close

తాజా వార్తలు

Published : 25/11/2019 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భలే వింటాం... బాగా తింటాం!

అమ్మమ్మ తాతయ్యలు చెప్పిన కథలంటే మీకు చాలా ఇష్టం కదూ. అందులో జంతువులవంటే మరీ. ఆ కథల్లో తోడేలు గురించి వినే ఉంటారుగా. ‘ఆ...విన్నాం అయితే ఇప్పుడేంటీ’ అంటారా? దాని గురించి చెప్పడానికి అదే మన పేజీలోకి వచ్చేసింది. మరి వింటారా?!


 

ప్రేమిస్తాం...  ప్రాణమిస్తాం!

మీరే కాదూ మేమూ ప్రేమలో గొప్ఫే ఎలాంటి పరిస్థితుల్లో అయినా జతను వీడం. చనిపోయే వరకు కలిసే ఉంటాం. మా కుటుంబమన్నా మాకు చాలా ఇష్టమే. మా వాళ్ల కోసం ప్రాణ త్యాగం చేయడానికైనా మేం సిద్ధంగానే ఉంటాం. ప్ఛ్‌. కానీ మీరు మనుషుల్లోని దుర్మార్గులను మాతో పోలుస్తారు.●


ఆహార వేటలో మేం వ్యూహాన్ని అల్లుకుంటాం. ముందస్తుగానే పక్కా ప్రణాళిక ప్రకారం వేటను కొనసాగిస్తాం. మాలో ఒక తోడేలు శత్రువుని అనుసరిస్తూ వెళ్తుంది. సమయం చూసి దాడి చేసి ఆ జంతువును గాయపరుస్తుంది. ఆ వెంటనే మిగతా తోడేళ్లు వచ్చి ముక్కలు ముక్కలు చేసి ఆహారాన్ని సేకరిస్తాయి.●


మేం ఎక్కువగా మేకలు, దుప్పిలను వేటాడతాం. అప్పుడప్పుడు కుందేళ్లను, ఉడతలనూ వేటాడతాం. అయితే గుంపుగా ఉన్నప్పుడు మాత్రం పెద్ద జంతువులైన జడలబర్రె, అడవి దుప్పి లాంటి వాటినీ వేటాడేస్తాం.●


మాకు చాలా మంచి వినికిడి శక్తి ఉంది. మీ మనుషుల కన్నా 20 రెట్లు బాగా వినగలం. కొన్నిసార్లు 10 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శబ్దాల్నీ వినేస్తాం. మా ముక్కు కూడా మీకన్నా బాగా వాసన చూడగలదు. కిలోమీటరు దూరం నుంచి వస్తున్న వాసన్నైనా ఇట్టే పసిగట్టగలం.●


నన్ను చూడగానే ఇది కాస్త కుక్క పోలికలతో ఉంటుందే అనుకుంటారు మీరంతా. అలా ఎందుకుంటామో చెప్పనా? కుక్కలు మా బంధువులే. పెంపుడు కుక్కలు, ఆఫ్రికన్‌ హంటింగ్‌ డాగ్స్‌, రకరకాల నక్కలు మేమూ కనిడియా కుటుంబానికి చెందినవాళ్లం.●


జపనీస్‌లో ఉల్ఫ్‌కి అర్థం గొప్ప దేవుడు అని.


మేం మూడు అడుగుల ఎత్తు, ఐదు అడుగుల పొడవుంటాం.


కాలివేళ్లతో పరుగులు తీస్తుంటాం. దీని వల్ల పరుగును హఠాత్తుగా ఆపేసి ఒక్కసారిగా వెనక్కి చూడగలం.●


మా శరీరంపై ఒత్తుగా ఉండే బొచ్చు చుట్టూ ఉన్న పరిసరాల్ని తట్టుకునేలా చేస్తుంది.●


మీరు మహా అయితే ఓ కంచం నిండా అన్నం భోంచేస్తారేమో మేమైతే ఒక్కసారే 9 కిలోల మాంసం తినేస్తాం. మా దవడలు పెద్దగా, చాలా చాలా దృఢంగా ఉంటాయి. వాటితో ఎముకల్నీ పట్‌పట్‌మంటూ నమిలిపడేస్తాం. ●


మేం ఒక్కరోజు దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగలం. గంటకు 32 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలం.


