
తాజా వార్తలు
కొత్తబంగారులోకం
బాగా చదవాలని పుస్తకం ముందేసుకుంటాం... ఆలోచనలేమో ఎక్కడో విహరిస్తుంటాయి. ఏదో చేయాలని ప్రణాళిక రూపొందించుకుంటాం... మనసు మన మాట వినక మరేదో చేస్తుంది. అందరూ నవ్వుతూ హాయిగా ఉంటే... మనమేమో డల్‌గా ఒంటరిగా కూర్చుంటాం. మానసిక ఆరోగ్యం బాగోలేకపోతే... వచ్చే సమస్యలే ఇవన్నీ. వీటి నుంచి ఎలాబయటపడాలంటే...
యువతలోనే ఎందుకంటే...
* కాలికి ముల్లు గుచ్చుకున్నా సరే... దాన్ని ఎలా తీయాలో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ చూసే కాలం ఇది. ఏ చిన్న సమస్య వచ్చినా గూగుల్ తల్లి సహాయం తీసుకునేవారూ పెరిగారు. దీంతో చిన్నచిన్న సమస్యలకు సైతం భయపడుతున్నారు. అదే ఆందోళన, కుంగుబాటుకు దారితీస్తోంది.
* ఏ వస్తువు ఉన్నా, లేకపోయినా సరే... ఫోన్ వెంట లేకపోతే మాత్రం ఇప్పటి వారు జీవించడం చాలా కష్టంగా భావిస్తున్నారు. అదే ప్రపంచం కావడంతో ఇతరులతో మాట్లాడే అవకాశమూ తగ్గిపోయింది. మొబైలే ప్రపంచంగా మారిపోయింది. వీటన్నింటితో ఎవరితో ఎలా ఉండాలో వారికి అర్థం కావడంలేదు. ఇతరులు ఓ మాట అన్నా... ఎలా స్వీకరించాలో తెలియని పరిస్థితి. దాంతో ఏ విషయంలోనూ సర్దుకోలేకపోతున్నారు. చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో చూడటం మొదలుపెడుతున్నారు. ఇవన్నీ ప్రవర్తనాపరమైన మార్పులకు దారి తీస్తున్నాయి.
* పక్కవాళ్లు మంచి హెయిర్‌స్టైల్‌తో వచ్చారా... అది నప్పినా, నప్పకపోయినా దాన్నే అనుసరించడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు యువత. దీన్నే పీర్ ప్రెజర్ అంటారు. ఇతరులను చూసి తమ దగ్గర అది లేదనో, వాళ్లలా ఉండాలని ప్రయత్నించడమో చేస్తున్నారు. ఇది ఆత్మస్థైర్యం లేమిని సూచిస్తుంది.
* ఇంటి వాతావరణం, జీవితంలో ఎదురైన అనుభవాలు, తల్లిదండ్రుల మధ్య గొడవలు వంటివి సైతం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
దృఢంగా ఉంటే...
* ఎప్పుడూ నవ్వుతూ హాయిగా కనిపిస్తారు. అన్ని పనులను సరిగ్గా చేసుకోగలుగుతారు. ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.
* అన్ని విషయాల్లోనూ మెరుగ్గా, చురుగ్గా ఉంటారు.
* ఉన్న వనరులనే సమర్థవంతంగా వినియోగించుకుంటారు. నిత్యం నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు.
* ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు.
మానసికంగా బాగోలేకపోతే...
* చిరాకు, కోపం, అసహనం వెంటాడుతాయి. మొండిగా ప్రవర్తిస్తారు, గట్టిగా అరుస్తారు. అందరితో సరిగ్గా మాట్లాడలేరు. అనవసరంగా వాదిస్తారు. ఇవి వారి సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతాయి.
* ఏ పనీ మనస్ఫూర్తిగా చేయలేరు. ప్రతికూల ఆలోచనలు వారిని వెంటాడుతాయి. దేనిపైనా ఆసక్తి ఉండదు.
* అన్నింటికీ భయపడతారు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. నిరాశగా కనిపిస్తారు.
* ఇతరులపై ఆధారపడతారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వారి ఉత్పాదకతపైనా ప్రభావం పడుతుంది.
* ఇతరులూ వీరితో మాట్లాడటానికి ఇష్టపడరు.
ఈ మార్పులు చేసుకోండి....
ఈ సమస్యల నుంచి బయటపడాలన్నా... రాకుండా నివారించాలన్నా జీవన విధానాన్ని ఇలా మార్చుకుని చూడండి.
మీతోమీరు కాసేపు... కుదురుగా కొంతసేపు ఒకే పని చేసేవారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ధ్యానం, యోగా చేయడం, కాసేపు ఆధ్యాత్మిక చింతన వంటివి చేయాలి. ఈ సమయంలో ఏదో ఒకదాని మీద దృష్టి కేంద్రీకృతం అవుతుంది. ఇవి ప్రశాంతతను చేకూర్చి ఆలోచనలను అదుపులో ఉంచుతాయి.
పని పెట్టుకోండి... ఖాళీగా ఉంటే ఏవో ప్రతికూల ఆలోచనలు వేధిస్తుంటాయి. ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. అందుకే ఎప్పుడూ తీరిక లేకుండా గడపడానికి ప్రయత్నించాలి. ఏదైనా కళలో నైపుణ్యం సంపాదించడమో, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడమో చేయాలి. మీలో సృజనాత్మకతా పెరుగుతుంది.
పుస్తకంతో కుస్తీ పట్టండి... సానుకూల దృక్పథం పెంచుకోవాలనుకునేవారు పుస్తకాలు చదవాలి. ఇలా చేస్తే వాటిలోని సానుకూల అంశాలు మనలో ప్రతికూలతలు తొలగిపోతాయి. పుస్తకాల్లోని పాత్రలకనుగుణంగా మనం ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాం. రోజులో కొంత సమయాన్ని పఠనానికి కేటాయించండి. ఇది విజ్ఞానపరంగానూ ఎంతో మేలు చేస్తుంది.
అలా గ్రౌండ్కెళ్లండి... రోజూ ఎంతో కొంత సమయాన్ని వ్యాయామానికి, ఆటలాడుకోవడానికి కేటాయించుకోవాలి. ఆటలాడటం వల్ల శారీరక శ్రమ లభిస్తుంది. మానసిక ఉల్లాసం దొరుకుతుంది. హ్యాపీ హార్లోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని, ఆందోళనను దూరం చేసి మానసికానందాన్ని కలిగిస్తాయి. సమన్వయం, సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి.
వేళకు తినండి... వేళకు ఆహారం తీసుకోకపోవడం, అందులో సరైన పోషకాలు లేకపోయినా... రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ ఆందోళన, గుండెదడ వంటివాటిని పెంచుతాయి. అందుకే వేళకు ఆహారం తీసుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
స్నేహితులతో సరదాగా... పరిచయాలు పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. స్నేహితులతో మన కష్టసుఖాలు పంచుకోవాలి. అప్పుడే మనసులో బాధలు తొలగి, మనసు కుదుట పడుతుంది. సానుకూల ధోరణి పెరుగుతుంది.
సమయాన్ని అనుసరించండి... ఉదయం నుంచే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. అనుకున్న ఒక్కో పనిని పూర్తి చేసుకుంటూ ముందుకు పోతే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేసే పనులు వాయిదాలు వేసుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఫోను అవసరానికే... సామాజిక మాధ్యమాలు, ఇతర వ్యాపకాలకు ఒక నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలి. ఇలా చేస్తే ఎన్నో మానసిక సమస్యలు దూరమవుతాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
