో వెండి పతకం సాధించింది. అదే ఏడాది ఎనిమిది రాష్ట్రాల సౌత్వెస్ట్ జోనల్ ఛాంపియన్ పోటీల్లో బంగారు, కాంస్య పతకాలతో మెరిసింది. జాతీయ స్థాయికీ ఎంపికైంది. ఇటీవల నెల్లూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి... మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటడానికి సిద్ధమైంది. ప్రస్తుతం దిల్లీలో నిర్వహించే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
చదువులోనూ... పూజ చదువు, చిత్రకళలోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. ఏ పరీక్ష పెట్టినా సరే 95శాతానికి తగ్గకుండా మార్కులు తెచ్చుకుంటూ చదువుల తల్లి సరస్వతని అనిపించుకుంటోంది. పాఠశాలలో జరిగే చిత్రకళ పోటీల్లో అందరికంటే మేటిగా నిలుస్తోంది. ఎవరైనా నువ్వేమవుతావని అడిగితే... కన్నీటితో ‘నేను బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలి. ఐఏఎస్ అధికారినై పేదవాళ్లకు సేవ చేయాలి...’ అని చెబుతుందామె.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