కెనడా, అలస్కా, ఇటలీ, స్పెయిన్‌, నార్వే, స్వీడన్‌, రష్యాల్లో మా సంఖ్య ఎక్కువ.●


మాలో మేం మాట్లాడుకోవడానికి బోలెడన్ని సంకేతాలిస్తాం.


ఇంచుమించు మూడున్నర కోట్ల ఏళ్లక్రితం మెసోసియాన్‌ అనే జీవి ఉండేది. పెద్ద శరీరం, పొట్టి కాళ్లతో బుల్లికుక్క రూపుతో ఉండేది. అదే మా పూర్వీకురాలు.●


65 రోజులపాటు మేం పిల్లని కడుపులో పెట్టుకుని తర్వాత కంటాం. మాకు ఒకేసారి ఐదు నుంచి ఆరు పిల్లలు పుడతాయి.


పుట్టిన పిల్లకి కళ్లు కనిపించవు. చెవులు వినిపించవు. వాసన ద్వారా అమ్మను గుర్తుపట్టి పాలు తాగుతుంది.●


అప్పుడే పుట్టిన మా పిల్లల కళ్లు నీలం రంగులో ఉంటాయి. ఎనిమిది నెలల తర్వాత పసుపు పచ్చ, ఆరెంజ్‌, గోధుమ రంగుల్లోకి మారతాయి.


మా పిల్లలు పుట్టిన మూడు వారాల నుంచి మేం బయట నుంచి వేటాడి తెచ్చిన ఆహారం తినడం మొదలుపెడతాయి. 8 నెలల వరకు మా సంరక్షణలోనే పెరుగుతాయి. ఆ తర్వాతే బయటకు వెళుతుంటాయి.రెండేళ్ల నుంచి సొంతంగా జీవించేస్తుంటాయి. ●


మాలో గ్రే ఉల్ఫ్‌, రెడ్‌ ఉల్ఫ్‌, ఇథియోపియన్‌ ఉల్ఫ్‌ అనే జాతులున్నాయి. ఇంకా రకరకాల పరిమాణాల్లో, వేర్వేరు రంగుల్లో మాలో 40 వరకు ఉపజాతులున్నాయి.


మా ఆర్కిటిక్‌ తోడేళ్లు ఏమీ తినకుండా కొన్ని రోజుల పాటు అడవిలో ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తాయి. ఇవి 3 అడుగుల నుంచి 6 అడుగుల వరకు ఎత్తు ఉండి 125 కిలోల బరువు ఉంటాయి. 7 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇవి వాటి సమూహానికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నమాట.●


గ్రే ఉల్ఫ్‌... తెలుపు, నలుపు, గోధుమ రంగులో ఉంటుంది. దీని నోరు, తోక చాలా పొడవుగా ఉంటుంది. రోజుకు సగటున 30 మైళ్ల దూరం తిరుగుతుంది. దీని శరీరం రెండు పొరలతో కప్పి ఉంటుంది. లోపలిపొర, బయటి పొర దృఢంగా ఉండటం వల్ల ఇది ఎలాంటి ఉష్ణోగ్రతలకైనా తట్టుకోగలుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలతోపాటు, -40 డిగ్రీల వరకు చలిని తట్టుకుంటుంది. ఇంకానేమో 20 మైళ్ల ఆవల ఉన్న తోడేళ్ల గుంపు వేసే శబ్దాల్నీ వినగలుగుతుంది.●


మా జీవితం కాలం ఇంచుమించు 8 ఏళ్లు.


బాధాకరమైన విషయం ఏంటంటే.. మా చర్మం కోసం మమ్మల్ని ఎక్కువగా వేటాడుతున్నారు.

ఇక ఉంటానే బైబై!


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని